"ఉచ్చిష్టం శివనిర్మాల్యం
వమనం శవకర్పటమ్!*
కాకవిష్ఠా సముత్పన్నః
పంచైతేఽతి పవిత్రకాః!!"*
ఎంగిలి, శివ నిర్మాల్యం, వాంతి(కక్కినది),శవము పై కప్పిన బట్ట , కాకి రెట్ట నుండి పుట్టినది అత్యంత పవిత్రములు. సమన్వయం?
1) ఉచ్చిష్టం(ఎంగిలి) అంటే దూడ తాగిన తరువాత పితికిన ఆవుపాలు. దూడ ఎంగిలి చేసినా అన్ని వైదిక, దైవిక కార్యక్రమాలకీ లౌకిక కార్యక్రమాలకీ అత్యంత శ్రేష్ఠం, పవిత్రం, పంచామ్రుతాలలో మొదటిగా వెలుగొందేది.
2) శివనిర్మాల్యం(శివార్చనానంతరం తీసిన ఆ పూజాద్రవ్యాలు), శివుని జటాజూటముల నుండి జాలువారే గంగ. శివుని అభిషేకించిన, పూజించిన ద్రవ్యములు శివ స్పర్శచెందినదేదైనా పవిత్రమే. విధిపూర్వకముగా గ్రహిస్తే అవి అత్యంత మహిమాన్వితములు.
3) వమనం(వాంతి లేక కక్కినది)అంటే రకరకాల పూలనుండి తేనెటీగలు మకరందం సేకరించి తేనెపట్టులో దాచడం. త్రాగిన తేనెను తేనెపట్టులో కక్కుట ద్వారా దాచినా అది వైదిక, అర్చనాది కార్యక్రమాలకు అత్యంత పవిత్రమైనదే. పంచామృతాలలో ఒకటి.
4)శవకర్పటం(శవంపై కప్పబడిన వస్త్రం)అంటే చనిపోయిన పట్టు పురుగు చుట్టూ ఉండే పట్టుగూడు నుండి తీసిన దారముతో నేసిన పట్టుపుట్టం. పట్టు దారం తీయడానికి పట్టుకాయలో దాగున్న పట్టుపురుగుని చంపి, అది చనిపోయిన తరువాత పట్టునూలు సేకరించినప్పటికీ పట్టువస్త్రం శుభకరమే.
5) కాకవిష్ఠాసముత్పన్నం(కాకి రెట్ట నుండి పుట్టినది)దేవాలయ, తటాక, నదీతీర, మైదాన, అరణ్యాలలోని రావి చెట్లు కాకి రెట్ట(విసర్జనం)ద్వారా స్వతస్సిద్ధంగా మొలకెత్తి పెరుగుతాయి. అయినాకూడా రావి పరమ పవిత్రం సాక్షాత్ విష్ణు స్వరూపం, త్రిమూర్తి స్వరూపం. యఙ్ఞ యాగాది క్రతువులలో సమిధగా సమర్పించుటకు అత్యంత అర్హమైనది.
దోషములు కూడుకున్నవిగా కనపడ్డా ఈ ఐదు వస్తువులూ అత్యంత పవిత్రమైనవి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి