*ప్రతి పని దైవకార్యమే*
ప్రాచీన గ్రంథాలన్నీ పనిని దైవస్వరూపంగా చూడమన్నాయి. పని దైవారాధనతో సమానమని ఉపదేశించాయి. నిష్కామ భావనతో, భక్తిశ్రద్ధలతో చేసే కార్యాలన్నీ మంచి పనులేనని భగవద్గీత బోధించింది. మన సంకల్పాలన్నీ కల్యాణదాయకంగా ఉండాలని యజుర్వేదం ఆకాంక్షించింది.
మంచి పనిని వాయిదా వేయకూడదు, చెడు పనిని తలపెట్టనేకూడదని రామాయణం వివరించింది. అందుకే ఒక పని చేసేముందు వేయిసార్లు ఆలోచించాలి. పని మొదలు పెట్టాక వేయి అడ్డంకులు వచ్చినా దాన్ని నెరవేర్చాలి. శ్రద్ధాసక్తులతో కర్తవ్యాన్ని నిర్వర్తించడమే నిజమైన ఈశ్వరారాధన అంటారు స్వామి వివేకానంద. అందుకే ప్రతి వృత్తీ పవిత్రమైందిగా భావించాలి. లోకహితం కోసం చేసే పనులకు దైవమే మనిషి రూపంలో వచ్చి సహాయం చేస్తాడని పెద్దలు చెబుతారు. కానీ చేసే పని ఎంత చిన్నదైనా అది సమాజానికి మేలు చేసేటట్లుగా ఉండాలి. చేస్తున్న పనిపట్ల అవగాహన, ఆలోచన లక్ష్యసిద్ధికి దారితీస్తాయి. నిజానికి ఎవరికైనా మనసుకు నచ్చిన పని మీదే ఆసక్తి, మమకారం ఉంటాయి. అవే మనిషికి ప్రోత్సాహాన్నిస్తాయి. అసలు ఇష్టపడి పని చేయాలే కాని ఏదీ కష్టంగా అనిపించదు. ఇష్టం లేకుండా చేసే ఏ పనైనా మనసుకు తృప్తినివ్వదు. ‘సాధనమున పనులు సమకూరు ధరలోన’ అన్నాడు వేమన. ఏ విజయానికైనా మూలం సాధన. నిరంతర సాధన వల్లే మనం కోరుకున్న పనులు పూర్తి చేయగలుగుతాం.
మనిషి ఒంటరిగా జీవించలేడు. నిత్యం పదిమందితో కలసి మెలసి ఉండక తప్పదు. అందుకే ఎవరైనా ఒక పనిని ప్రారంభించేటప్పుడు అనుభవజ్ఞులను సంప్రదించి మంచీ, చెడులను విచారించాలి. అప్పుడే పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. మనిషి గొప్పతనం అతడు చేసే పనిని బట్టి ఉంటుంది. ఎంత ఉన్నతుడైనా పని చేయకపోతే అతడికి విలువ ఉండదని భారతం చెబుతోంది. అందుకే ఒక పనిని సంకల్పించినప్పుడు దాన్ని పూర్తి చేసేవరకు విశ్రమించకూడదు. ఎవరు విమర్శించినా, ఎన్ని రకాల అవాంతరాలు ఎదురైనా.. సమయస్ఫూర్తితో వాటిని అధిగమించి శ్రద్ధతో పనిని పూర్తి చేయాలి. అప్పుడు అది తప్పక విజయవంతమవుతుంది. ఈ సృష్టిలో ప్రతి జీవి ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది. అలాగే మనిషి కూడా నిరంతరం ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండాలి. అప్పుడే తగిన వ్యాయామం లభించి ఆరోగ్యవంతుడిగా ఉంటాడు. అంకితభావంతో పనిచేసిన మనిషిలో అనవసరపు ఆలోచనలు ప్రవేశించవు. పనిలో ఆనందాన్ని ఆస్వాదించే అతడు కష్టసుఖాలకు అతీతంగా వ్యవహరిస్తాడు.
చిత్తశుద్ధితో చేసే మంచి పనులకు దైవానుగ్రహం తప్పక ఉంటుంది. మంచి పనులంటే దానధర్మాలు, పరోపకారం. అనాథలకు, అభాగ్యులకు దానధర్మాలు చేస్తూ, వారి ఉన్నతికి కృషి చేసిన వ్యక్తి చిరస్మరణీయుడవుతాడు. పరోపకారం వల్ల మానసిక ఆనందంతో పాటు మనిషి జీవితం కూడా ధన్యమవుతుంది.
~విశ్వనాథ రమ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి