7, ఆగస్టు 2023, సోమవారం

శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -11🌹*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹*🌹

శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర -11🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


*ఆదుకున్న ఆవుదూడలు:*


అందము చిందే ఆవు రూపము ధరించాడు బ్రహ్మదేవుడు. సొగసులు మెరిపించే దూడ రూపము ధరించాడు శంకరుడు.


 లక్ష్మీదేవి సరేసరి! అచ్చు గొల్లభామగా మారిపోయినది. 


చంద్రగిరిని చోళరాజు పాలిస్తుండేవాడు. ఆ చోళరాజు చెంతకు ఆ యావునూ దూడనూ తోలుకొని గొల్లభామ రూపము ధరించిన లక్ష్మీదేవి వెడలినది. 


చోళరాజునకూ, ఆయన భార్యకూ వానిని చూపించినది. సర్వశుభ లక్షణాలతో విలసిల్లి పుష్టిగా ఉత్సహంగానున్న యావుదూడలను చూచి చూడడముతోనే వారికి అవి నచ్చినవి. గొల్లభామ వద్ద వాటిని కొన్నారు. 


భలే ‘మంచి బేరము’ అనుట తోడనే గొల్లభామ మెల్లమెల్లగా తన దారిన తాను వెడలిపోయినది.


 చోళరాజు భార్యకు ఒక క్రొత్త కోరిక చిగురించింది. భర్తతో అన్నది గదా! ‘‘నాథా మన ఆవులమందలో ననేకము లయిన ఆవులున్నవి. కాని ఈ ఆవుపాలే ప్రతిదినము పోయబడునట్లుగా మీరు చూడవలెను. చూడవలెనను మాట ఏల చేయవలెను’’ 


భర్త దాని కిష్టపడి పశువుల కాపరిని పిలచి ‘‘ఓయీ! నీవు ఈ గోవును కన్నులందు బెట్టుకొని కాపాడుచూ దీని పోషణ, రక్షణ మున్నగునవి చూచుచుండవలెను. 


జాగ్రత్తగా దీనిని పెంచడమే కాదు. ప్రతిదినము దీని పాలను జాగ్రత్తగా పితుకుతూ మాకిచ్చుచుండవలెను’’యనెను. 


సరేయని బుర్రనూపెను గోపాలుడు. తన మందకు నాటి నుండి దానిని జోడించి మేతకు తోలుకొనిపోవుట, తీసుకొని వచ్చుట చేయుచుండెను. అతడు ప్రతిదినము మందను శేషాచలమునకే తోలుకువెళ్ళుచుండెడివాడు. 


మిగిలిన పశువులు మేతను మేయుచుండగా, క్రొత్తగా వచ్చిన ఆవు మేత మేయుచుండెడిది కాదు. నిజమునకది పశువు కాదు కదా! మందతో పాటు వెళ్ళినప్పటికిన్నీ, 


రహస్యముగా ఆ యావుపోయి శ్రీమహావిష్ణువు తలదాచుకొనిన పుట్టను చేరుచుండెడిది. చేరి ఆ పుట్టలో క్షీరధారలను కురిపించి, అప్పుడు మాత్రము తిరిగివచ్చి మందలో కలిసిపోయేది. 


దూడ దానికెంతో సంతోషించెడిది. దినదినమూ ఆ యావుదూడలు కలసి వెడలెడివి. పుట్టలో పోయబడిన పాలను ఆవురావుమంటూ యాకలితోనున్న శ్రీమహావిష్ణువు త్రాగుచుండెను, 


ఈ విధముగా రోజూ జరుగుచుండెను. 


ఆ యావు పుట్టలో క్షీరధారలు తన పొదుగు నుండి అదుపులేకుండగా పోయుచునేయుండెను. కాని అందువలన చోళరాజుగారి బిడ్డకు పాలు కఱువగుచుండెను. 


ఇంటిలో పాలిచ్చిన గదా బిడ్డపోషణ. పాలు లభించని సంగతిని గ్రహించి చోళరాజు భార్య కోపాలు పెంచుకొని గోపాలుని పిలిపించింది.


 కమలదళాక్ష గోవిందా, కామిత ఫలదా గోవిందా; పాపవినాశక గోవిందా, పాహిమురారే గోవిందా; | 


 గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా.||11|| 


*శ్రీవేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం.🙏*


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: