11, అక్టోబర్ 2023, బుధవారం

మహాభారతములో - ఆది పర్వము*

 *మహాభారతములో - ఆది పర్వము*


         *ద్వితీయాశ్వాసము*


                      *20*


*వినత దాస్య విముక్తి*


తరువాత వినత రెండవ అండం నుండి అతి బలవంతుడైన  గరుత్మంతుడు  జన్మించాడు. గరుత్మంతుడు తల్లితో చేరి దాస్యం అనుభవిస్తున్నాడు. ఒక రోజు  కద్రువ గరుడా ! నీ తల్లి నాకు దాసి నీవు దాసీ పుత్రుడవు. కనుక నీవు రోజూ నీ సోదరులైన నాగులను రెక్కలమీద విహారానికిని వెళ్ళు" అన్నది. ఒక రోజు గరుత్మంతుడు నాగులను రెక్కలమీద ఎక్కించుకుని సూర్య మండల సమీపానికి వెళ్ళాడు. వేడికి తట్టుకోలేని నాగులు సొమ్మసిల్లి పడిపోయాయి.  కద్రువ ఇంద్రుని ప్రార్ధించి వర్షం కురిపించి పుత్రులను సేద తీర్చింది. పుత్రుల అవస్థకు కారణమైన గరుత్మంతుని తీవ్రంగా దూషించింది. అది సహించలేని  గరుత్మంతుడు తమ దాస్యానికి కారణం ఏమిటని వినతను అడిగి తెలుసుకున్నాడు. తల్లి దాస్యాన్ని తాను తీర్చగలనని తెలుసుకున్నాడు.  గరుత్మంతుడు తమ దాస్య విముక్తి చేయడానికి ఏమి కావాలని  కద్రువను  అడిగాడు. ఆమె తన కుమారులకు అమృతం తెచ్చి ఇస్తే దాస్య విముక్తులు కాగలరని చెప్పింది.  గరుత్మంతుడు అమృతం తీసుకు రావడానికి బయలు దేరాడు. మార్గమధ్యంలో తనకు తీవ్రంగా ఆకలి అయింది. ఆకలి తీర్చమని తండ్రిని అడిగాడు. కశ్యపుడు " కుమారా విభావసుడు సుప్రీతకుడు అనే అన్నదమ్ము ఉన్నారు. తమ్ముడు ఆస్తిలో భాగం అడిగినందుకు కోపించి అతడిని ఏనుగువు కమ్ము అని విభావసుడు శపించాడు. తమ్ముడు కోపించి అన్నను తాబేలువు కమ్ము అని ప్రతి శాపం ఇచ్చాడు. అప్పుడు వారిరువురు మూడు యోజనములు పొడవు పది యోజనము వెడల్పు గల తాబేలు గానూ, ఆరు యోజనముల పొడవు పన్నెండు యోజనముల వెడల్పు కలిగిన ఏనుగుగానూ మారి పోయారు. కానీ ఇప్పటికీ కలహించుకుంటూ ఉన్నారు. నీవు వారిరువురిని పట్టి తిని ఆకలి తీర్చుకో ". గరుడుడు సంతోషించి విభావసుడు అనే ఏనుగుని సుప్రతీకుడు అనే తాబేలును తీసుకుని రోహణుడు అనే వృక్షపు కొమ్మ మీద కూర్చున్నాడు. ఆ బరువుకు ఆ కొమ్మ విరిగింది. ఆ వృక్షపు శాఖలో తపసు చేసుకుంటున్న మునులను చూసాడు. వారు క్రింద పడతారని భావించి ఆ కొమ్మను పట్టుకుని తండ్రి దగ్గరకు వెళ్ళి ఏమి చేయాలి అని అడిగాడు.  కశ్యపుడు మునులను చూసి హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకొమ్మని ప్రార్ధించాడు. మునులు అంగీకరించి కొమ్మను విడిచి వెళ్ళారు. గరుత్మంతుడు ఆహారాన్ని భుజించి దేవలోకానికి చేరాడు. దేవలోకానికి చేరిన గరుత్మంతుడు అమృతం కోసం దేవతలను ఓడించి అమృతాన్ని తీసుకు వెళుతున్నాడు. అప్పుడు విష్ణుమూర్తి గరుడుని వద్దకు వచ్చి " నీ సాహసానికి మెచ్చాను వరం ఏమి కావాలి " అని అడిగాడు. అందుకు గరుత్మంతుడు " దేవా అమృతం సేవించకుండానే చిరంజీవిగా ఉండాలి,  విష్ణుమూర్తికి వాహనం కావాలి " అని కోరుకున్నాడు. ఇంతలో ఇంద్రుడు గరుత్మంతునపై వజ్రాయుధాన్ని వేసాడు. తనపై వేసిన వజ్రాయుధాన్ని గౌరవించి ఒక ఈకను మాత్రం తుంచమని చెప్పాడు. ఇంద్రుడు  గరుడుని బలానికి అశ్చర్యము చెంది అతనితో మైత్రి చేసుకున్నాడు. గరుడా క్రూరులైన నాగులకు అమృతాన్నిచ్చి లోకాలకు కీడు చేయవద్దని వేడుకొన్నాడు. అందుకు సమ్మతించిన గరుత్మంతుడు "నేను అమృతాన్నిచ్చి నా తల్లితో సహా దాస్య విముక్తులము అవుతాము. ఇంద్రా నీవు వారు అమృతం సేవించే లోపు తిరిగి తీసుకొని వెళ్ళు" అని చెప్పాడు. అలాగే చేసి తల్లిని దాస్య విముక్తి చేసి తన రెక్కలపై పెట్టుకొని తీసుకు వెళ్ళాడు. అమృతం త్రాగే ముందు నాగులు శుచి అగుటకు నదిలో స్నానమాచరించే సమయంలో ఇంద్రుడు  అమృతాన్ని తీసుకు వెళ్ళాడు. నిరాశ పడిన నాగులు అమృతం ఉంచిన దర్భలు నాకాయి. ఆ కారణంగా వాటి నాలుకలు రెండుగా చీలి పోయాయి. ఆనాటి నుండి నాగులు ద్విజిహ్వులు అయ్యారు. అమృతం పెట్టిన కారణంగా దర్భలు పవిత్రం అయ్యాయి. ఇదంతా చూసిన ఆదిశేషుడు తల్లి మీద తమ్ముల మీద అసహ్య పడి వారిని విడిచి వెళ్ళి బ్రహ్మను గురించి తపస్సు చేసాడు. అతని సత్య సంధతకు ధర్మనిష్టకు మెచ్చిన బ్రహ్మ దేవుడు భూభారాన్ని మోసే భారాన్ని ఆది శేషునకు అప్పగించాడు.

కామెంట్‌లు లేవు: