9, అక్టోబర్ 2021, శనివారం

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*443వ నామ మంత్రము* 9.10.2021


*ఓం తుష్ట్యై నమః*


సర్వభూతములందును తుష్టి (సంతోష) రూపంలో ఉండు జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *తుష్టిః* అను రెండక్షరముల (ద్వ్యక్షరీ) నామ మంత్రమును *ఓం తుష్ట్యైనమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని భక్తిశ్రద్ధలతో ఆరాధన చేయు భక్తులను ఆ తల్లి వారి జీవనమంతయు ధనకనక వస్తువాహన సమృద్ధితోను, శాంతిసౌఖ్యములతోను సంతోషముగా నుండునటులు అనుగ్రహించును.


జగన్మాత సంతోషరూపిణి. పరమేశ్వరుడు ఆ తల్లికి పతిదేవుడు. కుమార, గణనాథులు ఆమె పుత్రులు, అనంతకోటి జీవరాశులు ఆ తల్లి బిడ్డలు. బ్రహ్మోపేంద్రమహేంద్రాదులు ఆ తల్లిని నిరంతరమూ కీర్తిస్తుంటారు. చతుష్షష్టికోటి యోగినీ గణములు సేవిస్తూ ఉంటారు. దుష్టశిక్షణలో గజసమూహముల యధిపతి సంపత్కరీదేవి, అశ్వదళాధీశ్వరి అశ్వారూఢ, మంత్రిణి శ్యామల, చక్రరాజ, గేయచక్ర, కిరిచక్ర రథసంపద, జ్వాలామాలిని, నిత్యాదేవతలు, బాలాత్రిపురసుందరి, వారాహి మొదలైన ఆమె శక్తిసైన్యము, అసురుల శస్త్రములకు తనవద్దగల ప్రత్యస్త్ర సంపద ఉండగా పరబ్రహ్మస్వరూపిణియైన ఆ తల్లి సదా సంతోషస్వరూపిణియే కదా! అదే సంతోషము అనంతకోటి జీవరాశులయందును నెలకొనజేయు ఆపరమేశ్వరి *తుష్టిః* అని యనబడినది. ఆ తల్లి *ఇందుగలదందు లేదని సందేహము వలదు* అనునట్లు సర్వత్రా *తుష్టిరూపేణ సంస్థితా* యని అనబడినది.


*యా దేవీ సర్వభూతేషు తుష్టిరూపేణ సంస్థితా|*


*నమస్తస్యై, నమస్తస్యై, నమస్తస్యై నమో నమ:॥*


సకల జీవరాశులలోను తుష్టిరూపంలో నెలకొని యున్నది గనుక ఆ తల్లి *తుష్టిః* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం తుష్ట్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: