ఓం శ్రీ మాత్రే నమః
9-10-25
మహిత మార్గ శీర్షం
(అవధాన పుష్కరిణీ అంతర్జాల మాస పత్రికార్థం)
(కవితా ఖండిక)
డా.రఘుపతి శాస్త్రుల
మాసములందు మార్గ శిర మాసమె శ్రేష్ఠ మటంచు చెప్పె వి
శ్వాసము గూర్చు నట్లు భగవానుడు కృష్ణుడు వర్షమందు నీ
మాసపు ధ్యాన సంపదలు మానిత సత్ఫలితార్థ సిద్ధితో
భాసిత రీతులన్ సుగతి వర్ధిల గూర్చుచు నుండు నెప్పుడున్
స్కందుడు షష్ట మాతృకల సంపదగా జననమ్మునందె యీ
సుందరమైన షష్టిని, సుశోభిత రీతుల నొప్పు పూజలా
నందము తోడ గైకొను సనాతన దైవము, భక్తి చిత్తమం
దొంద, ననుగ్రహమ్మును యథోచిత రీతుల గూర్చు నీశుడున్
గీతాచార్యుని కృష్ణునిన్ జగతి సంక్షేమ ప్రదానార్థమౌ
గీతార్థమ్ము స్మరించినన్ సుమతితో కీర్తింప ప్రద్యుమ్నుడున్
చేతోమోదమునందు మాసమిదియే శీఘ్రమ్ముగా స్తోత్రముల్
ప్రీతిన్ గాంచుచు సద్గతుల్ గనగ సంవేద్యుండు గూర్చున్ సదా
దత్తాత్రేయుడు దివ్య రూపుడు భువిన్ తత్త్వార్థ త్రైలోక్య సం
పత్తిన్ గాంచిన మాసమిద్ది తలపన్ వైవిధ్యమౌ రీతులన్
దత్తోపాసన జేయగల్గినను ప్రత్యక్ష స్తుతిన్ పూర్ణిమన్
బత్తిన్ సాధన జేయువారలిలలో వర్ధిల్లగన్ సాధ్యమౌ
సమశీతోష్ణపు శోభలం గనుచు ప్రాశస్త్యమ్ముగా పృథ్వియున్
తమికాన్పించుచు వేడ్క చేయు నెదకున్ తాల్మింగనన్ కర్షకుల్
తమదౌ త్యాగము వర్ధిలన్ కృషిని సంధానింప నీ నేలయున్
రమణీయమ్మగు సంపదన్ హరిత సామ్రాజ్యంపు సొంపొప్పెడిన్
నమస్సులతో
డా.రఘుపతి శాస్త్రుల
హైదరాబాద్
రిటైర్డ్ ప్రిన్సిపల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి