27, సెప్టెంబర్ 2023, బుధవారం

*🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-58🌹

 *🌹శ్రీ వేంకటేశ్వర దివ్య చరిత్ర-58🌹*


🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


*తిరుమల ప్రసాదం:*


తిరుమల శ్రీవారి ఆలయంలో పల్లవుల కాలం నుంచే ప్రసాదాలు మొదలయ్యాయని చరిత్ర చెబుతోంది. రెండవ దేవరాయలు కాలం నుండి ప్రసాదాల సంఖ్య మరింత పెరిగింది.

ఆ సమయంలో మంత్రిగా పనిచేసిన శేఖర మల్లన్న కేవలం ఆలయ ప్రసాదాల కోసమే అనేక దానాలు చేశారు. అప్పుడే శ్రీవారికి ‘సంధి నివేదనలు (నైవేద్య వేళలు)’ ఖరారయ్యాయట.

ఈ సమయాల్లోనే భక్తులకు ప్రసాదాలు పంచేవారు. అప్పట్లో కొండమీద భోజన సదుపాయాలు ఉండేవికావు.

ఏడుకొండలవానికి సమర్పించే నైవేద్యం

సంప్రదాయబద్ధంగా కట్టెల పొయ్యిపై వండిన అన్న ప్రసాదాలను శ్రీవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆధునిక కాలంలో గ్యాస్ స్టవ్ వంటకాలు సర్వసాధారణం. కానీ తిరుమలేశునికి కృత్రిమ స్టవ్వులమీద వండిన వంటకాలు నైవేద్యంగా సమర్పించరు.

సుప్రభాత సేవ, తోమాల, అర్చన సేవలు ముగిసిన తర్వాత వేంకటేశ్వరుని ఆలయం ఎదురుగా, స్వామి పుష్కరిణి వద్ద కొలువైన ఆది వరాహస్వామివారికి తొలుత నైవేద్యం సమర్పించిన తర్వాత గర్భగుడిలోని మూలవిరాట్టుకు నైవేద్యం సమర్పిస్తారు.

తిరుమల వేంకటేశ్వరునికి ఓడు అని వ్యవహరించే పగిలిన కొత్త మట్టికుండలో వెన్న మీగడలు కలిపిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ అన్నాన్ని మాతృ దద్దోజనం అంటారు.


*లడ్డు:*

తిరుమల వేంకటేశ్వరుని పేరు చెప్పగానే లడ్డు ప్రసాదం గుర్తొస్తుంది. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఈ తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని కళ్ళకు అద్దుకుని మరి స్వీకరిస్తారు.

తిరుమలలో ఆవు నెయ్యితో తయారు చేయబడే ఈ లడ్డు ఇక్కడకు వచ్చే భక్తులకు ఉచితంగా లేదా నామమాత్రపు రుసుముకు పరిమితంగా అందజేస్తారు.

శ్రీవారి లడ్డూకు జీయోగ్రాఫికల్ ఇండిగేషన్ రిజిష్ట్రీ గుర్తింపు లభించింది. ప్రపంచ చరిత్రలోనే ఒక హిందూ ఆధ్యాత్మిక సంస్థకు చెందిన ప్రసాదానికి ఇంతటి గుర్తింపు రావడం ఇదే ప్రప్రథమం.

తిరుపతి లడ్డూలది ఓ ప్రత్యేకత. ఇక్కడ ఏ గదిలో లడ్డులుంటే ఆ గదిలో సువాసనలు గుబాలిస్తుంటాయి. 

లడ్డూల తయారీలో వాడే పదార్ధాలు, ఫార్మూలాలు ప్రత్యేకంగా ఉంటాయి.

ఈ తరహలో లడ్డూను తయారు చేయాలని ప్రయత్నించిన చాలా సంస్థలు కూడా ఆ రుచిని సాధించలేకపోయాయి. అందుకే టీటీడీ వీటి తయారీకి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది.

డిపార్ట్ మెంట్ ఆఫ్ కామర్స్ ఆధీనంలోని జియోగ్రాఫికల్ ఇండికేటర్ రిజిస్ట్రీలో మాత్రం స్థానం దక్కింది. ఒక ప్రాంతంలో తయారయ్యే వస్తువులకు, ఉత్పత్తులకు జీయోగ్రాఫికల్ ఇండిగేషన్ రిజిష్ట్రీ గుర్తింపునిస్తుంది.

తిరుమలలో 1942 నుంచి భక్తులకు లడ్డూ ప్రసాదాన్ని అందిస్తున్నారు. మొదట్లో భూందీగా ఇచ్చే ఈ ప్రసాదం తర్వాత లడ్డూగా తయారు చేసి ఇచ్చేవారు.

51 లడ్డూలను ఒక ప్రోక్తం అంటారు. ఒక్కోసారి వెయ్యి ప్రోక్తాలను తిరుమలలో తయారు చేస్తారు. అంటే 51వేల లడ్డూలన్న మాట.

ఇందుకుగాను 2వేల కిలోల శనగ పిండి, 4వేల కిలోల చక్కెర, 1850 కిలోల నెయ్యి, 350 కిలోల జీడిపప్పు,80 ఏడున్నర కిలోల ఎండుద్రాక్ష, 50 కిలోల యాలకులు, 50 కిలోల కలకండ అవసరమవుతాయి.

రోజుకు లక్షా పాతికవేల లడ్డూలను తితిదే పోటు కార్మికులు తయారుచేస్తున్నారు. భవిష్యత్ లో ఈ సంఖ్యను 5 లక్షలకు పెంచి భక్తులు అడిగినన్ని లడ్డూలు పంచాలనేది టీటీడీ ఆలోచన.


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*


*శ్రీవేంకటేశ్వరుని దివ్య లీలల లో మరికొన్ని తదుపరి సంపుటిలో తెలుసుకుందాం*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: