5, జులై 2020, ఆదివారం

జై హనుమాన్ జై జై హనుమాన్.

         హనుమ అంటేనే తెలియని ఆనందం కల్గుతుంది.  ఈ స్వామి నామం తలుస్తుంటే తెలియని ధైర్యం వెంట చేరుతుంది. మన పెద్దలు హనుమనుగూర్చి ఏమి తెలిపారో ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకుందాం.  హనుమ అంటే శబ్దబ్రహ్మమట, హనుమ అంటే 
ముప్పది మూడు కోట్ల దేవతల స్వరూపమట, హనుమ అంటే 
1, 50, 000 గోవులను దానము చేసిన ఫలమట, హనుమఅంటే  సంకట హరుడట, అడిగిన/కోరిన కామ్యములు తీర్చే శక్తీభూతుండుట, రుద్రత్వమునుగల్గి కార్య జయము చేయగల మహా శక్తియట, హనుమ అంటే ఆనందమును కలుగ జేయువాడట.  చూచారా "హనుమ" అంటే ఏమిటో.

        తల్లి తండ్రులు పూజించిన దేవతలను వారి ఇంటివారు వారి ఇంటి ఇలవేలుపుగా తలచి  పూజించాలి.  నాకు చాలామంది మేము ఏ పని చేసినా కలసిరావటంలేదు అనితెలుపుతున్నారు. ఏదైనా నివారణోపాయం ఉంటే లఘువుగా తెలపండని. వారికి గల్గిన కష్టం ఎందువలన అని ఆలోచిస్తే  వారికే తెలుస్తుంది. అదేమిటో  ఇప్పుడు తెలుసుకుందాం.  తల్లి తండ్రులను పూజించకపోవటం మరియు వారు నిత్యం సేవించిన దేవతలను విస్మరించి ఇతర దేవతలను పూజించటమే కలసిరాకుండా ఉండుటకు ప్రధాన  కారణమని తలవాలి. 

         పితృదేవతలకుచేయవలసిన కర్మలు నిర్వహించకపోవడం రెండొవ కారణంగా తలువాలి. తల్లి తండ్రులను సేవించటమే గాకుండా 
వారు పూజించిన దేవతలను పూజిస్తే వారి ఇంట సంక్రాంతి పండగే. పితృదేవతల కార్యాలు సకాలంలో చేస్తే దేవతా అనుగ్రహం కలగటమేగాక సిరులు వారి ఇంట తాండవిస్తుంది అని తెలుసుకోవాలి.

        ఇహ పరాలకు కావలసిన సంపదను/పుణ్యాన్ని శ్రీ  హనుమంతులవారు నొసగగలరు. యత్ర యత్ర రఘునాధ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్. రామ అంటే మనం ఒనరించిన కర్మలచే గల్గె పాపం తొలిగి పోవటమే గాకుండా హనుమ ఆప్రాంతంలో నిలచివుంటారు. రామానుగ్రహం కలగటమే గాకుండా శ్రీ హనుమంతుని అనుగ్రహంకూడా వారికి కల్గుతుంది. హనుమ ఎవ్వరూ నొసగలేనిదానినైన నొసగగలవాడని, ఎటువంటి క్లిష్ట కార్యమైనా ఇట్టే జయము చేయగలవాడని తెలుస్తున్నది రామాయణాదులవలన. హనుమ అంటేనే  బుద్ధి, జ్ఞానం కల్గుతుంటే ఇంకేమి కావాలి.   హనుమ అను దివ్యనామ స్మరణతోనే కార్య జయం కల్గుతుంది. భక్తిగా పిలుస్తే పలికేవాడని తెలుస్తున్నది. పెద్దగా జప తపాదులు చేయ నవుసరములేదు ఈ కలియుగములో నామ స్మరణతోనే కార్య జయాన్ని పొందవచ్చని తెలుస్తున్నది. 

          ఈ స్వామీ చిరంజీవి. రాబోవు యుగమునకు కాబోవు బ్రహ్మముగా తెలుపబడింది. 33 కోట్ల దేవతల శక్తి ఒక్క హనుమ అని భక్తిగా అంటే వారికి కలుగుతుందని తెలుపబడింది.

          భక్తితో శ్రీ హనుమను సేవిద్దాం, కలి బాధలనుండి విముక్తినొంది   సుఖమైనా జీవనాన్ని 
మన సొంతం చేసుకుందాం.

కామెంట్‌లు లేవు: