11, అక్టోబర్ 2023, బుధవారం

దేవతార్చన మానవాళికి

 దేవతార్చన మానవాళికి ముఖ్యమైన కర్తవ్యంగా చెప్పబడుతున్నది. ప్రతివారూ వారి ఇంట్లో రెండు పూటలా దేవతా సన్నిధిని కల్పించుకొని దీపాలు వెలిగించుకోవడం అనేది సంస్కృతిలో ప్రధానమైనటువంటి భాగం.  ఏదో అందరం కలిసి గుడికి వెళ్తున్నాం, దణ్ణం పెడుతున్నాం సరిపోతుంది, ఇంట్లో పూజలు అక్కరలేదు అని అనరు. 

ఇంట్లో దేవతారాధన తప్పకుండా జరగాలి అని చెప్పబడుతున్నది. గృహం అంటూ ఉన్నాక గృహదేవతలు ఉంటూ ఉంటారు. ఆ గృహదేవతలందరూ శాంతించాలంటే ఇంట్లో ఇష్టదేవతను ఆరాధిస్తూ పెద్దలు చెప్పినటువంటి, 

సనాతన సంప్రదాయంలో వస్తున్నటువంటి దేవతలను ఆరాధన చేసుకుంటూ ఉండాలి. ఎంత ఇష్టదేవతా నిష్ఠ ఉన్నా ఇతర దేవతలను కూడా ఆరాధించుకుంటూ ఉంటాం. ఇష్టదేవతలు ఇతర దేవతల యొక్క మరొక రూపాలు అనే భావనతో ఆరాధించుకోవాలి. అది భావనతో సరిపోతుంది. 

ఇంట్లో పూజించినప్పుడు భావము, భగవన్నామము లేదా మనకు తెలిసిన పురాణాలలోను, ఇతర స్తోత్ర వాజ్ఞ్మయంలోను ఉన్నటువంటి శ్లోకాలతో భగవంతుడిని ఆరాధించినా సరిపోతుంది. ఎక్కువ సేపు కష్టపడనక్కరలేదు. 

స్నానం చేసిన తరువాత ఒక్క అయిదు/పది నిమిషాలు శుద్ధిగా భగవంతుడి దగ్గర ధూపము, దీపము, నైవేద్యము, కుసుమాలు ఇత్యాదులు సమర్పణ చేసుకుంటూ ప్రీతిపాత్రమైన ఒక శ్లోకాన్నో, మంత్రాన్నో జపం చేసుకున్నా సరిపోతుంది. సామాన్యుల విషయం ఇది. అయితే ఇంట్లో ఆరాధించే దేవతలపట్ల ఒక భావం ఉంటే చాలు. ఆ భావానికి ఈ శ్లోక, నామరూపమైన శబ్ద శక్తి జతకలిస్తే అక్కడ తప్పకుండా ఆ దేవతా సన్నిధి ఉంటుంది. అది ఇంటినంతటినీ రక్షించుకుంటూ ఉంటుంది. అలాంటి దేవతా సన్నిధి ఇంట్లో ఉంటుంది గనుక ఇంటిని కూడా పవిత్రంగా ఉంచుకోవడం అనేది మన సంప్రదాయంలో కనబడుతూ ఉంటుంది. ఇళ్ళల్లో భావన సరిపోతుంది. పెద్దలు ఒక మాట చెప్తారు -

న దేవో విద్యతే కాష్ఠే న పాషాణే న మృణ్మయే!

భావే హి విద్యతే దేవస్తస్మాత్ భావోహి కారణం!!

దేవత కర్రలోనో, రాయిలోనో ఉండదు. భావంలో ఉంటుంది.  భావంలో భగవంతుడు ఉంటాడు కనుక బయట పూజలు అక్కరలేదు అని చెప్పరాదు.  భావంలో భగవంతుడు ఉంటాడు గనుక నీ భావంతో ఏ విగ్రహమునందు, ఏ పటము నందు భావిస్తే అందులో భగవచ్ఛక్తి కేంద్రీకరింపబడి కాపాడుతూ ఉంటుంది అని దీని యొక్క భావం.

అయితే ఆలయాలలో కొచ్చేటప్పటికి అనేక రకాలైన పద్ధతులు ఉంటాయి. ఏదో విగ్రహం పెట్టుకొని, ఏదో పూజ జరుగుతోందని బయట చూసే వాళ్ళకి అనిపించవచ్చు. కానీ అక్కడ జరిగే ప్రక్రియ చాలా విశేషంగా ఉంటుంది. 

ఉదాహరణకు ఒక ఊరిలో ఎలక్ట్రిసిటీ ఆఫీస్ ఉంటుంది. అక్కడ విద్యుచ్ఛక్తిని వాళ్ళు ఏవిధంగా దాచిపెడతారు, ఏవిధంగా పంచుతారు అనే వ్యవస్థ అందులో పనిచేసేటటువంటి ఆ శాస్త్రవేత్తలకి, కార్మికులకి తెలుస్తుంది తప్ప సామాన్యులకి చెప్పినా అర్థం కాదు. అదేవిధంగా ఆలయాలలో కూడా దైవశక్తిని ఏవిధంగా జాగ్రత్త చేసుకోవాలి? ఏవిధంగా దానిని పరిరక్షించుకుంటూ ప్రసారం చేయాలి? ఈ ప్రక్రియలన్నీ ఆగమ శాస్త్రాలలో చెప్తూ ఉంటారు. 

అందుకే ఆలయ అర్చకులు తప్పకుండా శాస్త్రాలపై అవగాహన కలిగి ఉండాలి. ఆ శాస్త్రాలు చెప్పినట్లు వాళ్ళు జీవిస్తూ ఉండాలి. కనీసం త్రిసంధ్యలు చేయనప్పుడు అర్చకత్వానికి అర్హతే ఉండదు. సంధ్యావందనాది కృత్యాలు చేయగలిగితేనే వాని మంత్రం ఫలిస్తుంది. మంత్రోచ్ఛారణ చేయడానికి తగిన అర్హత అనుష్ఠానం వల్ల వస్తుంది. 

అంతేకానీ కేవలం అర్చకత్వం కడుపు నింపుకోవడం చేసే వృత్తి అనే భావన కాకుండా ప్రధానంగా అతడు అనుష్ఠాన పరుడై ఉండాలి. తాను ఆరాధించే దేవతయందు తాను ముందు విశ్వాసం కలిగి ఉంటూ శాస్త్రం చెప్పిన ప్రక్రియను తు. చ. తప్పకుండా జరపాలి. ఎందుకంటే ఆ ప్రక్రియ ఇవాళ ఆరంభమైనది కాదు. యుగయుగాలనుంచి ఉన్నటువంటి ఆలయాలలో క్షేత్రాలలో పద్ధతులు ప్రాచీనులు చేస్తూ వచ్చారు. వాటిని మార్చేటటువంటి అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే ఆ దైవశక్తిని ఎలా కాపాడుకోవాలి? ఎలా అర్చించాలి? అక్కడ ఉన్న దేవత క్రింద పెట్టిన యంత్రం ఏమిటి? ఆ యంత్రంలో ఆవరణ దేవతలు ఎవరు? వారికి ఏయే పదార్థాలు నివేదన చేయాలి? అక్కడ గర్భగుడిలో, అంతరాలయంలో, ధ్వజస్తంభం దగ్గర, పరివార దేవతలు, ద్వారపాలకులు, - వాళ్ళని ఎలా ఆరాధించాలి? వంటి పద్ధతులు తెలియాలి. 

అందుకే పరంపరాగతమైనటువంటి ఒకానొక సంప్రదాయం ప్రతి ఆలయ అర్చనా విధానాలలోను, ఆలయ నిర్వహణలోను ఉంటూ ఉంటుంది. ఏ సమయంలో ఏవి నివేదన చేయాలి? ఏ సమయంలో ఏయే మంత్రములు నియోగించాలి? ఎప్పుడెప్పుడు ఏ ఉత్సవాలు చేయాలి? ఇవన్నీ ప్రతి ఆలయానికీ అనాదిగా చక్కగా భద్రపరచబడి ఉన్నాయి, నిర్దేశింపబడి ఉన్నాయి. ఆ నిర్దేశించినటువంటి ఆగమ పద్ధతులు అతిక్రమించకుండా చూడడమే నిర్వహణ. అంతేకానీ క్రొత్త పథకం పెడితే మరింత రాబడి వస్తుంది అంటూ ప్రాచీనమైన పద్ధతులను దెబ్బతీయరాదు. అటువంటివి గానీ దెబ్బతీస్తే క్రమంగా కొన్ని ప్రమాదాలు ఎదుర్కొనవలసి వస్తుంది. ఎందుకంటే ఒక ఆలయంలో జరిగిన ప్రక్రియలు ఆ ఊరిలో ఉన్న పంచభూత వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తాయి. ఆ పద్ధతులను తేడా చేస్తే పంచభూత వ్యవస్థలో తేడా చేసి ఉత్పాతాలు కూడా వస్తున్నాయి. కొద్దికాలం క్రితం ఒక ఆలయంలో ఒక అద్భుతమైన విషయం జరిగింది. అది ప్రతిష్ఠిత ఆలయమే. తండ్రి ప్రతిష్ఠ చేశాడు. అందులో ఆయన ఒక శివలింగాన్ని పెట్టి అటు, ఇటు దుర్గా, కాళీ విగ్రహాలను పెట్టాడు. కొంతకాలానికి తరువాతి తరం మారగానే అర్చకుడిగా ఉన్న వాడు సౌకర్యం కోసం శివలింగాన్ని తీసి పైన ఎత్తుగా అరుగు మీద పెట్టాడు. ఆశ్చర్యం ఆరోజు రాత్రినుంచి అతనికి తల తిరుగుతున్నట్లు అనిపించడం, మెదడు ఒకవైపు వాలిపోతున్నట్లు అనిపించడం,మొదలైనవి జరిగాయి. తరువాత అక్కడికి ఒక సిద్ధ పురుషుడు వచ్చినప్పుడు ఎందుకో ఇలా ఉంటోంది ఆరోగ్యం బాగోలేదు అంటే ఆయన నాయనా! నువ్వు ఈ శివుడిని తీసుకెళ్ళి పైకి పెట్టావు. కానీ శివుడు అక్కడే ఉండాలి. ఎందువల్ల అంటే దుర్గ, కాళి ప్రక్కన పెట్టడంలో అక్కడి శివుడి పేరు శరభేశ్వరుడు. శరభేశ్వరునికి దుర్గ, కాళి రెండు రెక్కలు. నువ్వు దానిని కదిలించి పైకి పెట్టగానే రెక్కలనుంచి దూరమైన పక్షిలాగా పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడైతే నీ తాతలు ప్రతిష్ఠ చేశారో ఆ దేవత యొక్క శక్తి నీ జీవులతో అనుబంధం కలిగి ఉంటుంది. 

కనుక అక్కడ ఎక్కడైనా తేడా జరిగితే అవి మీ శరీరాలలో తేడా చూపిస్తాయి. ఊరిలో కూడా తేడా చూపిస్తాయి. అందుకే మన సౌకర్యాల కోసం కట్టడాలు కానీ, విగ్రహాలు కానీ స్థానభ్రంశం చెందరాదు. జరిగితే ప్రమాదము. ఎందుకంటే అక్కడ విగ్రహంకంటే గొప్పది ఆ క్షేత్రంలో ఉన్న శక్తి. ఆ శక్తిని ఉద్దేశించి అక్కడ విగ్రహం పెడతారు. అది మనం తరలించితే ఆ శక్తికి విగ్రహ ఆధారం దొరకదు. 

అందుకే ఆగమ శాస్త్రము, పెద్దలను సంప్రదించకుండా మార్పులు చేయరాదు. మహా మహిమాన్వితమైన ఆలయాలు, క్షేత్రాలు ఉన్నప్పుడు వాటిని కాపాడుకోవలసిన బాధ్యత కూడా మనకు ఉన్నది.  అందుకే కాపాడుకొనే పద్ధతులు చెప్పుకున్నాం. అలా మహా అర్చకుడు రామకృష్ణపరమహంస వంటి యోగులు కూడా ఉన్నారు అర్చకులలో. ఇటువంటి వ్యవస్థ కలిగిన భారతీయ దేవాలయ స్వరూపాలకు నమస్కరిస్తూ స్వస్తి.

కామెంట్‌లు లేవు: