ప్రహ్లాద చరిత్ర -- పోతన
రెండవ భాగం
హిరణ్య కశిపుడు మండి పడ్డాడు. తన శత్రువైన విష్ణువును కీర్తించినందుకు ప్రహ్లాదుని కఠినంగా శిక్షించమని ఆదేశించాడు. కాని శూలాలతో పొడిచినా, ఏనుగులతో తొక్కించినా, మంటల్లో కాల్చినా, కొండలపైనుండి త్రోయించినా ప్రహ్లాదునకు బాధ కలుగలేదు. అతడు హరినామ స్మరణ మానలేదు. అదిచూసి రాజు చింతాక్రాంతుడయ్యాడు. మరొక అవకాశం అడిగి రాక్షసగురువు ప్రహ్లాదుని గురుకులానికి తీసికొనివెళ్ళారు. అక్కడ ప్రహ్లాదుడు మిగిలిన రాక్షస బాలురకు ఆత్మజ్ఞానాన్ని, హరితత్వాన్ని, మోక్షమార్గాన్ని ఉపదేశించసాగాడు. ఇలా లాభం లేదని గురువు రాజుతో మొరపెట్టుకున్నాడు.
క్రోధంతో హిరణ్య కశిపుడు ప్రహ్లాదుని పిలిపించి - నేనంటే సకల భూతాలు భయపడతాయి. దిక్పాలకులు నా సేవకులు? ఇక నీకు దిక్కెవరు? బలమెవరు? అని గద్దించాడు. అందరికీ ఎవరు బలమో, అందరికీ ఎవరు దిక్కో ఆ విభుడే నాకు దిక్కన్నాడు ప్రహ్లాదుడు.
ఆ హరి ఎక్కడుంటాడు? అని దానవేశ్వరుడు ప్రశ్నించగా
కలడంబోధి కలండు గాలి గలడాకాశంబునన్ గుంభినిన్
గలడగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్
గలడోంకారమునం ద్రిమూర్తుల ద్రిలింగ వ్యక్తులం దంతటన్
గలడీశుండు గలండు తండ్రి! వెదుకంగా నేల యీ యా యెడన్? - అన్నాడు బాలుడు.
ఇంకా "చక్రి సర్వోపగతుడు. ఎందెందు వెదకి జూచిన నందందే గలడు" అని చెప్పాడు.
హరి సర్వాకృతులన్ గలండనుచు ప్రహ్లాదుండు భాషింప స
త్వరుడై ఎందును లేడు లేడని సుతున్ దైత్యుండు తర్జింప శ్రీ
నరసింహాకృతినుండె నచ్యుతుడు నానా జంగమ స్థావరో
త్కర గర్భంబుల నన్ని దేశముల నుద్ధండ ప్రభావంబుతోన్
ఇలా దైత్యరాజు, అతని సుతుడు వాదించుకొటుండగా శ్రీహరి సకల జడ,చేతన పదార్ధములలో శ్రీ నరసింహాకృతిలో నుండెను (సర్వాంతర్యామిత్వం)
అయితే "ఈ స్తంభమునన్ జూపగలవె చక్రిన్ గిక్రిన్?" అని రాజు ప్రశ్నించాడు. "బ్రహ్మ నుండి గడ్డిపోచవరకు అన్నింటిలో విశ్వాత్ముడైయుండేవాడు ఈ స్తంభమునందెందుకుండడు? స్తంభాంతర్గతుడై ఉండును. ఏ సందేహములేదు. నేడు గానబడు ప్రత్యక్ష స్వరూపంబునన్" అన్నాడా పరమ భాగవతుడైన ప్రహ్లాదుడు. "సరే. చూద్దాం. ఈ స్తంభంలో విష్ణువును చూపకుంటే నీ తలతీయిస్తాను. అప్పుడు హరి వచ్చి అడ్డుపడతాడా?" అని హిరణ్యకశిపుడు చేతితో స్తంభంపై చరిచాడు.
శ్రీ నరసింహావిర్భావం
బ్రహ్మాండ కటాహం బ్రద్దలయ్యే ఛటఛట ఫటఫటారావములు ధ్వనించాయి. పదిదిక్కుల నిప్పులు చెదిరాయి. "
ప్రఫుల్ల పద్మయుగళ సంకాశ భాసుర చక్ర చాప హల కులిశాంకుశ జలచర రేఖాంకిత చారు చరణ తలుండును, చరణ చంక్రమణ ఘన వినమిత విశ్వ విశ్వంభరాభర ధౌరేయ దిక్కుంభి కుంభీనస కుంభినీధర కూర్మ కులశేఖరుండును, దుగ్ధజలధిజాత శుండాల శుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోరు స్తంభ యుగళుండును, ఘణఘణాయమాన మణికింకిణీ గణ ముఖరిత మేఖలావలయ వలయిత పీతాంబర కటిప్రదేశుండును, .......... కులాచల సానుభాగ సదృశ కర్కశ విశాల వక్షుండును, వజ్రాయుధ ప్రతిమాన భాసమాన నిశాత ఖరతర ముఖ నఖరుండును, ధగధ్ధగాయమాన తటిల్లతా సమాన దేదీప్యమాన దంష్ట్రాంకురుండును, సంధ్యారాగ రక్త ధారాధర మాలికా ప్రతిమ మహాభ్రంకష తంతన్యమాన పటుతర సటాజాలుండును, ధవళ ధరాధర దీర్ఘ దురవలోకనీయుండును, ప్రహ్లాద హిరణ్యకశిపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జేగీయమాన కరుణా వీర రస సంయుతుండును, మహాప్రభావుండును నైన శ్రీనృసింహదేవుడు" స్తంభమునుండి ఆవిర్భవించాడు.
ఇది నరమూర్తికాదు, కేవల హరిమూర్తియు కాదు. హరిమాయా రచితమై యున్నదను కొన్నాడు హిరణ్య కశిపుడు. అప్పుడు శ్రీ నృసింహదేవుడు భీకరంగా హిరణ్యకశిపుని ఒడిసిపట్టి తనయొడిలో వేసికొని వజ్రాలవంటి తన నఖాలతో (గోళ్లతో)చీల్చి చెండాడాడు.
ఇలా శ్రీహరి (మనిషీ, జంతువూ కాక)నారసింహుని రూపంలో, (పగలూ, రాత్రీ కాని) సంధ్యాకాలంలో, (ప్రాణం ఉన్నవీ లేనివీ అని చెప్పలేని) గోళ్ళతో, (ఇంటా బయటా కాక) గుమ్మంలో, (భూమిపైనా, ఆకాశంలో కాక) తనతొడపైన హిరణ్యకశిపుని సంహరించాడు. బ్రహ్మ వరము వ్యర్ధం కాలేదు. ప్రహ్లాదుని మాట పొల్లు పోలేదు.
గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు మొసలి చేత పీడింపబడ్డాడు.వేదన చెందుతూ విపరీతమైన బాధ వ్యక్తం చేశాడు కానీ ప్రహ్లాద చరిత్రలో ప్రహ్లాదుని ఎంత హింసించినా అస్సలు బాధ వ్యక్తం చేయలేదు సరికదా విష్ణువును స్తుతిస్తున్నాడు. పైగా ధైర్యంతో ఉన్నాడు. కారణం ఏమిటి? గజేంద్రుడు మనలాటి సామాన్య వ్యక్తికి ప్రతీక. ప్రహ్లాదుడు మహా జ్ఞాని ఈ శరీరం నేను కాదు అనే స్థాయికి వెళ్లినవాడు.గజేంద్రుని వంటి మనము ప్రహ్లాదుని స్థాయికి చేరుకోవాలి. అప్పుడే మానవ జన్మకు సార్ధకము.
స్వస్తి
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి