28, జులై 2023, శుక్రవారం

శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయ చరిత్ర:

 *నిత్యాన్వేషణ:*


శ్రీ చాళుక్య కుమారరామ శ్రీ భీమేశ్వర స్వామి దేవాలయ చరిత్ర:




ఈ దేవాలయం సామర్లకోట అనే పట్టణం (కాకినాడ కు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది) లో ఉంది.. రైల్వే స్టేషన్ కి బాగా దగ్గర.. చుట్టూ పచ్చటి పంటపొలాలు, గోదావరి జలాలతో చాలా ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా ఉంటుంది ఈ చాళుక్య కుమార భీమేశ్వర స్వామి వారి దేవాలయం..

భీమేశ్వర స్వామి వారి దేవాలయం పంచారామాల్లో ఒకటి.. చరిత్ర గురించి చెప్పాలంటే స్థానికంగా తెలిసిన కథనాల ప్రకారం చూస్తే....  ఆ గుడి పేరు చాళుక్య రాజయిన భీముడు నిర్మించాడని క్షేత్ర కథనంలో వివరించబడింది. మీరు సరిగ్గా గమనిస్తే ద్రాక్షారామం భీమేశ్వరాలయం నిర్మాణం, శిల్పాలు, శైలి కూడా సామర్లకోట మాదిరే ఉంటుంది, అందుకు కారణం రెండిటినీ నిర్మించిన రాజు ఈ భీముడు గారే..


ఈ మందిరం నిర్మాణం శా.శ. 892 లో ప్రారంభమై సుమారు శా.శ. 922 వరకు సాగింది. ఆలయం నిర్మాణం చాలా చక్కని శిల్ప కళ కలిగి ఇప్పటికీ పగుళ్ళు లేకుండా ఉంది. ఇక్కడి శివలింగం తెల్లని రంగులో ఉంది. 1340-1466 మధ్యకాలంలో రాజ్యం చేసిన కాకతీయులు ఈ మందిరాన్ని కొంత పునర్మిర్మించారు.


ఇక్కడ కాకతీయుల నాటి శిల్ప కళను, అంతకు పూర్వపు తూర్పు చాళుక్యులనాటి శిల్ప కళను తేలికగా గుర్తించవచ్చును. ఇక్కడి అమ్మవారు బాలాత్రిపురసుందరి. శివుడు కాలభైరవుని రూపంలో కూడా ఉన్నాడు. 1147 - 1494 మధ్యకాలంలో ఆలయానికి సమర్పించిన విరాళాల గురించిన శాసనాలున్నాయి. తెలుగు భాషకి సంబంధించిన అత్యంత ప్రాచీన శిలాశాసనాలలో ఇది ఒకటిగా భావిస్తున్నారు.


ఇక ఆధ్యాత్మిక పరంగా చుస్తే సామర్లకోట పరమశివుని పంచ ముఖాల్లో ఒకటైన వామదేవ ముఖానికి సంబంధించిన క్షేత్రం.. కుమారస్వామి ప్రతిష్టించిన వామదేవ స్వరూపుడు కనుక కుమార భీమేశ్వరుడుగా పూజలందుకుంటున్నాడు శివయ్య..ఇది యోగలింగం.. శివలింగం ఎత్తు 14 అడుగులు, ఇప్పటికీ పెరుగుతూనే ఉంది, కనుక శిరస్సు పైన శీల కొట్టారు అని చెప్తారు.. దేవాలయం అత్యంత పురాతనమైనది కనుక భారత పురావస్తు శాఖ వారి అధీనంలో ఉంది..


సామర్లకోట, ద్రాక్షారామం దేవస్థానాల్లో శివుడికి పాలతో అభిషేకం చేయరు, ఎందుకంటే అక్కడి లింగాలకి పాల వల్ల కొంచెం నష్టం జరుగుతుంది.. సామర్లకోట క్షేత్రం రైల్వే జంక్షన్ కూడా కనుక, అన్ని ప్రధాన రైళ్ళు ఈ మార్గంలో ఆగుతాయి, మీకు వీలైతే సందర్శించండి..

కామెంట్‌లు లేవు: