*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*కర్ణ పర్వం – తృతీయాశ్వాసం*
*402 వ రోజు*
*కర్ణార్జునుల యుద్ధం*
కర్ణుడు అర్జునుడు ఢీకొన్నారు. యుద్ధం తీవ్రం అయింది. అర్జునుడితో కృష్ణుడు " అర్జునా ! అడుగో కర్ణుడు నీ ప్రతాపం చూపించు. కర్ణుడి శరీరం నిండా శరములు నాటు. కర్ణుడు నీకు ఎందులో సరి రాడు. అర్జునా ! విజృంభించి కర్ణుడిని వధించు " అన్నాడు. కర్ణుడిని కూడా కౌరవ వీరులు ఉత్సాహ పరుస్తున్నారు. " కర్ణా ! ఇన్నాళ్ళు అడవులలో మృగముల మాదిరి తిరిగిన పాండవులు ఇప్పుడు యుద్ధానికి వచ్చారు. నువ్వు అర్జునుడిని చంపితే మిగిలిన పాండవులు తిరిగి అడవులకు పోతారు. సుయోధనుడు కురుసామ్రాజ్యాధిపతి ఔతాడు. నీ శక్తిని అంతా ఉపయోగించి అర్జునుడిని చంపు " అన్నాడు. కర్ణుడు అర్జునుడి శరీరంలో పది బాణములు నాటాడు. అర్జునుడు కర్ణుడి శరీరంలో పందొమ్మది బాణములు నాటాడు. కర్ణుడు అర్జునుడి మీద తొమ్మది పదునైన బాణములు ప్రయోగించాడు. అతడు కృష్ణుడిని కూడా వద లేదు. అది చూసిన అర్జునుడు తన బాణములతో కర్ణుడిని రక్తం కారేలా కొట్టాడు. కర్ణుడు కోపించి కృష్ణార్జునులను పదునైన బాణములతో గాయపరిచాడు. అర్జునుడు కర్ణుడి సారధిని, అశ్వములను కొట్టి కర్ణుడి మీద ఆగ్నేయాస్త్రం ప్రయోగించాడు. కర్ణుడు వారుణాస్త్ర ప్రయోగంతో దానిని నిర్వీర్యం చేసాడు. అర్జునుడు కర్ణుని మీద మేఘాస్త్ర ప్రయోగం చేసి కౌరవ సేనలను మేఘాలతో కప్పి అంధకారం సృష్టించాడు. కర్ణుడు అనిలాస్త్ర ప్రయోగంతో దానిని నిర్వీర్యం చేసాడు. ఇంతలో అర్జునుడు ఇంద్రశక్తిని ప్రయోగించాడు. కర్ణుడు మంత్రశక్తితో ఇంద్రశక్తిని నిర్వీర్యం చేసి అర్జునుడి మీద పదునైన బాణములు వేసాడు. అది చూసిన భీముడు " తమ్ముడా అర్జునా ! ఈ కర్ణుడు ఈ రోజు మనతో అటో ఇటో తేల్చుకోవాలని వచ్చాడు. నీ ప్రతిజ్ఞా భంగం కాకుండా నీవు చంపుతావా ! లేక నాగదా ఘాతంతో అతడి తల ముక్కలు చెక్కలు చేయనా ! " అన్నాడు. అది చూసి కృష్ణుడు " అర్జునా ! నీవు ప్రయోగించిన దివ్యాస్త్రాలను కర్ణుడు తిప్పి కొడుతున్నాడు. పైగా నిన్ను తీవ్రంగా తన బాణములతో గాయపరుస్తున్నాడు. నీ పరిస్థితి కౌరవసేనలో ఉత్సాహాన్ని పాండవసేనలో నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. కారణం తెలియక ఉంది. నా చక్రాన్ని ఇస్తాను దానిని ప్రయోగించి కర్ణుడి తల తుంచు " అన్నాడు. అర్జునుడు " కృష్ణా ! అంత పని వద్దులే నేను కర్ణుడి మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాను " అని బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు. అది కర్ణుడి మీదకు వేగంగా రాసాగింది. కర్ణుడు బెదరక నిశ్చలంగా నిలబడి తన మంత్రశక్తితో దానిని నిర్వీర్యం చేసి కృష్ణార్జునులను తన బాణములతో గాయపరిచాడు. అర్జునుడు కర్ణశల్యులను మీద తొమ్మిదేసి బాణములను ప్రయోగించాడు. కర్ణుడు అర్జునుడి వింటి నారిని తెంచాడు. అర్జునుడు నారిని సరి చేసుకుని కర్ణుడి వింటి నారిని తెంచాడు. అర్జునుడి ధాటికి తాళ లేని కర్ణుడి చక్రరక్షకులు పారి పోయారు. అది చూసి సుయోధనుడు అర్జునుడిని చంపమని తన సైన్యమును ప్రోత్సహించాడు. సుయోధన బలగాలు అర్జునుడిని చుట్టుముట్టాయి. అర్జునుడు వాడి అయిన బాణములు ప్రయోగించి వారిని చెదరగొట్టాడు. ఇరు పక్షముల వీరులు యుద్ధం వదిలి కర్ణార్జునుల యుద్ధం వీక్షించసాగారు. సుయోధనుడు " యోధులారా ! కర్ణుడు అత్యంత పరాక్రమంతో పోరుతుండగా మీరు చూస్తూ ఉండటం భావ్యమా ! పోయి కర్ణుడికి సాయపడండి " అన్నాడు. ఆమాటలకు రోషపడి కౌరవ వీరులు అర్జునుడిని ఎదుర్కొన్నారు. అర్జునుడు పదునైన బాణములు వేసి వారి కేతములు, రధములు, ధనస్సులను విరిచి అశ్వములను పంపాడు. ముందుకు పోతే అర్జునుడు చంపు తున్నాడు. వెనక్కు పోతే సుయోధనుడు హెచ్చరిస్తున్నాడు. కౌరవ వీరులు అయోమయ అవస్థకు లోనయ్యారు.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి