16, ఏప్రిల్ 2024, మంగళవారం

నాటకరంగ దినోత్సవం!

 ఈరోజుతెలుగు నాటకరంగ దినోత్సవం!


    తనదేహము, తనగేహము,

    తనకాలము తనధనమ్ము తనవిద్య జగ

    జ్జనులకు వినియోగించిన

    ఘనుడీ వీరేశలింగకవి జనులారా..!

         ఈరోజు నవయుగ వైతాళికుడు కందుకూరి పుట్టినరోజు,దాదాపు చాలామంది విస్మరించిన రోజు. జీవితమంతా స్త్రీవిద్యకోసం, స్త్రీపునర్వివాహంకోసం, స్త్రీజన సముధ్దరణకోసం, సాంఘికదురచారాల నిర్మూలనకోసం అహరహంశ్రమించిన కవితాయోధుడు కందుకూరి.

           కందుకూరి పుట్టినరోజు అయిన ఈరోజును అసలు తెలుగు నాటకరంగ దినోత్సవంగా ఎందుకు జరుపుకొంటున్నాం?

              తెలుగుసాహిత్యం పుట్టి వెయ్యేళ్ళు దాటింది కాని తెలుగు నాటకం పుట్టిమాత్రం 164 సంవత్సరాలే అయింది.తెలుగులో తొలినాటకం 1860లో శ్రీకోరాడ రామచంద్ర శాస్త్రిగారు రాసిన "మంజరీ మధుక రీయం". అయితే తొలిగా1880లో ప్రదర్శింపబడిన నాటకం మాత్రం కందుకూరివారి "వ్యవహారధర్మబోధిని". 

               కందుకూరి ఆంగ్ల,సంస్కృత నాటకాల్ని అనువదించారు. పౌరాణిక, సాంఘిక నాటకాల్ని రాసారు. వీరి శాకుంతలం అనువాదనాటకం ఆంధ్రదేశంలో పలుచోట్ల ప్రదర్శింపబడి మన్ననలు పొందింది.ఇక బ్రహ్మవివాహం నాటకం ఆనాటి సమాజాన్ని మిక్కిలి ప్రభావితం చేసింది. అతి బాల్యవివాహం, వృద్ధవివాహం, కన్యాశుల్కం వంటి సాంఘిక దురాచారాల్ని ఈనాటకంలో అధిక్షేపించడం జరిగింది.

                 నాటకం ప్రజలను ప్రభావితుల్ని చేసే ఒకశక్తివంతమైన సాధనం. అంతేకాదు అది జీవితవిమర్శ. సమాజంలో ప్రతిబింబించే మనుష్యుల మనః ప్రవృత్తులను, అడుగడుగునా మనకు ఎదురుపడే సామాజిక సమస్యలను రంగస్థలంపై ప్రదర్శించే నాటకంలో ప్రేక్షకులు ప్రత్యక్షంగా చూడగల్గుతారు.

              నాటకం యొక్క ప్రయోజనం పఠనంకాదు, ప్రదర్శన. ప్రదర్శించినపుడే అది ప్రజలహృదయాల్లోకి సూటిగా ప్రవేశిస్తుంది. అలా నాటకాల్ని రచించి వదిలేయకుండా వాటిని తొలిసారి ప్రదర్శించే చొరవతీసుకొన్న గొప్ప ప్రయోక్త కందుకూరి.

                  సాంఘికనాటకాల్లో వ్యావహారిక భాషను ప్రవేశ పెట్టి, సమకాలీన సమాజాన్ని కధావస్తువుగా స్వీకరించి, తొలినాటక సమాజాన్ని స్థాపించి, తొలినాటక ( వ్యవహారధర్మబోధిని) ప్రదర్శనను నిర్వహించిన నాటకకర్త, ప్రయోక్త, కందుకూరే. అందుకే కందుకూరి పుట్టినరోజును తెలుగు నాటకరంగదినోత్సవంగా మనం జరుపుకొంటున్నాం..!

కామెంట్‌లు లేవు: