29, మే 2025, గురువారం

శ్రీమహాభాగవతావతరణము

 🌻శ్రీమహాభాగవతావతరణము 🌻


సీ.

నారాయణుని దివ్యనామాంకితమ్మునౌ 

       కావ్యమ్ము విరచించు కౌతుకమున

నొకనాటి పూర్ణచంద్రోదయోదీర్ణ సత్ 

       చంద్రగ్రహణ దివ్యసమయ మందు

సజ్జను లనుమతిన్ స్నానమ్ము పాటించ

       గంగలో నిష్ఠతో  క్రుంకు లిడియు 

వెడలివచ్చి యచటి  విమల సైకత తటిన్  

       జేరి సద్భక్తితో  కూరుచుండి

తే.

ధ్యాన యోగాన పరమేశు నాత్మ నెంచి 

యర నిమీలిత నయనాల నరయు చుండ

భక్తపోతన్న యెదుటను ప్రభల నొల్కు 

దివ్య తేజస్సు కన్పించె  దిశలు వెలుగ       19*


సీ.

మెరుపుతీగకు ప్రక్క మేఘమ్ము వోలెను

          నువిద  చెంగట నుండ నొప్పు వాడు

చంద్రమండల సుధాసారమ్ము వంటిదౌ

          చిరునవ్వు ముఖమందు చిందు వాడు

వల్లీయుత తమాల వసుధజ వోలెను

           బలు విల్లు మూపునన్ బరగు వాడు

నీలాద్రి శిఖరాన నిల్చు భానునిగను

            ఘన కిరీటము దల గల్గు వాడు

ఆ.

పుండరీకయుగము బోలు నేత్రమ్ముల 

వెడద యురము తోడ  వెలయు నట్టి

రాజముఖ్యు డొకడు  తేజోనిధీశుండు 

పోతనార్యు నెదుట పొలిచి నిలిచె          20*


క.

కనె పోతన యా పురుషుని

తనువంతయు పులకలెత్త తన్మయమతితో,

కను లెదుటను కన్పించిన

ఘను డంతట పల్కెనిట్లు గాంభీర్యముగన్     21*


✍️గోపాలుని మధుసూదనరావు🙏

కామెంట్‌లు లేవు: