శీర్షిక.. ఆ రోజులే ఎంతో హాయి!
ఆరోజులె ఎంతో హాయి
ఇది కాదనలేని నిజం
కారంతో మండే పచ్చడి మెతుకులు తిన్నా
చల్దన్నం తిన్నా .. మారాం గారం
అలుకలతో.. అమ్మ గుమ్మపాలు త్రాగి గడిచిన బాల్యం
భీమునిలా బలవంతుని చేసిన పౌష్టిక ఆహారం
ఈనాడు డబ్బా పాలతో అవుతుంది పీలగా.. బలహీనంగా
కొండలు ఎక్కుతూ, చెట్టూ చేమలపై ఎగబ్రాకుతూ
పొలాల గట్లపై గెంతుతూ.. చెరువుల్లో ఈదుతూ
చెట్లెక్కిన ఆ బాల్యం ఎంతో అపూర్వం
నాన్న తెచ్చిన తాజా తాజా బుట్టెడు మామిడి పండ్ల
రసాలు జుర్రుతూ.. ఆస్వాదించిన తీయని మమతల
మాధుర్యం బాల్యం గుండె గుడిలో దాగింది..దొంగాటలు ఆడుతుంది
నేను మళ్లీ నీకు కనిపించనంటూ..
బ్రహ్మ ముహూర్తం లో ఎక్కాల లెక్కల
చదువుతూ.. శతక పద్యాలు బట్టీ బెట్టింగులతో
స్వర రాగాల పల్లకిలో..హల్లుల తైతక్కలతో
చిలుకల పలుకుల పదాల పదనిసలతో
సరస్వతీ నమస్తుభ్యం.. గురువే దైవంగా
భావించిన విద్యాధనం పొందిన ఆరోజులే ఎంతో హాయి
కష్ట సుఖాల్లో కలిసీ మెలిసీ ఒకరికి ఒకరై అండగా
తోడు నీడగా.. నిలిచిన ఉమ్మడి కుటుంబం
ఆకలిని తీర్చే దయా గుణంతో
వినయం శాంతీ సహనంతో వర్ధిల్లిన ఆ రోజులే ఎంతో హాయిగా..
వృద్ధాప్యంలో తీయని స్మృతులు
ఆలపించాయి.. మది వెన్నెల కంటె చల్లగా సేదలు తీర్చాయి
మమతలు వెల్లువగా
ఆనాటి ఆ రోజులే ఎంతో హాయి కదా!!
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
ఇది నా స్వీయ కవిత
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి