*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*కర్ణ పర్వం – తృతీయాశ్వాసం*
*391 వ రోజు*
*కర్ణ పర్వము తృతీయాశ్వాసం*
కర్ణుడు తన చేత చిక్కిన ధర్మరాజును వదిలి సుయోధనుడిని రక్షించడానికి వెళ్ళాడని తెలియగానే ధృతరాష్ట్రుడు " సంజయా ! కర్ణుడు అలా బుద్ధి లేని పని ఎందుకు చేసాడు. చేత చిక్కిన ధర్మరాజును చంపక ఎందుకు వదిలాడు ? సుయోధనుడు అంత మాత్రం భీమునితో యుద్ధం చేయ లేడా ? కర్ణుడు మోసం చేసాడంటావా ? సరేలే తరువాత ఏమి జరిగిందో చెప్పు అన్నాడు.
*ధర్మరాజు శిబిరముకు వెళ్ళుట*
కర్ణుడి చేత విడువ బడిన ధర్మరాజు శిబిరానికి చేరి మెత్తటి శయ్య మీద పరుండి. తన శరీరానికి తగిలిన బాణములు తీయించు కుంటూ తనకు జరిగిన పరాభవానికి బాధపడ సాగాడు. ఇంతలో నకుల సహదేవులు లోనికి వచ్చారు. ధర్మరాజు వారిని వెంటనే భీమునకు సాయంగా వెళ్ళమని చెప్పాడు. నకుల సహదేవులు భీముడికి సాయంగా వెళ్ళారు. అర్జునుడు అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. అర్జునుడు వేస్తున్న తీవ్రమైన బాణములు ఎదుర్కొంటూ అశ్వత్థామ అర్జునుడి మీద గదను విసిరాడు. ఆ గదను ముక్కలు చేసి వెంటనే అర్జునుడు అశ్వత్థామ శరీరంలో పది వాడి అయిన బాణములు గుచ్చి అతడి సారధిని చంపాడు. ఆగ్రహించిన అశ్వత్థామ కృష్ణార్జునుల మీద బాణవర్షం కురిపించాడు. అర్జునుడు ఆ బాణములు మధ్యలో తుంచి అశ్వత్థామ రధాశ్వముల పగ్గములను తెంచాడు. పగ్గములు తెగిన అశ్వములు రధమును ఎటో లాక్కుని వెళ్ళాయి. అది చూసి పాండవ సేనలు జయజయ ధ్వానాలు చేసాయి. కౌరవసేన పారిపోయింది.
*కర్ణుడు భార్గవాస్త్రాన్ని ప్రయోగించుట*
కురుసేనల వెనుకడుగు చూసి సుయోధనుడు " కర్ణా ! నీవు యుద్ధరంగమున ఉండగా కురుసేనలకు ఈ దుర్గతి ప్రాప్తించింది. నీవు సరిగా యుద్ధము చేసిన పాండవులు నీకు లెక్క కాదు. నీ వివిధాస్త్రాలను ప్రయోగించి నీ పరాక్రమాన్ని చూపించు " అని పురికొల్పాడు. అప్పుడు కర్ణుడు " శల్యా ! చూసావుగా సుయోధనుడి మాటలు మన రథమును అర్జునుడి వద్దకు పోనిమ్ము. అర్జునుడిని వధించి ఈ సువిశాల సామ్రాజ్యానికి సుయోధనుడిని చక్రవర్తిని చేసి నా ప్రతాపం లోకానికి తెలియజేస్తాను " అని వెంటనే విల్లు ఎక్కు పెట్టి భార్గవాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రము నుండి వివిధ ఆకృతులలో ఆయుధాలు వచ్చి పాండవ సేనను నాశనం చేస్తోంది. రధములు విరుగుతున్నాయి. హయములు, ఏనుగులు గుట్టలుగా చచ్చి పడుతున్నాయి. రధములు విరుగుతున్నాయి. ఆ అస్త్రప్రభావానికి తాళ లేని పాండవసేనలు పరుగులు పెట్ట సాగాయి.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి