3, ఏప్రిల్ 2021, శనివారం

క్రూర కర్మలు

 ఏవి క్రూర కర్మలు?


మనిషికి నడక కన్నా నడత అందంగా ఉండాలి. అందమైన నడత కలిగిన వారికి గౌరవం దక్కుతుంది. చిరకీర్తి కలుగుతుంది. నడత అనేది మనిషి ప్రవర్తనకు ప్రతిబింబం. ఈ ప్రవర్తన కులం, జాతి, మతం, ప్రాంతం, పుట్టుక లాంటి వాటి వల్ల రాదు. అది వారి శీలగుణ సంపద మాత్రమే! ఎవరైతే గుణశీలురుగా జీవిస్తారో వారికి అది సహజంగానే సంక్రమిస్తుంది. కాబట్టి మన నడతకు మూలం శీలగుణం మాత్రమే! కానీ సమాజంలో పుట్టుక, కులాలను బట్టి గుణశీలాలు ఉంటాయనే అపోహ ఉంది. దానివల్ల కొందరిలో అహంభావమూ ఉంది. అలాంటి అహంభావుల్లో అగ్ని భరద్వాజుడు ఒకడు.

 ఒక రోజు బుద్ధుడు తన శిష్యులతో కలసి శ్రావస్తి నగరంలోని ఒక వీధిలో ప్రవేశించాడు. ఆ వీధిలో అగ్ని ఆరాధకుడైన భరద్వాజుడు ఉంటున్నాడు. ఆయన అప్పుడే అగ్నిహోత్రాన్ని ప్రజ్వలింపజేస్తున్నాడు. ఇంతలో వాకిటి తలుపులో నుంచీ బుద్ధుణ్ణి చూశాడు. తన ఇంటికే భిక్ష కోసం వస్తున్నాడని అనుకున్నాడు. గబగబా వీధి గుమ్మం దగ్గరకు వెళ్ళి ‘‘ఓ శ్రమణకా! ఆగవయ్యా ఆగు! ఓయీ! చండాలా (వసలా)! ఎక్కడకి వస్తున్నావు?’’ అని గద్దించాడు. అతని దృష్టిలో క్రూర కర్మలు చేసేవాడు చండాలుడు. కులభేదాలు చూడకుండా అందరి ఇళ్ళల్లో ఒకే రీతిగా అంటూసొంటూ లేకుండా భిక్ష స్వీకరిస్తాడు కాబట్టి బుద్ధుడూ చండాలుడే అనేది ఆ భరద్వాజుని అభిప్రాయం. 

అతని మాటలకు బుద్దుడు ఆగి - ‘‘భరద్వాజా! నీకు ఏది చండాలత్వమో తెలుసా?’’ అని అడిగాడు. ‘‘క్రూరకర్మల ఆచరణ’’ అన్నాడు భరద్వాజుడు.  ‘‘ఏవి క్రూరకర్మలు?’’ ‘‘హింసించేవి క్రూరకర్మలు.’’ ‘‘ఔను భరద్వాజా! ఏ పనులైతే మనిషినీ, సమాజాన్నీ హింసిస్తాయో అవి మాత్రమే క్రూరకర్మలు. కోపం క్రూరకర్మ. నిష్కారణంగా ఇతరులను నిందించడం క్రూరకర్మ. పాపాలు చేయడం, ద్వేషాలు చూపడం, అసత్యాలు పలకడం, మోసం చేయడం... ఇవి క్రూరకర్మలు. అలాగే ఇతరుల ఆస్తిని బలవంతంగా లాక్కోవడం, దొంగతనం, అప్పు తీసుకొని, తీసుకోలేదని మాట మార్చడం, అధిక వడ్డీలు గుంజడం... ఇవన్నీ క్రూరకర్మలే! అలాగే డబ్బుకు ఆశపడి దొంగ సాక్ష్యాలు చెప్పడం... ఇదీ క్రూరకర్మే! 

వృద్ధాప్యంలో తల్లితండ్రుల్ని చూడకపోవడం, కోపావేశంలో తల్లితండ్రుల్నీ, అత్తమామలనూ, అక్కాచెల్లెళ్ళనూ, అన్నదమ్ములనూ, భార్యనూ కొట్టడం కూడా క్రూరకర్మలే! భరద్వాజా! ఒక పండితుడు ప్రజలకు గంభీర శబ్దాలతో, అర్థంకాని పదాలతో చెబుతాడో, ప్రబోధిస్తాడో అది క్రూరకర్మే! చేసిన మేలు మరచిపోవడం, ‘ఎవరూ చూడలేదు కదా!’ అని తప్పు చేయడం, తననుతాను గొప్పగా పొగుడుకోవడం, ఇతరులను తెగడడం, విమర్శించడం, విజ్ఞత మరువడం... ఇవి కూడా క్రూరకర్మలే! పిసినారితనం, పశ్చాత్తాపం చెందకపోవడం, ఆమె అనుమతించినా, అనుమతించకపోయినా మిత్రుని భార్యతో సంబంధం పెట్టుకోవడం, తనకు జ్ఞానం లేదని తెలిసి కూడా జ్ఞానిలా నటించడం, శాస్త్రం తెలియకపోయినా పండితునిగా ప్రచారం చేసుకోవడం... ఇవిగో, ఇవన్నీ క్రూరకర్మలే! ఇలాంటి పనులు చేసేవారు ఏ కులం వారైనా, ఏ ప్రాంతం వారైనా వారే చండాలురు. అంతేకాని నీవనుకున్నట్టు కులభేదాలు పాటించని వారు కాదు!’’ అన్నాడు బుద్ధుడు. అగ్ని భరద్వాజునికి అజ్ఞానం కరిగింది. అహం దిగింది. ‘‘భగవాన్‌! క్షమించండి! నా ఇంటికి దయచేయండి. భిక్ష స్వీకరించండి’’ అని ప్రాధేయపడ్డాడు. ఆనాటి నుంచి మంచిగా నడుచుకున్నాడు.

కామెంట్‌లు లేవు: