29, డిసెంబర్ 2023, శుక్రవారం

శ్రీ వివేకానందస్వామి

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.                    *భాగం 130*


*అమృతం కన్నా రుచికరం*


ఖేత్రీలో  ప్రజలు తండోపతండాలుగా స్వామీజీ వద్దకు వచ్చారు. స్వామీజీ వారితో ఎడతెగకుండా మాట్లాడుతూనే ఉన్నారు. స్వామీజీ మాటల్లోనే ఆ సంఘటన గురించి విందాం: 


"నమ్మశక్యం కాదు, కాని ఎడతెగకుండా  మూడు రాత్రుళ్లు పగళ్లు నాకు క్షణం కూడా విశ్రాంతి లేదు, నిద్రాహారాలు లేవు. ఎవరూ ఈ విషయం పట్టించుకొన్నదీ లేదు. వారు వస్తూనే ఉన్నారు, నేను మాట్లాడుతూనే ఉన్నాను. మూడవ రోజు రాత్రి అయింది. అప్పటికి అందరూ వెళ్లి పోయినట్లున్నారు. అప్పుడు నిమ్నకులానికి చెందిన ఒక వ్యక్తి నా వద్దకు వచ్చాడు. 


'స్వామీజీ! మూడు రోజులుగా నిద్రాహారాలు లేకుండా మీరు మాట్లాడుతూనే ఉండడం నేను గమనిస్తూనేవున్నాను. నా మనస్సు ఆవేదనతోతల్లడిల్లిపోతున్నది. ఆకలీ, అలుపూ మీకు కూడా ఉంటాయి కదా! ఒక గ్లాసు నీరు కూడా మీరు త్రాగలేదు!' అన్నాడు ఆప్యాయతానురాగాలు ఉట్టిపడే స్వరంలో, అతడి ప్రేమాభిమానాలు నన్ను కదలించివేశాయి. 


'తినడానికి నువ్వు ఏమైనా ఇస్తావా?' అని అడిగాను. 'ఇవ్వాలనే నా మనస్సు తహతహ చెందుతున్నది. కాని ఏం చేయగలను? నేను నిమ్న కులస్థుణ్ణి, చెప్పులు కుట్టేవాణ్ణి. నేను చపాతీలు తయారుచేసి మీకు ఇవ్వలేను. పిండి తదితర పదార్థాలు తీసుకొచ్చి ఇస్తాను. మీరే చేసుకొని తినండి' అన్నాడతడు. 


అందుకు నేను. 'ఫరవాలేదు. నువ్వే తయారుచేసి పట్రా! నేను తింటాను' అన్నాను. అతడు హడలిపోయాడు. చెప్పులు కుట్టే వాడయిన అతడు ఒక సన్న్యాసికి ఆహారం ఇచ్చాడని తెలిస్తే శిక్షింపబడతాడు; అంతేకాదు దేశబహిష్కరణ చేస్తారు కూడా. కాని నేను అతణ్ణి సాంత్వన పరిచాను; 'నీకు శిక్ష పడకుండా నేను చూసుకొంటాను' అని వాగ్దానం చేశాను. 


అతడు నా మాటలను అంతగా నమ్మినట్లులేదు. కాని నా పట్లగల అభిమానంకొద్దీ చపాతీలు తీసుకొచ్చాడు. నేను వాటిని తిన్నాను. దేవేంద్రుడు ఒక బంగారు కలశంలో అమృతాన్ని తెచ్చి ఇచ్చినా, అది కూడా ఇంత రుచిగా ఉండదని నాకు అనిపించింది.  నా హృదయం ప్రేమతోను, కృతజ్ఞతతోను పొంగిపొరలింది.కళ్లు చెమ్మగిల్లాయి.🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

కామెంట్‌లు లేవు: