29, మే 2025, గురువారం

తిరుమల సర్వస్వం 254*

 *తిరుమల సర్వస్వం 254*

*ద్వాదశ ఆళ్వారులు-18*


2  *విష్ణుసాయుజ్యం* 


 అప్పటికే చోరవిద్యలో ఆరితేరిన తిరుమంగై ఆళ్వార్ తన చోరవృత్తిని యథేచ్ఛగా కొనసాగించి, ఆ వచ్చిన సొమ్ముతో శ్రీరంగంలో అచ్చెరువొందే అనేక నిర్మాణాలను చేపట్టాడు. వాటిలో కొన్ని ఇప్పటికీ చూపరులను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతాయి. అత్యద్భుత కళాఖండాలు సృష్టించిన వేలాది శిల్పకారులకు కూలి డబ్బులు సైతం చెల్లించలేని దయనీయస్థితికి చేరుకున్న తిరుమంగై ఆళ్వార్ తన సర్వస్వాన్ని ధారపోసి, అన్నపానాదులు సైతం త్యజించి, తాను కలగన్న నిర్మాణాలన్నింటినీ పూర్తిచేసి, పరమ భాగవతోత్తముడు అనిపించుకున్నాడు. తదనంతరం చిరకాలం శ్రీరంగనాథుని కైంకర్యంలో తరించి, పెక్కు వైష్ణవక్షేత్రాలను సందర్శించుకొని మోక్షప్రాప్తి నొందాడు.


 *నామాంతరాలు* 


 విష్ణుభక్తి ప్రధానంగా కలిగినప్పటికీ, అనేక విద్యలలో ఆరితేరిన వాడవ్వటం వల్ల, తిరుమంగై ఆళ్వార్ కు అనేక నామాంతరా లున్నాయి. బహుముఖ ప్రజ్ఞాశాలి యైన తిరుమంగై ఆళ్వార్, ఆ నామాలన్నింటికీ సార్థకత చేకూర్చాడు. అనన్య సామాన్యమైన కవితాసామర్థ్యం కలిగి యుండటం వల్ల 'చతుష్కవి శిఖామణి' గాను; రాజాస్థానంలో నున్నపుడు శత్రువులకు సింహస్వప్నంలా ఉండటం వల్ల 'పరకాలుని' గాను; వైష్ణవభక్తులకు తలమానికంగా భాసిల్లడం ద్వారా 'తిరుమంగై ఆళ్వార్ గాను ఖ్యాతి నొందాడు. వారి పండితీప్రకర్ష ద్వారా 'ఆశుచిత్రమధురవిస్తరకవితానిర్మాణదక్షులు' అనే బిరుదును కూడా స్వంతం చేసుకున్నారు.


 *సాహిత్యసాధన* 


 వీరు తమ రచనల్లో శ్రీవేంకటేశ్వరుణ్ణి భూమ్యాకాశలపై పాదాల నుంచిన త్రివిక్రమావతారునిగా, గజేంద్రమోక్షప్రదాతగా, అష్టదిక్కుల సంరక్షకునిగా, బదరికాశ్రమవాసిగా, సప్తలోక సంచాలకునిగా ఇంకా అనేక రకాలుగా అభివర్ణించాడు. 'ఓం నమో వేంకటేశాయ' అనే అష్టాక్షరీ మంత్రాన్ని జపించిన వారికి పునర్జన్మ రాహిత్యం సంప్రాప్తిస్తుందని కూడా వీరు తమ రచనల ద్వారా స్పష్ట పరిచారు. తిరువళుక్కూత్తిరుక్కై, తిరుక్కురుందాండకం, శిరియతిరుమడల్ అనే ఇతర గ్రంథాలను కూడా వీరు రచించారు.


 శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏడవరోజు ఉదయం 'సూర్యప్రభ వాహనోత్సవం' లో తిరుమంగై ఆళ్వార్ రచించిన 'పెరియ తిరుమొళి' లోని ఎనభై పాశురాలను; అదే రోజు రాత్రి జరిగే 'చంద్రప్రభ వాహనోత్సవం' లో 'పెరియ తిరుమొళి' లోని మరో నూటనలభై పాశురాలను పారాయణం చేస్తారు.

 *విప్రనారాయణుడు (తొండరడిప్పొడి ఆళ్వార్)* 


 తమిళదేశం లోని కుంభకోణం అనే పుణ్యక్షేత్రంలో శ్రీమహావిష్ణువు *'శారంగపాణి'* గా వెలశాడు. వీరు అతృప్తామృతునిగా వాసికెక్కారు. అతృప్తామృతమంటే 'ఎంత సేవించినా తృప్తి తీరని అమృతం'. అంటే, ఈ స్వామిని ఎంతసేపు కాంక్షించినప్పటికీ తనివి తీరదన్నమాట.


 *పుష్పకైంకర్యం* 


 ఆ కుంభకోణం క్షేత్రానికి కొద్ది దూరంలో గల మండంగుడి అనే చిన్న పట్టణంలో, ఒక విప్రోత్తమునికి కలిగిన బాలునికి *'విప్రనారాయణుని'* గా నామకరణం చేశారు. ధనుర్మాసపు జ్యేష్టానక్షత్రాన, 787 వ సంవత్సరంలో ఉద్భవించిన వీరు శ్రీమన్నారాయణుడు ధరించే, *'వైజయంతిమాల'* యని పేరొందిన పుష్పమాల యొక్క అంశగా భావింపబడుతారు. సద్ర్భాహ్మణ వంశ సంజాతుడవ్వడం వల్ల, పండితుడైన తండ్రిగారి పెంపకం వల్ల విప్రనిరాయణుడు అతి చిన్నవయసు లోనే వ్యాకరణ, తర్క, మీమాంసాది సర్వశాస్త్రాలను; వేదవేదాంగాలను అభ్యసించ గలిగాడు. దానితో బాటుగా, భగవద్భక్తిని కూడా అలవరచుకున్నాడు. యుక్తవయసు కొచ్చిన విప్రనారాయణునికి తల్లిదండ్రులు వివాహ ప్రయత్నాలు ప్రారంభింపగా, తన భగవదారాధనకు సంసారజీవితం ఆటంకమవుతుందనే ఉద్దేశ్యంతో; యువకుడు వివాహ ప్రస్తావనను నిరాకరించి, ఆజన్మ బ్రహ్మచారిగా ఉండదలిచాడు. ముక్తిబాటలో పయనిస్తూ శ్రీరంగనాథుని సందర్శనార్థం 'శ్రీరంగం' చేరుకున్న విప్రనారాయణుడు రంగనాథునికి నిత్యము పుష్పకైంకర్యం చేసే లక్ష్యంతో, మరో ఆళ్వార్ శ్రీవిష్ణుచిత్తుణ్ణి స్ఫూర్తిగా తీసుకుని; ఆలయానికి సమీపంలో ఒక పుష్పవనాన్ని పెంచసాగాడు. మిక్కిలి శ్రద్ధతో సంరక్షించడం వల్ల అనతి కాలంలోనే ఆ పూదోట రంగురంగుల, పరిమళ భరిత పుష్పాలకు నెలవై, నందనవనాన్ని తలపించేంత సుందరంగా తయారై, చూపరులను ఆకట్టుకుంది. విప్రనారాయణుడు మధ్యాహ్న సమయంలో భిక్షాటనతో జీవితాన్ని గడుపుతూ; ఉదయం మరియు సాయంకాల సమయాలలో పూమాలలల్లి శ్రీరంగనాథునికి సమర్పించు కునేవాడు.


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

కామెంట్‌లు లేవు: