1, జులై 2023, శనివారం

అశోకవనంలో సీత

 *అశోకవనంలో సీత* (6/10)


పుల్లెల శ్రీరామచంద్రుడు వారి వచన రామాయణము సుందరకాండము నుండి….


*రావణుని చూసిన సీత పరిస్థితి*

ఈ సమయమునందు, రూపయౌవనములతో కూడి, శ్రేష్టములైన భూషణములతో అలంకరించుకొని ఉన్న ఆ రాక్షసరాజైన రావణుని చూడగానే, జనకరాజపుత్రి అయిన సీత పెనుగాలిలో అరటిచెట్టు ఊగిపోయినట్టు వణికిపోయెను. విశాలములైన నేత్రములు, శ్రేష్టమైన శరీరచ్చాయ గల ఆ సీత, తొడలతో పొట్టను, బాహువులతో స్తనములను కప్పికొని కూర్చుండెను. 

జనకుని పుత్రికయైన ఆ సీత రాక్షసీగణములచే రక్తింపబడుచుండెను. దుఃఖముచేత పీడింపబడిన ఆమె సముద్రమధ్యమునందు ఆపదలో చిక్కుకొన్న ఓదవలె ఉండెను. అట్టి సీతను రావణుడు చూచెను. 

కఠోరమైన వ్రతమును పాటించుచున్న సీత కటికనేలపై కూర్చుండెను. మహావృక్షమునుంచి ఛేదింపబడి నేలపై పడిన కొమ్మవలె ఉండెను. అలంకరించుకొనదగిన ఆమె, అలంకారములను ధరించక మాలిన్యమునే అలంకారముగా ధరించుటచేత ఆమె శరీరము విచిత్రముగా ఉండెను. ఆమె, బురద అంటుకొనిన తామరతూడువలె ప్రకాశించీ ప్రకాశించకుండగా ఉండెను. ఆ సీత ఊహలనే గుల్మములు కట్టిన, కోరిక లనే రథము నెక్కి రాజులలో శ్రేష్టుడు, ప్రసిద్ధమైన బుద్ధికలవాడూ అయిన రాముని దగ్గరకు వెళ్లుచున్నదా అన్నట్లుందెను. 


ఉత్తమసౌందర్యముతో మనోహరురాలైన ఆమె రామునియందే చిత్తము నిలిపి ఉందెను. ఈ దుణఖమునకు అంతము కనబడకపోవుటచే నిరంతరము ఆలోచనలతో, శోకముతో ఏడ్చుచు, సహాయము ఎవ్వరూ లేక శుష్కించి పోయెను. 


ఆ సీత మణిమంత్రాదులచేత కట్టబడి కొట్టుకొనుచున్న మహాసర్పమువలె, ధూమకేతువను గ్రహముచేత(ధూమముతో) ఉక్కిరిబిక్కిరి చేయబడుచున్న రోహిణివలె ఉందెను. సదాచారసంపన్నమూ, ధర్మతత్పరమూ, మంచి వృత్తశీలములు గలదీ అయిన కులములో పుట్టి, వివాహసంస్కారము ద్వారా మరల దుష్కులములో పునర్జన్మ పొందిన కన్యవలె ఉండెను. 


అసత్యదోషారోపణముచేత చెడిపోయిన కీర్తివలె, మాటిమాటికి అధ్యయనము చేయకపోవుటచేత శిథిలమైన విద్యవలె ఉండెను. క్షీణించిన గొప్ప కీర్తివలె, అవమానింపబడిన (శద్ధవలె, క్షీణించిపోయిన పూజవలె, దెబ్బతిన్న ఆశవలె ఉండెను. లభించు నని ఎదురుచూచుచుందగా రాకుండా పోయిన లాభమువలె, నెరవేర్చబడని ఆజ్జవలె, ఉత్పాత సమయములందు మండుచున్న దిక్కువలె, ఒకరికొరకై ఉద్దేశింపగా మరొకరు అపహరించుకొని పోయిన పూజవలె ఉండెను. త్రొక్కివేయబడిన పద్మలతవలె, శూరు లందరూ మరణించిన సేనవలె, చీకటి కప్పిన కాంతి వలె, ఎండిపోయిన నదివలె ఉండెను. 


అపవిత్రవస్తువుల స్పర్శచే అపవిత్రమైపోయిన అగ్నివేదికవలె, శాంతించిన అగ్నిజ్వాలవలె, చంద్రమండలమును రాహవు మింగివేయగా కాంతివిహీనముగా ఉన్న పూర్ణిమారాత్రివలె ఉండెను. ఏనుగు తొందముతో కొట్టుచు ఆకులను పద్మములను లాగివేయగా, పక్షులన్నీ భయపడి పారిపోగా, వ్యాకులముగా ఉన్న పద్మసరస్సువలె ఆ సీత మనస్సు కలిగిపోయి ఉండెను. భర్తృశోకముచే పీడితురాలై, ఉత్తమశరీరసంస్కార మేమీ లేని ఆ సీత, ఉన్న నీరంతా క్రిందికి ప్రవహించిపోవునట్లు చేయుటచే ఎండిపోయిన నదివలె కృశించి, కృష్ణపక్షరాత్రివలె శోభావిహీనురాలై ఉండెను. 


సుకుమారురాలు, చక్కని అవయవనిర్మాణముతో సుందరముగా ఉన్నదీ, రత్నాలతో నిండిన ఇండ్లలో నివసించుటకు అలవాటుపడినదీ అయిన ఆ సీత, కొంచెము సేపటి క్రితమే పెకలింపబడి, వేడికి కమిలిపోవుచున్న తామరతూడువలె ఉండెను. ఆటవికులు పట్టుకొని, ఏనుగుల గుంపుకు నాయకుడైన మగ ఏనుగుకు దూరముగా తీసికొనిపోయి స్తంభమునకు బంధింపగా చాలా దుఃఖముగా నిట్టూర్చుచున్న ఆడ ఏనుగువలె, ఆ సీత చాల దుఃఖార్తయై ఉండెను. దీర్ఘమైన ఒక్క జడతో సహజముగానే శోభించుచున్న ఆ సీత, వర్షాకాలాంతమునందు నల్లని వృక్షపంక్తితో ప్రకాశించుచున్న భూమివలె ఉండెను. 


ఉపవాసముచేత, దుఃఖముచేత, ఆలోచనలచేత, భయముచేత కూడ సీత చాలా దుర్బలురాలై, కృశించి దైన్యముతో నిండియుండెను. అత్యల్పమైన ఆవారమును భుజించుచు జీవించి ఉన్న ఆమె రామధ్యాన మను గొప్ప తపస్సు చేయుచుండెను. సీత దేవతాస్రీవలె ఉండెను. దుఃఖార్తురాలై, అంజలి ఘటించి, రావణునికి రాముని చేతిలో పరాభవము కలుగవలె నని మనస్సులో కోరుకొనుచుండెను. 


అందమైన రెప్పలతో చివర ఎర్రగాను, మధ్య తెల్లగాను ఉన్న విశాలములైన నేత్రములు గల దోషలేశము కూడ లేని ఆ సీత నలువైపులా చూచుచు ఏడ్చుచుండెను. రాముని విషయమున అచంచలమైన పాతివ్రత్యనియమము అవలంబించి ఉండెను. 


*సీతతో రావణుని సంభాషణ*

అట్టి సీతను రావణుడు “నేను చెప్పినట్లు విననిచో చంపెదను” అని భయపెట్టుచు మంచి మాటలతో కూడ ఆమెకు ఆశచూపెను (లేదా తనకు చావు వచ్చుటకే ఆమెను ఆ విధముగా లోభపెట్టెను).


రాక్షసస్రీల మధ్య దీనురాలై, ఆనందము లేక దయనీయస్థితిలో ఉన్న ఆ సీతకు, రావణుడు, హస్తముఖాదులతో చేష్టలు చేయుచు మంచి మాటలతో తన అభిప్రాయమును తెలిపెను. 


“ఏనుగు తొండము వంటి ఆకారము గల తొడలు గల ఓ సీతా! నీవు నన్ను చూడగానే భయపడి స్తనములను, ఉదరమును కప్పుకొనుచు, అదృశ్యురాలవు అగుటకు కోరుచున్నట్లున్నావు. విశాలములైన నేత్రములతో, సద్గుణసంపన్నములైన సర్వావయవములతో సకలజనుల మనస్సును ఆకర్షించుచున్నఓ సీతా! నేను నిన్ను కామించుచున్నాను. ఓ ప్రియురాలా! నామీద ప్రేమ జూపుము.


నీవు భయపడుటకు ఇక్కడ మనుష్యులు గాని, కామరూపధారులైన రాక్షసులు గాని ఎవ్వరూ లేరు. నాకు నీపై ప్రేమయే ఉన్నది గాన నావలన కూడ నీవేమీ భయపడవలసిన పనిలేదు. 

పరభార్యాగమనము, బలాత్కరించి పరస్త్రీలను అపహరించుటా ఇది అన్నివిధాలా రాక్షసుల స్వధర్మము. ఏమాత్రము సందేహము లేదు. రాక్షసధర్మ మీ విధముగా ఉన్నది. 


అయినను, నా శరీరమును కామము దాని ఇష్టము వచ్చినట్లు ఎంత పీడించినను, నీకు నాపై ప్రేమ కలుగునంతవరకు నిన్ను స్పృశించను. ఈ విషయమున భయపడవలసిన పని లేదు. నన్ను విశ్వసించుము. నన్ను నిజముగా ప్రేమించుము. ఈ విధముగా శోకపీడితురాలవు కాకుము. 

ఒంటి జడ, నేలపై పరుండుట, ఏదో ఆలోచన, మాసిన వస్త్రములు, నిష్కారణముగా ఉపవాసము చేయుట, ఇవి నీ కేమాత్రము తగినవి కావు. నీవు నన్ను పొందినచో, నీకు విచిత్రములైన మాలలు, చందనములు, అగురువు, అనేకవిధములైన వస్త్రములు, శ్రేష్టములైన ఆభరణములు, ఉత్తమములైన మద్యములు, శయనములు, ఆసనములు, గీతము, నృత్తము, వాద్యము లభించగలవు. 


నీవు స్త్రీలలో రత్నమైనదానవు. ఈవిధముగా ఉండకూడదు. అవయవములపై అలంకారములను ధరించుము. నన్ను పొందిన పిమ్మట కూదా నీవు భోగాదు లనుభవించుటకు అయోగ్యురాలవు ఎట్లగుదువు? మనోహరమైన నీ యౌవనము గడచిపోవుచున్నది. ఇది శీఘ్రముగా గడచిపోయిన పిమ్మట, ప్రవహించి వెళ్ళిపోయిన జలమువలె, వెనుకకు మరలిరాదు. 

సౌందర్యనిర్మాతయైన సృష్టికర్త నిన్ను సృజించిన పిమ్మట, ఇక సౌందర్యమును నిర్మించుట నిలిపివేసినా దని అనుకొనుచున్నాను. కావుననే నీ సౌందర్యమును పోలిన సౌందర్యము మరొకటి లేదు. రూపయౌవనములతో ప్రకాశించుచున్ననిన్ను

చూచినచో సాక్షాత్తు బ్రహ్మదేవుడు కూడ విడిచిపెట్టడు. ఇతరుల మాట చెప్పవలెనా?


చంద్రునితో సమానమైన ముఖము, పెద్ద కటిప్రదేశము గల ఓ! సీతా! నా దృష్టి నీ ఏ యే అవయవముమీద ప్రసరించుచున్నదో దానిమీదనే నిలచిపోవుచున్నది. 

ఈ తెలివితక్కువతనమును విడచి, నాకు భార్యవు అగుము. నేను అనేకదేశములనుండి ఎందరినో ఉత్తమస్త్రీలను తీసుకువచ్చి ఉన్నాను. నీవు, వారందరిలో ప్రధానురాలైన పట్టమహిషివి అగుము. ఆ యా లోకములను జయించి నేను తీసికొని వచ్చిన అన్ని శ్రేష్టవస్తువులూ, ఈ రాజ్యమూ, నేనూ కూడ నీకు చెందినవారము. అనేకనగరములతో కూడిన ఈ భూమినంతను నీకు గాను జయించి, నీ తండ్రియైన జనకునకు ఇచ్చెదను. 


ఈ లోకములో నన్నెదిరించగలిగినవాదెవ్వడూ కనబడడు. యుద్ధములో ఎదిరించువారెవ్వరూ లేని నా మహాపరాక్రమము ఎంతటిదో గుర్తించుము. నేను ఎన్నో పర్యాయములు, యుద్ధములలో సురులను అసురులనూ కూడ ఓడించి వారి ధ్వజములను ఛేదించినాను. వాళ్ళవరూ నా శత్రుసేనలలో(శత్రువులుగా) నిలబడజాలరు. 


నామీద ప్రేమ చూపుము. ఇప్పుడు ఉత్తమమైన అలంకరణము చేసికొనుము. నీ శరీరముమీద కాంతి గల అలంకారములను ధరించుము. నీవు చక్కగా అలంకరించుకొని యుండగా నీ రూపము చూడవలెనని ఉన్నది. సరళమైన ప్రవృత్తిని అవలంబించి చక్కగా అలంకరించుకొని, నీకిష్టము వచ్చినట్లు భోగము లనుభవించుము; త్రాగుము; ఆనందముగా ఉండుము. నీకిష్టమైన వారికి భూములను, ధనములను పంచిపెట్టుము. విశ్వాసముతో నన్ను కలిసి ఆనందించుము. నిర్భయముగా నన్ను ఆజ్ఞాపించుము. 


నా అనుగ్రహముచేత, నీతో పాటు నీ బంధువులు కూడ ఆనందించెదరుగాక. నా కెంత ఐశ్వర్యము, కీర్తి ఉన్నవో చూడుము. నారబట్టలు కట్టుకునే రామునితో ఏమి చేసెదవు? విజయము లేక, ఐశ్వర్యము కోల్పోయి, వనములో నివసించుచు, మునివ్రతము అవలంబించి నేలపై పండుకొనే ఆ రాముడు జీవించి ఉన్నాడా లేదా అనునది కూడ సందిగ్ధమే! ఎదుట కొంగలు ఎగురుచున్న నల్లని మేఘములు కప్పివేసిన వెన్నెలను వలె నిన్నుచూచుటకు కూడ రామునికి శక్యము కాదు. 


హిరణ్యకశిపుడు ఇంద్రుని చేతిలో చిక్కిన తన భార్యయైన కీర్తిని పొందగలిగినాడు. కాని రాముడు మాత్రము నా చేజిక్కిన నిన్ను పొందజాలడు. చాల అందమైన చిరునవ్వు, అందమైన పలువరుస, అందమైన కళ్లు, మనోహరములైన విలాసములు గల ఓ భయస్వభావవంతురాలైన సీతా! గరుత్మంతుడు సర్పమును హరించినట్లు, నీవు నా మనస్సును హరించుచున్నావు. నీవు నలిగిపోయిన పట్టువస్తము కట్టుకొని ఉన్నావు. చిక్కిపోయినావు. ఏ అలంకారములూ ధరించలేదు. నీవు ఇట్టీ స్టితిలో ఉన్నను నిన్ను చూచిన పిదప నా భార్యలవలన ఆనందము పొందజాలకున్నాను. 


నా అంతఃపురములో ఉత్తమగుణవతులైన ఎందరో స్త్రీలు ఉన్నారు. వారి అందరిపైన నీకు ఆధిపత్యము లభించగలదు. మూడులోకములందూ శ్రేష్టలైన స్త్రీలు అందరూ, అప్సరస్త్రీలు లక్ష్మిని సేవించినట్లు నిన్ను సేవించగలరు. కుబేరునికి సంబంధించిన రత్నములనూ, ధనములనూ, మూడు లోకములనూ నన్నూ కూడా సుఖముగా అనుభవించుము. 

సీతా! రాముడు, తపస్సుచేతగాని, బలముచేతగాని, పరాక్రమముచేతగాని, ధనముచేతగాని, తేజస్సుచేతగాని, కీర్తిచేతగాని నాతో సమానుడు కాడు. 

నీకు ధనరాశులను, భూమిని ఇచ్చెదను. నీకు ఇష్టము వచ్చినట్లు త్రాగుము, విహరించుము; క్రీడించుము; భోగములు అనుభవించుము; నాతో కలిసి ఆనందించుము. నీ బంధువు లందరూ కూడా నీతో కలసి ఆనందించవచ్చును. నీవు బంగారు వికారములైన, ప్రకాశించుచున్న హారములను అలంకరించుకొని, నాతో కలసి, పుష్పించిన వృక్షముల సముదాయములలో నిండిన, తుమ్మెదలతో ధ్వనించుచున్న సముద్రతీరమునందలి ఉద్యానవనములలో విహరించుము.

 *అశోకవనంలో సీత* (8/10)


పుల్లెల శ్రీరామచంద్రుడు వారి వచన రామాయణము సుందరకాండము నుండి….


*రావణుడి హెచ్చరిక*

రావణుడు పరుషములైన సీత మాటలు విని, పైకి ప్రియములుగా ఉన్నట్లు కనబడు అప్రియములైన మాటలు ఈ విధముగా పలికెను. 


“స్త్రీలను బుజ్జగించిన కొలది పురుషుడు వాళ్ళకు స్వాధీను డగును. ఇతడు మనకు దాసు డని వాళ్ళు భావింతురు. మంచి మాటలు చెప్పిన కొలదీ అతనిని వాళ్ళు తిరస్కరించుచుందురు. నాకు నీయందున్నకామము, చెడు మార్గమునందు పరిగెత్తుచున్న గుర్రములను సారథి నిగ్రపించినట్లు, నా కోపమును అణచివేయుచున్నది. నిజముగా కామము ప్రతికూలస్వభావము కలది. ఎందుచేతననగా ఏ వ్యక్తిపై కామము కలుగునో ఆ వ్యక్తిపై జాలి, స్నేహము కూడ కలుగుచుండును. 


సీతా! కపటవనవాసము చేయు రామునియందు ఆసక్తురాలవై అవమానించుటకు, చంపుటకూ తగిన దానివైన నిన్ను ఈ కారణముచేతనే చంపించలేకుండా ఉన్నాను. నీవు నాతో పలికిన పరుషమైన ఒక్కొక్క మాటకు నిన్ను క్రూరముగా వధించవలసి ఉన్నది. 

రాక్షసరాజైన రావణుడు సీతతో ఈ విధముగా పలికి కోపముతోను, తొందరతోను కూడినవాడై ఆమెతో మరల ఈ మాట పలికెను. 

“నేను నీకు రెండు మాసములు గడువు ఇచ్చుచున్నాను. ఆ గడువును నేను పాలింపవలసి ఉన్నది. ఆ గడువు దాటిన వెంటనే నీవు నా శయనముపైకి రావలెను. ఈ గడువులోగా నీవు నన్ను భర్తగా అంగీకరించకపోయినచో, రెండుమాసముల పిదప నిన్ను నా ప్రాతఃకాలభోజనార్ధము వంటింటికి తీసికొని వెళ్ళి చంపివేయగలరు.”


రావణుడు ఆ విధముగ సీతను భయపెట్ట్సటను చూచి, దేవగంధర్వకన్యలు కన్నీళ్లు ఎర్రబడుట మొదలైన వాటితో(వారి) కండ్లు వికారము చెందగా దుఃఖించిరి. ఆ రాక్షసునిచేత భయ పెట్టబడుచున్న సీతను పెదవులు కదల్చి కొందరు, ముఖములు నేత్రములు కదల్చి మరికొందరు ఓదార్చిరి. 


*సీత ప్రత్యుత్తరము*

దేవగంధర్వకన్యల చేత ఆ విధముగా ఊరడించబడిన సీత, పాతివ్రత్యబలము, దర్పము ఉట్టిపడు నట్లు, ఆ రాక్షసరాజుతో తనకు హితమైన వాక్యము పలికెను. 

“నీ క్షేమమును కోరి నిన్ను ఈ విధమైన నింద్యమైన పనినుండి నివారించు వారెవ్వరూ ఉన్నట్లు లేదు. ఇది నిశ్చయము. శచీదేవి దేవేంద్రుని భార్య అయినట్లు నేను ధర్మాత్ముడైన రాముని భార్యను. అట్టి నన్ను ఈ మూడులోకములలో నీవు తప్ప మరెవ్వ డైనా, మనస్సులో కూడ కోరుకొనునా!


ఓ రాక్షసాధమా! అమితమైన తేజస్సు గల రాముని భార్యనైన నాతో ఈ విధముగా పాపవు మాటలు పలికినందుకు, నీ వెక్కడికి పోయినను ఈ అపరాధమునుండి తప్పించుకొనజాలవు. నీవు రామునితో యుద్ధమునకు తలపడుట, వనములో చెవులపిల్లి మదించిన ఏనుగును ఎదిరించుటవంటిది. రాముడు మహాగజము. నీవు చెవుల పిల్లివి. ఈ లంకాపట్టణములో కూర్చుండి, సిగ్గు లేక ఇక్షాకువంశప్రభువైన ఆ రాముని నిందించుచున్నావు. అతని కంటికి కనబడుటకు మాత్రము భయపడుచున్నావు. 


దుష్టుడా! నన్ను దుర్చుద్ధితో చూచుచున్న నీ క్రూరములు వికృతములు అయిన (పిల్లికళ్లవలె) తెల్లగాను, పచ్చగాను ఉన్న కళ్లు నేలమీద ఎందుచేత రాలి పడిపోలేదో తెలియదు! ధర్మాత్ముడైన ఆ రాముని భార్యనూ, దశరథుని కోడలినీ అయిన నన్ను గూర్చి ఇలా మాటలాడినందుకు, నీ నాలుక తెగి క్రింద పదలే దెందుచేతనో! 

ఓ! రావణా! నీవు భస్మముగా చేయదగినవాడ వైనను, అట్లు చేయుటకు నాకు రామాజ్ఞ లేకపోవుటచేతను, తపస్సును రక్షించుకొనుటచేతను నా పాతివ్రత్యమహిమచే నిన్ను భస్మము చేయుటలేదు. బుద్ధిశాలియైన రామునకు చెందిన నన్ను నీవు అపహరించజాలవు. అయినను ఈవిధముగా నా అపహారము జరిగినదనగా ఇది నీ మృత్యువు కొరకే వచ్చినది. సందేహము లేదు.

“నేను శూరుడను, కుబేరుని సోదరుడను, అనంతబలసంపన్నుదను” అని చెప్పికొనుచున్నావే! అట్టి నీవు రాముని దూరముగా పంపివేసి అతని భార్యనైన నన్ను ఎందువలన అపహరించినావు?”


రాక్షసరాజైన రావణుడు సీత మాటలు విని, క్రూరములైన నేత్రములు పెద్దవిచేసి, సీతను చూచెను. ఆ రావణుడు నల్లని మేఘము వలె ఉండెను. అతని భుజములు, కంఠము చాలా పెద్దవిగా ఉందెను. అతని బలము నడక, సింహము బలము నడకవలె ఉండెను. శోభాయుక్తుడైన అతని జివ్వాగ్రము, నేత్రములు కూడ మండుచున్నట్లుగా ఎర్రగా ఉండెను. అతడు కిరీటమును ధరించుటచే ఎత్తుగా ఉన్నట్లు కనబడుచుందెను. ఆ కిరీటము పై భాగము కదలుచుందడెను. విచిత్రములైన మాలలను, ఎర్రని వస్త్రములను ధరించెను. అగ్నిలో కాల్చి శుద్ధము చేసిన బంగారముతో తయారుచేసిన బాహముపురులను అలంకరించుకొనెను. 


నల్లగా, లావుగా ఉన్న త్రాడును నడుమునకు బిగించి ఆ రావణుడు, అమృతమునకై, సముద్రమథనము చేయు సమయమున వాసుకిని కట్టిన మందరపర్వతము వలె ఉండెను. పర్వతము వలె ఉన్నరావణుడు, బాగా బలిసిన భుజములతో, రెండు శిఖరములతో కూడిన మందరపర్వతము వలె ప్రకాశించెను. బాలసూర్యుడు వలె ఎర్రగా ఉన్న కుండలములు అలంకరించుకొని అతదు, ఎర్రని చిగుళ్ళూ, పుష్పములూ గల రెండు అశోకవృక్షములతో పర్వతము వలె ప్రకాశించుచుండెను. కల్పవృక్షమువలె ఉన్న అతడు మూర్తీభవించిన వసంతము వలె ఉండెను. అతడు చక్కగా అలంకరించుకొన్నను, శృశానమునందున్న మండపము వలె భయంకరముగా ఉండెను. 


*రాక్షసస్త్రీలకు ఆదేశం*

అతడు, సీతను, కోపముచేత ఎర్రనైన నేత్రములతో చూచుచు, సర్పము వలె బుసలు కొట్టుచు, ఆమెతో- “చెడ్డ నీతిని అనుసరించువాడు, ధనము లేనివాడు అయిన రామునిపై మక్కువకలదానా! సూర్యుడు తన కాంతిచేత సంధ్యను నశింపచేయునట్లు నేను నిన్ను ఇప్పుడే నశింపచేసెదను”

అని పలికి చూచువారికి భయంకరముగా ఉన్నరాక్షస స్రీలందరినీ చూచెను. 

ఒకే కన్ను, ఒకే చెవి కలదానిని, గొడుగు చెవులదానిని, ఆవు చెవుల దానిని, ఏనుగు చెవులదానిని, వ్రేలాడు చెవులదానిని, చెవులు లేనిదానిని, వనుగు పాదముల దానిని, గుర్రము పాదముల దానిని, ఆవు పాదముల దానిని, పాదాలమీద జుట్టు ఉన్నదానిని, ఒకే కన్ను ఒకే పాదము ఉన్నదానిని, పెద్ద పాదముల దానిని, పాదాలు లేనిదానిని, పెద్ద తలా కంఠమూ గలదానిని, పెద్ద స్తనములు, పొట్టా కలదానిని, పెద్ద నోరు, కళ్ళూ కలదానిని, పొడవైన నాలుక కలదానిని, నాలుక లేనిదానిని ముక్కులేనిదానిని, సింహముఖము దానిని, ఆవు ముఖముదానిని, పందిముఖము దానిని,

“ఓ రాక్షసస్రీలలారా! మీరందరూ కలసి ప్రయత్నించి సీత నాకు శీఘ్రముగా వశమగు నట్లు చెయ్యండి. ప్రతికూలములైన కార్యములు చేసి కాని, అనుకూలములైన కార్యములు చేసి కాని, సామ-దాన-భేదోపాయములను ప్రయోగించి కాని, దండమును ప్రయోగించి గాని సీతను లొంగదీసుకొనండి” అని ఆజ్ఞాపించెను. 

ఆ రాక్షసస్రీలను ఈ విధముగా అనేక పర్యాయములు ఆజ్ఞాపించి, కామముతోను, కోపముతోను నిండిన మనస్సుతో సీతను భయపెట్టెను. 


*ధాన్యమాలిని*

అప్పుడు ధాన్యమాలిని అను రాక్షసస్ర్రీ తొందరగా రావణుని వద్దకు వచ్చి, అతనిని కౌగిలించుకొని- “మహారాజా! నీవు హాయిగా నాతో విహరింపుము. రాక్షసాధిపా! చెడ్డ శరీరవర్ణము గల దీనురాలైన మనుష్యస్తీ- ఈ సీతతో నీకేమి సుఖము కలుగును? నీ బాహుబలముచేత సంపాదించిన దివ్యములైన ఉత్తమభోగములను బ్రహ్మదేవుడు ఈమెకు రాసి పెట్టలేదు. ఇది నిజము. ఏ పురుషుడైనను తనపై (పేమ లేని స్త్రీని కామించినచో వాని శరీరమునకు తాపము మాత్రమే కలుగును. తనపై ప్రేమ ఉన్న స్త్రీని కామించు వానికి మంచి ఆనందము కలుగును.” అని పలికిను. 


*రావణుడు వెనుకకు మరలుట*

రావణునితో ధాన్యమాలి ఇట్లు పలికి, అతనిని కౌగిలించుకొని పైకి లేవదీసెను. అపుడాతడు నవ్వుచూ వెనుకకు మరలెను. దశకంఠుడు భూమిని కంపింపచేయుచున్నట్లు నడచివెళ్ళి, ప్రకాశించుచున్న సూర్యుని కాంతి వంటి కాంతిగల గృహములో ప్రవేశించెను. అతనితో కూడ వచ్చిన దేవకన్యలు, గంధర్వకన్యలు, నాగకన్యలు నలుమూలలా అతనిని పరివేష్టించి, ఆ శ్రేష్టమైన గృహములో ప్రవేశించిరి. 

రావణుడు ధర్మమార్గమునందు స్థిరముగా నిలచిఉన్న భయముతో వణికిపోవుచున్న సీతను ఈ విధముగా భయపెట్టి, ఆమెను విడచి, మన్మథునిచేత మోహితుడై, ప్రకాశించుచున్న తన గృహములోనికి ప్రవేశించెను.


*రాక్షసస్త్రీలు సీతను హింసించుట*

క్రూరస్వభావము గల, వికృతములైన ముఖములతో భయంకరముగా ఉన్న రాక్షసప్రీలు సీతను సమీపించి పరుషముగా అప్రియములైన మాటలు పలికిరి. 

“ఓ! సీతా! రావణాంతఃపురము అందరికి మనోహరమైనది; శ్రేష్టములైన శయనములతో అలంకరింపబడినది. అట్టీ అంతఃపురములో నివసించుటకు ఏల అంగీకరించవు? నీవు మనుష్యస్తీవి అగుటచే మనుష్యుని భార్యగా ఉండుటయే గొప్ప అని తలచుచున్నావు. ఇంక రామునినుండి నీ మనస్సును మరల్చుకొనుము. అట్లు కానిచో నీ వెన్నటికీ జీవించవు. రాక్షసరాజైన రావణుడు మూడు లోకముల ఐశ్వర్యమును అనుభవించువాడు. అతనిని భర్తనుగా చేరి సుఖముగా విహరించుము.


మనుష్య స్త్రీవగుటచే నీవు మనుష్యుడైన ఆ రాముడే కావాలని కోరుకొనుచున్నాను! అతడు రాజ్యభష్టుడు. ఏ కార్యములు సాధించజాలనివాడు. కష్టాలతో వ్యాకులుడై ఉన్నాడు. ”


సీత, రాక్షసస్రీల మాటలు విని, కన్నీళ్లు నిండిన నేత్రములతో- “మీరందరూ కలసి, నాతో, లోకులు నిందించు మాటలు మాటలాడుచున్నారు! ఇవి పాపపు మాట లని మీకు తోచుటలేదా? మనుష్యప్రీ రాక్షసునకు భార్య అగుట యుక్తము కాదు. మీరందరూ కలసి నన్ను చంపి తినివేసినా సరే; మీరు చెప్పినట్లు మాత్రము చెయ్యను. 

దీనుడైనా, రాజ్యభష్టుదైనా, నా భర్తయే నాకు పూజ్యుడు. సువర్చల సూర్యునియందు అనురాగముతో ఉన్నట్లు, నేను ఎల్లప్పుడు నా భర్తయందే అనురాగముతో ఉందును. మవాభాగ్యవంతురాలైన శచీదేవి దేవేంద్రుని వలె, అరుంధతి వసిష్టునివలె, రోహిణి చంద్రునివలె, లోపాముద్ర అగస్త్యుని వలె, సుకన్య చ్యవనుని వలె, సావిత్రి సత్యవంతునివలె, శ్రీమతి కపిలుని వలె, మదయంతి సౌదాసునివలె, కేశిని సగరునివలె, భీమపుత్రియైన దమయంతి నలునివలె, నేను ఇక్ష్యాకువంశీయులలో శ్రేష్టుడైన రామునే అనుసరించుదానను.” అని పలికెను.

 *అశోకవనంలో సీత* (7/10)


పుల్లెల శ్రీరామచంద్రుడు వారి వచన రామాయణము సుందరకాండము నుండి….


*సీత రావణుడితో మాటాడుట*

భయంకరుదైన ఆ రావణుని మాటలు విని, సీత దుఃఖించుచు, దీనమైన స్వరముతో, మెల్లగా, దీనముగా ఇట్లు పలికెను. మహాపతివ్రతయైన ఆ సీత, దుఃఖపీడితురాలై, దయనీయమైన స్థితిలో ఏడ్చుచు, భర్తనే తలచుచు, ప్రత్యక్షముగా రావణునితో మాటలాడుటకు ఇష్టము లేకపోవుటచే మధ్య ఒక గడ్డిపరకను అడ్డముగా ఉంచి, వణికిపోవుచు ఇట్లు పలికెను.


“నీ మనస్సును నామీదనుంచి మరల్చి నీ భార్యలపై నిలుపుము. నీ భార్యలను ప్రేమించుము. పాపములే చేసినవాడు ఉత్తమమైన సిద్ధిని ఎట్లు ఆశించకూడదో, అట్లే నీవు నన్ను ఆశించకూడదు. నేను ఉత్తమవంశములో పుట్టి, ఉత్తమమైన వంశములోనికి కోడలుగా వెళ్ళితిని. పతివ్రతను. నింద్యమైన ఇట్టి అకార్యమును నేను చేయజాలను.”


కీర్తిమంతురాలైన సీత రావణునితో ఇట్లు పలికి అతనివైపు వీపు త్రిప్పి, మరల ఇట్లు పలికెను-


“పరభార్యను, పతివ్రతను అయిన నేను నీకు తగిన భార్యను కాను. ధర్మమును బాగుగా చూడుము. సత్పురుషు లనుసరించు నియమములను చక్కగా పాటీించుము. ఓ రాక్షసుడా! నీ భార్యలు ఎట్లు రక్షింపదగినవారో ఇతరుల భార్యలు కూడ అట్లే రక్షింపదగినవారు. అందుచేత నిన్నే ఉపమానము చేసి చూచుకొని, నీ భార్యలను ఇతరులు అభిమర్శించినచో నీ కెట్లుండునో అట్లే నీవు ఇతరుల భార్యలను అభిమర్శించినచో వారి కుండు నను విషయము గ్రహించి, నీ భార్యలతో నీవు రమింపుము. చపలస్వభావుడై, తన భార్యలతో సంతృప్తి చెందక, ఇంద్రియనిగ్రహము లేకుండా ఉన్ననీచబుద్ధి కలవానిని, పరభార్యలు పరాభవమును పొందింతురు. (అనగా పరదారాసక్తి వాని పతనమునకు హేతు వగును. )


నీ బుద్ధి సత్ర్రవర్తన లేక విపరీతముగా ప్రసరించుచున్నది; ఈ దేశములో నీకు సద్బుద్ధి బోధించే మంచివారే లేరా, ఉన్నా వారి మాటను నీవు వినుటలేదా? ధర్మమార్గము తెలిసిన సత్పురుషులు నీకు పితము ఉపదేశించినా అధర్మమార్గమునందు ప్రవర్తించుచున్న చిత్తము గల నీవు, రాక్షసుల వినాశనము దాపురించుటచే ఆ ఉపదేశమును లెక్కచేయుట లేదా!


మనస్సు అదుపులో లేక అమార్గమునందు ప్రవర్తించు రాజు పరిపాలనలో ఐశ్వర్యసంపన్నములైన రాష్టములు, నగరములూ కూడ నశించును. అటువంటి నీవు రాజుగా దొరకుటచే సకలైశ్వర్యసంపన్నమైన ఈ లంక నీ ఒక్కని మూలమున, కొద్ది కాలములో నశించగలదు. 


దీర్ఘదృష్టిలేని పాపాత్ముడు, తాను చేసిన పనులే తనను దెబ్బతీయగా నశించి పోవును. అపుడు వానిని చూచి సకలప్రాణులు సంతోషింతురు. పాపకర్మలు చేయుచున్ననీవు కూడ ఇట్లే నశించగలవు. అప్పుడు నీచే పీడింపదిడిన వారందరూ సంతోషించుచు, “మన అదృష్టము కొలది ఈ క్రూరునికి ఇట్టి ఆపద వచ్చినది” అనుకొనెదరు. 


*రామునివద్దకు చేర్చు, రాముని శరణువేడు*

ఐశ్వర్యమునూ, ధనమునూ చూపించి నన్నెవరూ లోభపెట్టజాలరు. కాంతి సూర్యునినుండి ఏవిధముగా వేరుకాదో ఆ విధముగా నేను రామునినుండి వేరు కాను. ఇంతకాలమూ, సకలలోకనాథుడదైన ఆ రాముని భుజమును తలగడగా ఉపయోగించుకొని సుఖముగా నిద్రించిన నేను ఎవ్వడో మరొక్కని భుజమును తలగడగా ఎట్టు స్వీకరించగలను! వేదాధ్యయనము చేయుటకు అవలంబించిన వ్రతమును పూర్తిచేసి కొన్న బ్రాహ్మణునకు ఆ వేదవిద్య ఏ విధముగా తగియుండునో అట్లే నేను సమస్తమైన భూమికి ప్రభువైన ఆ రామునకు మాత్రమే భార్యనగుటకు తగిన దానను.


అరణ్యములో ఆడ ఏనుగును గజరాజుతో చేర్చినట్లు, దుఃఖితురాలనైన నన్ను రామునితో చేర్చుము. అది యుక్తము. నీవు నీ రాజ్యమునకు ప్రభువుగా ఉండవలె నన్నచో, ఘోరమైన మరణము పొందకుందా జీవించవలె నన్నచో పురుషశ్రేష్టుడైన ఆ రామునితో స్నేహము చేసికొనుట మంచిది. ధర్మములన్నీ తెలిసిన ఆ రాముడు శరణాగతవత్సలుడను విషయము లోకప్రసిద్ధము. నీకు జీవించవలెనను కోరిక ఉన్నచో ఆ రామునితో స్నేహము చేసికొనుము. 

శరణాగతవత్సలుడైన ఈ రాముని అనుగ్రహింపచేసుకొనుము. నన్ను యథావిధిగా మరల రామునకు సమర్పించుము. ఈ విధముగా నన్ను రామునకు తిరిగి ఇచ్చివేసినచో నీకు క్షేమము కలుగును. నీవు మరొక విధముగా చేసినచో నీకు మరణము తప్పదు. 


ఇంద్రుడు ప్రయోగించిన వజ్రమైనను నీవంటివానిని ఏమీ చేయలేక విడిచి పెట్టవచ్చును; యముడు కూడ చాలాకాలము పాటు విడిచిపెట్టవచ్చును. కోపము వచ్చినచో, ఆ లోకనాథుడైన రాముడు మాత్రము విడిచిపెట్టడు. 


నీవు అచిరకాలములో, ఇంద్రుడు ప్రయోగించిన వజ్రాయుధము ధ్వనివంటి, దిక్కులను పిక్కబీల చేయు రామధనుర్ధ్వనిని వినగలవు. గట్టి కణుపులతో, మండుచున్న ముఖములు గల సర్పములవలె భయంకరములై, రామలక్ష్మణుల పేర్లతో చిహ్నితములైన బాణములు శీఘ్రకాలములో ఈ లంకానగరమునందు పడగలవు. రామలక్ష్మణుల బాణములు, ఈ నగరములో అంతటా, రాక్షసులను చంపుచు, ఈ నగరము నంతను కప్పివేయగలవు. 

గరుత్మంతుడు సర్పాలను పెకిలించివేసి నట్లు రాము డనే ఆ గొప్ప బలశాలియైెన గరుత్మంతుడు రాక్షసు లనే సర్పాలను పెకిలించివేయగలడు. విష్ణువు మూడు అడుగులు వేసి, ప్రకాశించుచున్న లక్ష్మిని అసురులనుండి తీసికొనిపోయినట్లు నా భర్తయైన రాముడు, శీఘ్రముగా నన్ను నీ వద్దనుండి తీసికొనిపోగలడు. 


*నీకు చావు తప్పదు*

రాముడు రాక్షససైన్యమును చంపివేయుటచేత, జనస్థానము హతస్థానము (చచ్చినవాళ్ల స్థానము) అయినది. అప్పుడు నీవేమీ చేయజాలక ఈ చెడ్డ పని చేసితివి(నన్ను అపహరించితివి. ) ఓరీ! నీచుడా! నరులలో శ్రేష్టుడైన ఆ రామలక్ష్మణు లిద్దరూ బైటకు పోయినపుడు వారు లేని ఆశ్రమములో ప్రవేశించి, నీవు నన్ను అపహరించినావు. 

పెద్దపులుల గంధమును వాసన చూచిన కుక్కవాటి ఎదుట ఎట్లు నిలువజాలదో, అట్లే రామలక్ష్మణుల గంధము వాసన చూచిన పిమ్మట నీవు వారి ఎదుట నిలువజాలవు కదా!


రెండు బాహువులతో పోరాడిన ఇంద్రునిముందు ఒక్కబాహువుతో పోరాడిన వృత్రాసురుడు నిలువజాలనట్లు వారిద్దరితో యుద్ధములో నీవు నిలువజాలవు. అచిరకాలములో నా భర్తయైన రాముడు లక్ష్మణునితో కలసి వచ్చి, చాల తక్కువగా ఉన్న జలమును సూర్యుడు ఎండింపచేసినట్లు, బాణములతో నీ ప్రాణములను తీసివేయగలడు. 


నీవు నశించు కాలము సమీపించినది. మహావృక్షము తనపై పడుచున్న పిడుగును ఏవిధముగా తప్పించుకొనకజాలదో, అట్లే నీవు, క్రైలాసపర్వతమునకు పారిపోయినను, కుబేరుని అలకాపురికి వెళ్ళినను, రాజైన వరుణుని సభకు పారిపోయినను రాముని నుండి తప్పించుకొనజాలవు.

 *అశోకవనంలో సీత* (9/10)


పుల్లెల శ్రీరామచంద్రుడు వారి వచన రామాయణము సుందరకాండము నుండి….


*రాక్షసస్త్రీలను గమనిస్తున్న హనుమ*

రావణునిచేత ప్రేరేపింపబడిన ఆ రాక్షసస్త్రీలు, సీత మాటలు విని కోపముతో నిండినవారై, పరుషములైన మాటలతో ఆమెను భయపెట్టిరి. హనుమంతుడు ఏమీ మాటలాడకుండా ఆ శింశుపావృక్షము పైననే దాగి ఉండి, సీతను భయపెట్టుచున్న రాక్షసస్రీల మాటలు వినుచుండెను.

ఆ రాక్షసప్రీలు వణకిపోవుచున్న సీతను నలుమూలల చుట్టుముట్టి వ్రేలాడుచున్న ఎల్జిని తమ పెదవులను నాకుచు, సీతను చంవీ తినివేయుద మన్నట్లు సూచించుచుండిరి. వాళ్ళు చాలా కోపముతో వెంటనే, గండ్రగొడ్డళ్లు చేతులతో ధరించి, “ఈమె రాక్షసరాజైన రావణునకు భార్య అగుటకు తగదు.” అనిరి. 


భయంకరమైన ఆ రాక్షసస్త్రీలు భయపెట్టుచుండగా సుందరమైన ముఖము గల సీత, కన్నీళ్ళు కార్చుచు అచటనుండి దూరముగా పోయి ఆ శింశుపావృక్షము వైపు వెళ్ళిను. పిమ్మట విశాలాక్షియైన ఆ సీత శింశుపావృక్షమును చేరి, అక్కడ కూడ రాక్షసస్రీలు చుట్టుముట్టగా, దుఃఖాక్రాంతయై నిలచెను. కృశించి, దీనమైన ముఖముతో, మలినమైన వస్త్రములను ధరించి ఉన్న ఆ సీతను ఆ రాక్షసస్తీలు చుట్టుచేరి భయపెట్టిరి. 

పిమ్మట, చూచువారికి భయము కలిగించు వినత యను రాక్షసి ఇట్లు పలిను. ఆమె దేహము వంకరటింకరగా ఉండెను. ఆమె కోపముతో నిండియుండెను. ఆమె పొట్ట లోతుకుపోయి ఉండెను. 

“సీతా! నీ భర్తపై నీ వింతవరకూ చూపించిన ప్రేమ చాలును. ఏ విషయమునందైనను అతిగా చేసినదో అది కష్టాలకు దారితీయును. ఒక మనుష్యస్తీ చేయవలసిన ధర్మమును నిర్వర్తించినావు. చాలా సంతోషము! నీకు క్షేమమగుగాక. నేను చెప్పుచున్న హితవాక్యమును కూడ విని, అట్లు ఆచరించుము. సకలరాక్షసులకు ప్రభువైన రావణుని భర్తగా పొందుము. అతడు పరాక్రమవంతుడు; సౌందర్యవంతుడు; దేవతల అధిపతియైన దేవేంద్రుని వంటివాడు. నేర్పు కలవాడు. త్యాగశీలము కలవాడు. చూచేవారందరికి ఆనందము కలిగించువాడు. 


మానవుడూ, దీనుడూ అయిన రాముణ్ణి విడిచి పెట్టి రావణుని ఆశ్రయించుము. నేటినుండి దివ్యములైన అంగరాగములను(మైపూతలను) శరీరమునకు పూసికొని శ్రేష్టములైన అలంకారములు అలంకరించుకొని సకలలోకములకు ప్రభువు అగుము. అగ్నిదేవుని భార్యయైన స్వాహాదేవివలె, ఇంద్రుని భార్యయైన శచీదేవివలె లోకాధీశు రాలవు అగుము. దీనుడైన రామునితో నీకేమి ప్రయోజనమున్నది? అతని ఆయుర్దాయము తీరిపోయినది. నేను చెప్పినట్లు నీవు చేయకపోయినచో, మేమందరమూ కలసి ఈ క్షణంలోనే నిన్ను చంపి తినివేసెదము.”


వ్రేలాడుచున్నస్తనములు గల వికట అను మరొక రాక్షసి, కోపముతో పిడికిలి ఎత్తి గర్జించుచు సీతతో, “చాలా చెడ్డబుద్దీ గల సీతా! నీవు చాల అప్రియముగా పలికిన ఎన్నోమాటలు, నీపై జాలివలన మెత్తదనము చూపి సహించినాము. కాలానుగుణముగా మేము చెప్పిన హితవాక్యములను నీవు వినుటలేదు. ఇతరులెవ్వరూ చేరలేని సముద్రము ఇవతలి ఒడ్డుకు తీసికొని వచ్చి నిన్ను భయంకరమైన రావణాంతపురములో ఉంచినారు. రావణుని గృహములో బద్దురాలవై మేము జాగర్తగా రక్షించుచున్న నిన్ను రక్షించుటకు సాక్షాత్తు దేవేంద్రునికి కూడ శక్యము కాదు. 

సీతా! నేను చెప్పుచున్న హితవాక్యమును విని ఆ ప్రకారము చేయుము. కన్నీళ్ళు కార్చకుము. వ్యర్ధమైన దుఃఖమును విడిచిపెట్టుము. ప్రేమతోను, సంతోషముతోను ఉంటూ, ఈ నిత్యదైన్యమును విడిచిపెట్టుము. రావణునితో సుఖముగా ్రీడించుము. స్ర్తీల యౌవనము స్థిరము కాదను విషయము నీకు తెలియును కదా! నీ యౌవనము గడచిపోవుటకు ముందుగానే సుఖము అనుభవింపుము. 

నీవు రావణునితో కలసి, రమ్యములైన ఉద్యానములలోనూ, పర్వతములపైనా, వాటి దగ్గరనున్న వనములలోను హాయిగా విహరించుము. సకల రాక్షసులకు ప్రభువైన రావణుని భర్తగా అంగీకరించుము. అట్లు చేసినచో ఏడువేలమంది స్రీలు నీ చెప్పుచేతలలో ఉండగలరు. నీవు నా మాట ప్రకారము చేయకపోయినచో నీ గుండెను చీల్చి తినివేసెదను.” అని పలికెను. 


పిదప, చందోదరి అను రాక్షసస్త్రీ చాలా కోపముతో పెద్ద శూలమును త్రిప్పుచు ఇట్లు పలికెను. 

“ఈ సీతను రావణుడు అపహరించి తీసికొని వచ్చినప్పుడు ఈమెను చూడగానే నాకొక కోరిక కలిగినది. ఈమె గుండెకాయ దగ్గర ఉండు యకృత్తు, ప్లీహము, ఉత్పీదము అను మాంసములను, బంధనముతో (గుండెకాయను పట్టి ఉంచునది) సహా గుండెకాయను, పేగులను, శిరస్సును తినవలె నని నాకు కోరిక ఉన్నది.” 


పిమ్మట ప్రఘస అను రాక్ష, “క్రూరురాలైన ఈ సీత కంఠము నులిమివేసెదము. ఎందుకు ఈ విధంగా ఊరక కూర్చుండడము? పిదప “ ఆ మనుష్యస్తీ మరణించినది” అని రాజుకు చెప్పెదము. “మీరు తినివెయ్యండి” అని అతడు తప్పక చెప్పగలడు” అని పలికెను.


పిమ్మట అజాముఖి అను మరొక రాక్షసి, “ఈమెను చంపివేసి సమానములైన మాంనఖండములను చెయ్యండి. తరువాత మనమందరము సమముగా పంచుకొనెదము. ఎక్కువ తక్కువ అని వివాదము నాకు ఇష్టములేదు. వెంటనే మద్యము, అనేక విధములైన లేహ్యపదార్థములు తీనికొనిరండు” అని పలికెను. 


పిదప శూర్చణఖ అను రాక్షసి, “అజాముఖి చెప్పినట్లే చేయుట నాకు కూడా ఇష్టము. సకలశోకములను నశింపచేయు మద్యము కూడ వెంటనే తీసికొనిరండు. మనుష్యమాంసము తిని, పిమ్మట, నికుంభిలాప్రీత్యర్థమైన నృత్యము చేసెదము.” అని పలికెను.

భయంకరములైన రాక్షసస్త్రీలు ఈ విధముగా భయ పెట్టుచుండగా దేవకన్యతో సమానురాలైన ఆ సీత, ధైర్యము కోల్పోయి ఏడ్చుచుండెను. 


*త్రిజటాస్వప్నము*

ఆ రాక్షసస్తీలు ఆ విధముగా భయపెట్టుచుండగా చూచి, అంతవరకూ నిద్రించిన త్రిజట అనే ఒక వృద్ధరాక్షసి వాళ్ళతో, “ఓ! దుష్టలారా! మీరు భక్షించవలసినది జనకుని ప్రియపుత్రికా, దశరథుని కోడలూ అయిన సీతను కాదు, మిమ్ములను మీరు భక్షించుడు. ఇప్పుడే నాకొక భయంకరము, రోమాంచము పుట్టించునదీ అయిన స్వప్నము వచ్చినది. అది రాక్షసుల వినాశమును, ఈమె భర్త అభ్యుదయమును సూచించుచున్నది.” అని పలికెను. 

(కోధముతో నిండి ఉన్నఆ రాక్షసప్రీలందరూ త్రిజట మాటలు విని, భయపడుచు ఆమెను “నీవు రాత్రి ఎట్టి స్వప్నమును చూచితివో చెప్పుము.” అని అడగగా త్రిజట తనకు ఆ సమయమునందు(ఉషఃకాలమునందు) వచ్చిన స్వప్నమును గూర్చి చెప్పెను.


“లక్ష్మణసహితుడైన రాముడు, తెల్లని మాలలు, వస్త్రములు ధరించి, వెయ్యి హంసలు మోయగా ఆకాశమునందు సంచరించుచున్ను ఏనుగు దంతములతో నిర్మించిన పల్లకిని ఎక్కి వచ్చినాడు. 


సీత కూడ తెల్లని వస్త్రములు ధరించి, చుట్టూ సముద్రమున్న తెల్లని పర్వతముమీద ఉన్నట్లుగా నాకిప్పుడు స్వప్నములో కనబడినది. కాంతి సూర్యునితో కలిసినట్లు, సీత రామునితో కలిసెను. మరల రాముడు నాలుగు దంతాలు ఉన్న పర్వతము వంటి మహాగజమునెక్కి లక్ష్మణునితో కూడి సంచరించుచున్నట్లు నాకు కనబడెను. 

పిమ్మట ఆ నరశ్రేష్టులైన రామలక్ష్మణులు తమ కాంతితో ప్రకాశించుచు, తెల్లని మాలలను వస్త్రములను ధరించి జానకి దగ్గరకు వచ్చినట్లుగా నాకు కనబడిరి. పిమ్మట జానకి ఆ పర్వతాగ్రమునందు, ఆకాశమునందున్న ఆ గజమును రాముడు నిలుపగా, దానిమూపు పైకి ఎక్కెను.


అటుపిమ్మట, కమలముల వంటి నేత్రములు గల సీత, భర్త అంకమునుండి పైకి లేచి, చేతితో చంద్రసూర్యులను తుడుచుచున్నట్లు నాకు కనబడినది. అటు పిమ్మట, రామలక్ష్మణులు, విశాలాక్షియైన సీతా ఎక్కి ఉన్న ఆ మహాగజము లంక పైభాగమునందు నిలచెను. రాముడు, భార్యయైన సీతతో, తెల్లని ఎనిమిది వృషభములు కట్టిన రథముతో ఇక్కడికి స్వయముగా వచ్చినాడు. 


పరాక్రమవంతుడు, పురుషశ్రేష్టుడు అయిన ఆ రాముడు సోదరుడైన లక్ష్మణునితోను, సీతతోను కలసి, సూర్యుడు వలె ప్రకాశించుచున్న, దివ్యమైన పుష్పకవిమానము ఎక్కి ఉత్తరదిక్కువైపు వెళ్ళెను. విష్ణువుతో సమానమైన పరాక్రమము గల ఆ రాముని, అతని సోదరుడైన లక్ష్మణుని, సీతను నేను ఈ విధముగా స్వప్నములో చూచితిని. 


పాపాత్ములు స్వర్గము నేవిధముగా జయించలేరో, అదే విధముగ సురులుగాని, అసురులుగాని, రాక్షసులుగాని మహాతేజశ్ళాలియైన రాముని జయించజాలరు. 

రావణుడు ఎర్రని వస్త్రములు, ఎర్రని కరవీరపుష్పముల మాలలు ధరించి, శరీరమునకు తైలము పూసికొని, తైలము త్రాగుచు, మత్తుడై నేలపై పడినట్లు నాకు కనబడినాడు. ముండితమైన శిరస్సుతో, నల్లని వస్త్రములు ధరించిన రావణుడు పుష్పకవిమానము నుండి పడిపోయినట్టు, అతనిని ఒక ప్రీ ఈడ్చుచున్నట్లు నాకు మరల కనబడెను. రావణుడు ఎట్టిని మాలలు ధరించి, ఎల్టిని మైపూత పూసికొని తైలము త్రాగుచు, భాంతి చెందిన చిత్తముతో, వ్యాకులములైన ఇంద్రియములతో నవ్వుచు, నృత్యము చేయుచు, గాడిదలు కట్టిన రథము ఎక్కి వెళ్ళెను. 


రావణుడు గాడిదను ఎక్కి దక్షిణపు దిక్కువైపు వెళ్ళిపోయెను. రాక్షసరాజైన రావణుడు భయముతో దిక్కుతోచక, ఆ గాడిదమీదనుంచి తల క్రిందుగా నేలపై పడినట్లు మరల నాకు కనబడినాడు. ఆ రావణుడు వెంటనే లేచి, కంగారుపడుచు, భయమచే పీడితుదై, మదముతో వ్యాకులుడై, దిగంబరుదై, పిచ్చివానివలె ఏమేమో చాలా చెడ్డమాటలు పలుకుచు సహింపరాని దుర్గంధముతో భయంకరమైన, అంధకారబంధురమైన నరకము వంటి మలపంకమును ప్రవేశించి దానిలో మునిగిపోయెను. 

ఎర్రని వస్త్రములు ధరించి, శరీరమంతా బురద పూసికొని ఉన్న ఒక నల్లని ప్రీ రావణుని మెడకు త్రాడు కట్టి దక్షిణము వైపు ఈడ్చుచుందెను. నిశాచరుదైన కుంభకర్ణుడు కూడా నాకు స్వప్నములో ఇట్లే కనబడినాడు. రావణుని కుమారు లందరు తైలము పూసికొని ఉండిరి. వరాహము నెక్కి రావణుడు, మొసలినెక్కి ఇంద్రజిత్తు, ఒంటెను ఎక్కి కుంభకర్ణుడు దక్షిణదిక్కు వైపు వెళ్ళినారు. 


వారిలో ఒక్కవిభీషణడు మాత్రము తెల్లని మాలలను, వస్త్రములను ధరించి, తెల్లని మంచి గంధము పూసికొని, శ్వేతచ్చత్రము ధరించి నాకు కనబడెను. 

ఆ విభిషణుడు, శంఖదుందుభుల ధ్వనులు, నృత్తములు, గీతములు మొదలైనవి చుట్టూ జరుగుచుండగా, ఉరుము వంటి ధ్వని గల పర్వతము వంటి నాలుగు దంతాల ఏనుగును ఎక్కినలుగురు మంత్రులతో కలిసి ఆకాశము మీద ఉండెను. 

రాక్షసు లందరూ గుమిగూడి, నూనె త్రాగుచు, ఎర్రని మాలలు, వస్త్రములు ధరించి వాద్యాలు వాయించుచు, పాటలు పాడుచూ ఉన్నట్లు నేను చూచితిని. రమ్యమైన ఈ లంకాపట్టణములోని గోపురములూ, ముఖద్వారములూ భగన్నములైపోయి నట్లూ, అశ్వములతోను గజములతోను సహా ఈ లంక సముద్రములో మునిగిపోయినట్లూ నాకు కనబడినది. రావణుడు రక్షించుచున్న ఈ లంకాపట్టణమును రాముని దూత, మహావేగవంతుడూ అయిన ఒక వానరుడు కాల్చివేసినట్లు నేను స్వప్నము చూచితిని. 


లంక అంతా బూడిదతో నిండి ఉండెను. దానిలోని స్త్రీలందరూ తైలము త్రాగుచు, మహాధ్వనితో అట్టహాసములు చేయుచు వెర్రిగా గంతులు వేయుచుండిరి. కుంభకర్ణాదిరాక్షశ్రేష్టు లందరూ ఎర్రని వస్త్రములు ధరించి, పేడతో నిండిన గోతులలో ముగినిపోయిరి. మీరు తొలగిపొండి; చావండి; రాముడు సీతను పొందుట తథ్యము. అతడు తన భార్యను పీడించినా రనే కోపముతో, రాక్షసులతోపాటు మిమ్ములను కూడా చంపించివేయును. 


సీత రామునకు అతిప్రియురాలు, బహుమానపాత్రురాలు అయిన భార్య. అతనిని అనుసరించి వచ్చి వనవాసవ్రతమును అవలంబించిన సాధ్వి. అట్టి భార్యను ఎవరైన భయపెట్టినా, దూషించినా రాముడు సహించదు. అందుచేత సీతతో పరుషవాక్యములు పలుకవద్దు. మంచిమాటలే చెప్పండి. సీతను బ్రతిమాలుకుందాము. నాకు ఇదే ఇష్టము. ఎవ్వరైన స్తీ కష్టాలలో ఉన్నప్పుడు ఈ విధమైన స్వప్నము వచ్చినచో, ఆమె సర్వదుఃఖములనుండి విముక్తురాలై, అత్యుత్తమమైన ప్రియమును పొందును. 

రాక్షసస్రీలలారా! ఇంకా ఏమేమో చెప్పి ప్రయోజనము లేదు. ఇంతవరకు ఈమెను భయపెట్టినాము. ఇపుడింక ఈమెను బ్రతిమాలుకొనుట మంచిది. రాక్షసులకు రామునినుండి గొప్ప ఆపద వచ్చిపడినది. జనకాత్మజయైన సీతకు నమస్కరించి అనుగ్రహింపచేసుకొన్నచో ఈమె మనలను మహాభయము నుండి రక్షించగలదు. 


*మంచిశకునాలు*

విశాలాక్షియైన ఈ సీత అవయవములలో, అంతము లేని దుఃఖమును సూచించు చెడ్డ లక్షణము, అతి సూక్ష్మమైనది కూడ, ఏదీ నాకు కనబడుటలేదు. ఈమె శరీరకాంతిలో మాత్రము కొంత లోపమును చూచుచున్నాను. అందుచేతనే విమానమును ఎక్కిన(భోగము లనుభవించవలసిన) దుఃఖము లనుభవించకూదని సీతకు దుఃఖము కలిగినదని తలచుచున్నాను. సీతకు కార్యసిద్ధి త్వరలోనే కలుగునట్లు కనుపించుచున్నది. రావణుని వినాశమూ, రాముని విజయమూ కూడా దగ్గరలోనే ఉన్నట్లు కనబడుచున్నది. 

ఈమె గొప్ప ప్రియవార్తను విననున్నది అను విషయమునకు సూచకముగా, పద్మపత్రము వలె ఆయతమైన ఈ నేత్రము(సీత ఎడమకన్ను) అదురుచున్నది. సాధుస్వభావము గల ఈ సీత ఎడమ భుజము హటాత్తుగా పొంగినదై, కొంచెము అదరుచున్నది. ఏనుగు తొండముతో సమానము, శ్రేష్టము అయిన ఈ సీత ఎడమ తొడ అదురుచున్నది. రాముడు దగ్గరనే ఉన్నాడని ఇది సూచించుచున్నది. 

ఒక పక్షి కొమ్మపై ఉన్న గూటిలో కూర్చుండి, మాటిమాటికి ఊరడింపుమాటలు పలుకుచు, చాలా ఉత్సాహముతో కూడినదై, స్వాగతవచనములు పలుకుచు, “రాముడు రానున్నాడు” అని సీతకు చెప్పుచున్నట్లున్నది.


ఇక ఆ సీత రాక్షసరాజైన రావణుని అప్రియములైన మాటలు విని, దుఃఖముతో బాధపడుచు,(లేదా రాముడు లేకపోవుటచేత బాధపడుచు) వనమధ్యమునందు సింహముచేత ఆక్రమించపబడిన చిన్న ఆడ ఏనుగు వలె భయపదెను. రాక్షసస్రీల మధ్య ఉన్న భయస్వభావము గల ఆ సీత రావణుడు కూడ మాటలతో అధికముగా భయపెట్టుటచేత, విజనమైన అటవీమధ్యములో ఒంటరిగా విడిచి పెట్టబడిన, బాలయైన కన్యవలె విలపించెను.

“పాపాత్మురాల నైన నేను ఈ విధముగ వీళ్ళందరూ భయ పెట్టుచున్నా దీనురాలనై, క్షణము పాటైనను జీవించుచున్నాను. అనగా, అకాలమునందు మరణము రాదు అని సత్పురుషులు లోకములో చెప్పు మాట సత్యమే! ఎట్టి సుఖమూ లేక, అత్యధికమైన దుఃఖముతో నిండిన ఈ నా హృదయము నిజముగా చాల గట్టిది. అందుచేతనే వజముతో కొట్టబిడిన పర్వతశిఖరమువలె ఇప్పుడు కూడా ఇది వెయ్యిముక్కలుగా బ్రద్దలగుట లేదు.


ఈ విషయములో నా దోషమేమీ లేకుండగానే చూచుటకు అప్రియుదైన ఆ రావణుడు నన్ను చంపనున్నాడు. ద్విజుడు, ద్విజుడు కాని వానికి మంత్రమును ఏ విధముగా ఇవ్వజాలడో, నేను అదే విధముగా వీనికి నా మనస్సును ఇవ్వజాలను. లోకములకు ప్రభువైన రాముడు రాకున్నచో, చెద్దవాడైన ఈ రావణుడు శస్త్రచికిత్సకుడు గర్భములో ఉన్న శిశువును ఛేదించినట్లు, నా అవయవములను వాడియైన శస్తములలో తప్పక ఛేదించును. రాజు విషయములో చేసిన అపరాధమునకు బద్దుదై తెల్లవారుజామున చంపవలసియున్న దొంగకువలె దుఃఖితురాలనైన నాకు ఇచ్చిన రెండు మాసములు గడువు ఆలస్యముగా గడచును. అయ్యో! ఎంత కష్టము వచ్చిపడినది!

అయ్యో! రామా! అయ్యో! లక్ష్మణా! అయ్యో! సుమిత్రా! అయ్యో కౌసల్యా! అయ్యో! నాతల్లీ! దుర్భాగ్యవంతురాలనైన నేను మహాసముద్రములో గాలిచేత ఎటు వెళ్తుటకూ వీలులేని ఓడ వలె, నశించుచున్నాను. ఆ ప్రాణి ఎవరో మృగరూపమును ధరించి మహాబలశాలులైన ఆ రామలక్ష్మణులను, పిడుగు శ్రేష్టములైన రెండు సింహములను చంపివేసినట్లు, నా మూలమున చంపివేసినది. సందేహము లేదు. 


నిజముగా ఆనాడు కాలవురుషుడుమృగము రూపములో వచ్చి దురదృష్టవంతురాలనైన నన్ను లోభపెట్టినాడు. అందుచేతనే నేను తెలివితక్కువతనముచే ఆర్యపుత్రునీ, లక్ష్మణునీ కూడ దూరముగా పంపివేసితిని. సత్యవ్రతుడవూ, దీర్హములైన బాహువులు కలవాడవు అయిన ఓ రామా! చంద్రుని వంటి ముఖము గలవాదా! అయ్యో! ప్రాణిలోకానికి పాతము చేయువాడవు, ప్రియుడవూ అయిన నీకు, నేను రాక్షసుల చేతిలో చిక్కి వధ్యురాలనుగా ఉన్నా నని తెలియదు కదా!


మనుష్యులు కృతఘ్నులకు చేసిన ఉపకారము ఎట్టు వ్యర్థమైపోవునో, అట్లే, నేను భర్తను తప్ప మరి ఏ దేవుని పూజించకుండుట, ఈ ఓర్పు, నేల మీద శయనించుట, ధర్మనియమము, పతివ్రతాత్వము - ఇవి అన్నీ వ్యద్ధమైపోయినవి. నీకు దూరమై, నిన్ను చూడజాలక, నిన్ను కలుసుకొందుననే ఆశకూడా లేక, చిక్కి సౌందర్యము చెడి ఉన్ననేను చేసిన ఈ ధర్మమంతా వ్యర్థమైనది! ఈ పతివ్రతాత్వము కూడ నిష్ప్రయోజనము!


నీవు ఆజ్జను నియమపూర్వకముగా పాలించి, సత్యవ్రతమును ఆచరించి, వనమునుండి అయోధ్యకు తిరిగి వెళ్ళినవాడవై, కృతార్థుడవై, ఎట్టి భయములు లేక, విశాలములైన నేత్రములు గల స్త్రీలతో విహరించగల వని అనుకొనుచున్నాను. నీయం దనురక్తురాల నగు నేను నాశనము కొరకే నీపై చిరకాలము మనసు నిలిపి, వ్యర్థముగా తపము, ఏకపత్నీవ్రతము చేసి జీవితము విడచిపెట్టెదను. ఛీ ఛీ నేనెంత దురదృష్టవంతురాలను.

 *అశోకవనంలో సీత* (10/10)


పుల్లెల శ్రీరామచంద్రుడు వారి వచన రామాయణము సుందరకాండము నుండి….


*సీతప్రాణత్యాగానికి సిద్దపడుట*

అట్టి నేను విషముచేతగాని, శస్తముచేతగాని శీఘ్రముగా నా జీవితము విడచెదను. రాక్షసుని ఇంటిలో నాకు విషముగాని శస్త్రము గాని ఎవ్వడూ ఇవ్వడు గదా!

సీత ఇట్లు అనేకవిధములుగా విలపించి, సర్వవిధాల రామునే స్మరించుచు, వణకిపోవుచున్నదై, ఎండిపోయిన ముఖముతో పుప్పించిన ఆ ఉత్తమవృక్షము దగ్గరకు వెళ్ళెను. శోకముతో బాధపడుచున్న సీత ఇట్లు అనేకవిధముల ఆలోచించి ఉరిత్రాడు వలె ఉన్న జడను చేతితో పట్టుకొని- “నేను జడను ఉరిపోసికొని, శీఘ్రముగా యమలోకమునకు వెళ్ళెదను.” అని నిర్ణయించుకొనెను.

మృదువైన సకలావయవములు గల ఆ సీత ఆ వృక్షశాఖను గ్రహించి నిలిచెను. రాముని,లక్ష్మణుని తన కులమును గూర్చి ఆలోచించుచున్న, శుభమైన

అవయవములు గల ఆ సీతకు ధైర్యమును కలిగించు అనేకములైన శుభశకునములు కనబడెను. శోకమును తొలగించేవి, అత్యుత్తమములుగా లోకములో ప్రసిద్ధములూ అయిన ఆ శకునములు పూర్వము కూడ అనేక పర్యాయములు కనబడి సఫలము లయ్యెను. 


వ్యథ చెంది, సంతోషము లేక దీనమైన మనస్సుతో ఉన్న దోషములేక శూన్యయైన, మంగళప్రదురాలైన ఆ సీతను, ఐశ్వర్యము లభించిన మనుష్యుని భృత్యు లందరూ వచ్చి చేరినట్లు, శుభశకునములు వచ్చి చేరినవి. (సీతకు శుభశకునములు కనబడినవి) అందమైన కేశములు గల ఆ సీత వామనయనము వంకరగా ఉన్నరెప్పల వెండ్రుకల పంక్తితో, శుభకరమై, విశాలముగాను, నల్లగాను, తెల్లగాను ఉండెను. ఆ వామనయనము తాకిడికి, మీనము ఎర్రని పద్మమొకటి కదలినట్లు అదరెను. 

సీతాదేవి ఎదమభుజము చక్కగా, చూచుటకు ముచ్చటగొల్పుచు బలసి, వృత్తముగా(గుండ్రముగా) ఉండెను. అది శ్రేష్టమైన అగురువు, చందనము పూసికొనుటకు తగినది. చాలకాలము ఆ భుజమును తలగడగా చేసికొని అత్యుత్తమపురుషుడైన రాముడు శయనించుచుందెడివాడు. అట్టి భుజముకూడ వెంటనే అదరెను. దగ్గరగా కలసి ఉన్న ఆమె రెండు తొడలలో ఒక ఎడమతొడ అదురుచు రాముడు ఎదుటనే ఉన్నాడని ఆమెకు చెప్పెను. సుందరమైన ఆ తొడ ఏనుగు వలె బలసిఉందెను. నిర్మలమైన నేత్రములు, కొనలు తేలిన దంతములు, అందమైన శరీరమూ గల ఆ సీత నిలచి ఉండగా, మంగళప్రదమూ, బంగారముతో సమానమైన రంగు గలదీ, పరాగము కప్పివేయుటచే కొంచెము కాంతి విహీనముగా ఉన్నదీ అయిన వస్త్రము కొంచెము జారెను. 

పూర్వము కూడ అనేక పర్యాయములు ఈ శకునములు శుభము రానున్నదని సూచించుటచే, మంచి కనుబొమ్మలు గల సీత, గాలికి ఎండకూ ఎండిపోయి, కనబడకుండా పోయిన విత్తనము వర్షము కురియగానే మొలకెత్తి నట్లు ఆనందించెను. దొండపండు వంటి అధరోష్టమూ, అందమైన నేత్రములు, కనుబొమ్మలు, కేశాంతములూ, వంకరయెన రెప్పలూ, తెల్లని అందమైన దంతములూ గల ఆమె ముఖము, రాహుముఖము నుండి బైటకు వచ్చిన చంద్రబింబము వలి, ప్రకాశించెను. 


పూజ్యురాలైన ఆ సీతకు శోకము తొలగెను. అలసత్వము పోయెను. మానసికసంతాపము శాంతించెను. సంతోషముతో మనస్సు వికసించెను. అప్పుడామె తేజోవంతమైన ముఖముతో, శుక్షపక్షమునందు ఉదయించిన చంద్రునితో రాత్రి ప్రకాశించునట్లు ప్రకాశించెను. 


*హనుమ ఆలోచనలు*

పరాక్రమశాలియైన హనుమంతుడు కూడా, సీత మాటలను, త్రిజట స్వప్పవృత్తాంతమును, రాక్షస స్త్రీలు భయపెట్టుచు పలికిన మాటలను, సర్వమును, యథాతథముగా వినెను. 

పిమ్మట అతడు నందనవనములో ఉన్న దేవతాస్రీ వలె ఉన్న ఆ సీతాదేవిని చూచుచు, అనేకవిధముల ఆలోచించెను. 

“ఎన్నో వేలకొలది, అయుతముల కొలది(పదివేలు =అయుతము) వానరులు సకలదిక్కులందు ఏ సీతకై వెదకుచున్నారో ఆమెను నేను చూడగలిగినాను. నేను శత్రుబలమును దృష్టిలో ఉంచుకొని అతిజాగరూకతతో, గూఢముగా, గూఢచారివలె సంచరించుచు ఈ విషయము లన్నీ తెలుసుకొన్నాను. రాక్షసుల విశేషమును, ఈ పురమును, రాక్షసాధిపతియైన రావణుని ప్రభావమును చూచినాను. 

సకలప్రాణులందు దయ గల, ఊహింపశక్యము కాని ప్రభావము గల రాముని భార్య పతిదర్శనమునకై తల్లడిల్లుచున్నది. ఈమెను ఓదార్చుట యుక్తము.


పూర్ణచంద్రుని వంటి ముఖము గల ఈ సీత పూర్వమెన్నడునూ ఇట్టి దుఃఖము లనుభవించలేదు. ఇపుడు దుఃఖార్తురాలై ఈ దుఃఖమునకు అంతము చూడజాలకున్నది. అట్టి ఈమెను ఓదార్చెదను. 

ఈమె శోకముచేత వికలమైన మనస్సుతో బాధపడుచున్నప్పుడు కూడ నేను ఈమెను ఓదార్భకుందా తిరిగివెళ్ళినచో నా గమనము పొరబాటే అగును. నేను తిరిగి వెళ్ళిపోయిన పిమ్మట రాజకుమారి, కీర్తిమంతురాలు అయిన సీత, రక్షశోపాయ మేదీ లభించక ప్రాణత్యాగము చేయవచ్చును. 

మహాబాహువు అయిన రాముడు సీతను చూడవలె నని చాల ఆసక్తితో ఉన్నాడు. అట్టి రాముని ఓదార్చుట కూడ నా కర్తవ్యము. రాక్షసస్రీల ఎదుట మాటలాడుట యుక్తము కాదు. ఇప్పుడు ఈ పని నేనెట్లు చేయవలెనో కదా! నేను కష్టపరిస్థితిలో చిక్కుకొన్నాను. తెల్లవారేలోగా నేను ఈమెను ఓదార్చకున్నచో తప్పక ఈమె ప్రాణములను త్యజించును. సందేహము లేదు. 

నేను ఈమెతో మాటలాడకుందనే వెళ్ళిన పిమ్మట - “సీత నాతో ఏమి చెప్పమన్నది” అని రాముడు అడిగినచో నే నాతనికి ఏమి సమాధానము చెప్పగలను? నేను సీత సందేశమేదీ తీసికొనకుండా, ఇక్కడినుంచి తొందరగా వెళ్ళిపోయినచో రాముడు కోపించి తీవ్రమైన దృష్టితో నన్ను కాల్చివేయును గూడ. రామునికి సాహాయ్యము చేయుటకై నేను సుగ్రీవుని, బయలుదేరతీసి తీసుకొనివచ్చినచో, ఈ లోగా సీత మరణించినచో సేనాసపితుడైన అతని రాక వ్యర్థమై పోవును. 

నేను ఇక్కడనే ఉండి, ఈ రాక్షసప్రీలు కొంచెము ఏమరుపాటుతో ఉన్నప్పుడు చాలా దుఃఖపడుచున్న ఈ సీతను మెల్లగా ఓదార్చెదను. 


ఇప్పుడు చాలా చిన్న శరీరముతో ఉన్ననేను, విశేషించి వానరుడనై యుండి మనుష్యవాక్కును ఉచ్చరించవలసి ఉన్నది. నేను ద్విజుడు వలె స౦స్కృతమైన భాషలో మాటలాడినచో నన్ను రావణు డని తలచి సీత భయపడును. విశేషించి, వానరుడు మాటలాడుట అనునది అసంభావ్యము కదా! స్పష్టమైన అర్ధమును బోధించు మనుష్యవాక్కులోనే మాటలాడుట తప్పదు. అట్లు కానిచో, దోషరహితురాలైన ఈ సీతను ఓదార్చుట ఎట్లు కుదురును?


నారూపమును చూచి, నా భాషను వినగానే అసలే ఇంతవరకు రాక్షసులచేత భయపెట్టబడుచున్న సీత మరల ఇంకా భయపడును. పిదప ఈ విశాలాక్షి నన్ను ఇచ్చానుసారముగా రూపములు ధరించగలిగిన రావణుడే అని భావించి, భయపడి అరవవచ్చును. సీత భయపడి అరవగానే, యముని వలె భయంకరమైన రాక్షసప్రీల సముదాయము, అనేకవిధములైన ఆయుధములు ధరించి గుమిగూడి వచ్చును. 

వికృతములైన ముఖములు గల ఆ రాక్షసస్రీలు, నన్ను నలుమూలల నుండి చుట్టుముట్టి, పట్టుకొనుటకూ, చంపుటకూ వారి బలమునంతా ప్రయోగించి ప్రయత్నము చేయుదురు. అపుడు నేను వాళ్ళకు దొరకకుండా మహవావృక్షముల కొమ్మలూ, చిన్న కొమ్మలూ, (మూనులూ పట్టుకొని ఇటు అటు పరుగెత్తుచుండగా చూచి వాళ్ళకు భయము, శంకా కలుగును. నేను వనములో తిరుగుచున్నప్పుడు, నాపెద్ద ఆకారమును చూచి వికృతముఖములు గల ఈ రాక్షసస్రీలు భయపడుదురు. 


పిమ్మట రావణుని గృహములో అతనిచేత నియుక్తులై ఉన్న రాక్షసులను కూడ పిలచెదరు. అప్పుడు ఆ రాక్షసులు, భయావేశముతో, శీఘ్రముగా, శూలములు, శక్తులు, ఖద్గములు మొదలైన ఆయుధములు ధరించి యుద్ధమునకు దిగుదురు. వాళ్ళందరూ నలుమూలలా చుట్టుముట్టగా ఆ రాక్షస సైన్యమును సంహరించుచు నేను సముద్రము ఆవలి ఒడ్డును చేరజాలకపోవచ్చును. 

లేదా ఆ రాక్షసులలో చాలా చురుకైనవాళ్ళు కొంతమంది, నామీద దుమికి, నన్ను పట్టుకొనవచ్చును. అప్పుడు సీతకు నేను వచ్చిన విషయమే తెలియకుందా పోవును. నేనా పట్టుబడిపోవుదును. లేదా, హింసాప్రియులైన ఈ రాక్షసులు సీతను చంపివేయవచ్చును. అట్లు జరిగినచో రామసుగ్రీవుల ఈ కార్యము చెడిపోవును. 


జానకి రహస్యమైన ప్రదేశములో నివసించుచున్నది. ఇక్కడికి చేరుటకు దారులు లేవు. దీని చుట్టూ సముద్ర మున్నది. రాక్షసులు అన్ని మూలలా నిలచి రక్షించుచున్నారు. యుద్ధములో నన్ను రాక్షసులు చంపివేసినా, బంధించినా, ఈ లంకకు వచ్చి సీతాన్వేషణకార్యమునందు రామునకు సాహాయ్యము చేసేవాడు మరొక దెవ్వడూ నాకు కనదిడుటలేదు. నన్ను వీళ్ళు చంపివేసినచో, శతయోజనవిస్తీర్ణమైన ఈ మహాసముద్రమును లంఘింపగల వానరు డెవ్వడూ, ఎంత ఆలోచించినా, నాకు కనబడుటలేదు. 

వేలకొలది రాక్షసులను కూడ చంపుటకు తగిన సామర్ధ్యము నాకున్నది.


నిజమే! కాని అంత యుద్ధము చేసిన పిమ్మట మహాసముద్రము ఆవతలి ఒడ్డుకు చేరు సామర్ధ్యము నాకు ఉండకపోవచ్చును. యుద్ధములో జయాపజయములు అనిశ్చితములు. నాకు సంశయము ఇష్టము కాదు. బుద్ధిమంతు డెవడైనా సంశయము లేని పనిని సంశయాస్పదము చేయునా? 

నేను సీతతో మాటలాదకుండా వెళ్ళిపోయినచో సీత ప్రాణత్యాగము చేయవచ్చును. సీతతో మాటలాడినచో నాకు ఈ విధముగా ఆపద సంభవించవచ్చును. 


ఫలోన్ముఖముగా ఉన్న కార్యములు కూడ వివేకశూన్యుడైన దూత చేతిలో పడి, సూర్యోదయము కాగానే తమస్సు తొలగినట్లు నశించును. ఏది లాభకరమో, ఏది నష్టమును కలిగించునో నిర్ణయించుకొన్న కార్యమునందు కూడ, వివేకహీనులైన దూతలను నియమించినచో ఆ కార్యములు సఫలములు కావు. 

ఎందుచేతననగా, పండితుల మను దురభిమానము గల దూతలు కార్యములను చెడగొట్టుదురు. ఇప్పుడు నే నేవిధముగా ప్రవర్తించినచో కార్యము చెడిపోకుండా ఉండును? బుద్ధికి వ్యాకులత్వము కలుగకుండా ఉండును? నేను చేసిన ఈ సముద్రలంఘనము వ్యర్థము కాకూడదన్నచో నేనేమి చేయవలెను? సీత నా మాటలు విని భయపడకుండా ఉండుటకు ఉపాయమేమి?” బుద్ధిమంతుదైన వానుమంతుడు ఈ విధముగా ఆలోచించి తానేమి చేయవలెనో నిశ్చయించుకొనెను. 


*రామనామ స్మరణ*

“సీత మనస్సు అత్యుత్తమబంధు వైన రామునియందే లగ్నమై ఉన్నది. శ్రమపడకుండా పనులను చేయగల సమర్ధుడూ, ఉత్తమబంధువూ అయిన రాముణ్ణిగూర్చి కీర్తించినచో ఈమె భయపడకుండా ఉండును. ఇక్ష్వాకువంశరాజులలో శ్రేష్టుడు, ప్రసిద్ధమైన బుద్దికలవాడూ అయిన రామునకు సంబంధించి, మంగళప్రదములైన వచనములు పలుకుచు మధురముగా మాటలాడుచు, రామాదుల అన్ని కార్యములను ఈమెకు వినిపించెదను. ఈమెకు బాగా నమ్మకము కలుగునట్లు చేసెదను. ”

గొప్ప ప్రభావము గల ఆ హనుమంతుడు ఇట్లు ఆలోచించి చెట్టు కొమ్మల మధ్య దాగియుండి, సీతను చూచుచు మధురములు, వ్యర్థము కానివి, అనేక విధములు అయిన మాటలు సీతకు వినబడునట్లుగా మధురమైన వాక్యమును పలికెను. 


*రామకధాగానము*

“ఇక్షాకువంశీయులలో గొప్ప యశస్సు గల, పుణ్యస్వభావవంతుడైన దశరథుడనే రాజు ఉండెను. అతడు రథగజాశ్వసైన్యములతో మహాబలశాలియై గొప్ప కీర్తి కలవాడై ఉండెను. అతడు గుణములచేత రాజర్నులందరిలోను శ్రేష్టుడు. తపస్సుచేత బుషులతో సమానుడు. చక్రవర్తుల కులమునందు పుట్టినవాడు. బలములో దేవేంద్రునితో సమానుడు. అహింసాపరుడు. నీచస్వభావము లేనివాడు. దయాశీలుడు. సత్యమైన పరాక్రమము గలవాడు. ఇక్షాకువంశములో చాలా ప్రధానమైనవాడు. ఐశ్వర్యసంపన్నుడు. ఐశ్వర్యమును పెంపొందించువాడు. ఉత్తమ రాజలక్షణములు కలవాడు. రాజులలో శ్రేష్టుడు. నాలుగు సముద్రముల వరకు వ్యాపించిన భూమిలో ప్రసిద్ధుడు. తాను సుఖపడుచు ఇతరులను కూడ సుఖపెట్టువాడు. 


ఆ దశరథునకు ప్రియుడైన రాము డను పేరు గల జ్యేష్టపుత్రుడు ఉన్నాడు. అతడు చంద్రుని వంటి ముఖముగలవాడు. మానవులలోను, ఇతర వస్తువులలోను ఉన్న విశేషము గుర్తించ సమర్దుడు. ధనుర్ధరు లందరిలో శ్రేష్టుడు. శత్రువులను పీడించు ఆ రాముడు తన నడవడికలో ఎట్టిలోపములూ లేకుండా రక్షించుకొనుచుండెను. తన వాళ్ళను, సకలజీవలోకమును, సకలధర్మములను రక్షించువాడు. 


సత్యమైన సంకల్పము గలవాడు, తన తండ్రీ, వృద్ధుడూ అయిన ఆ దశరథమహారాజు ఆజ్జచేత వీరుడైన ఆ రాముడు భార్యతోను, సోదరునితోను అరణ్యమునకు ప్రవాసము వెళ్ళిను. ఆ అరణ్యములో వేటాడు సందర్భములో అతడు శూరులూ, స్వేచ్చారూపధారులూ అయిన చాలా మంది రాక్షసులను సంహరించెను. 

పిమ్మట, రావణుడు జనస్థానములోని రాక్షసుల వధను, ఖరదూషణుల వధను విని, కోపముతో మాయామృగరూపము చేత అరణ్యములో రాముని వంచించి జానకిని అపహరించెను. 


రాముడు ఎట్టి దోషములూ లేని ఆ సీతాదేవిని వెదకుచు, అరణ్యములో సుగ్రీవుడనే వానరునితో మైత్రి చేసికొనెను. పిమ్మట, శత్రుపురములను జయించు, మహాబలుడైన ఆ రాముడు వాలిని చంపి ఆ వానరరాజ్యమును సుగ్రీవునకు ఇచ్చెను.


సుగ్రీవుడు ఆజ్ఞాపించి పంపగా, స్వేచ్చారూపధరణసమర్ధులైన వేలకొలది వానరులు ఆ సీతాదేవికొరకై అన్ని దిక్కులందు వెదకుచున్నారు. సంపాతి మాటలచే, సీత ఇక్కడ నున్నదని తెలుసుకుని నేను, ఈమెకొరకై మహావేగముతో నూరు యోజనములు పొడవైన సముద్రమును దాటితిని. రాముడు ఆ సీతకు ఎట్టిరూపము, ఎట్టివర్దము, ఎట్టిగుర్తులు ఉన్నట్లు చెప్పెనో అట్టి రూప-వర్జ-చిహ్నములతోనే ఇపుడు నే నీమెను కనుగొన్నాను.”


*సీత చూసింది హనుమను*

హనుమంతుడు ఈ మాటలు పలికి ఊరకుండెను. ఈ మాటలు వినగానే సీత చాలా ఆశ్చర్యపడెను. 

దుఃఖముచేత కప్పబడిన చైతన్యము(ఆలోచనాశక్తి) గలది, వంకరగా ఉన్న కేశాంతములు గలది, భయస్వభావురాలూ అయిన ఆ సీత, ముఖమునెత్తి ఆ శింశుపావృక్షమువైపు చూచెను. హనుమంతుని మాటలు విన్న సీత దిక్కులు, విదిక్కులు చూచుచు, మనస్సులో సర్వవిధములా రాముణ్ణే స్మరించుచు, చాల సంతోషించెను. ప్రక్కలకూ, పైకి, క్రిందకి చూచుచు, ఊహింప శక్యముకాని బుద్ధిబలము కలవాడూ, సుగ్రీవుని అమాత్యుడూ, వాయుకుమారుడూ, ఉదయాచలముపై నున్న సూర్యునివలె ఉన్న హనుమంతుని చూచెను. 

🙏

కామెంట్‌లు లేవు: