21, నవంబర్ 2023, మంగళవారం

ముక్త పద గ్రస్తంలో ముక్తి ప్రదాత !

 శు భో ద యం🙏


శు భో ద యం🙏


ముక్త పద గ్రస్తంలో ముక్తి ప్రదాత !

----------------------------------------------------------

మ: " గిరిజా మానస హంస! హంస వర యోగి ధ్యేయ చిద్రూప! రూ

పరుచి శ్రీ జిత ముక్త! ము క్త భుజ దర్ప వ్యాఘ్ర దైత్యేంద్ర! యిం

ద్ర రమావల్లభ మిత్ర! మిత్ర రజనీరాడ్చక్ర! చక్రాబ్జ సుం

దర రేఖా కరపద్మ! పద్మ శరభా నాశంకరా! శంకరా!


అనిరుధ్ధచరిత్రము-ద్వి: ఆ; 12వపద్యము; కనుపర్తి అబ్బయామాత్యుడు;

కవి ప్రతిభ తెలియాలంటే గ్రంధమంతా తిరగ వేయాల్సిన పనిలేదు. స్థాలీ పులాక న్యాయంగా(గిన్నెలో అన్నంమెతుకు ముట్టి ఉడికినదో లేదో చెప్పటం) ఒక్క పద్యాన్ని బట్టి గూడా అంచనావేయవచ్చు. అబ్బయామాత్యుడు ప్రబంధ కవులకు దీటిపోని కవితావైభవం కలవాడు.. అతని అనిరుధ్ధచరిత్రము అనవద్యమైన హృద్యమైన ప్రబంధం. ఏమి కవిత! అచ్చతెనుగుపదాల భావాల మురిపాలతో , హాయిగా' హేలగా 'సాగే యిందులోని పద్యాలు రసహృదయులకు చక్కని (పద్యాల) విందు.


ప్రస్తుతానికి వద్దాం. ఈపద్యంలో ఉన్నవిషయం పరమేశ్వర స్తుతి.. ముక్తిప్రదాత యైన శంకరుని ముక్తపదగ్ర స్తాలంకారంతో వర్ణించటం యిందులోనివిశేషం. ముక్త పదగ్రస్తం ఒక శబ్దాలంకారం.విడిచిన పదాన్ని తిరిగి స్వీకరిస్తూ పద్యాన్ని అర్ధవంతంగా ముందుకు నడిపించటం. సామాన్యంగా ముక్త పదగ్రస్తాలు అసమాపక క్రియలతో నిర్వహిస్తారు. దానికి భిన్నంగా నామవాచకాలతో ,

అదికూడా సంబోధనలతో, నిర్వహింపబడటం మరోప్రత్యేకత! శబ్దశక్తిలో ఘటికుడైతేతప్ప కవికిది సాధ్యంకాదు.అందుచేతనే అబ్బయామాత్యుడు ప్రౌఢకవితా దురంధరుడని చెప్పటం!


అర్ధములు:- ధ్యేయ- తలంపబడువాడు; చిద్రూప-జ్ఙానస్వరూపా; రుచి-కాంతి; శ్రీ- శోభ; జిత-జయింపబడిన; ముక్త-మోక్షగాములు; ముక్త-విడువబడిన(ముక్తిని ప్రసాదించిన) భుజదర్ప-బలగర్వము; రమావల్లభుడు- విష్ణువు; మిత్ర-స్నేహితుడా; మిత్ర రజనీరాడ్చక్ర-

సూర్య చంద్రులు రధచక్రములుగా గలవాడా; చక్రాబ్జ- చక్రము పద్మములు ;రేఖా-హస్తరేఖలుగల; కరపద్మ-పద్మమున బోలిన హస్తములుగలవాడా; శరభము- శరభమృగము, మంచు; శంకరా- సంపద నొసగు వాడా;


భావము: పార్వతీ మానస హంసా! పరమ హంసలగు యోగులచే ధ్యానింపబడు జ్ఙానస్వరూపా!రూపమునందలికాంతిచే ముత్యపు శోభలను తిరస్కరించువాడా! (భస్మ ధారణచే తెల్లని శరీరముగలవాడై ముత్యముల తెల్లదనమును ధిక్కరించు చున్నటులుండువాడనియర్ధము) వ్యాఘ్రాసుర భుజ గర్వమునణచినవాడా!

ఇంద్ర, కేశవులకు మిత్రుడా! సూర్యచంద్రులు రథ చక్రములుగాగలవాడా!చక్రము ,పద్మము అనబడు చక్కని సాముద్రిక రేఖలుగల

కరపద్మములు గలవాడా! పద్మ ములకు విరోధియైన మంచును తుదముట్టించువాడా! ఐశ్వర్య ప్రదాతా నీకు నమోనమః!


కావ్య నాయిక యగు ఉషాదేవి తండ్రి బాణాసురుడు పరమేశ్వర భక్తుడు. భక్త వత్సలుడైన యాపరమేశ్వరుని ప్రార్ధించుటయే పద్యము నందలి విషయము. కాకపోతే కవి తన ప్రతిభను ప్రదర్శించు కొనుటకై అనన్య సామాన్యమైన ప్రయత్నమును

యెట్లొనరించెనో తెలుపుట కోసమే యీపద్యము నీనాడు మీ ముందుంచుట జరిగినది.

                               స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

కామెంట్‌లు లేవు: