20, అక్టోబర్ 2023, శుక్రవారం

*🚩శ్రీ వివేకానందస్వామి🚩* . *🚩జీవిత గాథ🚩* *భాగం 69*

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   


*భాగం 69*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


దుఃఖంతో శోకించని హృదయం ఉండదు. అదేవిధంగా, గత్యంతరం లేని స్థితిలో భగవదభిముఖం కాని హృదయం కూడా ఉండదు. తత్త్వాలు ఏకరువు పెట్ట వచ్చు, సిద్ధాంతాలు ప్రతిపాదించవచ్చు. కాని కాలి క్రింది భూమి చీలిపోయే పరిస్థితి ఎదురయినప్పుడు ఎక్కణ్ణుంచి అయినా ఒక అభయహస్తం వచ్చి చేయూతనివ్వదా అనే ఆశాకిరణం మనిషి మనస్సులో మెరవకపోదు. సామాన్యంగా పేదవారు తమ పేదరికంతో సహజంగానే రాజీపడిపోతారు. 


నరేంద్రుడు కూడా పేదవానిగానే జన్మించి ఉంటే. ఈ పరిస్థితి అతణ్ణి అంతగా బాధించివుండేది కాదు. కాని నిన్నటి దాకా మహారాజుగా జీవించినవాడు నేడు బికారిగా మారిపోవడం ఎంత ఘోరం! నిన్నటి దాకా ఎలాంటి చీకూచింతా లేకుండా సీతాకోక చిలుకలా స్వేచ్ఛగా ఎగురుతూ విహరించిన అతడి మీద నేడు ఎంత భారం! 


ప్రతిసారి ఇంట్లోకి వస్తున్నప్పుడల్లా, 'ఈ రోజు నా కుమారునికి ఉద్యోగం దొరికి ఉంటుందా? మా దారిద్ర్యం తీరిపోతుందా?' అనే ఆశతో ఎదురయ్యే తల్లి ముఖం; 'ఈ రోజు తమ్ముడు ఏదో దారి కనిపెట్టి ఉంటాడా?' అనే ఆతురతతో కనిపించే అక్కల ముఖాలు; 'ఈ రోజు అన్నయ్య ఏదైనా కొని తెచ్చివుంటాడా?' అనే ఆసక్తితో చెల్లీ తమ్ముళ్ల ముఖాలు; - వీరందరికీ 'లేదు' అనే సమాధానంతో ఇంట్లోకి అడుగుపెట్టే యువకుని మనస్సు పొందే ఆవేదన వర్ణనాతీతం.


 మార్గం ఎక్కడ లభిస్తుందని అన్వేషించిన నరేంద్రుని హృదయానికి జగజ్జనని స్ఫురించింది! మానవ సహాయాలు ఏవీ అందనప్పుడు జగజ్జననినే ఆశ్రయించి చూద్దాం అని అతడు చొరవ తీసుకొన్నాడు. ఆ తరువాత జరిగింది అతడి మాటల్లోనే విందాం:


"శ్రీరామకృష్ణుల ప్రార్ధనను భగవంతుడు మన్నిస్తాడని నాకు జ్ఞాపకం వచ్చింది. నా కోసం, నా తల్లికి నా సోదరులకు అన్నవస్త్రాలకు లోటు లేకుండామార్గం చూపించమని జగజ్జననిని ప్రార్థించమని ఆయనను ప్రాధేయపడాలి; తప్పు కుండా ఆయన నాకు ఈ సహాయం చేస్తారని ఆశించి దక్షిణేశ్వరం వెళ్లాను. ఆయన వద్దకు వెళ్లి, 'నా తల్లీ, సోదరుల దారిద్ర్యం తొలగించమని మీరు జగజ్జననిని ప్రార్ధించాలి" అంటూ వేడుకొన్నాను. 


అందుకు శ్రీరామకృష్ణులు, 'నాయనా! ఇలా నేను కోరగలనా? నువ్వే వెళ్లి ఎందుకు ప్రార్ధించరాదు? నువ్వు కాళీమాతను అంగీకరించడం లేదు. అందుకే ఇన్ని బాధలు' అన్నారు. వెంటనే నేను, 'నాకు ఆమె తెలియదు. నా కోసం మీరే ఆమెకు విన్నవించండి, విన్నవించే తీరాలి. అలా చేయనంత వరకు మిమ్మల్ని ముమ్మాటికీ వదలను' అన్నాను. శ్రీరామకృష్ణులు ఆప్యాయత ఉట్టిపడే స్వరంలో, 'నీ దుఃస్థితిని తొలగించమని పలుమార్లు జగజ్జననిని ప్రార్ధించాను. నువ్వు ఆమెను అంగీకరించనందువలన నా ప్రార్థనను ఆమె మన్నించడం లేదు. 


పోనీలే, ఈ రోజు మంగళవారం. ఈ రాత్రి కాళికాలయానికి వెళ్లి ఆమెను ఆరాధించు; నువ్వు ఏం కోరినా తప్పక ఆమె అనుగ్రహిస్తుంది. నా తల్లి చైతన్య స్వరూపిణి, బ్రహ్మశక్తి, సంకల్పమాత్రంగానే ఈ లోకాన్నంతా సృజించింది. ఆమె తలచుకొంటే చేయలేనిది ఏదైనా ఉందా?' అన్నారు.🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: