5, జులై 2020, ఆదివారం

గురుపూర్ణిమ

🌹🌹వ్యాస పూర్ణిమ🌹🌹

శ్లో!! వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్!!

వశిష్టుని మనుమడు, పరాశర మహర్షి కుమారుడు శుకమహర్షి తండ్రైన వ్యాసుడు భగవత్తత్వాన్ని మానవజాతికి అందించిన దైవాంశ సంభూతుడు

వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే అని.

సోమకుడనే రాక్షసుడు  వేదాలు అపహరించాడు అవి అన్నీ ఒకే రాశిగా విడదీయడానికి సాధ్యం కాని విధంగా ఉన్నాయి. అయితే వ్యాసుడు ఆ వేదాలను విభజించి, తిరిగి మనకు ప్రసాదించాడు. 

వ్యాసుడు గొప్ప విజ్ఞాన పారంగతుడు. మహాభారత ఇతిహాసాలు రచించిన వ్యాసుడు, ప్రాచీన పవిత్ర గాథలకు మూలమైన అష్టాదశ పురాణాలను సంకలనం చేశాడు. ఇవన్నీ చేయడం మానవమాత్రుడికి సాధ్యమా?

అందుకే ఆయనను మహావిష్ణువు అవతారంగా భావిస్తారు

జగద్గురువుల్లో మొదటివాడు వ్యాసుడే. వ్యాస పూజ అంటే వేద పూజ, ఈశ్వర పూజ.

దైవానుగ్రహం కావాలంటే, గురువు ఆశీస్సు లభించాలి.

శ్లో!! గు కారో అంధకారస్యాత్                                               రు కార స్తన్నిరోధకః అంధకార నిరోదిత్వాత్ గురురిత్యభిధీయతే !!అంటుంది గురుగీత

మనలోని అజ్ఞాన అంధకారాన్ని పోగొట్టి జ్ఞాన జ్యోతిని వెలిగించి దారి చూపినవాడే గురువు.

ఆధ్యాత్మిక మార్గాన్ని బోధించే జ్ఞాన సంపన్నులను గురువులుగా పరిగణించి వారి శిష్యులు వారిని పూజిస్తారు. గురు పౌర్ణమి నాడు మనం పూజించే వ్యాసుడు ఫలానా వ్యక్తి అని ఒక్కర్ని గురించి చెప్పే పదం కాదు. అది పదవి! అది సకల కళానిధి మహాజ్ఞాని అయిన వేదవ్యాసుడు పరంపరలో వచ్చిన, వస్తున్న, రాబోయే గురువులందరికీ చెందుతుంది. అందువల్ల వ్యాస పూర్ణిమ నాడు ఎవరి గురువులను వారు ఆరాధించుకోవచ్చు.
కలియుగంలో ఈ సంప్రదాయాన్ని ఆదిశంకరాచార్యులు ప్రారంభించినట్లు చెబుతారు.

ఒకప్పుడు యతులు, సర్వసంగ పరిత్యాగులు పాటించిన ఈ పర్వదినం, ప్రస్తుతం జన సామాన్యంలోకి వచ్చింది. నేపాల్ లో ఇది ముఖ్యమైన పండుగ. మన దేశంలో అనేక విద్యాలయాల్లో గురుపూజ, వ్యాస పూజ జరుగుతాయి. శంకర పీఠాల్లో గురుపూర్ణిమ భక్తి ప్రపత్తులతో నిర్వహిస్తారు

వ్యాసునికి మరోపేరు కృష్ణ ద్వైపాయనుడు.

మానవజాతికి మహోపదేశం చేసేవి వేదాలు.

సోమరితనం పాపమని, కృషిచేసేవాడికే దైవం తోడ్పడతాడని, శ్రమలోనే సంపద ఉంది ఉత్సాహవంతుడికి విద్య లభిస్తుందని, మనసు ఎప్పుడూ శుభాన్ని కోరాలని, అన్ని ప్రాణుల్నీ స్నేహబుద్ధితో చూడాలని... వేదం వచిస్తోంది. ధార్మిక సేవకు వేదం మూలమని మనుస్మృతి పేర్కొంది.

ఇలాంటి అద్భుత వైదిక వాంగ్మయం నేటికీ మనకు లభించడానికి కారకుడు వ్యాసుడు.

మన పవిత్ర గ్రంథం భగవద్గీత. తిలక్, గాంధీలను కార్యోన్ముఖులను చేసిన భగవద్గీత మహాభారతంలోని. అంతేకాదు పాశ్చాత్య దేశాలు సైతం గీత గొప్పదాన్ని కీర్తిస్తున్నాయి. గీత ద్వారా భగవానుడుతో చెప్పించిన అనేక అంశాలు మేనేజ్మెంట్ పాఠాలు అమోఘం. వేదసారాన్ని పిండి పంచమవేదమై మహాభారతాన్ని అందించిన మహర్షి వేదవ్యాసుడు. 

ఏదైనా కొత్త రచనలు చేసేవారిని వ్యాసుడు అనడం సహజం. వేదబోధను సామాన్యుల చెంతకు చేర్చడానికి భారతాన్ని రచించి మళ్లీ భారత ఉపదేశాన్ని భగవద్గీత ద్వారా ఆయన అత్యంత రమణీయంగా సంక్షిప్తీకరించాడు. ఆది శంకరుల వారి భాష్యంతో భగవద్గీతా జ్ఞానం అందరికీ మరింత చేరువ అయ్యింది.           
సత్యవతి, పరాశరుడు పుత్రుడైన వ్యాసుడు భారతాన్ని రచించడమే కాదు, అందులో తానూ ఒక పాత్రగా పలు పర్యాయాలు దర్శనమిస్తాడు. భారత రచన సంతృప్తి చెందని వ్యాసుడు, భాగవతాన్ని రచించి ధన్యుడయ్యాడు. వేదం ప్రభువులా శాసిస్తే, పురాణం మిత్రుడిలా కథారూపంలో ప్రబోధిస్తుంది. ఇలా భారతీయ సాంస్కృతిక మూలస్తంభాల నిర్మాతగా వ్యాసుడు అందరికీ పూజ్యనీయుడయ్యాడు.   
 
"వ్యాసోచ్చిష్టం జగత్సర్వం" అన్నారు. వ్యాసుడు స్పృశించని అంశం లేదు. సమస్త వాంగ్మయాన్ని వ్యాసుడు పట్టకున్నాడు.

ఆయన జన్మించిన రోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి. ఆధ్యాత్మిక జ్ఞాన ప్రదాతలందరికీ ఆద్యుడైన వ్యాసుడి పుట్టినరోజు పండుగ గురుపూజోత్సవంగా, కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతం ఆచరిస్తారు. శివభక్తులు శివ శయనవ్రతాన్ని పాటిస్తారు. ఆధ్యాత్మికవేత్తలకే పరిమితమైన వ్యాసపూర్ణిమ నేడు సర్వజన హృదయాలకు గురుపౌర్ణమి వ్యాప్తి చెందడం విశేషం.
   
శ్లో!! గురుర్ర్బహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః !!

గురువు త్రిమూర్తి స్వరూపుడు. బ్రహ్మ జ్ఞానాన్ని మనలో పుట్టించి, విష్ణువై రక్షించి, శివుడిలా అజ్ఞానాన్ని తుంచి మంచి చెడులను విశదీకరించి మానవతా విలువలు, సద్గుణ సంపన్నతలు ఎలాపొందాలో నేర్పుతాడు. మనసు నుంచి ఆలోచనలు ఆవిర్భవిస్తాయి. సర్వవ్యాపకమైన మనసు విష్ణు స్వరూపం. విష్ణుమూర్తి నాభి నుంచి ఉద్భవించిన బ్రహ్మ మాదిరిగానే వాక్కు కూడా మనసు నుంచి ఆవిర్భవిస్తుంది. బ్రహ్మ వాక్కు...ఈశ్వరుడే హృదయం. ఇలా మన వాక్కు మనసు, హృదయం త్రిమూర్తాత్మకమై ఉంటాయి

త్రిమూర్తులు మనలోని త్రిగుణాలకూ ప్రతీకలు

గురువు మనలో మంచిని సృష్టించి, లోకంలో ఎలా జీవించాలో నేర్పుతాడు. అమాయకత్వాన్ని, మోహాన్నీ తుంచివేసే శక్తి సంపన్నుడు.

అంతేకాదు గురువు గుణాతీతుడు, రూపరహితుడు భగవత్ సమానుడు.

జ్ఞానాన్ని కోరేవారు తమ ఆధ్యాత్మిక గురువులు ఈ రోజు స్మరించి ఆరాధించి కృతజ్ఞతలను తెలియజేస్తారు. భుక్తి విద్యలు కాక ముక్తి విద్యను బోధించే గురు దర్శనానికి , స్మరణనకు ఈ రోజు విశిష్ట ప్రాముఖ్యత ఉంది. చంద్రుడు మనసునూ, సూర్యుడు బుద్ధి ప్రకాశింపజేస్తారు. మానవుల మనసులో అష్టమదాలూ,అరిషడ్వర్గాలూ, అహంకార చిత్తం అనే పదహారు మలినాలు పూర్ణిమ నాడు గురు నామస్మరణతో తొలగిపోతాయి

గురువును ఎందుకు స్మరించాలి ? ఎందుకు దర్శించాలి? కృతజ్ఞతలు ఎందుకు తెలపాలి? అనే సందేహాలు సహజంగా ఏర్పడతాయి. గురువు ఒక శిల్పి లాంటి వాడు. బండరాళ్లపై అందమైన శిల్పాలు చెక్కి వాటికి ప్రాముఖ్యతను కలిగించగల ప్రజ్ఞాశాలి గురువు. ఓ మంచి గురువు మలచిన శిష్యులు సంస్కారవంతులై ,సమాజానికి ఉపయోగపడతారు.

అలా గురువు సమాజ సేవ చేస్తున్నారు.

స్వర్ణకారుడు బంగారాన్ని సానబట్టి తయారు చేసిన ఆభరణం ధరించేవారికి అందాన్ని ఇస్తుంది. అలాగే గురువు కూడా శిష్యులను సానబట్టి సద్గుణాలు నేర్పి పరిపూర్ణ మానవుడిగా మార్చి సమాజానికి అలంకారంగా అందిస్తున్నాడు. తోటమాలి నేను చక్కగా చదునుచేసి మొక్కలు నాటి ఎరువు వేసి పెంచి పోషించి అందరికీ ఉపయుక్తమైన ఫలాలు పుష్పాలు ఎలా అందిస్తాడో గురువు కూడా శిష్యులను సమాజానికి అలంకారాలుగా అందిస్తాడు.

గురువు మార్గ దర్శకుడు ,తన శిష్యులు ఏది ఎలా చేయాలో, ఎంత వరకు చేయాలో, ఏది మంచి, ఏది చెడు అని నిర్ణయించగలరు.
వ్యాసమహర్షి మానవజాతి అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి దైవత్వాన్ని చూపే శ్రుతి, స్మృతి పురాణాలు, శాస్త్రాలు అందించిన గురువు
వేద విభజన చేయడం వల్ల వేదవ్యాసుడు ప్రసిద్ధిగాంచినాడు.

పుట్టుకతో నలుపు రంగులో ఉండడంతో క్రిష్ణ ద్వైపాయనుడు అని నామకరణం చేశారు. పుట్టిన వెంటనే తల్లి అనుమతి తీసుకుని తపోవనానికి వెళ్లిపోయాడు. ఇతనికి బాదరాయణుడు, క్రిష్ణుడు అనే పేర్లు కూడా ఉన్నాయి. ఇక వ్యాసుడు అనేది ద్వాపరయుగంలోని ఒక పదవి పేరు. ప్రతీ ద్వాపరయుగంలోనూ ఒక వ్యాసుడు జన్మిస్తాడు వేదాల్ని నాలుగు భాగాలుగా విభిజించి క్రిష్ణ ద్వైపాయనుడు, వేద వ్యాసుడిగా మారాడు.

నాలుగు వేదాలను తన శిష్యులకు బోధించి వారిచే ప్రచారం చేయించాడు. శిష్యుల్లో రుగ్వేదం పైలుడు, యజుర్వేదం వైశంపాయునికి, సామవేదం జైమిని, అధర్వణ వేదం సుమంతునికి బోధించాడు

వేదాల్లోని సారాలను పదిమందికి చేరేలా చేసి సమాజంలో మంచి మరింత పెంచడానికి ప్రయత్నించాడు కాబట్టే మనకు గురువయ్యాడు

వ్యాస పూర్ణిమ రోజున కింది శ్లోకాన్ని పఠించి విష్ణు పురాణం దానమిస్తే అంతా మంచే జరుగుతుంది.

శ్లో!!శంకరం శంకరాచార్యం గోవిందం బాదరాయణం సూత్ర భాష్యకృతౌ వందే భగవంతౌపునః పునః.!!

గురువు భగవంతునికన్నా శక్తివంతుడు. ఆయన కోరికలను తీర్చడం... శిష్యునికి ఏది అవసరమో అందిస్తారు. గురువు గొప్పదనం గురించి వర్ణించిన ఓ మహానుభావుడు 'గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు.

కాని వర్షంలో వెళ్లడానికి ఉపయోగపడుతుంది

గురువు ఆ గొడుగులాంటి వాడు' అని అన్నాడు

గురువు, గోవిందుడు ఒకేసారి దర్శనమిస్తే ముందు తాను గురువు నమస్కరిస్తానని కబీరు తన దోహాలులో పేర్కొన్నాడు. దీనికి కారణం గోవిందుడి గురించి వర్ణించి చెప్పింది గురువు కాబట్టి

అవతారమూర్తులై రాముడు, కృష్ణుడు అందరూ గురువుల వద్దనే విద్య నేర్చుకున్నారు.

ఆషాఢ పూర్ణిమ గురుపూర్ణిమ, వ్యాస పూర్ణిమ జరుపుకుంటాం.

గీతోపదేశం చేసిన కృష్ణుడు కృష్ణం వందే జగద్గురుం అని కీర్తిస్తున్నాం. తర్వాత కాంలో అనేక మంది గురువులు ఉద్భవించారు. వేదాలకు భాష్యం రాసి అస్పృశ్యుడిలోనూ భగవంతుణ్ణి దర్శించిన ఆదిశంకరులను. లోక కల్యాణానికి గుణమే ప్రధానం కాని కులం కారణం కారాదని ప్రవచించి ఆచరించిన శ్రీ రామానుజుల వారిని గురువుగా స్వీకరించారు. సదాచార సంపన్న వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరమ్' అని గురువును నిత్యం స్మరిస్తూ ఉంటారు. గతంలో కాదు నేటికి అనేక మంది గురువులు మన కళ్ల ముందే ఉన్నారు.

🌹గురువులను పూజిద్దాం🌹

కామెంట్‌లు లేవు: