17, నవంబర్ 2020, మంగళవారం

కార్తిక పురాణము

 శ్రీరస్తు.


కార్తిక పురాణము

2వ అధ్యాయము.


కార్తిక సోమవార వ్రతమాహాత్మ్యము


పద్యరచన.

చింతా రామకృష్ణారావు.


వశిష్ఠుఁడు జనకునికిట్లు చెప్పసాగెను.


మత్తకోకిలు.

👇

1.  శ్రీ వశిష్ఠుఁడు చెప్పుచుండెను శ్రీకరంబగు సత్ కథల్


ధీవరేణ్యుఁడు రాజయోగియు తృప్తిగా వినుచుండె, స


ద్భావ సంపద, పుణ్యసత్ ఫలదంబు కార్తిక మాసమున్


జీవపాళికి సోమవారము చేయుమేలు వ్రతంబునే.


2.  కార్తికంబున సోమవారము గాఢ సద్వ్రత దీక్షతో


వర్తిలం దగు షడ్విధంబులు బాగుగా వివరించుచున్,


ధూర్తులేవిధి ముక్తిగాంచ బుధుల్ వచించిరొ తెల్పి తా


నార్తితోడను నిష్ఠురీ యపహాస్య వృత్తిని తెల్పెగా.


3.  భారతంబున కాశ్మిరంబున బ్రాహ్మణోత్తము పుత్రిగా


వారకాంతయె పుట్టెనా యన పాపి నిష్ఠురి పుట్టె, నె


వ్వారలున్ తన దుర్గుణంబులు భారమంచును చేరనీ


రారజోగుణ దుర్భగన్, గని యాదరించెను భర్తయే.   


4.  మిత్ర శర్మ మహానుహావుఁడు, మేలు కూర్చగ నామెనే


పాత్రురాలుగ నెంచి నిత్యము భర్త్రుధర్మము తోడ తా


ధాత్రి వర్తిలుచుండ, నామె కుతంత్రముల్ పచరించుచున్


శత్రువట్టుల చూడ సాగె నసహ్య ధూర్తుల చేరికన్,   


5.  అంద చందములారఁ బోయుచు నందరున్ వశమౌటతో


పొంద సాగెను యౌవనోద్ధృతి పొంగగా దురహంకృతిన్,


కొందరామెను భర్త యడ్దని క్రుమ్మిచంపమనంగనే


మందబుద్ధి వధించె భర్తను,మంచియే కనరానిదై.     


6.  పాప పంకిల దుర్మదాంధను వార కాంతగ చేసి యా


కూపమందుననుంచి వీడిరి కోడెగాండ్రు, కృశించగా


వాపువోలెను యౌవనంబు, ప్రభావమంతయు హీనమై


యోపలేని దురంత దుర్గతి నొంది క్రుళ్ళెను దేహమున్. 


7.  తా నధర్మమునందు మున్గిన ధర్మబాహ్యను నిష్ఠురిన్


ప్రాణముల్ హరియించి దూతలు వాతలెన్నియొ పెట్టి, య


క్షీణ పాపికి దుష్ట జన్మలు శిక్షగా విధియించగా


తాను చేసిన కర్మదుష్ఫల దండనంబని రోదిలున్,       


8.  వేల జన్మలు నెత్తు నామెను పెద్దవారల పుణ్యమే


నేలపై జనియింపఁ జేసెను నీతిబాహ్యను, కుక్కగా


జాలి చూపుచు బ్రహ్మయే మనసార మార్చగ వ్రాతయే,


మ్రోల నిల్చెను బ్రాహ్మణోత్తము ముంగిలిన్ గని భుక్తికై.   


9.  కార్తికంబది, సోమవారము, కాల కంఠుని గొల్చుచున్,


గుర్తుగా వ్రతమాచరించెను కోవిదుండగు బ్రాహ్మణుం


డార్తులన్ గని బ్రోవుదైవ మహత్వ మాతనికబ్బుటన్


బూర్తిగా శివుఁడట్లు భాసిలు పూజ్యుడుండు గృహంబదే.


10.  బాపడావ్రతమున్ సమాప్తము పాడిగా యొనరించి తా


మాపటన్ బలి నుంచె బైటను మంచికోరుచు, నంతలో


నా పదార్థము గ్రోలె నిష్ఠురి యాకలిన్ బరిమార్చగా


నా పరాత్పరు సత్ కృపన్ దన యాత్మలో స్మృతి కల్గెనే.  


11.  నాకు ముక్తిని గొల్పుడంచు ఘనంబుగా నది కోరగా


శ్రీకరుండగు బ్రాహ్మణుండటు చెంత నిష్ఠురిఁ గాంచుచున్


నీకదెట్టుల వచ్చె మాటలు నీ వెవండవు తెల్పుమం


చాకడన్ గల కుక్క తో ననె నంతనయ్యది తెల్పగా,          


12.  దానివృత్తము విన్న బాపఁడు దానికిన్ వ్రత సత్ ఫలం


బే నయంబుగ ధారవోసె, నహీన దివ్య ఫలంబుచే


శ్వాన దేహము వీడి నిష్ఠురి శర్వుసన్నిధి చేరె, నో


ధీనిధీ! వర కార్తికవ్రత దీక్ష మానకు మెప్పుడున్.               


13.  కార్తికంబున సోమవారము కాలకంఠుని గొల్చుడీ!


స్ఫూర్తి నొందుడి భక్తి భావము పొంగిపొర్లగ మీరలున్


ధూర్తపాళిని చేరబోకుడి, తోచినట్లుగ నీశ్వరున్


పూర్తిగా మదినిల్పి ముక్తిని పొందుడీ జనులందరున్.


2వ అధ్యాయము సమాప్తము.


స్వస్తి.

కామెంట్‌లు లేవు: