6, ఆగస్టు 2025, బుధవారం

పోతన గారి సరస్వతి

 🙏పోతన గారి సరస్వతి ప్రార్ధన🙏

ఈ పద్యం చదివితే సరస్వతి కటాక్షం తప్పక కలుగుతుంది.

 క్షోణితలంబునన్ నుదురు సోఁకఁగ మ్రొక్కి నుతింతు సైకత

శ్రోణికిఁ, జంచరీక చయ సుందరవేణికి, రక్షితామర

శ్రేణికిఁ, దోయజాతభవ చిత్త వశీకరణైక వాణికిన్,

వాణికి. నక్షదామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్.

ణి అక్షరం అనేక పర్యాయాలు ఆవృత్తి అయింది.ఇది ఒక అద్భుతం.ణ అంటే మంత్రశాస్త్రం లో జ్ఞానం అని అర్ధం. జ్ఞాన ప్రదాయిని కాబట్టి ణి ఆవృత్తి చేశారు.

 క్షోణితలంబునన్ = నేలకు; నుదురు = లలాటము; సోఁకఁగన్ = ఆనేలా; మ్రొక్కి = నమస్కరించి; నుతింతున్ = స్తుతిస్తాను; సైకత = ఇసక తిన్నెల లాంటి; శ్రోణి = పిరుదులు గలామె; కిన్ = కు; చంచరీక = తుమ్మెదల; చయ = గుంపు లాంటి; సుందర = అందమైన; వేణి = జుట్టు గలామె; కిన్ = కు; రక్షిత = రక్షింప బడే; అమర = దేవతల; శ్రేణి = సమూహము గలామె; కిన్ = కి; తోయజాతభవ = నీటిలో పుట్టిన (పద్మం) దానిలో పుట్టిన వాని (బ్రహ్మ) యొక్క; చిత్త = మనసును; వశీకరణ = వశీకరించు కోగల; ఏక = అసహాయ శూర; వాణి = వాక్కు గలామె; కిన్ = కి; వాణి = సరస్వతీదేవి; కిన్ = కి; అక్ష = స్పటికముల; దామ = మాల; శుక = రామ చిలుక; వారిజ = తామర పువ్వు; పుస్తక = పుస్తకము; రమ్య = అందంగా; పాణి = చేత ధరించి నామె; కిన్ = కి.

భావము:- నేలకు నెన్నుదురు తాకేలా సాగిలపడి మ్రొక్కి, సైకత శ్రోణీ, చదువులవాణీ, అలినీలవేణీ ఐన వాణిని సన్నుతిస్తాను. సుధలు వర్షించే సుందర సుకుమార సూక్తులతో అరవిందభవుని అంతరంగాన్ని ఆకర్షించే సౌందర్యరాశిని; కటాక్ష వీక్షణాలతో సుర నికరాన్ని కనికరించే కరుణామయిని; ఒక చేతిలో అక్షమాల, ఇంకో చేతిలో రాచిలుక, వేరొక చేతిలో తామర పువ్వు, మరో చేతిలో పుస్తకం ముచ్చటగా ధరించే ఆ తల్లిని సదా సంస్తుతిస్తాను.


పోతనామాత్యుల యొక్క సరస్వతీ భక్తిని ఎంత కొనియాడినా తక్కువే,ఎప్పుడు ఆయన సరస్వతీ స్తుతి చేసినా అమోఘం అద్భుతం అనితర సాధ్యం అన్నట్టు ఉంటాయి పద్యాలు.ఆ పద్యాలు చదువుకున్నప్పుడల్లా ఆ పద్యాల లో ఉండే భక్తిభావం, వారు చేసిన అమ్మవారి దర్శనం ఎటూ నావంటి అల్పునకు అసంభవం కానీ , కనీసం వాటి గురించి మట్లాడడానికి కైనా నాకున్న అర్హత ఏమిటి అనిపిస్తుంది ? మహాత్ములు , మహాభక్తులైన వారి భక్తికి ప్రణమిల్లి వారుచూపిన బాటలో వెళ్ళే ప్రయత్నం మనం చేయాలి .

 

సరే ఇహ ఈ పద్యం యొక్క భావానికి వద్దాం.

 అసలు ప్రారంభం చేస్తూనే “నా నుదురు నేలకి తాకించి నమస్కరిస్తున్నాను” అంటూ ప్రారంభంచేసారు పోతనామాత్యులు.ఎవరికి చేస్తున్నారయ్యా అటువంటి నమస్కారం ? అంటే,ఆయనే చెప్తున్నారు , నల్లని అందమైన శిరోజములు కలిగి,అక్షమాల(రుద్రాక్షమాల),చిలుక,పద్మము మరియు పుస్తకములను చేతుల యందు ధరించు తల్లికి , వాణికి ,దేవతలను రక్షించు తల్లికి,చతుర్ముఖ బ్రహ్మగారి హృదయేశ్వరికి ,సరస్వతీ దేవికి నా నుదురు నేలకి తాటించి సాష్టాంగ నమస్కారము చేస్తున్నాను అంటూ చెప్పుకొని పొంగిపోయాడు ఆ మహానుభావుడు.

మధుర భాగవత మహాకావ్యకర్త బమ్మెర పోతనామాత్య కృత సరస్వతీ దేవిస్తవం ఇది. చదువుల తల్లిని కావ్యారంభాన స్మరించాడు. నమస్కార స్మరణలో ఎన్ని విశేషాలో!

(ఇక్కడ పాఠాతరం ఉన్నది అందుకే పద్యం మళ్ళీ వ్రాశాను)

క్షోణితలంబు నెన్నుదురు సోకగమ్రొక్కి నుతింతు సైకత

శ్రొణికి జంచరీకచయసుందరవేణికి రక్షితామర

శ్రేణికి దోయజాతభవచిత్తవశీకరణైక వాణికిన్

వాణికి నక్షదామశుకవారిజ పుస్తకరమ్యపాణికిన్


నెన్నుదురు సోక అంటే నిండైన నుదురు భూమికి తాకించి మొక్కుతానన్నాడు. ఇది సాష్టాంగ నమస్కారం. కరచరణ యుగము నురము నొసలు, భుజములు, ధరణి సోక మొక్కగ లేదా!” అని అష్ట అంగములను త్యాగరాజస్వామి నమస్కార సమయాన భూమికి తాకించాలన్న సంప్రదాయం జ్ఞప్తిచేసాడు. సైకత శ్రోణి మరొక విశేషణం. ఇసుక తిన్నెల వంటి పిరుదులని. విశాల జఘనములని. ఇది విజ్ఞాన సంకేతం. విజ్ఞానం విశాలం, గోపనీయం, ఎంత ఎరిగినా ఒదిగి ఉండటం గోపనీయత. చంచరీక చయ అనగా తుమ్మెద సమూహం వంటి అందమైన కురులు కలది. తుమ్మెదలు పువ్వు పువ్వుకు తిరిగి మకరందం సాధించినట్టు జ్ఞానతృష్ణతో గ్రంథాలు శోధించమని సంకేతం. శిరోజాలు తలలోని విజ్ఞానానికి పుట్టిన ఆలోచనలకు సంకేతం. స్థూలదృష్టిలో స్త్రీ సౌందర్యం. సూక్ష్మదృష్టికి విజ్ఞాన సంకేతాలవి.


రక్షిత + అనత శ్రేణికి = వినయంతో ఒదిగి ఉండి చదివే విద్యార్థినీ విద్యార్థి సమూహానికి రక్షకురాలు. తోయజాత భవ చిత్తునకు వశీకరణ చేయగల ఏకవాణి. అనగా వశీకరణ చేయగల ఏకైక వాక్కు కలదని, తన వాక్యాలతో బ్రహ్మను వశం చేసుకోగలదని. బ్రహ్మను అనగా భగవంతుని వశం చేసుకోవడం వాక్కుకుసాధ్యం కాదు కదా! “యతో వాచో నివర్త్యంతే అప్రాప్య మనసాసహ” (వాక్కు, మనస్సు భగవంతుని, బ్రహ్మమును, పొందలేక తిరిగి వచ్చాయి) అని కదా ఉషనిషత్సూక్తి! కాని ఇక్కడ విజ్ఞానరూపిదేవిని మనం వశం చేసికొంటే బ్రహ్మ వశమవుతాడని. అంటే అర్థమవుతాడని, పొందగలమని అంతరార్థం. వాక్కుతో సభ వశీకరణమవుతుంది కదా! సమాజం వశమవుతుంది కదా!


వాణికి అంటే సరస్వతీదేవికి వాగ్రూపియైన దేవతకని సంకేతార్థమే.


అక్షదామం (స్ఫటిక జపమాల), శుక = చిలుక, వారిజ = పద్మం, పుస్తక = గ్రంథం చేతిలో గల రమ్యపాణి = అందమైన చేతులు కలది, లేదా పై వాటిని పట్టుకోవడంతో చేతులు అందమైనాయని, ‘పుస్తకం హస్త భూషణం” అని ఆర్యోక్తి కదా!


అమ్మ చతుర్భుజి. నాలుగు చేతులు నాలుగు ఋగ్యజుస్సామా ధర్వణాలు. తల్లివేద స్వరూపిణి. వేదస్థాపిత బ్రహ్మమును అర్థం చేసికొనే విద్యాధిదేవత అని సంకేతం. ఒకచేత పుస్తకం. ఇది ధర్మానికి సంకేతం. ధర్మానికి గ్రంథాలుగా ఉంటాయి. పూర్వవుజులు ఆచరించిన, నిశ్చయించిన, లిఖించినట్టివి. శుకం మరోచేత ఇది కామానికి సంకేతం. సౌందర్యవతి


స్త్రీ శుకరూపం. శుకం మన్మథవాహనం. భోగానికి గుర్తు. వారిజం మరోచేత. ఇది అర్థ సంకేతం. లక్ష్మీదేవి వారిజభవ. అక్షదామం (స్ఫటిక) శుద్ధమోక్షానికి సంకేతం. మోక్షార్థులు జపనిష్టులు. జపనం, భగవన్నామాధ్యానైక చిత్తానికి సోపానం, జపగణనకు అక్షమాల. ధర్మ, అర్థ, కామ, మోక్షాలకు దేవి సంకేతరూపం. ఉపాసనా రూపం.

ఆ అర్థాలే పద్యం నిండా పరచుకొన్నాయి. పోతన్నవాణి సుమధుర, అష్ట ‘ణ’ కారయుత శోభిత అనుప్రాస ప్రియకవిత

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

కామెంట్‌లు లేవు: