16, అక్టోబర్ 2023, సోమవారం

మహాభారతములో - ఆది పర్వము*

 *మహాభారతములో - ఆది పర్వము*


         *తృతీయాశ్వాసము*


                      *25*



*వ్యాస జననం*


మత్స్యగంధి పడవ నడిపే తరుణంలో ఒక రోజు ఆ పడవలో వశిష్ట మహాముని కుమారుడైన శక్తి మహాముని కుమారుడు  పరాశరుడు ప్రయాణిస్తూ మత్స్య గంధిని చూసి మోహించి ఆమెతో సంగమించగా వారిరువురికి వ్యాస భగవానుడు జన్మించాడు. పుట్టగానే  వ్యాసుడు తల్లికి నమస్కరించి తనను తలచిన మరుక్షణం ఆమె ఎదుట ఉంటానని మాటిచ్చి తపసు చేసుకోవడానికి వెళ్ళాడు. ఆ పై వైశంపాయనుడు దేవ దానవ అంశలతో  పాండవులు కౌరవులు పుట్టారని చెప్పగా  జనమేజయుడు దేవాంశతో పుట్టిన వారు యుద్ధం ఎందుకు చేశారని సందేహం వెలుబుచ్చాడు. సమాధానంగా వైశంపాయనుడు పరశురామ దండయాత్రకు క్షత్రియులంతా బలి కాగా రాజుల భార్యలు వంశాభివృద్ధి కొరకు ఆకాల ధర్మం అనుసరించి ఉత్తములైన బ్రాహ్మణుల అనుగ్రహంతో సంతానవతులైయ్యారు. మరలా రాజులు ధర్మపరిపాలన సాగించగా భూమి సుభిక్షంగా ఉండి ప్రజల ఆయుర్ధాయం పెరిగి మరణాలు తగ్గాయి భూభారం ఎక్కువైంది. భూదేవి త్రిమూర్తుల వద్దకు వెళ్ళి భూభారాన్ని తగ్గించమని వేడుకొనగా వారు భూదేవితో దేవతల అంశంతో పాండవాది రాజులు రాక్షసాంశతో కౌరవాది రాజులు పుట్టి పరస్పరం కలహించుకొని కురుక్షేత్రమనే యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో జనక్షయం జరిగి భూభారం తగ్గకలదని భూదేవితో చెప్పారు.

కామెంట్‌లు లేవు: