19, ఆగస్టు 2023, శనివారం

*🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 15*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 15*


నరేంద్రుని చదువు గూర్చి తెలుసుకొంటే అతడి జ్ఞాన పిపాస తీవ్రత మనం గ్రహించవచ్చు. ఆతడు ఎఫ్.ఏ. చదువుతున్నప్పుడే బి.ఏ. పాఠాలు చదివి పూర్తిచేశాడు. బి.ఏ. చదువుతున్నప్పుడు, అంతకు మించిన ప్రమాణ స్థాయిగల పుస్తకాలు చదివి ముగించాడు.


ఫ్రెంచ్ విప్లవం గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. యావజ్జీవితం ఆయనను ఆకట్టుకొన్న నాయకుడు నెపోలియన్. అతడి దళపతి 'నే' (Ney) కూడా నరేంద్రుణ్ణి అమితంగా ఆకర్షించాడు. 'నే' ఎలా నెపోలియన్ ఆజ్ఞలను నిక్షేపణీయంగా శిరసావహించాడో అట్టి నమ్రత, ఉన్నత లక్ష్యాల కోసం కృషిచేసేవారు ఎంతో ఆవశ్యకమని కాలాంతరంలో1 స్వామి వివేకానంద ఉద్ఘాటించేవారు.


కళాశాలలో చదువుకొంటున్న రోజుల్లోనే నరేంద్రుడు పాశ్చాత్య తత్వాలను లోతుగా అధ్యయనం చేశాడు.  వారందరు వెలిబుచ్చిన తత్వా లను నరేంద్రుడు స్పష్టంగా అవగతం చేసుకొన్నాడని రోమా రోలా సూచిస్తున్నాడు. 


పాశ్చాత్య తత్త్వవేత్తలలో హెర్బర్ట్ స్పెన్సర్ అభిప్రాయాలు నరేంద్రునికి బాగా నచ్చేవి. స్పెన్సర్ ప్రగాఢ అభిమాని అని నరేంద్రుణ్ణి పేర్కొనడం అతిశయోక్తి కాదేమో! ఆయన అభిప్రాయాలకు ముగ్ధుడైన నరేంద్రుడు 'విద్య' అనే గ్రంథాన్ని అనువదించాలనుకొన్నాడు. అందు నిమిత్తం అనుమతి కోరుతూ స్పెన్సర్ కు ఉత్తరం వ్రాశాడు. మనఃస్ఫూర్తిగా అనుమతినిస్తూ, అంత చిన్న వయసులో అంతటి తాత్విక చింతనలు సంతరించుకొన్న నరేంద్రుణ్ణి ప్రశంసించాడు. నరేంద్రుడు ఆ గ్రంథాన్ని కొంతమేరకు క్లుప్తీకరించి అనువదించాడు. ఆ పుస్తకం 'శిక్ష' పేరిట వంగభాషలో వెలువడింది. కాలాంతరంలో ఉపనిషత్తులు, వేదాంతంలోని క్లిష్టమైన తత్త్వాలను విపులీకరించడంలో స్పెన్సర్ తాత్త్విక తీరు తెన్నులను ఆయన చాలావరకు అనుసరించినట్లు గమనించవచ్చు.


 హామిల్టన్  మిల్ , లాక్ , ప్లేటో  ప్రభృతుల తత్త్వాలనూ నరేంద్రుడు ఇష్టపడి చదివాడు. హామిల్టన్ తన తత్వ గ్రంథం ముగింపులో, "మనిషి మేథస్సు భగవంతుని ఉనికి గురించి మాత్రమే చెప్పగలదు, దాని పని అంతటితో సరి. భగవంతుని స్వభావాన్ని వివరింపగల శక్తి దానికి లేదు. అందువలన ఇక్కడ తత్త్వాలు ఆగిపోతాయి. ఎక్కడ తత్త్వాలు అంతరిస్తాయో అక్కడ ఆధ్యాత్మికత ప్రారంభమవుతుంది" అని వచించాడు. హామిల్టన్ చివరి పంక్తులు నరేంద్రునికి బాగా నచ్చాయి. సంభాషణలు మధ్య ఆతడు దీనిని ఉదహరించడం కద్దు. ధ్యానంలో లీనమైపోతున్నప్పటికీ ఆతడు చదువును నిర్లక్ష్యం చేయలేదు. చదువు, ధ్యానం, సంగీతాలలో ఎక్కువ సమయం గడిపేవాడు.🙏


*సేకరణ:-  శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.* 

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: