15, అక్టోబర్ 2023, ఆదివారం

ఆపత్కాల పెన్నిధి

 *ఆపత్కాల పెన్నిధి..*


మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారు సిద్ధిపొందిన నాటినుండి నేటివరకు ...శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకున్న తరువాత  తమ కష్టాలు తీరిపోయాయనీ..తాము ఆ స్వామి దయ వల్లే సుఖ సంతోషాలతో జీవిస్తున్నామనీ..చెప్పుకుంటున్నారు..శ్రీ స్వామివారి మందిరం లో ఉన్న మేము కూడా..కష్టాలతో, కన్నీళ్ళతో ఈ నెల మీద అడుగుబెట్టి..శ్రీ స్వామివారి కృపను పొంది..సంతోషం తో తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లడం మా కళ్లారా చూసాము..చూస్తూనే ఉన్నాము..శ్రీ దత్తాత్రేయ స్వామివారు ఈ స్థలం లో అడుగుబెట్టిన మొదటి క్షణం లోనే.."ఇది దత్తక్షేత్రం..పుణ్యభూమి..అతిత్వరలో ఈ భూమి క్షేత్రం గా మారుతుంది.." అని చెప్పారు..వారి మాట పొల్లు పోలేదు..దూరప్రాంతాల నుంచి సైతం ఎందరో ఇక్కడకు వచ్చి..శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకొని వెళుతున్నారు..ఎందుకూ పనికిరాని భూమిగా పేరు పడిన "ఫకీరు బీడు" నేడు పుణ్యక్షేత్రం గా మారిపోయింది..


రెండు సంవత్సరాల క్రితం గురుపౌర్ణమి ముందు జరిగిన సంఘటన మీతో ఈరోజు పంచుకుంటున్నాను..


కర్ణాటక రాష్ట్రం లోని రాయచూరు వద్ద పార్థసారధి గారు కాంట్రాక్టర్ గా ఉండేవారు..ఆ క్రమం లో ఆర్ధికంగా కూడా మంచి స్థితి లో వున్నారు..భార్యా, ఇద్దరు పిల్లలు..ముచ్చటైన సంసారం..ఇద్దరు పిల్లల్లో మొదటి సంతానం కూతురు..రెండవ వాడు కుమారుడు..అమ్మాయి ఇంజినీరింగ్ చదువుతోంది..అబ్బాయి ఇంటర్ చదువుకుంటున్నాడు..అన్నీ అమర్చినట్టు ఉన్న జీవితం ఉంటే..దైవం మీదకు మనసు త్వరగా పోదు..ఏదో మొక్కుబడి కోసం దేవుడికో దండం పెట్టి..వెళ్లిపోవడం మానవులలో అతి సహజం..అదే జరిగింది పార్థసారధి విషయం లో కూడా..కానీ కాలం ఎల్లప్పుడూ ఒక లాగా ఉండదు..ఈ చక్రభ్రమణం లో చక్రానికి వుండే ఆకులు క్రిందకు, పైకి తిరుగుతూనే ఉంటాయి..


ప్రభుత్వం తరఫున చేసే పనుల్లో అవినీతి ఎక్కువగా ఉన్నదనీ..కాంట్రాక్టర్లు తమ ఇష్టారాజ్యంగా పనులు చేసి బిల్లులు పొందుతున్నారనే అభియోగం మీద విచారణ నిమిత్తం అన్ని పనులనూ అర్దాంతరంగా ఆపివేయమని అధికారులు చెప్పారు..ఆ క్రమం లో పార్థసారధి గారి తాలూకు పనులు కూడా ఆగిపోయాయి..ఇది ఊహించని పరిణామం..పెద్దఎత్తున పెట్టుబడి పెట్టి వున్నారు..తనవద్ద ఉన్న డబ్బే కాక అప్పు తీసుకొచ్చి మరీ పెట్టుబడి పెట్టారు..కొద్దికాలం వేచి చూద్దామని నిర్ణయించుకున్నారు.ఇంతలో భార్యకు జబ్బు చేసింది..వైద్యం కోసం హాస్పిటల్లో చేరిస్తే..అన్ని పరీక్షలు చేసి..కడుపులో కణితి లాగా ఏర్పడ్డదనీ..త్వరగా ఆపరేషన్ చేయాలని చెప్పారు..ఒక్కసారిగా ఆయన డీలా పడిపోయాడు..ఏమీ దిక్కుతోచని స్థితి..


ఆ సమయం లో సుబ్రహ్మణ్యం గారని పార్థసారధి గారి స్నేహితుడు..తాను రోజూ వాట్సాప్ లో మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర ను చదువుతున్నాననీ..ఆ స్వామివారిని నమ్ముకుంటే మేలు జరుగుతుందని అనుకుంటున్నారని..నువ్వు కూడా నీ పరిస్థితి బాగు పడాలని ఆ స్వామివారిని వేడుకోమనీ..చెప్పారు..


పార్థసారధి గారి మీదఆ మాటలు ప్రభావం చూపాయి..తన స్నేహితుడి వద్ద శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం తాలూకు ఫోన్ నెంబర్ తీసుకొని..నాకు ఫోన్ చేశారు..తన పరిస్థితి బాగాలేదని తన కుటుంబం గోత్రనామాలను పంపుతాననీ..తమ పేరుతో అర్చన చేయమని చెప్పారు..అలాగే జరిపిస్తామని చెప్పాను..మరో వారం రోజుల్లో గురుపౌర్ణమి సందర్భంగా దత్తహోమాన్ని నిర్వహిస్తున్నామని..మీరు అంగీకరిస్తే..ఆరోజు హోమామ్ లో కూడా మీ గోత్రనామాలతో సంకల్పం చెప్పి..అర్చన చేస్తామని చెప్పాను..సరే స్వామీ..చేయించండి..దానికయ్యే ఖర్చు తెలపండి..పంపుతాను అన్నారు..నా పరిస్థితి బాగుపడితే..మా కుటుంబం తో సహా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటానని చెప్పారు..సరే అన్నాను..


అనుకున్న విధంగానే పార్థసారధి గారి గోత్రనామాలతో అర్చన జరిపించాము..అలాగే దత్తహోమము లో కూడా వారి పేర్లతో పూజ జరిపించాము..శ్రీ స్వామివారి విభూతి గంధం పోస్ట్ ద్వారా వారికి పంపాము..


సరిగ్గా మూడు నెలల తరువాత..పార్థసారధి గారు తమ కుటుంబం తో సహా శ్రీ స్వామివారి మందిరానికి వచ్చారు.."మీరు అర్చన చేయించిన వారం కల్లా..ప్రభుత్వం వారు మా పనులు కొనసాగించమని ఆదేశం ఇచ్చింది..మా బిల్లులు కూడా చెల్లించారు..మళ్లీ నా.పనులు యధావిధిగా కొనసాగుతున్నాయి..ఆర్ధిక పరిస్థితీ మెరుగు పడింది..ఇదిగో ఈవిడ నా భార్య..ఆపరేషన్ ఇప్పుడు అక్కర్లేదు..మందులతో తగ్గిపోతుంది అని బెంగుళూరుకు చెందిన డాక్టర్లు చెప్పారండీ..ఆవిడా ప్రస్తుతం ఆరోగ్యం గా ఉంది..ఈ స్వామివారి దయవల్ల బాగుపడ్డాను..ప్రతి ఏడూ దత్తహోమము లో మా గోత్రనామాలతో అర్చన చేయండి.." అని చెపుతూ.."ఇక్కడ అన్నదానం చేస్తే మంచిదని నా స్నేహితుడు సుబ్రహ్మణ్యం చెప్పాడు..వచ్చే శని, ఆదివారాల్లో జరిపే అన్నదానానికి అయ్యే ఖర్చు నేను భరిస్తాను.." అన్నారు..శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకొని సంతోషంతో తిరిగి వెళ్లారు.


స్వామివారి వద్ద ఎందరో భక్తులు పొందిన అపురూప అనుభవాలను మీలాటి పుణ్యాత్ములతో పంచుకోవడమే మా భాగ్యవశాన..స్వామివారి దయతో మేము చేయగలిగింది..


సర్వం..

దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామిమందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..SPSR నెల్లూరు జిల్లా..పిన్: 523114.. సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: