5, అక్టోబర్ 2020, సోమవారం

*అనుకోని అతిధి (కథానిక )*


      🌷🌷🌷

రోజూ ఉదయాన్నే స్నానంచేసి 

పెరట్లో తులసికోట గూటిలో దీపం పెట్టి పూలతో అలంకరణ చేసి,"తన్మూలే సర్వ తీర్ధాని" శ్లోకం చెప్పుకొని, అరటిపండో, బెల్లం ముక్కో, ఏదోకటి నైవేద్యంపెట్టేది బామ్మ. కోడలు పెట్టిన ఇడ్లీలు తిన్నాక బీపీ బిళ్ల వేసుకొని, మళ్ళీ పెరట్లోకెళ్ళి ఆ నైవేద్యం తీసుకొని కళ్లకద్దుకొని తిని, కాసేపు ఎండలో తిరుగుతూ పూల మొక్కలు, కరివేపాకు చెట్లు, కూరల పాదులు పరిశీలించి లోపలకెళ్ళి విశ్రాంతి తీసుకోవడం నిత్య కృత్యం!

ఒకరోజు అలాగే వచ్చిచూస్తే 

తులసికోట దగ్గర అరటిపండ్లు 

లేవు. ఎవరో తినేసి తొక్కలు 

మందారచెట్టు మొదట్లో వేసి వెళ్లారు. ఎవరు చెప్మా, తమఇంట్లో చిన్నపిల్లలు ఎవరూలేరు మనవడూ, మనవరాలు సిటీలో ఉద్యోగం. సంసారాలు. కొడుకు, కోడలు, తానూ మాత్రమే ఉంటారు. రెండ్రోజులు అలా ప్రసాదం మాయమయ్యాక నిఘా పెట్టింది బామ్మ. తొమ్మిది గంటలకు ప్రహరీ గోడదూకి ఒక కోతిపిల్ల నేరుగా వచ్చి ఇత్తడి పళ్లెంలోని దానిమ్మ గింజలు మొత్తం తినేసి వెళ్లిపోవడం చూసి నవ్వొచ్చింది బామ్మకి. ఆరి బుజ్జిముండా, నువ్వట్రా అని, 

తర్వాత రోజునుండి నైవేద్యం పరిమాణo పెంచి అక్కడ నిలబడి గమనిస్తూ, కోతిపిల్లని పలకరించేది బామ్మ. దాంతో భయం పోయిన కోతిపిల్ల సాయంత్రం వరకూ పెరట్లోనే నీడలో పడుకొని బామ్మపెట్టే మధ్యాహ్న భోజనం కోసమే ఎదురు చూసేది. మెడలో ఎర్రదారంతో ముద్దొస్తున్నావ్ మారుతీ అంటూ దాంతో మాట్లాడుతున్న అత్తగారిని చూసి కోడలు ఆక్షేపణ చేసింది. 

"అత్తయ్య గారూ, మీనేస్తం మన మొక్కలు పాడు చెయ్యకుండా చూసేబాధ్యత మీదే మరి!" అంటూ. 

"నిజమే లక్ష్మి, కోతిబుద్ది అన్నారు కదా, కానీ తరమ బుద్ది కావడం లేదే,ఏగారడీ వాళ్ళనుండో తప్పించుకొచ్చి ఉంటుంది. ఈ ఊర్లో కోతులు ఎప్పుడు కనపడలేదు. ఈసారి గుంపువస్తే వాటితో ఇదే వెళ్తుందిలే. అందాకా మనమే ముద్దపెడదాం. అసలు ఇది రాత్రిళ్ళు ఎక్కడఉంటుంది అని, ఆశ్చర్యంగా ఉంది!"

అంటున్న అత్తగారితో" వీధి చివరి రామాలయం గాలిగోపురం అరుగుల మూల 

గూడులా ఉందట. అక్కడ పడుకుంటున్నదని పక్కింటి పిల్లలు చెప్పారు" అన్నది లక్ష్మి. ఆమెకీ భర్తకీ కూడా మూగజీవులమీద ప్రేమ. అందుకే అభ్యంతరం చెప్పలేదు ఇద్దరూ. బామ్మ భోంచేసాక చిన్నచాపా, దిండు తెచ్చుకోని పెరట్లోనే నీడగా ఉండేచోట కాసేపు నడుమువాల్చేది కోతి పిల్లమీద ఓకన్నేసి. వత్తులు చేసుకోవడమో, పప్పులు, బియ్యం బాగుచేసి డబ్బాల్లో పోయడమో, అన్నీ చిన్నిచిన్ని 

కళ్లతో వింతగా చూస్తూ మారుతి బామ్మదగ్గర బాగా అలవాటు అయింది. ఇంట్లోకి మాత్రం వచ్చేది కాదు, మిక్సీ, కుక్కర్ విజిల్ చప్పుడంటే చాలా భయం! అన్నం పెడితే తినడం, పెరట్లో ఉన్న చిన్న ఉసిరి కాయలు కిందరాలినవి, కొండ రేగుపండ్లు ఏరుకొని తింటూ, నూతిపళ్లెం దగ్గర తనకోసమే ఉంచిన ప్లాస్టిక్ మగ్గులో నీళ్ళు తాగుతూ, సూరీడు దిగిపోయాక, బామ్మ ఇచ్చిన పండో బిస్కెట్లో తినేసి వెళ్లిపోయేది మారుతీ. సాయంత్రం తులసిమొక్క దగ్గర బామ్మ పాట వినడం దానికి బాగా ఇష్టం. సెలవులకి వచ్చి వారం ఉండివెళ్లే పిల్లలకీ, ఊరిలో ఉండే బంధువులకీ కూడా అలవాటు అయింది కోతిపిల్ల. నుదుట సింధూరం బొట్టు పొడవుగా బామ్మ పెడుతుంటే, బుద్దిగా పెట్టించుకుంటుంది. చిన్నరేకులగది వేశారు మారుతి కోసమే!

కాలంతో బాటు పెరిగింది మారుతీ. బంధువులలో వెటర్నరీ డాక్టర్ ఉండడంతో వ్యాక్సిను, మందులు వాడుతున్నందున ఆరోగ్యంగా ఉంది. వడియాలు పెట్టినపుడు కాకులు ముట్టుకుంటే తరమడం బామ్మ ఏదైనా చెప్తే 

అర్ధమైనా కాకున్నా శ్రద్దగా వినడం, మనవళ్లకి, పిల్లలకీ బాగా మాలిమి అయింది మారుతీ. వచ్చిన మూడునెలలకి కార్తీకమాసంలో ఒకరోజు పొద్దున్నే గారడీ జంట వచ్చివాకిట్లో కూర్చుంది. ఎవరు మీరు, ఎందుకు వచ్చారూ అని బామ్మగారి కొడుకు అడుగుతా ఉంటే ఇద్దరూ ఏడవడం మొదలు పెట్టారు. ఆ కోతి మాదే బాబూ. అడవిలో కష్టపడి పట్టుకొనివచ్చాము. కాస్త గడమీద నడవడం, బిందె చంకలో పెట్టుకొని నీళ్లకి పోవడం, ఇల్లు చిమ్మేది, కర్రపుల్ల భుజంమీద పెట్టి డాన్స్ లూ నేర్పిన, మాతో బాటు బాగానే చూస్తిమి, తప్పిచ్చుకొని వచ్చేసింది దొంగకోతి. అదిలేకుంటే పదిరూపాయలు కూడా రావట్లేదు సామీ, మా కోతిని మాకిచ్చేయ్," అంటూ ఒకటే గోల. గుడికెళ్ళి వచ్చిన బామ్మ అసలే ఉపవాసంతో ఉందేమో వీధిఅరుగుమీదే కూలబడిపోయింది. వీళ్ళు వదిలేలాలేరు ఎలా శివయ్యా అనుకుంటూ. కొన్ని నిముషాలు మౌనంగా ఉండి," ఎందుకు ఇవ్వాలి,అది మా మారుతి. నువ్వు చెప్పేది నిజమే అయితే నీదగ్గరికి రాలేదేం? అదిగో ఆ జామ చెట్టెక్కి అరుస్తూ ఉంది. నువ్వు ఎన్ని హింసలు పెట్టి ఉంటావో, పాలుతాగే వయసులో వలపెట్టి తేవడానికి దయలేదా? ఇప్పుడు శోకాలు పెట్టావే, నీపిల్లలు నీకుముద్దు అయితే, దానికి తల్లి ప్రేమలేకుండా చేస్తివి. తిండి పెడితే సరిపోదు. మూగజీవిని 

దేవుని బిడ్డగా చూడాలి. వెళ్ళెళ్ళు!" అన్నది బామ్మ. "అమ్మా, వీళ్ళతో గొడవలెందుకు పంపేద్దాం!" అన్న కొడుకుమాటలుకి మండిపడింది శాంతమ్మ గారు." ఒరేయ్, మిమ్మల్ని ఎప్పుడు కూడా ఏమి అడగలేదు, ఇవాళ ఈ ప్రాణి గురించి చెప్తున్నా, అనుకోని అతిధిలా మన జీవితంలోకి వచ్చింది. కుక్కలే కాదు ప్రతిజీవి విశ్వాసం చూపేవే. వాళ్ళు తీసుకొనివెళ్లి ఇంకా హింసపెట్టి బందీగానే చూస్తారు. పంపేసానంటే నా కంటే పాపి ఎవరూ ఉండరు. నేను ఇవ్వను మారుతిని" అంటున్న పెద్దామెని చూసి, కాళ్లకి దండాలు పెట్టి, "అమ్మా, తప్పే చేశాము, మీరు సదువు, ఉజ్జోగాలు, ఇల్లు వాకిలి భద్రంగా ఉన్నోళ్లు. మావి సంచారి బతుకులు. ఈ రోజుకి ఆకలి తీర్తే సాలు, నలుగురు బిడ్డలుండారు. వాళ్ళని సాక్కో వాలా, ఆదాయం లేకపోతే ఎట్లా సెయ్యల?" అంటూ మొండిగా 

వాదిస్తూ ఉన్న వాళ్ళని చూసి, చివాలున అరుగుమీదనుండి లేచి ఇంట్లోకి వెళ్లిన బామ్మ, తన ట్రంకుపెట్టె అడుగున ఉన్న తమిళనాడు పసుపు రంగు సంచీలో ఉన్న నోట్లు అన్నీ తీసుకొని వచ్చి కొడుకు చేతిలో పెట్టి లెక్కపెట్టబ్బాయ్ అన్నట్టు చూసింది. లెక్కేసి ఇరవై ఒక్క వేలు అమ్మా అన్నాడు కొడుకు. "వాళ్ళకిచ్చి పంపు, ఇక ఎప్పుడూ ఇటు రాకూడదు. ఆ డబ్భుతో కిరాణా కొట్టు పెట్టుకోమను, తలో పనిచేసుకుంటే ఆ కొట్టులో ఉప్పు, పప్పుతోనే కుటుంబం కూడా గడిచిపోతుంది. వచ్చే ఆదాయం లో పెట్టుబడి పోను మిగతా పిల్లలకే" అంటున్న 

బామ్మ కాళ్లమీద పడబోయాడు గారడీ అతను. డబ్బులు సంచీ లో పెట్టుకుని దండాలు పెడుతూ వెళ్లిపోయారు. చుట్టూ చేరిన జనం నోరెళ్ళ బెడుతూ ఇళ్ళకి వెళ్లారు. "కాశీకి వెళ్ళాలి, అంటూ దాచుకున్న డబ్బులు అలా ఇచ్చేసారు ఏమిటి అత్తయ్యా?" అన్నది కోడలు నొచ్చుకుంటూ, ఆమెకు తెలుసు శాంతమ్మ గారి ఔదార్యం. కోడలుగా కాదు కన్న బిడ్డలాగే చూసింది తనను అత్తగారు. తన పుట్టింటి వారికి ఎంతో సాయం చేసింది, కట్నాలు, కానుకలూ అసలు అడగలేదు. తనకున్న దేదో పెట్టి జరిపించినది అత్తగారు ఇంట్లో ప్రతి కార్యక్రమం. "కాశీ కి వెళ్ళేది మాత్రం పుణ్యం కోసమే కదా లక్ష్మి. ఆ మూగజీవి చూడండి వాళ్ళని చూసి పిచ్చిగా అరుస్తూ ఏడుస్తూ చెట్టెక్కి పోయింది. దీనిని రక్షించడం కంటే పుణ్యం ఇంకోటి ఉందా? ఏదీ నాకు పొంగలి పెట్టు, ఆకలిగా ఉంది. రారా మారుతీ, అప్ప తిందాం" అంటూ పెరట్లోకి వెళ్ళింది బామ్మ. అలా ఏళ్ళపాటు బంధం నిలిచిఉంది. తొంభయ్ ఆరేళ్ళు ఆరోగ్యంగా కోడలితో సమానంగా పనిచేసిన బామ్మ 

ఒకరాత్రి నిద్రలోనే అనాయాస 

మరణం పొందినారు. ఊరు మొత్తం కదిలింది ఆమె ఆఖరియాత్రలో. మారుతి మౌనంగా పడుకున్నావా బామ్మా, లే అన్నట్టు చూస్తూ తలదగ్గరికి వెళ్లి గంటల తరబడి కూర్చున్నది. స్నానం చేయించే సమయంలో పిల్లలు పెరటిలో ఉన్న రేకుల గదిలో మారుతిని ఉంచి పండ్లు ఉంచి తలుపులు గొళ్ళెం పెట్టేసారు. బామ్మగారు నిశ్చలంగా రుద్రభూమిని చేరారు. ఇంటికి వచ్చి స్నానాలు చేసి రూమ్ తలుపులు తీసి చూస్తే మారుతి బామ్మతెల్లచీర 

మీద పడుకొని నిద్రలో ఉంది. 

పండు ఒకటి కూడా ముట్టుకోలేదు. నెమ్మదిగా కోడలు లక్ష్మి పరామర్శతో, దగ్గరికి తీసుకొని అన్నం పెట్టడంతో మామూలుగా ఉన్నా ఎక్కువగా గుడి దగ్గరికి వెళ్లి పోతున్నది మారుతి. 

కుటుంబం కూడా పెద్దదిక్కు కోల్పోయిన దుఃఖం నుండి తేరుకొని, బామ్మగారికి ఇష్టమైన పనులు చేస్తూ, ఒక రోజు ఆమె రాసే రామకోటి పుస్తకంలో చివరిపేజీలలో, మారుతి గురించి చదివి చాలా 

ఆశ్చర్యపోయారు. మారుతిని బాగా చూసుకోమని, ఒకవేళ కోతుల సమూహం ఊరిలో కొస్తే దాని ఇష్టప్రకారమే వెళ్లిపోనివ్వమని, లేదా మునుపటి లాగే ఆదరణగా చూడండి అని రాసి పెట్టింది బామ్మ. ఊరివాళ్ళకి కొన్ని ఏళ్ళ పాటు ఈఅనుబంధం గుర్తు ఉండిపోయింది!


✍️. ఎం. వి. ఉమాదేవి, నెల్లూరు.

కామెంట్‌లు లేవు: