14, జులై 2023, శుక్రవారం

_జగమెల్ల తనికెళ్ళ.

 *_జగమెల్ల తనికెళ్ళ..!_*


***********************


ఇంటర్ వరకు 

కలం పట్టనివాడు..

అటు తర్వాత 

కలకలం రేపాడు..!


రైల్వే కళాశాలలో

ఇతర వ్యాసంగాల 

'అద్దె కొంప'లో 

కాలం వెళ్ళబుచ్చినోడు 

'అగ్గిపుల్ల ఆత్మహత్య' తో

సాహిత్య నిత్య జైత్రయాత్రకు

శ్రీకారం చుట్టి..

రచనలతో ప్రపంచాన్ని చుట్టబెట్టి..

రాస్తూ రాస్తూ బాలగ్రహణం అధిగమించి..

ప్రాణం పెట్టి రాసిన 

'గోగ్రహణం' తో 

సాహితీ ఉన్నత శిఖరం

అకాడమీ అవార్డును 

చేపట్టి..పట్టుబట్టి 

వెండితెరను మెట్టి

ఆ తెరపై 

జిలుగుల తారగా

వెలుగులు పంచుతున్న

భరణి..అక్షరాల ఆమని..

ఆ అక్షరాలనే 

లక్షణంగా మెచ్చింది అవని..!


భరణి..

వీధినాటకాలకు పేరని..

అందుకు 

బాదల్ సర్కార్ ప్రేరణని..

ఆ ఏకలవ్య శిక్షణే

'పెద్దబాలశిక్ష'ని..

ఆ పరంపరలో 

కొక్కొరోకో..గొయ్యి..

విలన్ పాత్రల్లో

అందె వేసిన చెయ్యి..!


రాళ్ళపల్లితో చెలిమి

ఇచ్చింది నాటకాల కలిమి..

వంశీకి నేస్తమై 

లేడీస్ టైలర్ పోలీసై..

శివలో పైలాపచ్చీసై..

జనం మెచ్చిన భాసై..

తెలంగాణ యాసై..

ప్రతి సినిమా సెభాసై..!


నేపాలీ మాంత్రికుడి తంత్రాన్నే తిప్పికొట్టిన 

నాటి తోటరాముడు..

యముడు తిప్పితిప్పి కొట్టిన

నిన్నటి తోటరాముడు..

చెల్లికి జరగాలి పెళ్లి 

మళ్లీ మళ్లీ..

కవిత ప్రచురణ కాగానే

అంతటి రచయితా 

మురిసిపోలేదా తుళ్లీతుళ్ళీ..!

హైదరాబాద్ నీకు..

సికిందరాబాద్ నాకు..

ఇలా మురిసిపోతే

ఎలా డిసైడ్ అయిపోయిందో

తనికెళ్ళ కెరీరు..

పెద్ద పెద్దోళ్ళే తకరారు..

జాతకమే తారుమారు..

వెలిగిపోతూ మారుమారు..!


నాలోన శివుడు కలడు..

నీలోన శివుడు కలడు..

సర్వేశ్వరుడే సర్వస్వమై..

తాదాత్మ్యతే త్వమేవాహమై

భక్తి నిలువెల్లా ఆవాహమై..

పాటలు ప్రవాహమై..

మురిసిపోతూ భరణి..

మెరిసిపోతూ ధరణి..!

***********************

తోటరాముడు 

తనికెళ్ళ భరణికి

జన్మదిన శుభాకాంక్షలతో..


    *_ఎలిశెట్టి సురేష్ కుమార్_*

        విజయనగరం

       9948546286

కామెంట్‌లు లేవు: