25, మే 2021, మంగళవారం

లక్ష్మీవాన్

 *లక్ష్మీవాన్..*


అససాదాధ లక్ష్మీవాన్ రాక్ష్షసేంద్ర  ని వేశనం ;  ఈ శ్లోక పాదం సుందరాకాండ లో మూడు చోట్ల అంటే 6/2, 6/28 & 9/4 శ్లోకాల్లో  ఉంది. 24,000 ల శ్లోకాలు వ్రాసిన వాల్మీకి కొత్త పాదం వ్రాయలేక అదే పాదాన్ని 3 సార్లు వ్రాసాడను కుందామా? పోనీ అర్థం ఏమైనా కొత్తదనం ఉందా అంటే అదీలేదు.  ఒక ఇంట్లోకి ఒకడు ఒకసారి వెళ్తాడు. వరస గా అదే ఇంట్లోకి మూడుసార్లు వెళ్ళాడు  అని వ్రాయడం మెందుకు. 


 రామాయణం చదివే వాళ్ళు కొన్ని పదాలు  చూసు కో కుండా అర్థం చేసు కో కుండా ముందుకు పోతారేమో అని వాల్మీకి కి భయం. ఆయన ఏదో పదం గురించి ఇక్కడ కంగారు పడ్డారు.  ఏదైనా పదం తప్పు గా వాడినట్లుగా కనపడేటట్లు చేసి తరవాత దానికి సరైన వివరణ చూపించడం వాల్మీకి కి ఓ సరదా.  ఈ శ్లోకం లో ఏ పదం వాల్మీకి నొక్కి చెబుతున్నాడో మనం చూడాలి. 

 

Repitition తప్పే గాని అది ఇక్కడ ఒక purpose serve చేస్తుంది.   మన దృష్టి ఆకర్షించ డానికి చేసిన పనియిది. జయత్యతి బలో రామో శ్లోకం కూడా ఆంజనేయుడి ద్వారా repeat అవుతుంది. దాని importance చెప్పడానికే వాల్మీకి అలా repeat చేశాడు. 


ఇక అససాదాధ లక్ష్మీవాన్ దగ్గరికి వద్దాము. వేదాంత పరిభాష తెలిసిన వాళ్లకు అధః అనే పదానికి ఉన్న  ప్రాముఖ్యత తెలిసే ఉంటుంది. అధాతో బ్రాహ్మ జిజ్ఞాస అన్నదానికి వ్యాఖ్య వ్రాస్తూ ఆది శంకరులు ఈ పదానికి ఇంత పొడుగు అర్థం వ్రాశారు. అధః అంటే అంతట, పిమ్మట, దాని తరవాత అని అర్థం. కాబట్టి తరవాత పదాన్ని మనం చూడాలి. లక్ష్మీవాన్ పదం జాగ్రత్త గా చూసుకో వాలి. ఈ పదాన్ని ఆంజనేయుడి కి విశేషణం గా వేశారు.  


ఇలాగే చాలా సార్లు లక్ష్మీవాన్ / శ్రీమాన్ పదాలు విశేషణం గా లక్ష్మణుడికి విభిషణుడికి కూడా వాల్మీకి చాలా చోట్ల వాడాడు. వాళ్ళు ఇద్దరూ పుట్టడమే రాజుల ఇండ్లలో పుట్టి డబ్బు లో పెరిగారు. లక్ష్మీవాన్ అంటే వాళ్లకు పరవాలేదు. ఆ పదం ఆంజనేయుడి కి ఎట్లా అన్వ యిస్తుంది అన్నది ప్రశ్న. ఈ ప్రశ్న పుట్టడానికే 3 సార్లు ఒకటే  పాదం వ్రాయడం. మనకు ఒకసారి చెబితే అర్థం కాదని వాల్మీకి కి బాగా తెలుసు.


ఆంజనేయుడి పుట్టుక, పెరగడం అడవుల్లో జరిగింది. పైగా వాలి దగ్గర కాకుండా సుగ్రీవుడి దగ్గర ఉన్నందున పూర్తి దరిద్రం లోనే ఉన్నాడు. ఆయనకు ఆభరణాలు ఉన్నట్లు కూడా రామాయణం లో వర్ణన లేదు.     ఈ యన శివాంశ లో పుట్టిన వాడు. శివుడి లక్షణాలు చాలావున్నాయి. దిగంబరుడు కాదు కానీ ఆయనకు పట్టు పీతాంబరాలు మాలలు లేపనాలు వంటివి లేవు. ఆయనకు విశేషంగా సంపదలు లేవు. ఇంక లక్ష్మీవాన్ ఏమిటి. అర్థం పర్థం లేకుండా ఊరికే వ్రాసిన పదం అనుకుంటామని వాల్మీకి తన విలక్షణ మైన పద్ధతి లో ఒక నొక్కు నొక్కాడు. 9 వ సర్గ 8 వ శ్లోకములో కుబేరుడి ఇంట్లో ఉన్న సంపదలూ ఇంద్రుని సంపదా రావణుడి ఇంట్లో ఉన్నాయి అని వ్రాస్తూనే  అవేమీ లేని ఆంజనేయుడిని పట్టుకుని లక్ష్మీవాన్ అనడం ...  ఇదీ మనం పరిష్కరించ వలసిన సమస్య.


వాల్మీకి ఇక్కడ మనకు చెప్పదలుచుకున్నది అసలైన  ఐశ్వర్యం అంటే ఏమిటి అని.  వేదాంత సంబంధం లో భక్తి జ్ఞాన వైరాగ్యాలను మాత్రమే ఐశ్వర్యం గా లెక్కకడతారు.  ఇంకోదాన్ని ఐశ్వర్యం అనరు. ఈశ్వరస్య భావం ఐశ్వర్యం అని ఉత్పత్తి.  భక్తి జ్ఞాన వైరాగ్యాలు పుష్కలం గా ఉన్నవాడు అవితప్ప మరోటి లేని వాడు ఆంజనేయుడు. ఇదీ ఆయన తత్వం. అందువల్ల ఆయన లక్ష్మీవాన్ అయ్యాడు. భౌతిక సంపద ల కూ లక్ష్మీవాన్ అవడానికీ వాల్మీకి దృష్టి లో సంబంధం లేదు. వాల్మీకి మనకు హనుమ గురించి చెప్పదలుచు కున్నది ఇదే. 


ఈ పదానికి ఈ అర్థం అని తెలిసింది కనుక లక్ష్మణుడికి విభిషణుడికి కూడా మిగతా అన్ని చోట్లా అవే అర్థాలు వర్తిస్తాయి. 


*విజ్ఞప్తి* : 


గోరఖ్ పూర్ గీతా ప్రెస్ వాళ్ళు వాల్మీకి రామాయణం..మరియు.. వ్యాస భాగవతం సంస్కృత మూలం తెలుగు లిపి లో  అమ్ముతున్నారు. మంచి font మంచి print.  చదివితే అసలు కథా తెలుస్తుంది పారాయణ ఫలం కూడా వస్తుంది. సంస్కృతం రానక్కర లేదు. తెలుగు తాత్పర్యం తో సహా వున్నాయి.    .....


*పవని నాగ ప్రదీప్.*

*98480 54843*

కామెంట్‌లు లేవు: