25, సెప్టెంబర్ 2025, గురువారం

చతుర్ధావస్థ

చతుర్ధావస్థ  

మోక్షార్ధులు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఇది. ప్రతి సాదారణ మానవుడు తన దైననందికే జీవితంలో మూడు అవస్థలలో జీవితాన్ని గడుపుతాడు.కేవలం జ్ఞాని మాత్రం నాలుగవ అవస్థను పొందగలుగుతాడు దానిని తురీయావస్థ లేక సమాధి స్థితి అని అంటారు. ముందుగా  ఈ మూడు అవస్థలలో ఆత్మ జీవునితో (మానవునిలో) ఎలా ఉంటుంది.అది చూద్దాము  అవి ఏమిటంటే 

1) జాగ్రతావస్థ 

మనం నిత్యం నిద్రలేచినప్పడి నుండి మరల నిద్రించే వరకు ఈ స్థితిలోనే ఉంటాము జాగ్రత్తావస్థలో ఆత్మా శరీరంలో ఉంది ఈ చరాచర జగత్తుతో సంచరిస్తూ ఉంటుంది. దశ ఇంద్రియాలు (5 జ్ఞానేంద్రియాలు, 5కర్మేంద్రియాలు) తేజోమయంగా (active )గా ఉండి ఐహిక కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటాయి. అంటే కళ్ళు చూస్తూ ఉంటాయి, చెవులు వింటూ ఉంటాయి, ముక్కు వాసన చూస్తూ ఉంటుంది, చర్మం స్పర్శ కలిగి ఉంటుంది. జిహ్వ రుచుల చూస్తూ ఉంటుంది. అంటే దాని అర్ధం అవి అన్ని ఒక్కసారి వాటి పనులు చేస్తాయి అని కాదు. వీటి అవసరం వచ్చినప్పుడు అవి చురుకుగా వాటి పనులు నిర్వహిస్తూ వున్నాయి అన్న మాట. ఒక దృశ్యాన్ని చూడాలంటే కళ్ళు చూడగలవు.  అవి చుసిన విషయాన్నీ మనస్సు ద్వారా చెతన్య స్వరూపమైన ఆత్మకు చేరవేయగలవు. అనుకుంటే తాత్కాలికంగా కళ్ళు మూసుకొని కొంత సమయం చూడటం అనేది చేయకుండా ఉండవచ్చు. మరల కావాలంటే కళ్ళు తెరుచుకొని చూడగలవు. అంటే పాటిది మనస్సు నిర్వహించగలదు. అలాగే ముక్కు, చెవి కూడా చేయగలవు. అలాగే కర్మేంద్రియాలు కూడా వాటి వాటి కర్మలను అంటే ఇవి కూడా  ఐదు రకాలు:అవి  వాక్కు (మాట్లాడటం), పాణి (చేతులు), పాదం (కాళ్లు), పాయువు (మలద్వారం), మరియు ఉపస్థ (అంగం). జ్ఞానేంద్రియాల వలె కాకుండా, కర్మేంద్రియాలు మన పనులు, కదలికలు, మరియు శారీరక కార్యకలాపాలను నియంత్రిస్తాయి. ఈ పది ఇంద్రియాలు జాగ్రత్తగా ఉంటాయి కాబట్టి ఈ అవస్థను జాగ్రదావస్థ అని పేర్కొన్నారు. జాగ్రత్తవస్థలో వున్న ఆత్మ మొదటి పాదంగా తెలియవడుతున్నది దీనికి వైశ్వానరుడు లేక విసుడు అని పేరు ఎందుకంటె ఇక్కడ ఆత్మ విశ్వముతో సంయమం కలిగి ఉన్నందున ఈ పేరు వచ్చింది

2) నిద్రావస్థ లేక సుషుప్తావస్థ 

జాగ్రత్తవస్థలో  రోజంతా శారీరిక వ్యాపారాలు చేసిన ఆత్మా విశ్రాన్తి తీసుకునే అవస్తే నిద్రావస్థ లేక సుషుప్తావస్థ ఈ స్థితిలో మనస్సు లయమై ఉంటుంది. నిద్రలో చాలామటుకు శరీరం చేష్టలు లేకుండా ఉంటుంది. అంటే ఇంద్రియాలు వాటి పనులు చేయవు. కానీ ఆత్మ మాత్రం జాగృతంగానే ఉంటుంది ఈ స్థితిలో వున్నా ఆత్మ పాదాన్ని ప్రాజ్ఞుడు గా పేర్కొన్నారు.  

ప్రాజ్ఞుడు అంటే రెండు అర్థాలు చెప్పుకోవచ్చు...
(i) ప్ర+అజ్ఞ = ప్రాజ్ఞ : అంటే గొప్ప అజ్ఞానం అని. ఈ సుషుప్తిలో ఏమీ తెలియదు. నీవెవరో తెలియదు. ఎక్కడున్నావో తెలియదు, నీ భార్యబిడ్డలు ఎవరో తెలియదు. అసలు నీవున్నావో లేవో తెలియదు. అందుకే గొప్ప అజ్ఞానం అనే అర్థం బాగా సరిపోతుంది.
(ii) ప్రా+జ్ఞ = నిరుపయోగమైన జ్ఞానం అని. జ్ఞానం అనేది బయటి ప్రకృతి నుండి జ్ఞానేంద్రియాల ద్వారా మనస్సుకు చేరుతుంది. తర్వాత బుద్ధికి చేరుతుంది. ఇది జాగ్రదవస్థలో సర్వసాధారణం. అయితే సుషుప్తిలో ఈ జ్ఞానం అనేది మనోబుద్ధుల నుండి, ఇంద్రియాల నుండి ఉపసంహరించబడుతుంది. అంటే అవి జ్ఞానంతో పనిచేయవు. ఏమైందీ జ్ఞానం.. అది మూటగట్టబడి, సీల్ వేసి ఒక మూలన పెట్టినట్లు అవుతుంది. అందువల్ల ఇది నిరుపయోగంగా ఉన్న జ్ఞానం అవుతున్నది. అందుకే ప్రా+జ్ఞ అనేది సరిపోతుంది.
ఇంతకీ ఈ ప్రాజ్ఞుడెవరు? ఆత్మయే - జీవుడే. ఆత్మయా? జీవుడా? ఆత్మయే ఇంద్రియ మనోబుద్ధులతో తాదాత్మ్యంలో ఉన్నంత కాలం ఆత్మను జీవుడు అంటారు. ఆ జీవుడే జాగ్రదవస్థలో విశ్వాన్ని చూచే విశ్వుడు. . ఆ జీవుడే సుషుప్తిలో ఏమీ తెలియకుండా ఉన్న ప్రాజ్ఞుడు. 
3) స్వప్నావస్థ  
మానవుడు నిద్రావస్థలో వున్నప్పుడు నిద్రలో కొంత సమయం స్వప్నాన్ని కంటాడు. ఈ స్వప్నం అనేది జీవుడు సృష్టించుకున్న ఒక అవస్థ ఈ అవస్థలో ఇంద్రియాలు పనిచేయవు కానీ ఇంద్రియ వ్యాపారాలు గోచరిస్తాయి అదెలా అంటే తన స్వప్నంలో ఒక సుందరమైన దృశ్యాన్ని చూస్తాడు ఒక చక్కటి ఉద్యానవనంలో పూల సుగంధాన్ని అనుభవిస్తాడు, చక్కటి భోజనాన్ని ఆరగించి వాటి రుచులు అనుభవిస్తాడు. అన్ని ఇక్కడ పంచేంద్రియాలు లేవు కేవలం అనుభూతి మాత్రమే వున్నది. ఈ సుషుప్తిలో జీవుడు ఎక్కడ ఉండి తన కార్యకలాపాలు సాగిస్తాడు.. అంటే హృదయస్థానంలో ఉండి. విత్తనంలో కొమ్మలు, పూలు కనిపించకుండా ఉన్నట్టు సుషుప్తిలో జగత్తు కనిపించకుండా ఉంటుంది.ఆ జీవుడే స్వప్నావస్థలో స్వప్న ప్రపంచాన్ని తెలుసుకుంటున్న తైజసుడు..
మనం ఇక్కడ ఆత్మను మూడు అవస్థలాల్లో మూడు రకాలుగా అంటే  వైశ్వానరుడు, ప్రాజ్ఞుడు, తైజసుడు. అని మూడు ఆత్మలుగా ఉన్నాయా అంటే కనే కాదు. కానీ ఇవి మూడు వేరు వేరు పాదాలుగా చెపుతున్నాము. అది ఇంకా వివరంగా చెప్పాలంటే ఒక ఉదాహారణ చూద్దాము. ఒక మనిషి తన భార్యకు భర్త అంటే తానూ ఇంట్లో వున్నప్పుడు ఒక భర్తగా తన భార్యను చూసుకుంటాడు. అదే మనిషి ఆఫీసులో ఒక ఆఫీసరుగా తన భాద్యతలను నిర్వహిస్తాడు. మరి తన పిల్లల ముందు ఒక తండ్రిగా తన భాద్యతలను నిర్వహిస్తాడు నిజానికి అతను ఒక సాధారణ మానవుడు కానీ ఒక్కొక్కళ్ళ వద్ద ఒక్కొక్క బాధ్యత నెరవేరుస్తూ జీవితాన్ని గడుపుతాడు. అదేవిధంగా ఆత్మ ఒక్కొక్క అవస్తలో ఒక్కొక్క పాదాన్ని కలిగి తన కర్తవ్యాన్ని నిర్వహిస్తుంది. 
4)  తురీయ అవస్థ
ఇప్పటివరకు చెప్పిన అవస్థలు సాధారణముగా మన అందరికి అనుభవంలో వున్నవి. కానీ చెతుర్ద అవస్థ మాత్రం  కేవలము జ్ఞానులు మాత్రమే పొందగలరు. దీనిని తురీయ అవస్థ లేక సమాధి స్థితి అని అంటారు. నిద్రావస్థలో స్వప్నావస్త వస్తుందని నాకు తెలుసు. అదేవిధంగా ఈ తురీయ అవాస్ట్ జాగ్రదావస్థలోనే వస్తుంది. అంటే ఇక్కడ ఆత్మ ఆత్మలో సంయమం చెంది ఉంటుంది. అంటే జాగ్రదావస్తలో వున్నా కూడా ఆత్మ విశ్వనరుడుగా ప్రవర్తించాడు అంటే బాహ్య ప్రపంచ జ్ఞానం కలిగి ఉండదు. మెలకువతో వున్నా కూడా ఈ ప్రపంచంతో సంబంధము లేకుండా సాధకుడు ఉంటాడు. ఒక అద్వితీయమైన అనుభూతితో వుంది ఆత్మానుభవం కలిగి ఉంటాడు. అట్టి స్థితే మోక్ష స్థితి. అది కేవలం ఎంతో సాధనచేసి ఆత్మ పరిపక్వత సిద్దించుకుంటే మాత్రమే కలుగుతుంది. ఈ స్థితిలో ఆత్మ నాలుగవ పాదమైన తూరీయుడుగా పిలువబడతాడు. ప్రతి సాధకుడు అత్యంత కఠోర సాధన చేసి చివరకు ఈ స్థితిని చేరుకుంటాడు. 
మనకు అత్యంత శక్తివంతమైన సూక్ష్మమైన జ్ఞానాన్ని ప్రసాదించిన మహర్షులు సదా స్మరణీయులు.

 



కామెంట్‌లు లేవు: