9, అక్టోబర్ 2021, శనివారం

జ్ఞానోదయం- మౌనం

 *🧘‍♂️జ్ఞానోదయం- మౌనం 🧘‍♀️*



*ఒక పౌర్ణమి రోజున బుద్ధుడికి జ్ఞానోదయమైంది. ఆ వారమంతా ఆయన మౌనంలోనే ఉన్నారంటారు. ఒక్క మాటైనా మాట్లాడలేదు. పురాణగాథల ప్రకారం స్వర్గంలో దేవతలు భయపడిపోయారట. వాళ్లకు తెలుసు- కొన్ని లక్షల సంవత్సరాలకోసారి ఎవరో బుద్ధుడిలా వికసించడం జరుగుతుందని. ఇప్పుడు ఆయన మౌనంలో ఉన్నాడు.



*దేవతలు ఏదైనా మాట్లాడమని ఆయనను కోరారు. అప్పుడాయన- ‘తెలిసినవారికి అర్థమవుతుంది నేనేం చెప్పకపోయినా... తెలియనివారికి నేనేం చెప్పినా బోధపడదు. ఇది అంధుడి ముందు వెలుగును వర్ణించడంలాంటిది. జీవితంలోని అమృతాన్ని రుచిచూడని వారితో నేనేం మాట్లాడినా వ్యర్థం. అందుకే ఈ మౌనం. పవిత్ర గ్రంథాలు ఏనాడో చెప్పాయి- ఎక్కడ మాటలు ఆగిపోతాయో, అక్కడ సత్యం మొదలవుతుంది’ అన్నాడు.



*బుద్ధుడి మాటలు కచ్చితంగా నిశ్శబ్దాన్ని సృష్టిస్తాయి. ఎందుకంటే ఆయన నిశ్శబ్దానికి ప్రతిరూపం. అదే జీవానికి మూలం, అన్ని రుగ్మతలకూ ఔషధం.



*మనుషులు కోపంగా ఉంటే మౌనాన్ని పాటిస్తారు. ముందు అరుస్తారు, తరవాత నిశ్శబ్దం ఆవరిస్తుంది. తెలివైన వారూ చాలా సందర్భాల్లో మౌనంగా ఉండిపోతారు.



*మాటల ఉద్దేశం నిశ్శబ్దాన్ని సృష్టించడానికే. మాటలు శబ్దానికి కారణమైతే వారు లక్ష్యాన్ని ఇంకా చేరుకోలేదని అర్థం. ‘శబ్దాలు, మాటలు ఏదైనా వ్యక్తపరచడానికే. అవి అనుబంధోత్పత్తి మాత్రమే. దానికంటూ అస్తిత్వం లేదు. ఆలోచనను వ్యక్తపరచేందుకు వాహకనాళం. ఒక మట్టికుండలాంటిది... మట్టికాదు... ఓంకారం అసలైనది’ అంటారు ఆది శంకరాచార్య మాండూక్యోపనిషత్తులో.



*మనసులోని రొద దేని గురించి? ధనం, కీర్తిప్రతిష్ఠలు, సంబంధబాంధవ్యాలు... శబ్దం ఏదో ఒక దాని గురించి. దేని గురించీ కానిది నిశ్శబ్దం. నిశ్శబ్దం మూలం... శబ్దం ఉపరితలం.



*మొదటినుంచీ బుద్ధుడిది సంతృప్తికరమైన జీవితం. ఏ సుఖమైనా కావాలనుకుంటే చాలు- ఆయన పాదాల దగ్గరుండేది. వెళ్ళి ప్రపంచాన్ని చూడాలనుకున్నాడు. తనకు తానుగా యథార్థం తెలుసుకోవాలనుకున్నాడు. తన స్థానాన్ని, భార్యను, కొడుకును వదిలిపెట్టాడు. నిశ్శబ్దం ఎంత దృఢంగా ఉంటే లోపలి నుంచి తలెత్తే ప్రశ్నలు అంత శక్తిమంతంగా ఉంటాయి. ఆయనను ఏదీ ఆపలేదు.



*ఎటువంటి మనిషైనా జీవితంలో కొన్నిసార్లైనా మౌనంగా ఉండే పరిస్థితులు తలెత్తుతుంటాయి. ఎందుకంటే మనసులో, హృదయంలో జరుగుతున్నదాన్ని సంపూర్ణంగా ఏ మాటలూ వివరించలేవు. మౌనం శక్తిమంతమైన సందేశాలను అందిస్తుంది. సహనం, మౌనం- రెండూ బలమైన శక్తులు. సహనం మానసికంగాను, మౌనం భావోద్వేగాలపరంగానూ అని అర్థం చేసుకోవాలి. మనిషి తన సహజ స్వభావాన్ని తెలుసుకోవాలి. సహజ లక్షణాలుగా భావించే శాంతి, కరుణ, ప్రేమ, స్నేహం, సంతోషం... ఇవన్నీ నిశ్శబ్దం నుంచి పుట్టేవే. నిశ్శబ్దం బాధను, అపరాధాన్ని, దుఃఖాన్ని మింగేస్తుంది.



*వివేకంతో ప్రవర్తిస్తే ప్రతి ఒక్కరూ కష్టాలసాగరం దాటవచ్చు. సుఖాల తీరం చేరుకోవచ్చు. ఎవరైనా మౌనంగా ఉండిపోయారంటే వారు మాట్లాడలేకపోయారని, ఓడిపోయారని కాదు. అర్థం చేసుకోలేనివారితో వాదించడం ఇష్టంలేక అలా ఉండిపోయారనుకోవాలి.

కామెంట్‌లు లేవు: