20, అక్టోబర్ 2023, శుక్రవారం

నవగ్రహా పురాణం🪐* . *59వ అధ్యాయం*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *59వ అధ్యాయం*


*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐


*సూర్యగ్రహ చరిత్ర - 2*


శని , సావర్ణి , తపతి - ముగ్గురూ బంగారు గిన్నెల్లో ఉన్న క్షీరాన్నం తింటున్నారు. వాళ్ళ దగ్గరగా కూర్చున్న ఛాయ కొసరి కొసరి వడ్డిస్తోంది...


శని తింటూ , తింటూ వాలుగా ద్వారం వైపు చూసి , ఛాయ వైపు అదోలా చూశాడు. ఛాయ ద్వారం వైపు చూసింది.


యమీ , యముడూ , వైవస్వతుడూ లోపలికి వస్తున్నారు. 


*"ఇప్పుడెందుకు వచ్చారిక్కడికి ? నేను వచ్చి పిలిచేదాకా ఉద్యానవనంలోనే ఉండండి ! వెళ్ళండి !"* ఛాయ విసుగ్గా అంది.


*"ఆకలిగా ఉందమ్మా క్షీరాన్నం..."* యమి ముందుకు అడుగులు వేస్తూ అంది. *"ఆగు !"* ఛాయ అరిచింది. *"రావద్దని చెప్పానా ? వెళ్ళండి !"*


యమి భయపడుతూ , ఆగిపోయింది.


యముడు ఆవేశంగా ముందుకు వెళ్ళి యమి పక్కన నిలుచున్నాడు. సూటిగా ఛాయ వైపు చూశాడు. *"క్షీరాన్నం మాకు కూడా పెట్టాలి ! ఇప్పుడే !"*


*"యమా ! నా ఆజ్ఞనే ధిక్కరిస్తున్నావా ?”* ఛాయ హుంకరించింది.


*"నీ ఆజ్ఞను కాదు , అధర్మాన్ని ! అధర్మం ఎక్కడున్నా నేను ధిక్కరిస్తాను. తల్లివైనా సరే , నీ పక్షపాత ధోరణిని నేను సహించను. నీ ప్రేమలో , ఆ క్షీరాన్నంలో మాకూ వాళ్ళలాగే భాగస్వామ్యం ఉంది !"* యముడు వైవస్వతుడి చెయ్యి , యమి చెయ్యి పట్టుకుని ముందుకు అడుగులు వేశాడు. *"రా అన్నయ్యా ! రా , చెల్లీ !"*


*"ఈ యముడు ఎప్పుడూ ఇంతే అమ్మా ! ఆటపాటల్లో కూడా ధర్మం , ధర్మం అంటూ మమ్మల్ని ఏడిపిస్తాడు !"* శని యముడ్ని ఓరగా చూస్తూ అన్నాడు.


*"మీకు ఇప్పుడు క్షీరాన్నం పెట్టను. శనీ , సావర్ణి , తపతీ ముగ్గురూ తిన్నాక , ఏమైనా మిగిలితే అదే మీకు !"* ఛాయ నిష్కర్షగా అంది.


*"సావర్ణి , తపతీ ! వేగంగా ఆరగించండి ! అంతా మనమే తినేయాలి !"* శని ఉత్సాహంగా అన్నాడు. ఆదరాబాదరా జుర్రుకుంటూ.


*"తొందరేం లేదు నాయనా ! నెమ్మదిగా అంతా మీరే తినండి !”* ఛాయ అమిత శాంతంగా శనితో అంది.


యముడు తీక్షణంగా ఛాయను చూశాడు. *"అమ్మా ! ఇది అన్యాయం ! నువ్వు మమ్మల్ని కూడా వాళ్ళతో సమానంగా చూడాలి ! అది ధర్మం ! నువ్వు వడ్డించకపోతే , మేమే తీసుకుంటాం !"*


*“ఆగు ! ఆగరా అక్కడే !”* ముందుకు నడవ బోయిన యముణ్ణి చూస్తూ గర్జించింది. ఛాయ. *"సమానంగా చూడాలా ? చూడను ? ఏం చేస్తావ్ ?”*


యముడు ఆగ్రహంతో నిప్పులు కక్కుతూ చూశాడు. ఆవేశంతో ముందుకు వెళ్ళబోతూ , కాలు పైకెత్తి , దువ్వాడు. తన వైపు కాలు చూపిన యముణ్ణి ఆశ్చర్యంతో నోరు తెరిచి చూసింది ఛాయ. ఆమెలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.


*"నువ్వు అహంకారివి ! నన్ను తన్నడానికి కాలు పెకెతావు ! ఫలితం అనుభవించు ! నీ పాదం తెగి పడి , క్రిములకు ఆహారం అవుగాక !"* ఛాయ కంఠం భీకరంగా ప్రతిధ్వనించింది. 


యముడు నిశ్చేష్టుడై నిలిచిపోయాడు. అతని ముఖంలో ఆశ్చర్యం విశ్వరూపంలో ప్రత్యక్షమవుతోంది.


వైవస్వతుడూ , యమీ , శనీ , సావర్ణి , తపతీ అగ్నిగోళంలా ఉన్న ఛాయ ముఖాన్ని ఆందోళనతో చూస్తూ ఉండిపోయారు. ముందుగా ఆశ్చర్యం నుండి యముడు తేరుకున్నాడు.


*"అమ్మా ! నువ్వు... నన్ను శపిస్తావా !”* యముడి కంఠంలో ఇందాకటి ఆగ్రహం , ఆవేశం లేవు. వాటి స్థానాన్ని ఆశ్చర్యమూ , ఆవేదనా ఆక్రమించుకున్నాయి. *“నీ కొడుకును శపిస్తావా ?"* 


*"శపిస్తాను ! నిన్ను సర్వనాశనం చేస్తాను. నువ్వు నా కొడుకు కావు ! నీ ముఖం నాకు చూపించకు !”* ఛాయ గర్జించింది.


యముడు ఛాయ ముఖంలోకి నిర్భయంగా చూస్తూ ఉండిపోయాడు. అతని కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. తలవాల్చి ఒకసారి తన పాదం వైపు చూసుకొన్నాడు. మెల్లగా వెనుదిరిగి , అవతలకి అడుగులు వేశాడు. వైవస్వతుడూ , యమీ అప్రయత్నంగా యముణ్ణి అనుసరించారు.


ఆగ్రహావేశాలతో ఎగసిపడుతున్న ఛాయ వక్షభాగాన్ని ఆమె బిడ్డలు ముగ్గురూ భయంభయంగా చూశారు.


*"నిజమా , యమా ?! అమ్మ నిన్ను శపించిందా ?”* సూర్యుడు నమ్మలేకుండా అన్నాడు. *"సరిగా విన్నావా , నువ్వు ? తల్లి తన బిడ్డను శపించడం అనేది అసంభవం నాయనా ! అసంభవం !”*


*"నిజమే , నాన్నగారూ ! అమ్మ తమ్ముడి పాదం తెగిపడి క్రిములకు ఆహారమవుతుందని శాపం పెట్టింది !"* వైవస్వతుడు వినయంగా అన్నాడు.


*"శని తమ్ముడు పుట్టినప్పట్నుంచీ అమ్మ మా ముగ్గుర్నీ ఏడిపిస్తూనే ఉంది...”* యమి కన్నీళ్ళు తుడుచుకుంది.


సూర్యుడు కనుబొమలు ముడివేస్తూ ముగ్గుర్నీ కలయజూశాడు.


*“నాన్నగారూ...నా పాదం..."* యముడు భయంతో అన్నాడు. సూర్యుడు యముడి దగ్గరగా నడిచాడు. అతని తల మీద అరచేతిని ఉంచాడు.


*"భయపడకు నాయనా ! సంజ్ఞ శాపాన్ని నేను ఉపసంహరించలేను. ఆమె శాపం ఫలించినా , నీ పాదానికి ప్రమాదం రాకుండా చేస్తాను. నీ పాదంలో కొంత మాంసం తెగి పడుతుంది. దాన్ని క్రిములు ఆరగిస్తాయి. సంజ్ఞ శాపం ఆ విధంగా పరిహరించ బడుతుంది !"*


*"నాన్నగారూ !"* యముడి కళ్ళలో ఆనందబాష్పాలు తిరిగాయి.


సూర్యుడి ముఖంలోని ప్రశాంతత అంతర్థానమైంది. ఆయన వైవస్వతుడి వైపు తిరిగాడు. *"వైవస్వతా ! మీ అమ్మ మిమ్మల్ని సరిగా చూసుకోవడం లేదా ? నాకు యధార్ధం. కావాలి సుమా !"*


*"నిజమే నాన్నగారూ ! ఇద్దరు తమ్ముళ్ళూ , చెల్లీ జన్మించిన అనంతరం , అమ్మ ఎందుకో పూర్తిగా మారిపోయింది. వాళ్లను చూస్తే చిరునవ్వులు ! మమ్మల్ని చూస్తే కళ్లల్లో నిప్పులు !"*


*"తపతిని ఎప్పుడూ మెచ్చుకుంటుంది ! నన్ను ఎప్పుడూ నిందిస్తుంది !”* యమి దీనంగా అంది.


*"మాతో కలిసి మెలిసి ఉండవద్దని తమ్ముళ్లకూ , చెల్లికీ చెప్తుంటే నేను విన్నాను ! మమ్మల్ని చూస్తే అమ్మ నిప్పులు కక్కుతుంది ! ఇందాకా , శాపం పెట్టి , 'నువ్వు నా కొడుకువు కాదు, ఫో !' అంది నాన్నగారూ !"* యముడు చెప్పాడు. 


*"శపిస్తాను ! నిన్ను సర్వనాశనం చేస్తాను ! అంది. అమ్మ యముణ్ణి !”* వైవస్వతుడు ఆందోళనతో అన్నాడు.


*"నాన్నగారూ ! అమ్మ నన్ను సర్వనాశనం..."* అగ్నిగోళంలా ఎర్రబడుతున్న తండ్రి ముఖాన్ని చూస్తూ ఆపేశాడు యముడు.


సూర్యుడు ఆగ్రహావేశాలతో వేగంగా ద్వారం వైపు నడిచాడు. వైవస్వతుడూ , యముడూ , యమీ ముఖాలు చూసుకొని ఆయన వెంట పరుగుపెట్టారు.

 

*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

కామెంట్‌లు లేవు: