14, జనవరి 2024, ఆదివారం

మంగళాచరణ శివ స్తుతి -

 

        


తెలుగు , సంస్కృత కావ్యాలలో  మంగళాచరణ శివ స్తుతి -

ఉపద్రష్ఠ సత్యం!

(అ మె రి కా )


పరమశివునికి పెండ్లి జరుగుతోంది.


ఆయన ఒంటి నిండా ఆభరణాలు పెట్టారు.


కాబోయే భర్తగారి ఆ ఆభరణాల సమూహ సౌందర్యం చూసి హిమవంతుడనే కొండకు పుట్టిన కుమార్తె పార్వతీదేవి మనస్సు అనే వీథి కంపించి పోయింది.


రాతికి పుట్టిన అమ్మాయి మనస్సు కూడా రాయిలా కఠినంలా ఉండాలి కదా ! కాని ఆరాతి లాంటి చలించని మనస్సుకూడా శివుని అందానికి కదిలిపోయింది.అంటే ఇక శివుని అందం ఎంత బాగుంటుందో ఊహించండి.


హృదయంలోని కదలికకు ఆమె కొప్పు విడిపోయింది. నెమలిపింఛము అయింది.


నెమలంటే పాములకు భయం కదా !


అందువల్ల శివుని ఆభరణాల మధ్యలో ఉన్న కొన్ని చిట్టి పాములు ఆ నెమలి పింఛం చూసి భయంతో తలలు దించుకొన్నాయి


ఇదంతా గమనిస్తున్నాడు శివయ్య, 


ఆ యనకి నవ్వు వచ్చింది.


అది మాములు నవ్వు కాదు. 


జరుగుతున్న సంఘటనలను బాగా ఆమోదించిన నవ్వు.


అలా నవ్వే , సుఖాలను ఇచ్చే ఆ శంభుడు- మాకు ఎల్లప్పుడు అధిక సౌఖ్యాలు ఇచ్చుగాత!


ఈ మాటలు కూచిమంచి తిమ్మకవి(18వ శతాబ్దము) “రసికజనమనోభిరామము” అనే కావ్యంలో ప్రారంభంలో చేసిన పద్య కాంతులు.


అసలు పద్యమిది.


శ్రీ మీఱం దన పెండ్లి వేళ నొడలం , జెన్నారు భూషామణి


స్తోమంబుం బొడగాంచి శైలసుతచే,తో వీథి గంపింపద


ద్భామా రత్నము కొప్పు బర్హమని యప్పాముల్డలల్వంపన


త్యామోదంబున నవ్వు శంభుడిడు మా కశ్రాంత సౌఖ్యోన్నతుల్


(శ్రీ మీఱన్= కాంతి అతిశయించేటట్లుగా; తన పెండ్లి వేళన్= తన పెండ్లి సందర్భములోఒడలన్=శరీరమందు; చెన్నారు = అందమగు ; భూషామణిస్తోమంబున్= మణుల అలంకారములు; పొడగాంచి= చూసి; శైలసుత= పార్వతి;చేతో వీథి గంపింప= మనస్సు అనే వీథి చలించగా; తత్ +భామా రత్నము కొప్పు= భామలలో శ్రేష్ఠురాలయిన ఆ పార్వతీదేవి తలయందు దోపిన వెండ్రుకలముడి (విడివడి) ;బర్హమని= నెమలి పురి అని ;అప్పాముల్ =ఆ +పాముల్ =శివుని ఆభరణాలలో ఉన్న పాములు; తలల్వంపన్= భయముతో తలలు వంచుకోగా ; అతిమోదంబున నవ్వు= బాగా సంతోషముతో నవ్వు; శంభుడు = శివుడు ; మాకు= మా అందరికి, (మన అందరికి) అశ్రాంత = ఎప్పుడు; సౌఖ్యోన్నతుల్= గొప్పవైన సౌఖ్యములు ; ఇడు= ఇచ్చు గాత)


విశేషాలు


1. ఈ పద్యములో వర్ణించిన శివుడు కుక్కుటేశ్వరుడు.


కుక్కుటమంటే కోడి.తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురంలో కుక్కుటేశ్వర ఆలయం ఉంది. రసిక జన మనోభిరామాన్ని ఈ కుక్కుట లింగ ప్రభుమణికి తిమ్మకవి అంకితమిచ్చాడు.


2. ఈ కావ్యము రసిక జనులను మెచ్చుకొనే ఇతివృత్తంతో ఉంది. అందుకే నాంది ప్రస్తావనలో కూడా రసిక జన అహ్లాదకరమైన వర్ణన కవి చేసాడు.


3. అలంకారము


అప్రస్తుత వస్తువు యొక్క గుణము, క్రియ మొదలగువాని సంబంధముచేత ప్రస్తుత వస్తువును అ ప్రస్తుతముగా తలచుట ఉ త్ప్రేక్షాలంకారం. ఉత్ప్రేక్షలో ధర్మము అప్రసిద్ధంగా ఉంటుంది. ఉపమానములో ధర్మము ప్ర సిద్ధం. ధర్మాన్ని అనుసరించి ఈ రెండలంకారాలకు భేదము వస్తుంది. 


ఉత్ప్రేక్షము వాచ్యమని, గమ్యమని రెండు రకాలు.


తలంచెద, ఎంచెద, సత్యము, అదియో, అనునట్లు -మొదలయినవి ఉ త్ప్రేక్షావాచకాలు. . ఉ త్ప్రేక్షావాచకాలు ఉంటే వాచ్యోత్ప్రేక్ష, లేకపోతే గమ్యోత్ప్రేక్ష;


ఈ పద్యంలో బర్హమని అనుపదంలో " అని” అను ఉత్ప్రేక్షావాచకము ఉంది కనుక ఇది వాచ్యోత్ప్రేక్ష.


4. శమ్ అంటే సుఖం. అది ఇచ్చే వాడు కనుక శంభుడు అని శివునికి పేరు. శంభుడిడు మా కశ్రాంత సౌఖ్యోన్నతుల్


అనుచోట శంభు శబ్దము సాభిప్రాయం కనుక పరికరాలంకారం.


5. శివుని ఒంటి మీద రత్నాలున్నాయని కవి ఒక పక్క వర్ణిస్తూ, పార్వతిని భామారత్నము అన్నాడు.


ఇద్దరు అన్ని రకాలుగా సరిపోయిన, సమానమయిన జంట అనే అర్థం చదివే పాఠకులలో కలగటానికి


ఆహ్లాద కరమయిన భామారత్న విశేషణం కవి వాడాడు.


6. పిఠాపురం సంస్థానాధీశుల ఆదరణ పొందినప్పటికి, తన కావ్యాన్ని శివునికి అంకితమిచ్చిన వ్యక్తిత్వం కూచిమంచి తిమ్మకవిది.

కామెంట్‌లు లేవు: