18-09-గీతా మకరందము.
మోక్షసన్న్యాసయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
అవతారిక -ఇక సాత్త్వికత్యాగమును వివరించుచున్నారు-
కార్యమిత్యేవ యత్కర్మ
నియతం క్రియతేఽర్జున ! |
సఙ్గం త్యక్త్వా ఫలం చైవ
స త్యాగస్సాత్త్వికో మతః ||
తాత్పర్యము:- ఇది చేయదగినదియే యని తలంచి శాస్త్రనియతమగు ఏ కర్మము అభిమానము, ఫలము విడిచిపెట్టబడి చేయబడుచున్నదో అట్టి (కర్మమందలి సంగఫల) త్యాగము సాత్త్వికత్యాగమని నిశ్చయింపబడినది.
వ్యాఖ్య:- త్యాగమనగా సంగత్యాగమేకాని, ఫలత్యాగమేకాని కర్మత్యాగముకాదని ఈశ్లోకముద్వారా స్పష్టముగ వెల్లడియగుచున్నది. మఱియు “కార్యమ్" అని చెప్పినందువలన శాస్త్రనియతమగు కర్మ మనుజుడు తప్పక చేయవలెననియే బోధితమగుచున్నది. తామసుడు శాస్త్రవిధి తెలియక దాని నాచరించకనుండును. రాజసుడు తెలిసియు ఆచరించుట కష్టమని భావించి దానిని చేయకుండును. సాత్త్వికుడు తెలిసియు, కష్టములకు జంకక - సంగమును, ఫలమును త్యజించి దాని నాచరించును. సాత్త్వికునిదే ఉత్తమపద్ధతియనియు, ఆతడు కావించిన త్యాగమే ఉత్తమత్యాగమనియు ఈశ్లోకముద్వారా విదితమగుచున్నది. కావున అద్దానినే విజ్ఞులవలంబించవలెను.
ప్రశ్న:- సాత్త్వికత్యాగముయొక్క లక్షణమేమి?
ఉత్తరము: - శాస్త్ర నియతమగు కర్మను, "ఇది తప్పక చేయవలెను" అని యెంచి ఫలమును, సంగమును (ఆసక్తిని) వదలివైచి చేయుట సాత్త్వికత్యాగమనబడును.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి