16, జనవరి 2023, సోమవారం

ఈ పోస్టింగ్ ఎందుకు

 ఈ రోజు ఒక గొప్ప వ్యక్తి గురించి తెలుసుకోండి. దేశంలో ప్రతిభ కు కొదవ లేదు. పాలకుల ప్రోత్సాహమే కరువు.


అది 2016వ సంవత్సరం. సాధారణంగా, పదవీ విరమణ సమయంలో,  చివరి 2 సం.లలో తనకు అనువైన ప్రాంతంలో తేలికైన బాధ్యత గల పోస్టింగ్ పొంది ప్రశాంతంగా రిటైర్ అవ్వడానికి లేదా చివరి రోజుల్లో బాగా డబ్బు సంపాదించ గలిగే పోస్టు కోసం అందరు ఉద్యోగస్తులు ప్రయత్నిస్తారు. అయితే దీనికి భిన్నంగా  ఒక  రైల్వే జనరల్ మేనేజర్ గారు హోదా, పరపతి, డబ్బు వచ్చే జోనల్ హెడ్ పోస్ట్ కాదని,  ICF అంటే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (రైల్వే కోచ్ లు తయారు చేసే ప్రభుత్వ సంస్థ) జనరల్ మేనేజర్ గా వేయమని అధికారులను అడిగారు.


ఈ పోస్టింగ్ ఎందుకు? మీ ఉద్దేశం ఏమిటి అని రైల్వే బోర్డు ఛైర్మన్  అతనిని అడిగారు.


ఆయన తాను రిటైర్ అయ్యే లోగా తన దేశం కోసం ఒక సెమీ-హై స్పీడ్ రైలును తయారు చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. స్పానిష్ దేశానికి చెందిన టాల్గో కంపెనీకి చెందిన రైలు కోచ్‌లు గంటకు 180కిమీల వేగంతో పరిగెత్తడంపై దేశంలో చర్చ జరుగుతున్న కాలం అది. దాని ట్రయల్ విజయవంతమైంది, అయితే ఆ కంపెనీ 10 కోచ్‌ల రేక్ సప్లై కోసం సుమారు రూ. 250 కోట్లు అడుగుతోంది మరియు దాని సాంకేతికత మనకు బదిలీ చేయాలి అని ఒప్పందంపై ఆ కంపనీ సంతకం చేయడానికి కూడా ఇష్టపడలేదు.


అటువంటి పరిస్థితిలో, ఈయన తన దేశంలో టాల్గో కంటే మెరుగైన రైలును స్వదేశీ సాంకేతికతతో దానిలో సగం కంటే తక్కువ ఖర్చుతో తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. 


రైల్వే బోర్డు ఛైర్మన్ అడిగారు:  "మీరు ఖచ్చితంగా విశ్వాసంతో ఉన్నారా? మనం దీన్ని తయారు చేయగలమా?" 


'అవును అండి. ఖచ్చితంగా తయారు చేయగలం "అని ఆ ఇంజనీర్ హామీ ఇచ్చాడు. (హామీ ఇవ్వడమే కాదు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం, మధ్యలో పుల్లలు వేసే అధికారుల వల్ల రైల్వే బోర్డ్ వారిని కాళ్ళు పట్టుకుని బతిమాలినంత పని చేయవలసి వచ్చింది అని ఆయన చెప్పారు.)


"దీని రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ కోసం ఎంత డబ్బు అవసరం?"


"కేవలం 100 కోట్లు చాలు సార్."


సరే! అతనిపై నమ్మకం ఉంచిన  రైల్వే బోర్డ్ అతనికి ICF లో జనరల్ మేనేజర్ గా వేసి ఈ బాధ్యత ఇచ్చింది మరియు 100 కోట్లు బడ్జెట్ ఇచ్చింది.


అంతే ! ఆ అధికారి హడావుడిగా రైల్వే ఇంజనీర్ల బృందాన్ని తయారుచేసుకుని  ఈ ఇంజిన్ నిర్మాణ పనిలో నిమగ్నమయ్యారు.


18 నెలలు అవిశ్రాంతంగా శ్రమించి తయారు చేసిన ఈ ప్రత్యేకమైన ఇంజిన్ లేని రైలునే" వందే భారత్"  రేక్ అని ప్రస్తుతం పిలుస్తున్నాం. అయితే దీనిని ముందుగా 'రైలు 18' అని పిలిచేవారు.


మరి ఈ 16 కోచ్‌ల కొత్త "రైలు-18"  తయారీకి ఎంత ఖర్చయిందో తెలుసా?


కేవలం ₹97 కోట్లు మాత్రమే. టాల్గో కేవలం 10 కోచ్‌ల రైలు కోసం 250 కోట్లు అడిగింది. అంటే 16కోచ్ ల వందే భారత్ దిగుమతి చేసుకుంటే ₹400 కోట్లు అయ్యేది. మరి వందే భారత్ కేవలం ₹100కోట్లలో తయారు అయిపోతోంది.


ఈ "రైలు-18"  భారతీయ రైల్వే యొక్క అద్భుతమైన చరిత్రలో అత్యంత అరుదైన వజ్రం.  దీని ప్రత్యేకత ఏమిటంటే, ప్రతి కోచ్‌కి ఒక మోటారు ఉంటుంది. ప్రతీ కంపార్ట్‌మెంట్ స్వయం చోదకమైనది అంటే సెల్ఫ్ ప్రొఫెల్లింగ్,  కాబట్టి ఈ రైలు లాగడానికి ఎటువంటి ఇంజిన్ అవసరం లేదు.


రెండేళ్లలో సిద్ధం చేసిన తొలి "రైల్-18" రేక్‌ను "వందే భారత్"  రైలు పేరుతో వారణాసి - న్యూఢిల్లీ మధ్య నడిపారు. 


ఇంతకీ ఆ అధికారి పేరు చెప్పలేదు కదూ! అతనే శ్రీ సుధాంశు మణి.


అతను 2018లో పదవీ విరమణ చేశాడు. ప్రస్తుతం లక్నోలో నివసిస్తున్నారు.


ఈ వందే భారత్ వంటి అద్భుతమైన విజయాన్ని సాధించినందుకు ఈ దేశం నుండి ఎవరూ అతన్నీ, అతని జట్టును వెన్ను తట్టలేదు. కానీ, ఇటీవల అదే వందే భారత్ గేదెను ఢీకొన్నప్పుడు, దాని ముందు భాగం దెబ్బతిన్నప్పుడు,  చాలా మంది ఈ రైలు డిజైన్‌ను విపరీతంగా విమర్శించడం ప్రారంభించారు.


ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో  లో మణి వందే భారత్ రైలు గురించి ఇలా వివరించారు:


1. ఈ ట్రైన్ పూర్తి భారతీయ సాంకేతిక పరిజ్ఞానంతో కేవలం 18 నెలలోనే దేశంలో తయారు చేయబడ్డ మొట్ట మొదటి సెమి హై స్పీడ్ రైలు.


2. ఇలా భారత్ లొనే పూర్తిగా తయారు అయ్యే రైలు చేద్దాం అని మేం ఎప్పటి నుండో అనుకుంటున్నాం. కానీ, అధికారుల అలసత్వం, విదేశాల నుండి దిగుమతుల మీద యావ మా ప్రయత్నాన్ని ముందుకు జరగనీయ లేదు.


3. మేం తయారు చేసిన ప్రస్తుత లేటెస్ట్ మోడల్ గంటకు 180కి.మీ గరిష్టంగా వెళ్ళ గలవు.. రాబోయే మోడల్స్ లో స్పీడ్ ఇంకా పెంచ వచ్చు  అయితే ప్రస్తుత మన ట్రాక్స్ అంత వేగం తట్టుకోలేవు. దీని పూర్తి సౌలభ్యం ప్రయాణీకులు అనుభవించాలి అంటే కనీసం కొన్ని ముఖ్య రూట్లలో ట్రాక్ మార్చాలి.


4. ఇది ప్రస్తుతం ఉన్న ఎస్ప్రెస్ ట్రైన్స్ స్థానంలో ట్రాక్ సామర్ధ్యం బట్టి 130కి.మీ. పైగా వేగంతో నడపవచ్చు. ఇంధన సామర్థ్యం వల్ల వీటిని  ప్రస్తుతం ఉన్న రాజధాని, శతాబ్ది, వంటి రైళ్లు స్థానంలో నడపవచ్చు.


5. వందే భారత్ ట్రైన్ ని గేదెలు గుడ్డుకోవడం, డేమేజి గురించి మాట్లాడుతూ, ప్రస్తుత ట్రైన్స్ లో ముందు భాగం ఫ్లాట్ గా వుండే భారీ ఇంజిన్, దానిని జంతువులు ఢీ కొట్టినా ప్రయాణీకులకు ఇంపాక్ట్ తెలియకుండా ఉండడానికి బలమైన ఇనుప గార్డ్ ఉంటోంది.

కానీ వందే భారత్ ట్రైన్ కి ముందు భారీ ఇంజిన్ ప్రత్యేకంగా ఉండదు.  ఇంధన పొదుపు కోసం, లుక్ కోసం ట్రైన్ ముందు భాగం ఏరో డైనమిక్ డిజైన్ పెట్టాం. ముందు భాగంలో మొదట  వుండే  కోచ్ లో కంట్రోల్ పేనల్ వెనుకనే ప్రయాణీకులు వుంటారు. అంటే ఏదైనా జంతువుని ట్రైన్ ఢీ కొడితే ఆ ఇంపాక్ట్ నేరుగా ప్రయాణీకులకు తగిలి ప్రమాదం ఏర్పడవచ్చు..అందుకని మొదటి కోచ్ ముందు కొంత భాగం ఇంపాక్ట్ బాగా తగ్గించే ఫైబర్ మెటీరియల్ ఉపయోగించాము. దీని వల్ల ట్రైన్ కొంత డేమేజి అయినా ప్రయాణీకులు భద్రత బాగుంటుంది. చిన్న ఖర్చుతో ట్రైన్ వెంటనే రిపేర్ చేయవచ్చు.


ఆయన మాట్లాడుతూ యూరోప్ లో 160 కి.మీ హైస్పీడ్ రైళ్లు ఎలివేటెడ్ కారిడార్ల మీద నడుపుతారు, అవి లేని చోట్ల ట్రాక్ కి రెండువైపులా ఫెన్సింగ్ ఉంటుంది, ప్రజలు కూడా తమ పశువులను బాధ్యతగా చూసుకుంటారు కాబట్టి అక్కడ హై స్పీడ్ ట్రైన్స్ కి జంతువులు ఢీ కొట్టే బెడద తక్కువ అని అన్నారు. మన దేశంలో కూడా అటువంటి సదుపాయాలు వచ్చాక దీని ముందు వైపు డిజైన్ మార్పు గురించి ఆలోచించవచ్చు అని చెప్పారు.


ఏది ఏమైనా రాబోయే రోజుల్లో హై స్పీడ్ ట్రైన్స్ నిర్మాణానికి విదేశాలు మీద ఆధార పడకుండా స్వదేశీ పరిజ్ఞానం తో సెల్ఫ్ ప్రొఫెల్లింగ్ రైల్వే రేక్ నిర్మాణానికి ధైర్యం చేసిన మణి గారు అభినందనీయులు...🙏...


....చాడా శాస్త్రి....

కామెంట్‌లు లేవు: