25, మే 2021, మంగళవారం

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...


*దత్తపాదములు..*


*(ముప్పై ఎనిమదవ రోజు)*


ఫకీరు మాన్యం లో ఆశ్రమ నిర్మాణ స్థలానికి చేరుకున్న శ్రీ స్వామివారు..ఆ ప్రక్కరోజు శ్రీధరరావు దంపతులను వచ్చి ఒకసారి కలువమని చెప్పి పంపారు..ప్రక్కరోజు ఉదయానికి శ్రీధరరావు ప్రభావతి గార్లు వచ్చేసారు..ఆసరికి శ్రీ స్వామివారి తాత్కాలిక నివాసం "పూరి పాక " సిద్ధమైపోయింది..అందులో రెండు కొయ్యతో చేసిన బల్లలు కూడా పెట్టారు..ఎవరైనా వస్తే కూర్చోడానికి..శ్రీధరరావు ప్రభావతి గార్లు వెళ్ళేసరికి..శ్రీ స్వామివారు పద్మాసనం వేసుకొని ధ్యానం చేసుకుంటూ వున్నారు..


శ్రీధరరావు గారిని చూసి..నవ్వుతూ.."అన్నీ అమిరాయి..ఇక ఆశ్రమ నిర్మాణం దగ్గరుండి చూసుకోవచ్చు నేను!.." అన్నారు..ఆపై ఒక్కసారిగా శ్రీ స్వామివారు గంభీరంగా మారిపోయారు..


"ఈ స్థలంలో ఆ దత్తాత్రేయుడి పాదముద్రలు ఉన్నాయి..మీరు చూసారా? " అన్నారు..


శ్రీధరరావు ప్రభావతి గార్లు ఒకళ్ళనొకళ్ళు చూసుకొని.."లేదండీ..దత్తాత్రేయ స్వామి పాదముద్రలు మాకు తెలిసి ఇక్కడెక్కడా లేవే!.." అన్నారు..


"లేదు..లేదు..ఉన్నాయి..మీరు చాలా సార్లు చూసివుంటారు.. గుర్తుతెచ్చుకోండి.." అన్నారు శ్రీ స్వామివారు..


శ్రీధరరావు గారికి చప్పున గుర్తుకొచ్చింది.."స్వామీ!..ఇక్కడికి దగ్గరలోనే..మన్నేటి ఒడ్డున పాదముద్రలున్న శిల ఉన్నది..అది ఎన్ని సంవత్సరాల నాటిదో తెలీదు కానీ..మా తండ్రిగారి చిన్నప్పటి నుంచీ చూసేవారట!..వారి తండ్రిగారు అంటే మా తాతగారు హయాంలోనే చూసారట!..మేము, మా మాగాణి పొలానికి ఈ దారిలోనే వెళుతూ ఉంటాము..ఎన్నో మార్లు చూసాము..కానీ, దానిని మాకు "శ్రీ సత్యనారాయణ స్వామి పాదాలుగా" చెపుతూ వుండేవారు..మా పిల్లలకు కూడా మేము అలానే చెప్పాము..కావాలంటే చూపిస్తాను.." అని..ప్రభావతి గారివైపు చూసి.."నువ్వు రాగలవా అక్కడిదాకా?.." అన్నారు..


"అమ్మను కూడా తీసుకువెళదాము..ఏమ్మా.. నువ్వు కూడా మాతో రా తల్లీ!.." అన్నారు శ్రీ స్వామివారు..


ఆశ్రమనిర్మాణ స్థలం నుండి గట్టిగా ఒకటి రెండు ఫర్లాంగుల దూరం లోనే మన్నేరు నది ప్రవహిస్తున్నది.. ఆ నది ఒడ్డున ఉన్న శిల వద్దకు శ్రీధరరావు గారు శ్రీ స్వామివారిని తీసుకెళ్లారు..


పాదముద్రలు చెక్కినట్లుగా ఉన్న ఆ శిలాఫలకాన్ని శ్రీ స్వామివారు తదేకంగా కొద్దిసేపు చూసి..అక్కడే కూర్చుని..ధ్యానం చేస్తూ సమాధి స్థితిలోకి వెళ్లిపోయారు..సుమారు అరగంట గడచిన తరువాత..సమాధి స్థితి నుంచి బైటకు వచ్చి..


"అమ్మా!..ఇవి సాక్షాత్తూ ఆ దత్తాత్రేయుడి పాదముద్రలు..పశ్చిమ భారతం లో ఒక చోట చాలా ఎత్తైన ప్రదేశం లో ఇలానే శిల మీద ఆ దత్తాత్రేయుడి పాదముద్రలు ఉన్నాయి..మళ్లీ ఇక్కడే ఆ స్వామి పాదముద్రలు ఉన్నాయి..ఈ భూమి ఒకప్పుడు దత్తక్షేత్రం..మరుగున పడిపోయింది..నా తపస్సుకు అనువైన స్థలంగా నేను పదే పదే ఎందుకు ఆరాటపడ్డానో తెలుసా?..నాకు ఈశ్వరుడి ఆజ్ఞ తో పాటు, ఆ దత్తుడి ఆదేశం కూడా అందింది కనుక..భవిష్యత్ లో గొప్ప పుణ్యక్షేత్రంగా మారబోతోంది తల్లీ ఈ స్థలం..శ్రీధరరావు గారూ ఈ పాదముద్రలున్న శిల ను భద్రపరచండి..ఆశ్రమ నిర్మాణం కాగానే అందులో ఉంచుదాము.." అన్నారు..ఆసమయంలో శ్రీ స్వామివారి ముఖం అత్యంత ఆనందంతో వెలిగిపోతోంది..


శ్రీ స్వామివారు  సాష్టాంగ నమస్కారం చేసి..భక్తి పురస్సరంగా ఆ పాదాలను తన చేతితో తడుముతూ.. ఆ చేతులను తన కళ్ళకు..హృదయానికి హత్తుకున్నారు..తమ కళ్ళముందు ఏదో ఒక మెరుపు లాంటి తేజం శ్రీ స్వామివారిని తాకుతూ వెళ్లినట్లు ఆ దంపతులకు గోచరించింది..ఆ వెలుగు చూడలేనట్లు చప్పున కళ్ళుమూసుకున్నారు ప్రభావతి శ్రీధరరావు గార్లు..


తాము ఎన్నో మార్లు ఆ దారంట వెళుతూ చూస్తున్న ఆ శిలాఫలకం పై ఉన్నవి సాక్షాత్తూ ఆ దత్తాత్రేయుడి పాదముద్రలని ఆ దంపతులకు ఆ క్షణం వరకూ తెలియదు..శ్రీధరరావు ప్రభావతి గార్లు భక్తిగా ఆ పాదాలకు  మ్రొక్కారు..


అక్కడనుండి తిరిగి వచ్చేటప్పుడు శ్రీ స్వామివారు మౌనంగా వున్నారు..తానుంటున్న పూరి పాక లోకి వచ్చి..పద్మాసనం వేసుక్కూర్చుని.."అవధూతలకు.. సాధువులకు చేసిన ఉపకారం ఎన్నో రెట్లు ఫలితాన్ని ఇస్తుంది..సంచిత పాపకర్మలను..వాళ్ళు నిష్కామంగా చేసిన ఆ సేవ క్షయం చేసి వేస్తుంది..జన్మ రాహిత్యాన్ని కలుగ చేస్తుంది..మీరు చేస్తున్న సేవ..పడుతున్న ఆరాటం..ఊరికే పోదు.. మీ ప్రారభ్దపు కర్మలు అనుభవించక తప్పదు..కానీ..ఉత్తమ గతులు లభించడం మాత్రం తధ్యం!.."అని చెప్పి.."మీరిద్దరూ కూడా ఈనాటి నుంచి నన్ను దత్తాత్రేయుడిగానే సంబోధించండి..అమ్మా..నువ్వు మాత్రం నన్ను నాయనా అని మామూలుగా పిలిచినా పలుకుతాను తల్లీ!.." అన్నారు..


శ్రీధరరావు గారు తమతో బండి వెనుక వచ్చిన మనుషులకు ఆనవాళ్లు చెప్పి..ఆ బండిలోనే ఆ పాదముద్రలున్న శిలను తీసుకురమ్మని పంపించారు..కొద్దీ సేపటికే "దత్తాత్రేయ స్వామి పాదాలున్న శిలాఫలకం" అవధూతగా మారిన ఈ దత్తాత్రేయుడి వద్దకు క్షేమంగా చేరింది..


నేటికీ శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిర ప్రాంగణంలో ఆ "దత్తపాదములు " భద్రంగా ఉన్నాయి.. శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరం దర్శించిన ప్రతి భక్తుడూ..ఆ "దత్త పాదములకు " ప్రదక్షిణ పూర్వక నమస్కారం చేసుకొని వెళ్లడం ఆనవాయితీ..ఎంతోమంది తమ కోర్కెలు కోరుకుంటూ..ఆ పాదాలకు ప్రణమిల్లుతారు..


ఒంగోలు కు చెందిన సుప్రసిద్ధ వైద్యులు శ్రీ సునీల్ కుమార్ రెడ్డి గారు (Suneel Kumar Reddy.L ) ఆ దత్త పాదములకు ఒక చిన్న గుడి ఏర్పాటు చేసారు..


శ్రీ స్వామివారి జటాఝూటం... సవరం..రేపు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: