7, ఆగస్టు 2023, సోమవారం

పీఠాధిపతులు

 పీఠాధిపతులు.. వారిని... భక్తులను ఎందుకు తాకనివ్వరు.....


ఈమధ్య చాలా మందికి నన్ను ఈ ప్రశ్న అడిగారు...


అసలు ఈ పీఠాలు, మఠాలు గురించి మనకు పూర్తి అవగాహన ఉందా.. అక్కడ పీఠాలకు సంరక్షుకులుగా ఉండే ఈ పీఠాధిపతులకు ఉన్న నియమ నిబంధనలు ఏమిటో మనకు తెలుసా.. పూర్తిగా వివరాలు తెలియకుండా వారి మీద ఎగబడి పోయి వాళ్ళను ఇబ్బంది పెట్టడం భావ్యమా.. వారి నిబంధనలు చెబితే ఎక్కడలేని మానవహక్కులు గుర్తుకొస్తాయే.. వాళ్లకు వాళ్ళ నియమపాలన ఉండదా.. వాళ్లకు ఎలా ఉండాలో అనే హక్కు వారికి లేదా..


అంతవరకు ఎందుకు.. ఎందుకు కొరగాని తైతక్కలాడే సినిమా స్టార్ల దగ్గరకు మిమ్మల్ని రానిస్తారా..? వాళ్ళను ముట్టుకోలేదని మీలో ఎవరైనా గోల పెడతారా..? అక్కడొక రూలు ఇక్కడొక రూలా..? వారికి వీరికి అసలు సాపత్యమే లేదు కానీ జనాల మధ్యకు వచ్చారు కాబట్టి ఈ ప్రస్తావన వచ్చింది. అసలు ఈ పీఠ నిబంధనలు, పీఠాధిపతుల వ్యవహారాల గురించి కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నించి అప్పుడు ఆలోచన చేయండి.


"భారతీ విజయం" అన్న పుస్తకంలో దక్షిణామ్నాయ శ్రీ శారదా పీఠాధిపతి, జీవన్ముక్తులు అయిన శ్రీ శ్రీ శ్రీ భారతీతీర్థ స్వామీ వారి దైనందిన దినచర్య గురించి వివరణ ఉంటుంది. ఉదయాన్నే స్వామీ వారు నాలుగు గంటలకు లేచి స్నాన సంధ్యాదులు ఆచరించి, జపతపాదులు ఆచరించి 8 గంటలకు అనుష్టానం చేసుకుని శ్రీ చంద్ర మౌళీశ్వరుని పూజ చేసుకుని గురువుల అధిష్టానాలు దర్శించుకుని వచ్చి విద్యార్థులకు పాఠం చెప్పి మఠ వ్యవహారాలూ సమీక్షించి 11 గంటలకు భక్తులకు దర్శనం అనుగ్రహించి వారి సమస్యలకు సలహాలు ఇచ్చి భక్తుల పాదపూజలు, భిక్ష స్వీకరించి తిరిగి 1 గంటకు మరల స్నానం చేసి మాధ్యాహ్నిక అనుష్టానం చేసుకుని భిక్ష స్వీకరించి సాయంత్రం 4:30 వరకు విద్వంశులతో శాస్త్రచర్చలు జరిపి అటుపై కార్యదర్శి తెచ్చిన ఉత్తరాలు పరిశీలించి వాటికి సమాధానాలు చెప్పి సాయంత్రం 5:30 నుండి 6:30 వరకు తిరిగి భక్తులకు దర్శనం ఇచ్చి మరల స్నానం, అనుష్టానం అటుపై 8:30 నుండి 10 వరకు శ్రీ చంద్రమౌళీశ్వర పూజ, 11:30 వరకు శాస్త్రగ్రంథావలోకనం చేసి విశ్రమిస్తారు, మరల మరునాడు 4 గంటలకు లేవడం. అక్కడ నుండి తదుపరి దినచర్య మల్లి మాములె..


ఇంత ఒత్తిడి మామూలు వాళ్ళు తట్టుకోగలరా.. ఇంక పర్వదినాలలో మరింత ఒత్తిడి.


అటువంటి శక్తివంతమైన అనుష్టానాలు చేసుకునే స్వాములు విజయ యాత్రలు చేస్తుంటే మరింత ఒత్తిడికి గురవుతూ ఉంటారు. వాటిని తట్టుకుని నిత్యం దైవనామస్మరణతో ఆత్మానుసంధానం చేస్తూ నడుస్తూ ఉంటారు. వారు నడిచే ధర్మస్వరూపాలు. అటువంటి శక్తిని కలిగి నడుస్తున్న వారిని తాకాలంటే మనకు అంత శక్తి ఉండాలి, లేదంటే మనకే కష్టం. అందునా వారి అనుష్టానం చేసుకునేటప్పుడు ఒక మడి, ఒక శౌచం, ఒక నియమం ఇలా ఎన్నో ఉంటాయి. మరి.. మనము ఎంత శౌచం పాటిస్తున్నాము..?


ఉదాహరణకు.. మనం బయట తిరిగేటప్పుడు ఎందరినో తాకుతూ తిరుగుతున్నాము ఎవరికి ఎటువంటి శౌచాలున్నాయో ఏమేమి ముట్లు ఉన్నాయో, మనకు తెలియదు, అటువంటి వాళ్ళం మనం వెళ్లి వారిని తాకడం వలన వారు తమ బస చేరుకున్నప్పుడు ప్రాయశ్చిత్తాలు చేసుకుని తిరిగి ఎన్నో అనుష్టానాలు చెయ్య వలసి వస్తుంది. వారిని అంత బాధ పెట్టడం మనకు భావ్యమా..? వారికి దూరంగానే సాష్టాంగ పడి వారి అనుగ్రహం పొందాలి. వారి పాదాలకు ప్రతినిధులుగా వారి పాదరక్షలు అక్కడ ఉంచితే వాటిని తాకి అనుగ్రహం పొందవచ్చు.


పీఠాధిపతులు నడిచే ధర్మ ప్రతినిధులు. ప్రతీ రోజూ జరిగే గొడవల్లో వారెందుకు పట్టించుకోరు అని మరికొందరు అజ్ఞానుల అపోహ...


వారు చేస్తున్న ధర్మానుష్టానం వల్లనైనా ధర్మం నేడు కొంతైనా నిలుస్తోంది. వారు ఎందరో మెరికల్లాంటి ధర్మ రక్షకులను తయారు చేస్తూ ఉంటారు. జగత్తులో ఎవరికైనా ధర్మ సంకటం కలిగితే వారు వారి అనుమానాలు తీరుస్తూ ఉంటారు. నిత్యం జరిగే విషయాలను సరిదిద్దే వారెందరినో వారు తయారు చేస్తూ ఉంటారు.


వారి తపః శక్తి, వాక్శక్తి భక్తులను అనుగ్రహించడానికి ధారపోస్తూ ఉంటారు. రోజువారీ గొడవల్లో పడి ఉంటే మరి ధర్మం పాటించే వారికి అనుమాన నివృత్తి ఎవరు చేస్తూ ఉంటారు, ఎవరు తపస్సు చేస్తూ శాస్త్రాలను పరిశీలిస్తూ, ధార్మిక కార్యక్రమాలు చేస్తూ, తరువాతి తరానికి వేదం, వేదాంగాలు, పురాణేతిహాసాలలో రహస్యాలను విప్పి చెప్పేవారు ఇతర ధార్మిక వ్యవహారాల సంగతి ఎవరు చూస్తారు..?


కాబట్టి వారు ధర్మ రక్షణ కు కావలసిన రచన చేస్తూ శిష్యుల ద్వారా కాగల కార్యాన్ని చేయిస్తూ ఉంటారు. వారు స్వయంగా జీవన్ముక్తులైనా కేవలం ధర్మాన్ని అందరికీ అందజెయ్యడానికి, మోక్షార్థులకు దారి చూపడానికి మన మధ్య నడయాడుతున్నారు. వారు స్వయంగా ఆ దైవ ప్రతినిధులు. వారికి ఇవ్వవలసిన గౌరవం ఇచ్చి వారు చూపిన దారిలో నడవడం మన కర్తవ్యం.


ముఖ్య గమనిక: ఇవన్నీ కూడా సరైన గురుపరంపర ఉండి కొన్ని వేల సంవత్సరాల నుండి నడుస్తున్న గొప్ప పీఠాల గురించి, ఆయా పీఠ అనుబంధ పీఠాల గురించి. అంతే తప్ప స్వయం ప్రకటిత దొంగ స్వాములు, సొంత పీట వేసుకుని వాళ్ళు పీటాధిపతులని ప్రచారాలు చేసుకుంటూ జనాలను కౌగలించుకుని ముద్దులు పెట్టె మోసగాళ్లకు సంబంధించి కాదని మనవి...


|| ఓం నమః శివాయ ||

కామెంట్‌లు లేవు: