15, ఆగస్టు 2021, ఆదివారం

సంస్కృత మహాభాగవతం

*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*దశమస్కంధము - ఉత్తరార్ధము - ఎనుబది ఎనిమిదవ అధ్యాయము*


*వృకాసురుని వృత్తాంతము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*88.33 (ముప్పది మూడవ శ్లోకము)*


*యది వస్తత్ర విశ్రంభో దానవేంద్ర జగద్గురౌ|*


*తర్హ్యంగాశు స్వశిరసి హస్తం న్యస్య ప్రతీయతామ్॥12043॥*


దానవరాజా! నీవు ఎంతో గొప్పవాడివై యుండికూడా, ఇంత చిన్న చిన్న మాటలను నమ్మెదవా ఏమి? ఒకవేళ నీవు ఇప్పటికిని ఆయనను జగద్గురువుగా విశ్వసించుచున్నచో ఆయన ఇచ్చిన వరముయొక్క ప్రభావమును పరీక్షించుటకై వెంటనే నీ చేతిని నీ శిరస్సుపై ఉంచుకొనుము.


*88.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*


*యద్యసత్యం వచః శంభోః కథంచిద్దానవర్షభ|*


*తదైనం జహ్యసద్వాచం న యద్వక్తానృతం పునః॥12044॥*


దానవవీరా! ఆ శంభుని పలుకులు అసత్యములైనచో మఱల అతడు ఎప్పటికిని అబద్ధములు ఆడకుండునట్లుగా ఆ అసత్యవాదిని సంహరింపుము"


*88.35 (ముప్పది ఐదవ శ్లోకము)*


*ఇత్థం భగవతశ్చిత్రైర్వచోభిః స సుపేశలైః|*


*భిన్నధీర్విస్మృతః శీర్ష్ణి స్వహస్తం కుమతిర్వ్యధాత్॥12045॥*


శ్రీహరి (వటువు) ఇట్లు మనోహరమై, భ్రమగొలుపునట్టి (తికమకలో పడవేయునట్టి) మాటలను పలుకగా వృకాసురుడు వివేకమును కోల్పోయెను. అంతట ఆ బుద్ధిహీనుడు తాను పొందిన ఆ వరమువలన కలిగెడి ప్రమాదమును మఱచి, తన చేతిని తన తలపై పెట్టుకొనెను.


(శ్రీహరి శంకరుని గూర్చి అసత్యవాదిగా పేర్కొనినట్లు పైకి కనబడుచున్నను, సారాంశమునుబట్టి ఆ పరమశివునిగుఱించి సత్యవాదిగనే పేర్కొనినట్లు స్పష్టమగును. ఆ రాక్షసుని బోల్తాకొట్టించుటకే ఆ ప్రభువు ఇట్లు నుడివెను. పరమశివుడు సత్యవచనుడగుటవలననే ఆయన రాక్షసునకు తానిచ్చిన వరముపై (తన వచనముపై) నమ్మకమును ఉంచి పరుగిడెను. రాక్షసుడు తమోగుణాన్వితుడు గావున శ్రీహరి మాటల అంతరార్థమును తెలిసికొనలేక ఇట్లు బోర్లపడెను)


*88.36 (ముప్పది ఐదవ శ్లోకము)*


*అథాపతద్భిన్నశిరాః వజ్రాహత ఇవ క్షణాత్|*


*జయశబ్దో నమఃశబ్దః సాధుశబ్దోఽభవద్దివి॥12046॥*


మరుక్షణమే పిడుగుపాటునకు గుఱియైనట్లుగా వృకాసురుని తల బ్రద్దలైపోవుటతో అతడు నేలపాలయ్యెను. అంతట ఆకాశమునుండి *జయము-జయము*, *నమో నమః*, *సాధు సాధు* అను వచనములు వినవచ్చెను.


*88.37 (ముప్పది ఏడవ శ్లోకము)*


*ముముచుః పుష్పవర్షాణి హతే పాపే వృకాసురే|*


*దేవర్షిపితృగంధర్వా మోచితః సంకటాచ్ఛివః॥12047॥*


పాపాత్ముడైన వృకాసురుడు హతుడు కాగా, పరమశివుని సంకటస్థితి తొలగిపోవుటతో దేవతలు, మహర్షులు, పితృదేవతలు, గంధర్వులు మొదలగువారు సంతోషముతో పుష్పవర్షమును కురిపించిరి.


*88.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*


*ముక్తం గిరిశమభ్యాహ భగవాన్ పురుషోత్తమః|*


*అహో దేవ మహాదేవ పాపోఽయం స్వేన పాప్మనా॥12048॥*


*88.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)*


*హతః కో ను మహత్స్వీశ జంతుర్వై కృతకిల్బిషః |*


*క్షేమీ స్యాత్కిము విశ్వేశే కృతాగస్కో జగద్గురౌ॥12049॥*


పురుషోత్తముడైన శ్రీహరి ఆపదనుండి బయటపడిన శంకరుని సమీపించి ఇట్లు పలికెను - "మహాదేవా! కైలాసపతీ! భళీ! ఈ దుష్టుడు (వృకాసురుడు) తాను చేసికొనిన పాపముల ఫలితముగా హతుడయ్యెను. పరమేశ్వరా! మహాత్ములయెడ అపరాధములకు పాల్పడినవాడు ఎవడు క్షేమముగా ఉండును? అందునా లోకకల్యాణకారకుడవు, విశ్వేశ్వరుడవు ఐన నీకు హాని తలపెట్టినవాడు ఎవడు బాగుపడును?


*88.40 (నలుబదియవ శ్లోకము)*


*య ఏవమవ్యాకృతశక్త్యుదన్వతః పరస్య సాక్షాత్పరమాత్మనో హరేః|*


*గిరిత్రమోక్షం కథయేచ్ఛృణోతి వా విముచ్యతే సంసృతిభిస్తథారిభిః॥12050॥*


శ్రీమన్నారాయణుడు అవాఙ్మానస గోచరుడు, అనంత శక్తి సంపన్నుడు, ప్రకృతి పురుషులకంటెను విలక్షణమైనవాడు. సకలలోకములకు ఆధారమైనవాడు. ఆశ్రయించినవారి యొక్క దుఃఖములను పోగొట్టువాడు. అట్టి పరమాత్మునివలన శంకరుడు ఆపదనుండి బయటపడెను. అట్టి వృత్తాంతమును ప్రవచించినవారు, వినినవారు, సాంసారిక దుఃఖములనుండియు, శత్రు (అంశ్శత్రు, బహిశ్శత్రు)వుల భయమునుండియు విముక్తులగుదురు.


*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కంధే ఉత్తరార్ధే రుద్రమోక్షణం నామాష్టాశీతితమోఽధ్యాయః (88)*


ఇది భాగవత మహాపురాణమునందలి దశమస్కంధము, ఉత్తరార్ధమునందలి *వృకాసురుని వృత్తాంతము* 

అను

ఎనుబది ఎనిమిదవ అధ్యాయము (88)



🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కామెంట్‌లు లేవు: