5, అక్టోబర్ 2020, సోమవారం

జగద్గురువు - జగన్మాత

 


గ్రీసు దేశం రాజమాత(మహారాణి) కుమార్తె ఇపుడు స్పెయిన్ దేశపు మహారాణి. ఆమె పేరు సోఫియా. ఆమె తల్లికి మల్లే ఈమెకు కూడా కంచి పరమాచార్య స్వామివారిపై అపరిమిత భక్తి. మన మహాస్వామి వారిని వారి గురువుగా భావించి మొత్తం రాజకుటుంబం స్వామివారికి శరణాగతులు అయ్యారు. స్వామివారు సతారాలోని ఉత్తర చిదంబరంలో కొన్ని నెలలు మకాం చేసినప్పుడు మహారాణి సోఫియా స్వామివారి దర్శనార్థం నాలుగు రోజులు అక్కడే ఉండిపోయింది. కొన్ని సంవత్సరాల తరువాత ఒక నాట్యప్రదర్శన కోసం మేము స్పెయిన్ వెళ్లినప్పుడు మహారాణి సోఫియా మమ్మల్ని తన రాజభవనానికి పిలిపించింది. ఎంతో ప్రేమతో, మర్యాదతో మమ్మల్ని ఆదరించిన తీరు అబ్బురపరచింది.


“ఒక దేశపు మహారాణి, కనీసం జతగా స్నానాల గది కూడా లేని ఒక చిన్న హోటలు గదిలో ఎలా ఉండగలిగింది?” అని నేను ఆమెను అడిగాను.


“కాంచి మహాస్వామి వారి దర్శనం కోసం మేము ఒక చిన్న గుడిసెలోనైనా ఆనందంగా ఉండగలం. వీధుల్లో నడవగలను. స్వామివారి దర్శనం దొరికిన రోజే మేము జీవించిన రోజుగా లెక్క. ఇతర సమయాలలో ఏదో అలా ఊపిరి తీసుకుంటాను అంతే. ఈ వైభవం అంతా శాశ్వతం కాదు. వారి దర్శనం చేసుకోగలుగుతున్న ఆనందం మాత్రమే నిజమైనది మరియు నిత్యమైనది” అని ఎంతో భక్తితో చెప్పారు.


ఆ క్షణం స్వామివారిని జగద్గురువు అనడం కంటే జగన్మాత అనడం సబబేమో అనిపించింది నాకు.


--- డా. పద్మా సుబ్రమణ్యం, “నృత్యోదయ” చెన్నై. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 2


అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: