అసలు సిసలు కవితా రథి - దాశరథి.
దాశరథి కృష్ణమాచార్యులు కేవలం సినీగేకవి మాత్రమే కాదు. ఒక అభ్యుదయ కవిగా, విప్లవ కవిగా నిజాంకు వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేసిన ఉద్యమ వీరుడు.
22-7-1925 వరంగల్ జిల్లాలో వెంకటమ్మ, వెంకటాచార్యులకు జన్మించాడు. నిజాం నిరంకుశ పాలనలో విద్యాభ్యాసం చేశాడు. "మా నిజాం రాజు జన్మజన్మల బూజు" అంటూ అక్షరానికి ఉద్యమ స్వరూపం ఇచ్చిన వ్యక్తిత్వం ఆయనది. నిరంతరం తిమిరంతో సమరం చేస్తూ కాంతికిరణాలను ప్రసారంచేసే కవి సూర్యుడు. అగ్నిధార, రుద్రవీణ, మార్పు నా తీర్పు, తిమిరంతో సమరం వంటి ఆయన అనేక కవితా సంకలనాలు నాటికి నేటికి చెక్కుచెదరని సంపదులుగా తెలుగు నాట వెలసాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మొదటి ఆస్థాన కవిగా గౌరవం ఆయనకే దక్కింది.
'ఖుషి ఖుషిగా నవ్వుచు చలాకి మాటలు రువ్వుచు' సినీ రంగంలో ప్రవేశించి... 'గోదారి గట్టుంది గట్టు మీద చెట్టుది' లాంటి హుషారు గొలిపే గీతాలతో జనాలను ఈలలు వేయించారు. 'నడిరేయి ఏ జాములో'' అంటూ 'వేయి వేణువులు మ్రోగే వేళ ననుపాలింపగా నడచీ వచ్చితివా' అని బుద్ధిమంతుడిలా భక్తి గీతాలు అందించారు. 'దివి నుండి భువికి దిగివచ్చి' 'నన్ను వదిలి నీవు పోలేవులే అన్న యుగళ గీతాలు నేటికీ మన మధ్య నుండి పోలేవులే. 'ఏ ధివిలో విరిసిన పారిజాతమో' అంటూ బాలు గారి గళాణినికి ఎంతో గుర్తింపు తెచ్చారు. ఇవన్నీ ఒక ఎత్తైతే 'మదిలో వీణలు మ్రోగే', 'నేనె రాధనోయి,' లాంటి వీనుల విందైన వీణ పాటలంటే దాశరథే అన్న ప్రత్యేక ముద్ర వేయించుకొన్నారు. 'తల నిండ పూదండ దాల్చిన రాణి,' అన్న లలిత గీతం ఘంటసాల గళం నుండి పరిమళాలు వెదజల్లింది.
అందుకే ఆ పేరులో
'దాశరథి' అంటే శ్రీరామచంద్రుడుగ
'దా' లేకుండా 'శరథి' అంటే సముద్రం లాంటివాడు, కవితలనె అమ్ముల పొది,
'శ' లేకుండా 'రథి' అంటే అతిరధి మహారధి, మార్గదర్శియని '
ర' కూడా లేకుండా 'థి'అంటే బుద్ధిశాలి, జ్ఞాని అని అర్థం.
ఇంతటి మహాకవిని ఆయన శత వసంతాల జన్మదినాన తలుచుకోవడం తెలుగు వారికి గర్వ కారణం.
💐 శుభదినం 💐
- కడియాల
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి