29, మే 2025, గురువారం

భగవద్గీత

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


                    *భగవద్గీత*

                   ➖➖➖✍️```

       (సరళమైన తెలుగులో)```


*#రెండవ అధ్యాయము:* 

 ***సాంఖ్యయోగము.* 

————————————-

*21.వ శ్లోకము:*


*”వేదావినాశినం నిత్యం య ఏవమజమన్నయమ్l*

*కథం సః పురుషః పార్థ కం* *ఘాతయతి హన్తి కమ్||”*

```

“ఓ అర్జునా! ఎవరైతే ఈ ఆత్మను సత్యమైనదిగా, నాశనము లేనిదిగా, నిత్యమైనదిగా, జన్మలేనిదిగానూ, మార్పులేనిదిగానూ, మరణము లేనిదిగానూ తెలుసుకుంటాడో, అటువంటి వాడు ఎవరిని చంపిస్తాడు. ఎవరిని ఎందుకు చంపుతాడు? ఎలా చంపుతాడు. కాబట్టి ఎవరూ ఎవరినీ చంపరు, చంపించరు.”


ఇప్పటి దాకా ఆత్మ నిత్యము అది చావదు అని చెప్పిన కృష్ణుడు, ఇప్పుడు ఆత్మ ఎవరినీ చంపదు. ఎవరినీ చంపించదు అంటే ఎవరి చావుకూ కారణం కాదు అని అంటున్నాడు. అర్జునా! నీలో ఉన్న అత్మస్వరూపము, భీష్మద్రోణ, కృపాచార్యులలోనూ ఇతర రాజులు, సైనికులలోనూ ఉన్న ఆత్మస్వరూపాలను చంపదు. వారిలో ఉన్న ఆత్మలు చావడానికి నీలో ఉన్న ఆత్మ కారణం కూడా కాదు. నీవే అందరినీ చంపుతున్నాను అని అనుకోవడం నీ భ్రమ.


ఆత్మజ్ఞానం కలిగి ఉండటమే ఆధ్యాత్మికత, కాని మనలో ఉన్న నేను అనే అహంకారము, ఈ శరీరమే నేను అనే భ్రమను కలుగచేస్తుంది. నేనే ఈ శరీరము, అంతా నేనే చేస్తున్నాను అన్న భ్రమలో ఉన్నంత కాలము, ఆత్మతత్వము అర్థం కాదు. ఆత్మ అవినాశి అనీ, నిత్యం అని అవ్యయం అనీ తెలుసుకోవాలి.


మనం అందరం నేను నేను అంటున్నాము. నేను అంటేనే ఆత్మ. నా పేరు సుబ్బారావు. నాకు ఆకలి వేసింది. నాకు కోపం వచ్చింది. అంటే మనకు తెలియకుండానే 'నేను అంటే ఈ శరీరం కాదు. నాలో ఉన్న ఆత్మ స్వరూపము' అనే జ్ఞానం మనకు సహజంగానే ఉంది. కాని దానిని గురించి మనం ఆలోచించము. ఆచరించము మనం ఏది "నేను" అని అనుకుంటున్నామో ఆ "నేను" అనే దాని స్వభావం మనకు తెలియదు. అంటే నేను అంటే మనకు తెలుసు కాని దాని స్వభావం మాత్రం తెలియదు.


ఈ "నేను" అనే ఆలోచన జంతువులకు పక్షులకు లేదు. అవి "నేను" గురించి ఆలోచించవు. ఆహారం తినడం, ఎద వచ్చినప్పుడు కలవడం, నిద్రవస్తే నిద్రపోవడం వాటి సహజలక్షణం, వాటి నేచర్, వాటికి ఆలోచించే శక్తి లేదు. కాని మనకు ఆ శక్తిని ఇచ్చాడు భగవంతుడు. ఒక డిన్నర్ జరుగుతూ ఉంది. ఒక ఆవు ఒక పులి వచ్చాయి. అవి వాటి సహజమైన ఆహారం దగ్గరకు వెళతాయి అంటే ఆవు విజిటేరియన్, పులి నాన్ వెజిటెరియన్. కాని మానవుడు అటు ఇటు చూస్తాడు. తెలిసిన వాళ్లుంటే వెజ్ లేకపోతే నాన్ వెజ్ కు జంప్. 


అంటే జంతువులు తమ స్వభావాన్ని పట్టి పనులు చేస్తాయి. మనిషి ఆలోచించి చేస్తాడు. అవకాశాన్ని బట్టి చేస్తాడు.


ఈ "నేను" అనే అహంభావం మనిషిలో కలగడం వలన "నేను అందరి కంటే గొప్ప వాడిని, వాడు నా కంటే తక్కువ" అనే భావన కలుగుతుంది. జంతువులకు ఈ భావన కలుగదు. అవి తాము అన్నీ ఒకటే అనే భావనతో ఉంటాయి. కాబట్టి ప్రతిమనిషికి నేను అంటే ఏమిటో తెలుసు కాని దాని స్వభావం తెలియదు. ఈ శరీరమే నేను అనుకుంటూ ఉంటాడు. అలాగే మనకు నేను అంటే ఏమిటో తెలుసు. నేను అనే దాని స్వభావం మనకు తెలియదు కాబట్టి కనపడే ఈ శరీరమే నేను అనుకుంటున్నాము. మన కన్ఫ్యూజన్ అంతా ఇక్కడే ఉంది. నేనే ఈ శరీరం ఈ శరీరమే నేను అనుకోవడం, నేను స్వభావం గురించి తెలుసుకోక పోవడమే అసలు సమస్య కాబట్టి సాధకుడు తెలుసుకోవలసిందేమిటంటే "నేను 

ఈ శరీరం కాదు, నేను ఆత్మస్వరూపుడను" అని తెలుసుకోవాలి. అప్పుడు ఆత్మ అవినాశి, అజం, సత్యం, అవ్యయం అని తెలుసుకునే అవకాశం ఉంది. లేకపోతే వీటి అర్థాలు తెలియవు.


కాబట్టి ఆత్మజ్ఞానం రెండు దశలుగా తెలుసుకోవాలి. ముందు ఆత్మ యొక్క స్వభావం తెలుసుకోవాలి. అదే మొదటి పాదంలో చెప్పారు. ఆత్మ అవినాశి, నిత్యం, అజం, అవ్యయం అని, ఇంక రెండవ దశ ఆ ఆత్మ నేనే, నేనే ఆత్మను అని తెలియాలి. కాబట్టి రెండు దశల్లో ఆత్మజ్ఞానం సంపాదించాలి. కాని మనం అంతా ఈ శ్లోకం చదివి ఆత్మ ఇలా ఉంటుంది అని తెలుసుకుంటాము. కనిపించని ఆత్మ కొరకు వెదుకుతుంటాము. ఆత్మ కొరకు శోధిస్తున్నాను అని చెప్పుకుంటాము. కానీ నేను ఆత్మను అని మాతం అంగీకరించరు. మనలో ఉన్న ఆత్మ కొరకు బయట ఎక్కడెక్కడో వెదుకుతుంటాము. అదే అజ్ఞానము. దానికి కావాల్సినవి శ్రవణం అంటే ఆత్మ గురించి శాస్త్రముల ద్వారా వినడం, తరువాతది మననం, విన్నదానిని మననం చేయడం. ఆత్మస్వరూపం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం. దాని గురించి ఏవైనా సందేహాలు ఉంటే గురువు ద్వారా నివృత్తి చేసుకోవడం. మూడవది నిధి ధ్యాస. అంటే ఆత్మ ఎవరో కాదు నేనే. నేనే ఆత్మను. నేను ఈ శరీరం కాదు అనే జ్ఞానం కలగడం. అప్పటిదాకా నేనే దేహము, ఈ దేహంతో అన్ని పనులు చేస్తున్నాను. అమ్మో! ఈదేహం మరణిస్తుంది అని భయపడ్డ వాడు, ఆత్మజ్ఞానం కలగగానే, మరణించేది నేను కాదు, నా శరీరం మాత్రమే. నేను ఆత్మస్వరూపుడను నాకు మరణంలేదు అని నిశ్చింతగా ఉంటాడు. పైగా మరణాన్ని ఆనందంగా ఆహ్వానిస్తాడు.


కాబట్టి అర్జునా! నీవు దేహానివి కాదు. వీళ్లందరూ దేహాలు కాదు ఆత్మస్వరూపులు. దేహాలు వేరు వీళ్లు వేరు. నీవు చంపితే దేహాలు పోతాయి కానీ వాళ్లు ఎక్కడకూ పోరు. నీవు చంపడం వాళ్లు చావడం అంతా నీ భ్రమ, మిథ్య. చంపేవాళ్లు లేరు. చంపించేవాళ్లు లేరు. ఆత్మస్వరూపము ఎవరినీ చంపదు, ఎవరినీ చంపించదు. అలా అనుకోవడం 

నీ అవివేకమమ” అని బోధించాడు కృష్ణుడు.✍️```

```(సశేషం)

   🙏యోగక్షేమం వహామ్యహం🙏

రచన:శ్రీమొదలి వెంకటసుబ్రహ్మణ్యం, 

 (రిటైర్డ్ రిజిస్ట్రార్, ఏ.పి.హైకోర్టు.)

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

           🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

```

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

కామెంట్‌లు లేవు: