10, మే 2025, శనివారం

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*కర్ణ పర్వము ప్రథమాశ్వాసము*


*372 వ రోజు*


*ధృతరాష్ట్రుని సందేహం*


అది విన్న ధృతరాష్ట్రుడు " సంజయా ! నాకు తెలియక అడుగుతాను. అర్జునుడు కౌరవులను అందరిని చంపదల్చుకుంటే కర్ణుడు అడ్డు వచ్చినా అందరిని ఆరోజే చంపి ఉండేవాడు. దేవేంద్రుడి కొడుకైన అతడికి నాకుమారుల వంటి మానవమాతృలు ఒక లెక్కా ! అతడు సామాన్యుడా ! యాదవ వీరులను ఎదిరించి సుభద్రను వివాహమాడలేదా! ఇంద్రుడిని ఎదిరించి ఖాండవ వన దహనం చేయలేదా ! కిరాతరూపంలో ఉన్న పరమశివునితో యుద్ధము చేయలేదా! కాలకేయులను ఒంటి చేత్తో చంపలేదా! గంధర్వుల చేత చిక్కిన నా కుమారుడిని వారితో పోరి జయించ లేదా ! ఇన్ని చేసిన వాడికి ఈ యుద్ధము ఒక లెక్కా! అర్జునుడి చేతిలో ఓడిపోవడమూ కీర్తే కనుక మన వారిని అర్జునుడి చేతిలో ఓడారని నిందించ పనిలేదు " అన్నాడు. సంజయుడు తిరిగి " సుయోధనుడు ! ముఖ్యులతో ఆ రోజు విశేషములు చర్చిస్తున్నాడు. కర్ణుడు సుయోధనుడితో ఇలా అన్నాడు. " రారాజా ! మనమంతా ఒకటి గుర్తుంచుకోవాలి. అర్జునుడు అత్యంత శక్తి యుక్తులు కలవాడు. అందుకు తోడు అతడికి తగు సమయంలో సలహాలు ఇవ్వడానికి కృష్ణుడు ఉన్నాడు. నేను ఇంద్రప్రసాదిత శక్తిని అర్జునవధ కోసం అట్టిపెడితే దానిని ఘటోత్కచుడి మీద ప్రయోగించేలా చేసి మనలను వంచించి ఘటోత్కచుడిని చంపించి అర్జునుడిని రక్షించాడు. అయినా మన శక్తిని నమ్ముకుంటాము. నా అస్తశస్త్రములతో నేను రేపు కృష్ణార్జునులను రూపుమాపుతాను " అన్నాడు.


*కర్ణసారధ్యంలో రెండవరోజు యుద్ధము*


మరునాడు ఉదయం ఇరు పక్షాలు యుద్ధానికి సిద్ధం అయ్యాయి.ధర్మరాజు పూర్వం బృహస్పతి పన్నిన దుర్జయ వ్యూహము పన్నాడు. అందుకు ప్రతిగా మరొక వ్యూహము కొరకు కౌరవసేనలు కర్ణుని ఆనతి కోసము ఎదురుచూస్తున్నాయి " అని సంజయుడు చెప్పగానే ధృతరాష్ట్రుడు " సంజయా ! కర్ణుడు వచ్చి మాత్రం చేసేది ఏముంది. తనను సర్వసైన్యాధ్యక్షునిగా చేసిన మొదటి రోజే సుయోధనుడికి పరాజయం మూటగట్టాడు. రెండవ రోజు మాత్రం ఏమి చేస్తాడు. అయినా నా కుమారుడు బుద్ధిహీనుడు కనుక అలాంటి వారిని నమ్మాడు. కర్ణుడి బాహుబలం, శకుని కపట నీతి గెలిపిస్తాయని నమ్మి ఈ యుద్ధానికి దిగాడు. జూదం ఆడిన రోజు నుండి మనకు దుర్ధశ మొదలైంది. అది ఇప్పటికి పెరిగి నిరంతర దుఃఖంగా మారింది. నేను, నా కుమారుడు కాని పనులు చేసాము ఫలితం అనుభవిస్తున్నాము. సంజయా ! ఇన్ని రోజుల యుద్ధములో పాండవులు ఒక్కరూ మరణించ లేదు. కాని నా కుమారులు అనేక మంది మరణించారు. భీష్మ, ద్రోణులు పడిపోయారు. పాండవులు మన వారి మధ్యలో అంతఃపుర స్త్రీలతో సరసమాడుతున్నట్లు హాయిగా తిరుగుతున్నారు. అంతా విధి విలాసము " అన్నాడు.సంజయుడు " మహారాజా ! జరిగిన దానికి వగచి ప్రయోజనము లేదు. అందుకు నీ కుమారుడైన సుయోధనుడిని మాత్రము నిందించి ప్రయోజనము లేదు. అతడు చెప్పిన దానికి అంతా నువ్వు తల ఊపి ఇంతటి అనర్ధము తీసుకు వచ్చినది నువ్వు కాదా ! నాడు విదురుని మాట విని జూదము ఆపిన ఇంత దూరము రాక పోను. పాండవులకు నీవు చేసిన అపరాధములు నిన్ను కట్టి కుడుపుతున్నాయి. తరువాతి యుద్ధ విశేషములు చెప్తాను విను.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: