21, ఆగస్టు 2023, సోమవారం

శంఖుడనే మహర్షి

 నిత్యాన్వేషణ:


శంఖుడనే మహర్షి అన్న తోటలో మామిడిపండు అడగకుండా తీసుకున్న పాపాన్ని ప్రక్షాళన చేసుకోవడానికి రాజుగారి దగ్గరకు వెళ్ళి దండన స్వీకరించాడనీ, రాజు విధిలేక చేతులు నరికివేసే దండన ఇచ్చాడనీ పురాణాల్లో ఉంది. ఒక్క పండు అడకుండా కోసుకుంటే ఇంతటి శిక్షా? అన్యాయం కాదా?

అంతరంగమందు అపరాధములు చేసి

మంచివాని వలెనె మనుజుడుండు

ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా ( విశ్వ..)

అనేది నేటి నీతి.. మనం చేసిన తప్పు మనకు బాగా తెలుసు. ఐనా , నేనేమీ చేయలేదు....అని బుకాయిస్తాం. అదేమీ పెద్ద తప్పు కాదులే అని మనకు మనమే సమర్థించు కొంటాం.

శంఖుడు , లిఖితుడు అని ఇద్దరు ముని కుమారులు. చెరొక ఆశ్రమంలో నివాసం..

ఒకనాడు లిఖితుడు అన్నను చూడ వచ్చాడు. సమయానికి ఆయన ఇంట్లో లేడు. ఆయన తోటలో మామిడి పండ్లు ఉన్నాయి. నాలుగైదు కోసుకొని తినివేశాడు

అన్నయ్య వచ్చాడు. ఈ టెంకలేమిటి ?.అన్నాడు. ఆకలిగా ఉంటే మీ చెట్టువే కోసి తినివేశాను. అని సమాధానం.

అన్నకు ధర్మాగ్రహం కలిగింది. పో .త్వరగా పో. రాజు తో చెప్పి తగిన దండన విధించుకోని , శుద్దుడవై త్వరగా రా ! అని పంపించి వేశాడు..

తమ్ముడూ రాజు దగ్గరకు చేరాడు. విప్రోత్తముడు వచ్చాడని ఆనందపడి పోయాడు. ఏమిచ్చి సేవ చేసుకోమంటారు?. అని వినయం చూపాడు రాజు. .. నేను చెప్పినట్టు చేయాలి. మాట ఇచ్చారు గదా! అన్నాడు లిఖితుడు.

జరిగిన సంగతి చెప్పి మా అన్న మీ శిక్షతో పావనుణ్ణయి రమ్మని ఆదేశించాడు. నాకు శిక్ష వేయడం మీ విధి. ..అన్నాడు.

రాజు తల్లడిల్లి పోయాడు. వేదవేత్తలు..మీకు నేను శిక్ష విధించడమేమిటి?. నన్ను క్షమించండి అన్నాడు రాజు.

మాట ప్రకారం శిక్ష వేయవలసిందే . నా పాపం ఇక్కడే పరిహారం అయి పోతుంది. అని బలవంతపెట్టాడు లిఖితుడు.

అందరికీ ఒకే శిక్ష. విజ్ఞుడికి అధిక శిక్ష. వెంటనే అమలు గొప్ప వరం. అంతటితో ఆ పీడ విరగడై ఇంక మనసును దహించదు. సత్కర్మల అనుభవానికి ఆ పాపం అడ్డు పడదు.

రాజు రెండు చేతులు ఖండించమని ఆదేశించాడు.

తెగిపోయిన చేతులతో ఆనందంగా అన్న దగ్గరకు పోయాడు.

. పోయి నదిలో పితృ తర్పణం చేసిరా.. వేళ అయింది..అన్నాడు శంఖుడు.

దగ్గర ఉన్న నదిలో స్నానం చేసి ,సభక్తికంగా అర్ఘ్యం ఇవ్వబోయాడు. చేతులు యథాప్రకారం సహకరించాయి.

పోయిన బాహువులు ఇచ్చి ఆ నదీ మతల్లి *బాహుద* అయింది.

పరుల సొత్తు( తనకు ) పాము వంటిది.. అనీ , పరద్రవ్యాణి లోష్ఠవత్ అనీ మన విశ్వాసం..( రాయితో సమానం. )

మనది కానిదాని పైన ఆశ కలగడం పతన హేతువు.

మనసెపుడూ నిర్మలంగా ఉండాలి.

శంఖుడు పరద్రవ్యం అనుమతి పొందకుండా తీసుకొన్న దోషం పొందిన తమ్ముడి పైన ఆగ్రహించాడు.

అతణ్ణి శుద్ధుణ్ణి చేయడానికీ రాజదండన అనుభవించి రమ్మన్నాడు. లిఖితుడూ విజ్ఞుడే కాబట్టి, శిక్ష అనుభవించడం పాప విమోచన మార్గం అని సంతోషించాడు.

రాజుకూ తగిన దండన వేసి, సుకృతం కలిగింది.

ఈ కథ భీష్ముడు అంపశయ్య మీద ధర్మరాజాదులకు చెప్పినది.

రాజు పదవి చాల యోగ్యమైనదనీ దాన్ని చక్కగా నిర్వర్తించి పుణ్యం సంపాదించుకో అని , ఏదో తప్పు చేశానని అనవసరమైన చింతతో కుమిలి పోవద్దు అని ధైర్యం చెబుతూ, తాను గతంలో విన్న పుణ్య కథగా దీన్ని చెప్పాడు.

ఇది శాంతి పర్వం లో ఉన్న కథ..

ఇహమూ, పరమూ రెండూ ఉన్నాయి.

ఇక్కడ ధర్మం తప్పని వాడికీ మాత్రమే పుణ్య గతులు ..

చక్కగా రాజధర్మం చేయడం విష్ణుపద ప్రాప్తి మార్గం అని ఈ కథ నీతి.

పుణ్య నదీ స్నానాలు పాప మోచకాలు.. వాటిని అర్చించడం మన ధర్మం. వాటి మహిమ. అనిర్వాచ్యం.. ఎందరో పుణ్యాత్ముల తపస్సులతో అవి పావనమైనవి అని చెప్పే కథలెన్నో భారతాదులలో ఉన్నాయి..

ఉదాత్తుణ్ణి చిన్న తప్పైనా దహిస్తుంది.. దానికి ప్రాయశ్చిత్తం చేసుకొన్నపుడు అపరిమిత ఆనందం కలుగుతుంది. అది భౌతిక లౌకిక వస్తువుల చేత లభ్యమయ్యేది కాదు.

ప్రవరుడంటాడు వరూధిని తో. అది కామ విషయ సందర్భమైనా అన్ని జ్ఞానేంద్రియాలకూ అనువర్తించేదే

బ్రాహ్మణుడింద్రియ వశగతి

జిహ్మాచరణైక నిపుణ చిత్తజ నిశితా

జిహ్మగముల పాలై చెడు

బ్రహ్మానందాధిరాజ్య పదవీ చ్యుతుడై.

ఏ ఇంద్రియాలకూ (ఇక్కడ లిఖితుడు జిహ్వకు వశుడైనాడు) లొంగి పోక వాటిని తన వశంలో ఉంచుకొన్న వాడు తన నిత్య బ్రహ్మానందం నుండి పతనం కాడు..


జిహ్మా ఆచరణ ఏక నిపుణుడు = వక్ర మార్గం లోకి తిప్పడంలో తనకు తానే సాటి ఐన వాడు చిత్తజుడు ..మన్నథుడు.

అతడి బాణాలో.. అజిహ్మగములూ ..సూటిగా తాకుతాయి. అవి పడనిస్తే వాడు చెడుతాడు..

కామెంట్‌లు లేవు: