6, నవంబర్ 2022, ఆదివారం

Srimadhandhra Bhagavatham

 [ Srimadhandhra Bhagavatham -- 64 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


శ్రీరామ చరిత్ర

నవమస్కంధములో ఒక గమ్మత్తు చేశారు. నవమి నాడు రామచంద్రమూర్తి పుట్టారు. దశమ స్కంధమును ప్రారంభం చేసేముందు నవమస్కంధములో రామాయణమును చెప్పారు. నవమ స్కంధములో శ్రీరామచంద్రప్రభువు యొక్క సంకీర్తనము విశేషంగా చేయబడింది. ఇక్ష్వాకువంశములో జన్మించిన దశరథ మహారాజుగారికి సంతానం లేకపోతే పుత్రకామేష్టి చేస్తే, సంతానం కలగడానికి ప్రతిబంధకమయిన పాపము పరిహరింపబడి, యజ్ఞపురుషుని అనుగ్రహముచేత లభించిన పాయసమును తన ముగ్గురు ధర్మపత్నులయిన కౌసల్య, సుమిత్ర, కైకేయిలకు పంచి ఇస్తే పుట్టిన రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులనే నలుగురు కుమారులలో మహాధర్మాత్ముడయిన రామచంద్రమూర్తి పితృవాక్య పరిపాలన కోసమని, తాను భార్య సీతమ్మతో కలిసి తండ్రిని సత్యవాక్యమునందు ప్రతిష్ఠితుని చేయడం కోసం, పద్నాలుగు సంవత్సరములు అరణ్యవాసమునకు బయలుదేరి వెళ్ళి అక్కడ శూర్పణఖ ముక్కు చెవులు కోసి మారీచాది రాక్షసుల పీచమడచి, అక్కసుతో రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరిస్తే ఆ తరువాత అరణ్యకాండలో కబంధవధ జరిగిన తరువాత సుగ్రీవుని జాడ తెలుసుకుని, మైత్రి చేసి, వాలిని సంహరించి, హనుమ సహాయంచే నూరుయోజనముల సముద్రమునకు ఆవల దక్షిణదిక్కున వున్న లంకాపట్టణంలో రావణాసురుని ప్రమదావనంలో బంధింపబడిన సీతమ్మజాడ హనుమ ద్వారా తెలుసుకుని, సముద్రమునకు సేతువు కట్టి, ఆవలి ఒడ్డుకు చేరి, రావణ కుంభకర్ణాది రాక్షసులను తెగటార్చి, తిరిగి సీతమ్మను పొంది పదకొండు వేల సంవత్సరములు రామచంద్రమూర్తి రాజ్య పరిపాలన చేసి, రామరాజ్యమని పేరు తెచ్చి, ఎన్నో ఆశ్వమేధములు, వాజపేయములు, పౌండరీకములు మొదలయిన యాగములు చేసి, మనిషి ఎలా ప్రవర్తించాలనే దానికి ఒక అద్భుతమయిన కొలమానమును ఏర్పాటు చేసిన విశేషమయిన అవతారము రామావతారము.

ఆ రామచంద్రమూర్తి అనుగ్రహమే పోతనగారియందు ప్రసరించి భాగవతమును ఆంధ్రీకరించుటకు తోడ్పడింది. రాముడు కృష్ణుడని ఇద్దరు లేరు కనుక ఆ రాముడే కృష్ణకథ చెప్పించాడు.

దశమ స్కంధము – పూర్వ భాగము – శ్రీకృష్ణ జననం

భాగవతంలో దశమస్కంధము ఆయువుపట్టు లాంటిది. ఈ దశమస్కంధము జీవితంలో తప్పకుండా విని తీరాలి. ఇందులో వ్యాసభగవానుడు కృష్ణ భగవానుని లీలలను విశేషమయిన వర్ణన చేసారు. పోతనగారు దానిని ఆంధ్రీకరించి మనకి ఉపకారం చేశారు. దశమస్కంధమును ప్రారంభం చేస్తూ ఒకమాట చెప్తారు. పూర్వకాలంలో భూమి గోరూపమును స్వీకరించి బ్రహ్మగారి వద్దకు వెళ్ళి ఏడ్చి ‘మహానుభావా! భూలోకంలో ఎందరో రాజులు భూమి పతులమని పేరు పెట్టుకొని పరమదుర్మార్గమయిన పరిపాలన చేస్తూ ధర్మమును తప్పి ప్రవర్తిస్తున్నారు. ఎంతోమంది అధర్మాత్ములు ఈవేళ భూమిమీద తిరుగుతున్నారు. వారి భారం నాకు ఎలా తగ్గుతుంది? అటువంటి వారి మదమణచి భూమి భారమును తగ్గించవలసినది’ అని ప్రార్థించింది. భూభారము అనేది తక్కెట్లో పెట్టి తూచే కొలత కాదు. ఎంతమంది బిడ్డలు పుట్టినా తల్లికి ఎప్పుడూ బరువు కానట్లే, ఎన్ని ప్రాణులు వున్నా, భూమికి ఎప్పుడూ బరువు కాదు. కాని ధర్మము తప్పి ప్రవర్తించే మనుష్యులను చూసి భూమి భారమని బాధపడుతుంది. అన్నిటిని సృష్టి చేసిన బ్రహ్మగారిని అడిగింది. ‘భారము తగ్గించడం, ఉన్నది నిలబెట్టడం స్థితికారకుడయిన శ్రీమహావుష్ణువు అనుగ్రహం కాబట్టి నీవయినా నేనయినా ఆయనను ప్రార్థన చేయాలి’ అని ఆనాడు బ్రహ్మగారు ధ్యాన మగ్నుడై పురుషసూక్తముతో స్వామి వారిని ఉపాసన చేశారు. ఆ ధ్యానమునందు ఆయనకు ఒక వాణి వినపడింది. వెంటనే కళ్ళు తెరిచి ఒక చిరునవ్వునవ్వి బ్రహ్మగారు ‘భూమీ! నీవేమీ బెంగపెట్టుకోవద్దు. స్వామి తొందరలో కృష్ణావతారమును స్వీకరిస్తున్నారు. ఆ అవతారం చిత్రమయిన అవతారం. స్వామి కళ్ళు ఇంకా తెరవడం రాని పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి రాక్షససంహారం ప్రారంభం చేస్తాడు. ఎందరో రాక్షసులు, దుర్మార్గులు మరణిస్తారు. నీకు భారము తగ్గుతుంది. దేవతలను, సురకాంతలను తమతమ అంశలతో భూమిమీద జన్మించమని స్వామి ఆదేశం ఇచ్చాడు. ఆయన యదుకులంలో యాదవుడిగా పశువులను కాసేవాడిగా జన్మించబోతున్నాడు. జగదాచార్యునిగా లోకమునకు జ్ఞానమును ఇస్తాడు’ అని చెప్పాడు. భూమాత పరమ సంతోషమును పొంది తిరిగి వెళ్ళిపోయి కృష్ణ పరమాత్మ ఆగమనం కోసమని నిరీక్షిస్తున్నది.

ఈలోగా భూలోకంలో యదువంశమునకు చెందిన శూరసేనుడు అనే రాజు మధుర రాజ్యమును పరిపాలిస్తున్నాడు. ఆయన కుమారుడు వసుదేవుడు. భోజవంశమునకు చెందిన ఉగ్రసేనుడు, దేవకుడని ఇద్దరు అన్నదమ్ములు. దేవకుని కుమార్తె దేవకి. ఉగ్రసేనుని కుమారుడు కంసుడు. అన్నదమ్ముల బిడ్డలు కనుక కంసుని చెల్లెలు దేవకీదేవి. దేవకీదేవిని శూరసేనుని కుమారుడైన వసుదేవునకిచ్చి వివాహం చేశారు.

దశమస్కంధము ఉపనిషత్ రహస్యము. దశమస్కంధము ప్రారంభంలోనే ఒక లక్ష టన్నుల ప్రశ్న ఒకటి పడుతుంది. ఆ ప్రశ్నకు సమాధానమును తెలుసుకోగలిగితే హృదయగ్రంథి విడిపోయినట్లే! కృష్ణ జననం పరమపవిత్రమయిన ఆఖ్యానం.

దేవకీ వసుదేవులకు వివాహం జరిగిన తర్వాత కొన్ని వందల గుఱ్ఱములను, బంగారు ఆభరణములతో అలంకరింపబడిన ఏనుగులను, కొన్ని వేల రథముల నిండా బంగారమును, కొన్ని వందలమంది దాసీజనమును ఏర్పాటు చేసి, మహానుభావుడయిన దేవకుడు తన కుమార్తెను అత్తవారింటికి పంపుతున్నాడు. రాజమార్గంలో కొన్ని వేల రథములు అనుసరించి వెడుతున్నాయి. దేవకీదేవి రథం బయలుదేరి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నది. రథమును నడపడానికి సారథి ఉంటాడు. ఆ సమయంలో కంసుడు అకస్మాత్తుగా వచ్చాడు. అతనికి చెల్లెలు అంటే మహాప్రేమ. ఆమె తన తండ్రిగారి సోదరుని కుమార్తె అయినా, కంసునికి దేవకీదేవి అంటే చాలా ప్రేమ. ఆయన దేవకీదేవి రథమును నడపడానికి సిద్ధపడ్డాడు. అందరూ చాలా సంతోషించారు. తానే చెల్లెలిని అత్తవారింటిలో దింపుతానని గుఱ్ఱముల పగ్గములు పట్టుకున్నాడు. వెనక దేవకీవసుదేవులు కూర్చున్నారు. రథం వెళుతున్నది.

అశరీరవాణి కొన్ని మాటలు పలికింది. ‘అశరీరవాణి’ చాలా గమ్మత్తయిన మాట. శరీరము ఉంటే వాణి ఉంటుంది. వాణి ఉన్నది అంటే అది శరీరంలోంచి వస్తున్నదని గుర్తు. కనీసంలో కనీసం ఎదురుగుండా నామ రూపములతో ఏదో ఉండాలి. మనుష్యుడు లేకుండా మాట ఉండదు. కానీ ఇక్కడ శరీరము లేదు కానీ మాట వినబడుతున్నది అంటున్నారు అదీ చిత్రం.

‘తలోదరి’ అంటే పైకి కనపడని కడుపు కలది. కొంతమందికి కడుపు కనపడదు. అసలు కడుపు ఉన్నదా లేదా అనే అనుమానం ఉన్నట్లు ఉన్నవాళ్ళని ‘తలోదరి’ అంటారు. అసలు కడుపు లేనట్లుగా శుష్కించిన కడుపులా కనపడుతున్నది. ఈ కడుపులో ఎనమండుగురు పుట్టబోతున్నారు. వారిలో ఎనిమిదవవాడు కంసుడిని చంపబోతున్నాడు. ఆవిడ చక్కగా వసుదేవుడిని వివాహం చేసుకుని రథం ఎక్కి వెళ్ళిపోతోంది. ‘ఆవిడ మెచ్చుకోవాలని చెల్లెలి సంతోషం కోసం పిచ్చివాడా, రథము నడుపుతున్నావు! కాని ఈమె ఎనిమిదవ గర్భము నిన్ను చంపేస్తుంది’ అని అశరీర వాణి పలికింది.

ఇప్పటివరకు కంసుడు పరమప్రేమతో ఉన్నాడు. ఆకాశంలోంచి ఈమాట వినపడగానే వెంటనే రథమును ఆపి క్రిందికి దిగాడు. కళ్ళు ఎర్రబడిపోయి గుడ్లు తిరుగుడు పడ్డాయి. అపారమయిన కోపం వచ్చేసింది. తన ఎడమ చేతితో చెల్లెలి కొప్పు పట్టుకొని రథములో నుండి క్రిందకు లాగి ఒరనుండి కరవాలమును తీసి ఆమెను నరికివేయడానికని సిద్ధపడుతున్నాడు. ఆసమయంలో వసుదేవుడు మాట్లాడాడు. ఇది చాలా గమ్మత్తయిన సన్నివేశం. ఇలా జరుగుతుందని కూడా ఎవరు ఊహించరు. రథం నడుపుతున్న వాడు బావమరిది, తన చెల్లెలినే లాగేసి చంపేస్తాడని, అశరీరవాణి పలుకుతుందనిగాని వసుదేవుడు కలగనలేదు.

ఏమీ కంగారు పడకుండా, ధర్మం తప్పకుండా చాలా పెద్దమనిషిగా తాను అప్పుడు మాట్లాడిన మాట తాను తప్పలేని మాట అయ్యేటట్లుగా మాట్లాడగలగడం అంటే దానికి ఈశ్వరానుగ్రహం ఉండాలి. ఈశ్వరానుగ్రహం లేనివాడు అలా మాట్లాడలేడు. ఆయన ఎంతో గొప్పగా మాట్లాడాడు.

ముందు కంసుని అనుగ్రహం కోసమని బ్రతిమలాడాడు. ప్రపంచంలో పరమపవిత్రమయిన సంబంధములలో ‘అన్న’ అనిపించుకున్న రక్తసంబంధం ఒకటి. అన్నగా పుట్టినవాడికి ఒక మర్యాద ఉంటుంది. ఎప్పుడూ కూడా తన బావగారు బ్రతికి వుండాలని కోరుకోవాలి. ‘బావమరిది బ్రతక కోరతాడు’ అని ప్రపంచంలో ఒక సామెత ఉన్నది నీవు అన్నవి రథం తోలడానికి వచ్చావు. నీ చెల్లెలిని సంతోష పెట్టాలి. చక్కని మాటలు నాలుగు మాట్లాడాలి. నువ్వు చంపేస్తాను అంటున్నావు. గాలిమాటలు నమ్మి చెల్లెలిని చంపేస్తావా! రేపు ప్రపంచం నిన్ను ఏమంటుంది? అరివీర పరాక్రమము కలిగినవాడు భోజవంశంలో పుట్టినవాడయిన కంసుడు ఒక చెల్లెలి ఎనిమిదవ గర్భము వలన చచ్చిపోతాననే గాలిమాట విని, ఇంకా పాదముల పారాణి ఆరని ఆడపిల్లను చంపేశాడని లోకం చెప్పుకుంటుంది.. అది ఎంత మహాపాపం. అందుకని తొందరపడి చంపకు. నిన్ను అభ్యర్థిస్తున్నాను’ అన్నాడు.

కంసుడు ‘అది మిన్నులమోతో, అధికారిక వాక్యమో నాకు అనవసరం. ఈమె కడుపున పుట్టిన ఎనిమిదవ పిల్లవాడి వలన నాకు ప్రాణహాని అని నాకు వినపడింది. అందుకని నేను చంపేస్తాను’ అన్నాడు.

వసుదేవుడు ‘నీ అదృష్టం కొద్దీ నీ చావుకు ఒక కారణం తెలిసింది. ఒకవేళ నీవు ఈమెను చంపివేశావనుకో నీకు చావురాకుండా ఉంటుందా? చెల్లెలిని చంపిన పాపమునకు అధోగతికి వెళ్ళిపోతావు. నీ చెల్లెలిని విడిచిపెట్టెయ్యి’ అన్నాడు. ఎంత గొప్ప వేదాంతమును చెపితే మనసు మారే అవకాశం ఉంటుందో దానిని చెప్పాడు. ఏడురోజులు వినేది శుకబ్రహ్మ పరీక్షిత్తుకు చెప్పారు. ఏడు క్షణములలో వినేది వసుదేవుడు కంసునికి చెప్పాడు. వాని మనస్సు మారలేదు. కంసుడు ‘నేను అలా విడిచిపెట్టను. నువ్వు చాలా తేలికగా మాట్లాడుతున్నావు. నేను మరణమును అంగీకరించను. దేవకిని చంపేస్తాను’ అన్నాడు. వసుదేవుడు ఆలోచించాడు. ఉన్నదున్నట్లు చెపితే కంసుని తలకెక్కదని భావించాడు. తానొక ధర్మము నిర్వర్తించాలి తన భార్యను రక్షించుకోవాలి. జ్ఞానబోధ చేస్తే వీని బుద్ధికి ఎక్కదు. అలాగని ఎలాగయినా తన భార్యను రక్షించుకోవాలని అసత్యమును చెప్పకూడదు. సత్యమే చెప్పాలి. అది కంసుని మనస్సుకు నచ్చేదయి ఉండాలి. ముందు అసలు నేను తక్షణం చేయవలసిన పని దేవకీదేవి ప్రాణములను రక్షించడం అనుకుని ‘బావా! అయితే నీకొక మాట చెబుతాను. నీ చెల్లెలికి పుట్టిన ఎనిమిదవ వాని చేత నీవు మరణిస్తానని అనుకుంటున్నావు. ఈ దేవకీ దేవి గర్భమునుండి పుట్టిన ప్రతి పిల్లవాడిని, పుట్టీ పుట్టగానే తీసుకువచ్చి నీకు ఇచ్చేస్తాను. వాడిని నువ్వు చంపెయ్యి. అపుడు నీకు మృత్యువు రాదు కదా! అంతేకానీ నీ చెల్లెలిని చంపడం ఎందుకు? పాపకర్మ కదా! నీ మృత్యుహేతువును నువ్వు చంపినట్లయితే ప్రపంచం నిన్ను తప్పు పట్టదు. నువ్వూ ధర్మం తప్పనక్కరలేదు. నేనూ ధర్మం తప్పనక్కరలేదు. ఆమెను విడిచి పెట్టు’ అన్నాడు.

కంసుడు ‘ఇదేదో బాగానే చెప్పాడు’ అనుకుని మీ ఇద్దరు హాయిగా అంతః పురమునకు వెళ్ళిపొండి’ అని ఆ రథమును వదిలిపెట్టేశాడు. దేవకీ వసుదేవులు ఎంతో సంతోషముగా ఉన్నారు.


 Srimadhandhra Bhagavatham -- 65 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu

దేవకీ వసుదేవులు సంతోషంగా ఉంటూ ఉండగా వారికి మొట్టమొదట కొడుకు పుట్టాడు. పుట్టిన కొడుకును పుట్టినట్లుగా పట్టుకువెళ్ళి కంసునికి ఇచ్చేశాడు. వసుదేవుని చూసి ‘బావా చూశావా నువ్వు ఎంత మాట తప్పని వాడవో! పిల్లవాడు పుట్టగానే తీసుకు వచ్చి ఇచ్చావు. నాకు అందుకే నీవంటే అంత గౌరవం. నువ్వు మాట తప్పని వాడవు. ఎనిమిదవ వాడు కదా నన్ను చంపేది! మొదటివాడిని చంపడమెందుకు? తీసుకువెళ్ళిపో’ అన్నాడు. వసుదేవుడు పిల్లవాడిని తీసుకుని వెళ్ళిపోయాడు. రెండవ కొడుకు పుట్టాడు. ఎనిమిదవ గర్భమును కదా ఇమ్మన్నాడని రెండవ పిల్లవానిని తీసుకు వచ్చి ఇవ్వలేదు. ఇలా ఆరుగురు పిల్లలు పుట్టారు. ఆ ఆరుగురు పిల్లలతోటి అమ్మకి, నాన్నకి మిక్కిలి అనుబంధం ఏర్పడింది. ఇంత అనుబంధంతో వాళ్ళు సంతోషంగా ఉన్న సమయంలో ఒకరోజున కంసుని దగ్గరికి నారదుడు వచ్చాడు. ఆయన మహాజ్ఞాని. ఎప్పుడు వచ్చినా ఏదో లోకకళ్యాణం చేస్తాడు. కంసుని దగ్గరకు వచ్చి ‘కంసా! ఎంత వెర్రివాడవయ్యా! అసలు నీవు ఎవరిని వదిలిపెడుతున్నావో వారెవరూ మనుష్యులు కారు. నువ్వు క్రిందటి జన్మలో ‘కాలనేమి’ అను పేరు గల రాక్షసుడవు. నిన్ను శ్రీమహావిష్ణువు సంహరించారు. నీ తండ్రి, తల్లి, దేవకీ, వసుదేవుడు, పక్క ఊళ్ళో ఉన్న నందుడు, ఆవులు, దూడలు వీరందరూ దేవతలు. నిన్ను చంపడానికే వచ్చారు’ అని చెప్పి ఆయన హాయిగా నారాయణ సంకీర్తనం చేసుకుంటూ ఊర్ధ్వలోకములకు వెళ్ళిపోయాడు.

కంసుడికి అనుమానం వచ్చింది. నారదుడు అనవసరంగా అబద్ధం చెప్పడు కదా! వసుదేవుడిని ఆరుగురి పిల్లలను తీసుకురమ్మనమని కబురు చేశాడు. ‘ఎనిమిదవవాడికి వీళ్ళు సహాయ పడితే నా బ్రతుకు ఏమయిపోవాలి? ఉన్నవాళ్ళను ఉన్నట్లుగా సంహరించాలి’ అనుకుని పిల్లలను చంపేశాడు. తన తల్లిని, తండ్రిని, దేవకిని, వసుదేవుని అందరినీ కారాగారంలో పెట్టి బకుడు, తృణావర్తుడు, పూతన – ఇలాంటి వారినందరినీ పిలిచి వాళ్ళతో స్నేహం చేసాడు. వస్తున్న గర్భం ఏడవ గర్భం. జాగ్రత్త పడిపోవాలని దేవకీ వసుదేవులను అత్యంత కట్టుదిట్టమయిన కారాగారంలో పెట్టాడు. రోజూ తానే వెళ్ళి స్వయంగా చూస్తుండేవాడు. ఇక్కడ ఒక అనుమానం రావాలి. వసుదేవుని పిల్లలు పసివారు. నారదుడు మహానుభావుడు. లోకకళ్యాణకారకుడు. ‘నారం దదాతి యితి నారదః’ అని ఆయన జ్ఞానం ఇచ్చేటువంటి వాడు ఆరుగురు పిల్లలు చచ్చిపోవడానికి ఎందుకు కారకుడు అయ్యాడు? వచ్చి ఆయన చెప్పకపోతే వచ్చిన నష్టం ఏమిటి? కంసునితో ఎందుకు అలా చెప్పాడని అనుమానం వస్తుంది. భాగవతంలో దీనికి ఎక్కడా జవాబు లేదు. దీనికి పరిష్కారం దొరకాలంటే దేవీభాగవతం చదవాలి. దేవీ భాగవతంలో ఈ రహస్యమును చెప్పారు.

పూర్వం మరీచి, ఊర్ణాదేవి అని ఇద్దరు ఉండేవారు. వాళ్ళిద్దరికీ ఆరుగురు పిల్లలు పుట్టారు. వాళ్ళు పుట్టుకతో బ్రహ్మజ్ఞానులు. వీళ్ళు ఆరుగురు ఒకసారి చతుర్ముఖ బ్రహ్మగారి సభకు వెళ్ళారు. వాళ్ళు నిష్కారణంగా బ్రహ్మగారు కూర్చుని ఉండగా ఒక నవ్వు నవ్వారు. బ్రహ్మగారు ‘మీరు రాక్షసుని కడుపున పుట్టండి’ అని శపించారు. అందువలన వారు ఆరుగురు క్రిందటి జన్మలో ‘కాలనేమి’కి కుమారులుగా జన్మించారు. అలా కాలనేమి పుత్రులుగా కొంతకాలం బ్రతికి తదనంతరం హిరణ్యకశిపుని కడుపున పుట్టారు. అప్పటికి వాళ్ళకి ఉన్న రజోగుణ తమోగుణ సంస్కారం తగ్గింది. మరల బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు. బ్రహ్మగారు వారికి దీర్ఘాయుర్దాయమును ప్రసాదించారు. ఈవిషయమును వారు తండ్రయిన హిరణ్యకశిపునకు చెప్పారు. హిరణ్యకశిపునికి కోపం వచ్చింది. ‘నేను యింకా తపస్సు చేసి దీర్ఘాయుర్దాయమును పొందలేదు. మీరు అప్పుడే పొందారా? మిమ్మల్ని శపిస్తున్నాను. మీరు దీర్ఘనిద్రలో ఉండి మరణించండి. అంతేకాకుండా వచ్చే జన్మలో పుట్టినప్పుడు గతజన్మలో తండ్రి ఆ జన్మలో మిమ్మల్ని చంపుతాడు’ అన్నాడు. వాళ్ళు దీర్ఘ నిద్రలో ఉండి చచ్చిపోయారు. మరుజన్మలో మరీచి ఊర్ణల కొడుకులు ఇప్పుడు దేవకీదేవి కడుపున పుట్టారు. వాళ్ళ శాపం ఈ జన్మతో ఆఖరవుతుంది. వీళ్ళు ఇప్పుడు గతజన్మలోని తండ్రి కాలనేమి అయిన కంసుడిచేతిలో మరణించాలి. వారికి ఆ శాప విమోచనమయి వారు మరల బ్రహ్మజ్ఞానులు అయిపోవాలి. నారదుడు వచ్చి వాళ్ళు శాప విమోచనం పొందేలా చేసాడు. అదీ నారదుని రాకలో గల కారణం. ఇది దేవీ భాగవతాంర్గతం.

కుండలోపల వెలుగుతున్న దీపంలా లోకములనన్నింటినీ తన కడుపులో పెట్టుకున్న శ్రీమహావిష్ణువుని తనకడుపులో మోయవలసినటువంటి దేవకి కంసుని కారాగారమునందు మగ్గుతున్నది. ఈ స్థితిలో ఒక చిత్రం జరిగింది. శ్రీమన్నారాయణుడు తాను అవతరించాలని అనుకున్నాడు. తనకన్నా ముందు శేషుడు బయలుదేరుతున్నాడు. ఆదిశేషుడు ముందు అన్నగారుగా పుట్టాలి. యోగమాయను పిలిచి ఒకమాట చెప్పాడు. ‘నీవు భూమి మీదకి వెళ్ళు. అక్కడ కంసుని కారాగారంలో దేవకీ వసుదేవులు ఉన్నారు. కంసుడు వసుదేవుని భార్యలందరినీ ఖైదు చేశాడు. ఒక్క రోహిణి మాత్రం నందవ్రజంలో నందుని దగ్గర ఉన్నది. వసుదేవుని తేజస్సు దేవకీదేవిలో ఏడవగర్భంగా శేషుని అంశ ఉన్నది. ఎవరికీ తెలియకుండా ఆ గర్భస్థమయిన పిండమును వెలికి తీసి దానిని తీసుకు వెళ్ళి నందవ్రజంలో ఉన్న రోహిణీ గర్భమునందు ప్రవేశపెట్టు. గర్భస్రావం అయిందని అందరూ అనుకుంటారు. ఇక్కడ జారిపోయిన పిండము అక్కడ పెరుగుతుంది. పెరిగి అక్కడ వర్ధిల్లుతాడు. శేషుడు బలరాముడన్న పేరుతో జన్మిస్తాడు. నన్ను సేవించాలని కోరుకుంటున్నాడు. నీవు వెళ్ళి ఆపని చేయవలసినది’ అని చెప్పాడు. వెంటనే యోగమాయ బయలుదేరి వచ్చింది. ఏడవ గర్భంలో దేవకీదేవి గర్భము నిలిచి సంతోషంగా ఉన్న సమయంలో ఆమె కడుపులో ఉన్న పిండమును బయటికి లాగి నందవ్రజంలో నందుని దగ్గర వున్న రోహిణి గర్భంలోకి ప్రవేశపెట్టింది.

ఇవాళ భాగవతమును వింటున్నప్పుడు ఇది జరుగుతుందా అని సందేహించనవసరం లేదు. ఇప్పుడు మనవాళ్ళు చేసే పనిని భాగవత కాలంలోనే మహర్షులు చేశారు. చాలా బలవంతుడయిన వాడు కాబట్టి ఆయనకు ‘బలభద్రుడు’ అని పేరు. లోకముల నన్నింటిని ఆనందింప చేస్తాడు కాబట్టి రామ శబ్దమును ప్రక్కన పెట్టి ‘బలరామా’ అని పిలిచారు. ఈ అమ్మ కడుపులోంచి లాగబడి వేరొక అమ్మ కడుపులోకి ప్రవేశ పెట్ట బడ్డాడు ‘సంకర్షణుడు’ అని పేరు వచ్చింది. ఈవిధంగా బలరాముని ఆవిర్భావం జరిగింది. తదనంతరం కృష్ణపరమాత్మ ఆవిర్భవించాలి. శ్రీమన్నారాయణుని పూర్ణమయిన తేజస్సు బయలుదేరి వసుదేవుడిని ఆవహించింది. వసుదేవుడి లోంచి ఆ తేజస్సు దేవకీ గర్భంలోనికి ప్రవేశించింది. కృష్ణ పరమాత్మ దేవకీదేవి గర్భంలో పెరుగుతున్నాడు. ఈ గర్భంలోకి ముప్పది కోట్ల మంది దేవతలు బ్రహ్మగారితో కలిసి వచ్చి దేవకీదేవి కడుపులోకి వెళ్ళి నిలబడ్డారు. ఇదీ గర్భశుద్ధి అంటే. వారందరూ మహానుభావా! నీవు మాయందు అనుగ్రహించాలి. కంసాదులు రాజ్యం చేస్తూ భక్తులయిన వారిని నిగ్రహిస్తున్నారు. ముకుందా! నీవు అమ్మ గర్భంలోనుండి బయటకు రావసిందని పరమాత్మను స్తోత్రము చేస్తున్నారు.

ఇక్కడ కంసుని పరిస్థితి దారుణంగా ఉన్నది. దేవకికి అష్టమ గర్భం వచ్చేసింది. నెలలు పెరుగుతున్నాయి. తొమ్మిదవ నెల వచ్చేసింది. స్పష్టంగా తేజస్సు కనపడుతున్నది. ఆ అష్టమ గర్భంలో పుట్టేవాడు తనను చంపేస్తాడని భయం. జ్ఞానము చేత లోకమంతా ఒక ఈశ్వరుడు కనపడ్డట్టే కంసునికి కూడా కనపడుతోంది. నారదుడు ధర్మరాజు గారితో ‘కొందరు వైరముతో కూడా ఈశ్వరుని పొందుతున్నారు’ అన్నాడు. కంసుడు ఎవరిని చూసినా శ్రీహరే కనపడుతున్నాడు. కృష్ణుడు ఆవిర్భవించే సమయం ఆసన్నమవుతున్నది. శ్రావణమాసంలో అర్థరాత్రి పన్నెండు గంటలకి ఆకాశం మబ్బులు పట్టి వర్షం పడుతుంటే శ్రీకృష్ణ భగవానుని ఆవిర్భావం జరిగింది. ఆకాశం అంతా మబ్బులు పట్టి ఉన్నది. కంసుడు గాఢనిద్రలో ఉన్నాడు. భటులను పెట్టాడు. తలుపులు దగ్గరికి వేసి వాటికి ఇనుప గొలుసులు వేసాడు. వాటిలో మేకులు దింపాడు. తాళములు వేసాడు. తాళం చెవులు బొడ్డులో పెట్టుకున్నాడు. వసుదేవుడు ఏమయినా చేస్తాడేమోననే అనుమానంతో వసుదేవుని కాళ్ళకు చేతులకు ఇనుప సంకెళ్ళు వేశాడు. ఆనాడు దేవకీ ప్రసవ సమయమందు సహాయం చేసిన వారు లేరు. ఆతల్లి అంత బాధపడింది. అటువంటి స్థితిలో అర్థరాత్రి పన్నెండు గంటల వేళయింది.

మహానుభావుడు శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించాడు. నాలుగు బాహువులతో, నల్లటి మబ్బువంటి కాంతితో, పట్టు పీతాంబరము కట్టుకుని, శంఖ చక్ర గదా పద్మములను పట్టుకొన్న వాడై, మహానుభావుడు వజ్ర వైడూర్యములు పొదగబడిన కిరీటముతో, నల్లటి కుంతలములతో, చెవులకు పెట్టుకొనబడిన కర్ణాభరణముల కాంతి గండ స్థలములయందు ప్రకాశిస్తూ ఉండగా, మెడలో కౌస్తుభమనే రత్నమును ధరించి, శ్రీవత్సమనే పుట్టుమచ్చతో, సమస్త లోకములు కొలిచే పాదపద్మములతో, చంటిపిల్లవాడిగా వసుదేవునికి దర్శనం ఇచ్చాడు. పిల్లవానిని చూసి సంకెళ్ళలో ఉన్న వసుదేవుడు పొంగిపోయాడు. అన్ని లోకములను కాపాడేవాడు ఈవేళ నాకు కొడుకుగా పుట్టాడు. మామూలుగా కొడుకు పుడితేనే గోదానం, వస్త్రదానం, హిరణ్యదానం చేస్తారు. నాకు శ్రీమన్నారాయణుడు కొడుకుగా పుట్టాడు. నేను ఎన్ని దానాలు చెయ్యాలి. కొడుకు పుట్టినప్పుడు సచేల స్నానం చేయాలి. నేను చెయ్యడానికి కూడా లేదు. ‘కృష్’ అనగా నిరతిశయ ఆనందరూపుడు. ఆ కృష్ణ దర్శనంతో కలిగిన ఆనందములో ఆయన స్నానం చేసాడు. ఒక్కసారి నీళ్ళు ముట్టుకున్నాడు. మానసికముగా పదివేల మంది బ్రాహ్మణులకు పదివేల గోవులను దానం చేశాడు. ‘నేను కారాగారమునుండి బయటకు వచ్చిన తరువాత తీర్చుకుంటాను’ అనుకుని పిల్లవాడుగా ఉన్న స్వామిని చూసి దేవకీ వసుదేవులు నమస్కరించారు. కృష్ణ పరమాత్మ దేవకీ వసుదేవుల వంక చూసి నవ్వుతూ ‘భయపడకండి. అసలు నేను ఇలా ఎందుకు జన్మించానో రహస్యం చెపుతాను వినండి.

 Sri Siva Maha Puranam -- 11 By Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


కేదారేశ్వరుడు


కేదారేశ్వర లింగం గురించి ఒకమాట చెప్తారు.


మహాద్రి పార్శ్వే చ తటే రమంతం, సంపూజ్యమానం సతతం మునీంద్రైః

సురాసురైర్యక్షమహోరగాద్యైః కేదారమీశం శివమేకమీడే!! (ద్వాదశ జ్యోతిర్లింగస్తోత్రం – ౧౧)


హిమాలయ పర్వతములలో వెలసినది కేదారలింగము. నరనారాయణులిద్దరూ సాక్షాత్తుగా ఈ భూమండలం మీద బదరీక్షేత్రము నందు తపస్సు చేసినప్పుడు ద్యోతకమయిన శివలింగము. కేదారమునందు ఉన్న శివలింగమును దర్శనం చేసినా, చేయడానికి వెడుతున్నప్పుడు మరణించినా మోక్షమే! కేదారేశ్వర లింగమును దర్శనం చేసేటప్పుడు ఒక నియమం ఉన్నది. ఆ నియమంతోనే దర్శనం చేయాలి.

కేదారేశ్వరంలో నరనారాయణులు ఒక పార్థివ లింగమును ఉంచి ఆరాధన చేస్తూ ఉండేవారు. పార్థివ లింగము అంటే మట్టితో చేసిన శివలింగం. మట్టితో చేసిన ఆ శివలింగమును వారు సాక్షాత్తు ఈశ్వరుడని నమ్మి శివలింగమునకు అర్చన చేస్తు ఉండగా ఆ శివలింగం లోంచి పరమశివుడు ఆవిర్భవించి ‘మీరు చేసిన పూజకు నేను ఎంతో పొంగిపోయాను. ఇంత చల్లటి ప్రాంతంలో ఇంత తపస్సులో పార్థివ లింగమునకు అర్చన చేశారు. మీకేమి కావాలో కోరుకోమని అడిగితే వారు ‘స్వామీ! ఇక్కడే ఈ బదరీ క్షేత్రమునకు ఆవలివైపు హిమాలయ పర్వతశృంగముల మీద నీవు స్వయంభువ లింగమూర్తివై వెలసి లోకమును కాపాడు’ అని అడిగారు. వారి కోరిక ప్రకారం స్వామి అక్కడ వెలిశాడు.

హిమాలయ పర్వతములు సముద్ర మట్టమునకు కొన్ని వేల అడుగుల ఎత్తులో ఉన్నాయి. కేదారం వెళ్ళడానికి దారి కొన్ని నెలలలో మాత్రమే వీలు చేయబడుతుంది. రాత్రి తొమ్మిది దాటితే ఆ మార్గ ప్రాంతంలో కరెంటు తీసివేస్తారు. అక్కడి కాటేజీలలో చీకట్లోనే పడుకోవాలి. అక్కడ ప్రయాణం చేయాలి అంటే పాదచారియై వెళ్ళాలి. మంచి హోరుమని వానలా పడిపోతుంది. పైనుంచి క్రిందకి చూస్తే కళ్ళు తిరుగుతాయి.

ఇటునుంచి రుద్రప్రయాగ, అటునుంచి దేవప్రయాగ రెండూ వెళ్ళి కలుస్తాయి. ఇక్కడ గంగానది – బదరీలో అలకనందానది. పర్వతముల నుండి ఎన్నో జలపాతములు పడిపోతూ ఉంటాయి. సాధారణంగా ఆ మార్గంలో నడిచి వెళ్ళే వాళ్ళు తక్కువ. డోలీ, లేదా గుర్రముల మీద కూర్చుని వెళ్ళాలి. గుర్రం ఒక్కసారి జారిందంటే ఇక గుర్రం మీద కూర్చున్న వాడిని వెతకవలసిన అవసరం ఉండదు. అలా జారితే వాడు కొన్నివేల అడుగుల నుండి క్రింద పడిపోతాడు. శరీరం చిన్నాభిన్నం అయిపోతుంది. యాత్రలో ఎన్ని కష్టములు ఉన్నప్పటికీ కేదారనాథ్ యాత్ర వెళ్ళితీరవలసిన యాత్ర. ఇన్నివేల అడుగులు పైకి ఎక్కిన తర్వాత స్వామి దేవళం కనపడుతుంది. లోపలి వెడితే లోపల పెద్ద అంతరాలయం ఉంటుంది. అక్కడ మహానుభావుడు కేదారేశ్వరుడుగా వెలిశాడు. కేదార శివలింగ దర్శనం చేసిన వాడికి మోక్షం కరతలామలకమని శివమహాపురాణం, పెద్దలు నిర్ణయం చేశారు. కేదారం వెళ్ళినపుడు పడిపోయిన వారికి కూడా మోక్షం దొరికి తీరుతుంది.

ఆ శివాలయంలో ఒకసారి ఒక విచిత్రమయిన స్థితి ఏర్పడింది. అక్కడ శివలింగం వెలసి కొన్ని యుగములు అయింది. శివాలయములో శివునికి పునఃప్రతిష్ఠ ఉండదు.

ఒకసారి పాండవులు అయిదుగురు కలిసి కేదారేశ్వర దర్శనమునకు వెళ్ళారు. ఆలయంలో చిన్న శివలింగం ఉన్నది. పాండవులు ఏమి చేస్తారో చూడాలని శివునికి ఒక ముచ్చట. ఒక చిన్న దున్నపోతు రూపంలో పరుగెత్తాడు. పాండవులు దానిని గమనించారు. వారు ఖచ్చితంగా అది శంకరుడే అయి ఉంటాడని భావించారు. మహిషరూపంలో వెడుతున్నా అంతటా ఈశ్వర దర్శనం చేశారు పాండవులు. ఆ లింగం మాత్రమే శివుడు అనుకోలేదు. దాని కాళ్ళు పట్టుకోవాలని వారు ఆ మహిషం దగ్గరికి వెళ్ళారు. వాళ్లకి దాని కాళ్ళు అందలేదు. తోక అందింది. ఈశ్వర స్వరూపంగా దాని తోక పట్టుకున్నారు. వాళ్ళ భక్తికి మెచ్చుకున్నవాడై పరమేశ్వరుడు తన పృచ్ఛభాగమును అక్కడ విడిచిపెట్టి దానిని శివలింగంగా మార్చివేశాడు. అదే ఇప్పుడు మనందరం దర్శనం చేస్తున్న కేదారలింగం. కేదారం వెళ్లి వచ్చిన వాడికి అంతటా శివుణ్ణి చూడడం అభ్యాసంలోకి రావాలి. అంత పరమ పవనమయిన క్షేత్రం కేదార క్షేత్రం.


కొండ ఎక్కుతున్నప్పుడే దూరంగా కైలాస దర్శనం అవుతూ ఉంటుంది. ‘అదిగో కైలాసం కనపడుతోంది చూడండి అంటారు. ఆ మంచుకొండ నిజంగా కైలాసంలాగే భాసిస్తూ ఉంటుంది. వర్షం ఆగి సూర్య కిరణములు పడుతుంటే ఆ దృశ్యం చూడడానికి చాలా అందంగా ఉంటుంది. కైలాస సమీపమునకు వెళ్లి వచ్చినట్లు అనిపిస్తుంది. శంకర భగవత్పాదులు అక్కడే తమ సత్యదండమును విడిచిపెట్టేశారు అని భక్తులు నమ్ముతుంటారు. అక్కడ శంకరుల సత్యదండపు పెద్ద ఫోటో ఒకటి ఉంటుంది. అక్కడే చిన్న ఆలయం కూడా ఉంటుంది. కేదారము అంత గొప్ప క్షేత్రము.


కేదారక్షేత్రం వెళ్ళినవారు తెలియక ఒక పొరపాటు చేస్తూ ఉంటారు. కేదార లింగమును తిన్నగా కంటితో చూడకూడదు. వలయమును పట్టుకు వెళ్ళాలి. వలయము అంటే చేతికి వేసుకునే కంకణం వంటి గుండ్రని వస్తువును తీసుకువెళ్ళాలి. అంతరాలయంలో ప్రవేశించగానే కంటిముందు ఆ వలయమును పెట్టుకుని అందులోంచి చూడాలి. కేదారము దర్శనము చేత మోక్షమీయగలిగిన క్షేత్రం గనుక సమస్త బ్రహ్మాండము నిండినవాడు వీడే అని తెలుసుకోవడానికి కంటికి అడ్డంగా ఒక వలయాకరమును పెట్టుకుని అందులోంచి కేదార లింగమును చూడాలి. అలా చూసిన వలయ కంకణమును అక్కడ వదిలిపెట్టి వచ్చెయ్యాలి. మన చేతికి ఉన్న ఏ బంగారు కంకణమునో ఉపయోగించినట్లయితే దానిని అక్కడ వదిలిపెట్టేయడానికి మనసొప్పదు. ముందే ఒక రాగి కంకణమును పట్టుకుని వెడితే రాగి చాలా ప్రశస్తము కనుక, ఆ కంకణములోంచి కేదార లింగమును దర్శనం చేసి దానిని అక్కడ వదిలిపెట్టి రావచ్చు. ఇకముందు వెళ్ళేవారు ఒక వలయంలోంచి కేదారలింగమును దర్శనం చేసే ప్రయత్నం చేస్తే మంచిది.



కామెంట్‌లు లేవు: