*ప్రతి స్మృతి*
ఆంధ్ర మహాభారతం అరణ్య పర్వంలో ఒకనాడు వ్యాసులవారు ధర్మరాజు వద్దకు వచ్చి వారికి *ప్రతిస్మృతి* విద్యను నేర్పించారని, దానిని అర్జునునికి తెలియపరిస్తే వారికి దివ్య అస్త్రాలు సాధించేందుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ఆశ్చర్యకరంగా, వ్యాసుల వారు ప్రతిస్మృతి శాస్త్రం గురించి ఏమీ వెల్లడించలేదు, అది అర్జునుడి కోరికను నిజం చేసుకోవడానికి సహాయపడుతుందని మాత్రమే చెప్పారు. ఇంతకు మించి ఆ సందర్భంలో ఎటువంటి వివరాలు కానరాదు.
నేను స్వయాన అనుకోవడం *ప్రతిస్మృతి* అంటే ఒక వ్యక్తి గతంలో తెలుసుకున్న లేదా అనుభవించిన విషయాలను మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవడం లేదా జ్ఞాపకం చేసుకోవడం, ఆ జ్ఞాపకశక్తిని ఉపయోగించడం. మహాభారతంలో, ప్రతిస్మృతి అనేది ఒక ప్రత్యేకమైన జ్ఞానమని, దీని ద్వారా అర్జునుడు తన గత అనుభవాలు, జ్ఞానాన్ని ఉపయోగించి దేవుళ్ళను మెప్పించడానికి ప్రయత్నించాడని విదితమవుతుంది. ఇది మన అవగాహనే కాని వ్యాసులవారు ప్రతి స్మృతి గురించిన మరిన్ని వివరాలు ఇచ్చినట్టు మహాభారతంలో ఎక్కడా పేర్కొనబడలేదు.
ధర్మరాజు వ్యాసులవారు చెప్పినట్టే దాన్ని అర్జునుడికే బోధించారు. అర్జునుడు ప్రతిస్మృతి సహాయంతో హిమాలయాలలో తపస్సు కోసం బయలుదేరి, కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాడని, ఆ సమయంలో అతను శివుడి నుండి అంతిమ 'పాశుపత' అస్త్రాన్ని, మిగిలిన దేవతల నుండి దివ్యాయుధాలను పొందాడని మనందరికి తెలిసిన విషయమే.
ఇక్కడ నా సందేహం ఏంటంటే ప్రతిస్మృతి ఏంటన్న విషయాన్ని పక్కన ఉంచినా (ఎవరికైనా ఈ వివరాలు తెలిస్తే ఇంకా గొప్ప విషయమే), వ్యాసులవారు ఆ విద్యను నేరుగా అర్జునునికే ఉపదేశించవచ్చును కదా, మధ్యన ధర్మరాజుకు చెప్పడం దేనికి? ఏవైనా protocol పాటించాలన్న అవసరం ఉన్నదా, లేదే మరి. ఇంకెందుకు అలా జరిగిందని.
ఏదైనా సూక్ష్మమైన ఉపపత్తి (కారణం) కలదా, మరోటి, ఏవైనా కొత్త ప్రయోగం గురించి ప్రస్తావిస్తున్నప్పుడు దాని వివరాలను ముందుగా చర్చించాలి కదా, వాటిని మరుగున పెట్టాల్సిన అవసరం ఏంటి, సంస్కృత మూలంలో ఈ విషయాన్ని ఎలా తెలియబరిచారో మరి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి