28, జులై 2023, శుక్రవారం

గయా క్షేత్రం

 🕉 మన గుడి : 




⚜ బీహార్ : గయ


⚜ గయా క్షేత్రం



💠మన దేశంలో అత్యంత పుణ్యప్రదమైన తీర్థ క్షేత్రాలలో 'గయ' ఒకటి. 

ఈ పవిత్ర స్థలంలో కాలు పెడితేనే సమస్త పాపాలు పటాపంచలై సద్గతులు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.

వేదాల్లోనూ, పురాణాలలోను గయకు విశేషమైన ప్రాధాన్యం ఉంది. సమస్త దేవతలు ఈ క్షేత్రాన్ని పరమ మోక్షదాయకంగా తీర్థ క్షేత్రంగా భావించారు. 


💠 “గయ' తీర్దం సకల తీర్ధాలకి ప్రాణప్రదమైందని వేదాలు, పురాణాలు చెబుతున్నాయి. 

పల్గూ నది పశ్చిమ తీరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం, అత్యంత పవిత్రమైనదిగా విరాజిల్లుతోంది. పల్గూనదిని విష్ణుమూర్తి జలరూపంగా భావిస్తారు. మోక్ష సాధనకు గయ తీరానికి మించింది లేదు. ఇతర మోక్ష మార్గాలకన్నా గయ పిండదానానికి ఎన్నో విశిష్టతలున్నాయి.


💠 విష్ణుపాదోద్భవం పల్గూనది. గయాసురుడి శరీర క్షేత్రమే గయాతీర్థం ఈ క్షేతం ఇంతలా ప్రాచుర్యం పొందడానికి, ఇంత మహిమాన్వితం పొందడానికి ఓ పురాణగాథ

ప్రచారంలో ఉంది.


⚜ పురాణగాథ ⚜


💠 పూర్వం గయాసురుడనే రాక్షసుడు ఇక్కడ శ్రీమహావిష్ణువు గురించి ఘోర తపస్సు చేశాడు. గయాసురుడి భక్తికి, అతని తపసుుకు మెచ్చిన శ్రీమహావిష్ణువు ఇక్కడ ఈ క్షేతంలో అవతరించాడు. 

ఎవరైతే ఇక్కడ తర్పణ చేస్తారో, ఎవరైతే

పిండదానం చేస్తారో వారి పితృదేవతలంతా మోక్షం పొందుతారని, వైకుంఠం చేరుకుంటారని గయాసురునికి శ్రీమహావిష్టువు వరమిచ్చాడు. 


💠 అలాగే బ్రహ్మదేవుడు స్వయంగా ఇక్కడ యజ్ఞ వేదిక ఏర్పాటుచేసుకుని తపస్సు చేశాడు. ఆ కారణంగా ఈ క్షేతం మరింత పవిత్రత నొందింది. 

బ్రహ్మదేవుడు ఇక్కడ యజ్ఞం చేయడం వల్ల, అప్పటినుంచి ఈ క్షేత్రం త్రిమూర్తులతోపాటు సమస్త దేవతలకు నిలయంగా భాసిస్తోంది. 

శ్రాద్ద కర్మలకు అత్వంత పవిత్రమైన క్షేతంగా కొనియాడబడుతున్న ఈ క్షేత్రంలో బహ్మదేవుడు కృతయుగంలో తొలుత ఇక్కడ పిండ ప్రదానం చేశాడని ఒక కథ ఉంది. 


💠 అలాగే పిండ ప్రదానానికి సంబంధించి మరో పురాణగాథ కూడా ప్రచారంలో ఉంది.

 శ్రీ రాముడు అరణ్యవాసం చేస్తుండగా ఆయన తండ్రి దశరథ మహారాజు మరణించాడు. తన జ్యేష్ట పుత్రుడైన శ్రీరాముని చేత పిండ ప్రదానం అందుకుంటాను అని దశరథుడు శ్రీరాముడికి కలలో కనిపించి చెబుతాడు.

 

💠 ఈ నేపధ్యంలో శ్రీరాముడు ఇక్కడ తన తండ్రి దశరథునికి పిండ ప్రధానం చేస్తాడు. అదే సర్వ ప్రథమ పిండ ప్రధానమని భావిస్తారు.


💠 పిండప్రదానానికి ముందు స్నానమాచరించడానికి శ్రీ రాముడు వెళ్ళిన సమయంలో మహారాజైన దశరథుని హస్తాలు రెండు సీతముందు కనిపించి తాను చాలా ఆకలిగా ఉన్నానని రామునికి బదులుగా పిండం ప్రదానం చెయ్యమని సీతను అడుగగా సీతాదేవి పిండములు తీసి ఆచేతులలో ఉంచింది. శ్రీరాముడు తిరిగి వచ్చి యధావిధిగా పిండములు ప్రదానము చేసే సమయములో అతని తండ్రి ఆ పిండాలను స్వీకరించక పోయినప్పుడు శ్రీరాముడు ఆశ్చర్యానికి గురికావడమే కాక బాధపడ్డాడు. 


💠 సీతాదేవి జరిగిన ఉదంతం వివరించి , శ్రీరాముడు నమ్మటంలేదు అని సాక్ష్యానికి ఫలగు నదిని, సమీపంలో నిలిచియున్న బ్రాహ్మణుని, ఆవుని, రావిచెట్టుని, తులసిమొక్కని పిలిచింది. 

రావిచెట్టు తప్ప మిగిలిన వారు సాక్ష్యం చెప్పలేదు. 

ఆవు శ్రీ రామునికి భయపడి, ఫల్గూ నది శ్రీరాముని నుండి అధిక వరాలు పొందడానికి, 

బ్రాహ్మణుడు శ్రీరాముని నుండి అధిక దక్షిణ పొందాలని నిజం చెప్పలేదు.

తులసి మొక్క కూడా మనకి ఎందుకులే

అని ఊరుకొని నిజం చెప్పలేదు.


💠 సీతాదేవి ఆ నలుగురిని శపించిందని పురాణకథనం వివరిస్తుంది.

ఫాల్గు నది ఇంకిపోతుంది అని, 

ఆవు ముందు నుండి ఎప్పటికీ నివాళులర్పించబడదని, 

గయలోని బ్రాహ్మణులు ఎప్పుడూ సంతోషంగా ఉండరని - వారు ఎల్లప్పుడూ ఆహారం కోసం ఆరాటపడుతారని మరియు గయలో ఇకపై తులసి మొక్కలు పండించబడవని చెప్పి వారిలో నలుగురిని శపించింది. 


💠 శాపకారణంగా ఫల్గూనదిలో నీరు ఇంకి పోయింది.

నిజం చెప్పిన రావిచెట్టును మాత్రం శాశ్వతంగా జీవించమని వరమిచ్చింది.

 ఈ రావిచెట్టు ఆకులు ఎప్పుడూ రాలవని ఎప్పుడూ పచ్చగానే ఉంటాయని ఇక్కడివారు చెప్తున్నారు. అక్షయ వృక్షం అంటే ఎప్పటికీ క్షయం పొందని వృక్షం అని అర్ధం. కరువు సమయంలో కూడా ఈ వృక్షం పచ్చగా ఉంటుంది.


💠 వేదభూమి అయిన గయాక్షేత్రం హిందువులకు బౌద్ధులకు గొప్ప పవిత్రమైన యత్రాస్థలం.గయాక్షేత్రం నందు పితృదేవతలకు శ్రాద్ధవిధులను నిర్వర్తించి పిండప్రదానం చేస్తే పితృఋణాన్ని తీర్చుకుని ఇహపర సాధనలో మోక్షం పొందుతారని గట్టి నమ్మకం. 

వారణాసిలో మొదలైన శ్రాద్ధవిధులు గయా శ్రాద్ధవిధులతో పూర్తి అవుతుంది. 


💠 గయ క్షేత్రం పితృగయగా మరియు బుద్ధగయగా రెండు భాగాలుగా ఉంటుంది. 

హిందువుల పురాతన ఆలయాలకు పితృగయ ప్రసిద్ధి. బుద్ధ ఆశ్రమాలు, బౌద్ధ ఆలయాలకు బుద్ధగయ ప్రసిద్ధి. శ్రీమంగళగౌరి మహాశక్తిపీఠం గయాక్షేత్రం నందు కలదు. 


💠 పవిత్రమైన మంగళగౌరి ఆలయం సతీదేవి ఛాతీ భాగం పడిన ప్రదేశమని విశ్వసించబడుతుంది.

నదీతీరంలో చాలా ప్రసిద్ధిచెందిన విష్ణుపద్ ఆలయం ఉంది. 

అక్కడ విష్ణుపాద ముద్రలు ఉంటాయి. 

గయాసురుని చాతి మీద శ్రీ మహావిష్ణువు పాదము ఉంచిన ప్రదేశం ఇదే.



💠 రైలు మార్గం: దగ్గరగా ఉన్న రైల్వే స్టేషన్ గయా.

కామెంట్‌లు లేవు: