*తిరుమల సర్వస్వం -265*
*శ్రీవారి సంవత్సర సేవలు - 2*
2 *ఈ ఉత్సవాలు శ్రావణశుద్ధ దశమి, ఏకాదశి, ద్వాదశి దినాలలో; సంపంగిప్రాకారంలో నున్న శ్రీవేంకటరమణుని కళ్యాణమంటపంలో జరుగుతాయి.*
ముందురోజు సాయం సమయాన విష్వక్సేనుల వారు వసంతోత్సవ మండపం చేరుకుంటారు. అక్కడ మృత్సంగ్రహణం (పుట్టమన్ను సేకరించడం), అంకురార్పణ జరిగిన తరువాత పవిత్రోత్సవాలు ప్రారంభ మవుతాయి.
మొదటి రోజైన దశమి నాడు 'పవిత్రాల ప్రతిష్ఠ', శాంతిహోమాలు, ఉభయదేవేరిసహిత మలయప్పస్వామి వారికి అభిషేకాలు, రాత్రివేళలో పూర్ణాహుతి అర్పించడంతో మొదటిరోజు ఉత్సవాలు ముగుస్తాయి.
రెండవరోజైన ఏకాదశి నాడు పూర్ణాహుతి పూర్తయిన తరువాత; ఆలయం లోపల, బయటా ఉన్న ఉపాలయాలకు, బలిపీఠం మరియు ధ్వజస్తంభానికి పవిత్రాల సమర్పణ జరుగుతుంది. తదనంతరం పూర్ణాహుతితో రెండవరోజు కార్యక్రమం ముగుస్తుంది.
మూడవరోజు విశేషహోమం మరియు పూర్ణాహుతితో మూడురోజుల పవిత్రోత్సవాలు సుసంపన్నమవుతాయి. ఈ ఉత్సవాలతో దోషపరిహారం జరిగి, ఆలయ పవిత్రత ఇనుమడిస్తుందని ప్రతీతి.
ఆణివార ఆస్థాన మహోత్సవం
1843 వ సంవత్సరంలో అప్పటి ఆంగ్లపాలకులు తిరుమల ఆలయ నిర్వహణ బాధ్యతను మహంతుల కప్పగించినట్లు ఇంతకు మునుపే తెలుసుకున్నాం. యాదృచ్ఛికంగా జరిగిందో లేదా శుభ ముహూర్తాన్ననుసరించి జరిగిందో తెలియదు కానీ ఆ యాజమాన్య మార్పిడి సరిగ్గా తమిళమాసమైన 'ఆణిమాసం' ఆఖరి రోజున జరిగింది. అదే రోజు దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభ మవుతుంది. 'కర్కాటక సంక్రాంతి' గా కూడా పిలువబడే ఈ పర్వదినం, ప్రతి ఏడాది జూలై 16 లేదా 17 వ తారీఖుల్లో వస్తుంది. సరిగ్గా దీనికి ఆరుమాసాల ముందు జనవరి 15 వ తారీఖున, ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమయ్యే రోజున మనం మకరసంక్రాంతి జరుపుకుంటాము. తిరుమలలో తమిళులు అధికంగా అనుసరించే సౌరమానం ప్రకారం జరుపుకునే ఉత్సవాలలో ఇది కూడా ఒకటి.
ఆలయ వ్యవహారాలు మహంతుల చేతికి వచ్చినప్పటి నుండి ఆలయ వార్షిక లెక్కల్ని అదే రోజు, లాంఛనంగా ప్రారంభించడం ఆనవాయితీగా వచ్చింది. ఆర్థిక సంవత్సరం ప్రారంభాన్ని పురస్కరించుకుని, ఆణిమాసం ఆఖరి రోజున, అట్టహాసంగా *'ఆణివార ఆస్థాన మహోత్సవం'* జరుప బడుతుంది. తరువాతి కాలంలో మిగిలిన అన్ని ఆర్థిక, ధార్మిక, వాణిజ్య సంస్థల్లా ఆర్థిక సంవత్సరాన్ని ఏప్రిల్ ఒకటవ తేదీన ప్రారంభిస్తున్నప్పటికీ; అనాదిగా వస్తున్న *'ఆణివార ఆస్థానోత్సవం'* మాత్రం అదే రోజు జరుపబడుతోంది.
ఆరోజు ప్రాతఃకాల కైంకర్యాలను యథావిథిగా నిర్వహిస్తారు. అయితే, ప్రతినిత్యం కొలువు శ్రీనివాసునికి మునపటి రోజు ఆదాయవ్యయాలను అప్పగించే 'కొలువు' లేదా 'దర్బారు' సేవ మాత్రం జరగదు. ఏకంగా వార్షిక లెక్టల్నే స్వామివారికి నివేదిస్తారు కాబట్టి, ఆరోజుకిక దినవారీ లెక్కలు ఉండవన్న మాట. తరువాత తిరుమామణి మంటపంలో సర్వభూపాలవాహనంపై ఉభయదేవేరీ సమేతులైన మలయప్పస్వామిని; వారి ప్రక్కగా సర్వసేనాధిపతి విష్వక్సేనుణ్ణి వేంచేపు చేస్తారు. విశేష నైవేద్యసమర్పణ జరిగిన తరువాత జియ్యంగార్లు విమాన ప్రదక్షిణమార్గం లోని పరిమళపు ఆర నుండి ఆరు పట్టువస్త్రాలను పెద్ద వెండితట్టలో నుంచి తీసుకు వస్తారు. ఆ ఆరింటిలో మూలవిరాట్టుకు ధోవతి అంగవస్త్రాలుగా చెరి ఒకటి; ఆకాశరాజు కిరీటం, నందక ఖడ్గం, మలయప్పస్వామికి, విష్వక్సేనుల వారికి ఒక్కొక్కటి చొప్పున అలంకరిస్తారు. అప్పుడు గత సంవత్సరం ఆదాయవ్యయాల వివరాలను, నగదు నిల్వలను, సంబంధిత ఆలయాధికారులు స్వామివారికి విన్నవిస్తారు. ఆణివార ఆస్థానమహోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించడం ద్వారా సకలసంపదలు స్వామివారి సొంతమని; మిగిలిన వారందరు వారికి పరిచారకులేనని; వారి ప్రతినిధులుగా మాత్రమే వారి సంపదను, ఆదాయాన్ని పరిరక్షిస్తున్నారన్న సందేశం పంపబడుతుంది. తద్వారా ఆలయానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీల నిర్వహణలో జవాబుదారీతనం మరింత పెరుగుతుంది.
తరువాతి ఘట్టంలో జియ్యంగారి అధికారిక మొహరును, 'లచ్చన' అని పిలువబడే తాళం చెవులగుత్తిని స్వామివారి పాదాలకు తాకించి జియ్యరువారికి అందజేస్తారు. ఆ తరువాత గమేకార్లు (ప్రసాదం గంగాళాలను రవాణా చేసే కార్మికులు), మహంతుమఠం వారు, తాళ్ళపాక మరియు తరిగొండ వంశీయులు హరతు లర్పిస్తారు. తదనంతరం ఉత్సవానికి విచ్చేసిన భక్తులు, సిబ్బంది నుండి ఒక్కొక్క రూపాయి చొప్పున కానుకలు స్వీకరించి శ్రీవారి ఖజానాకు జమ చేస్తారు. దీనిని 'రూపాయి హారతిగా' వ్యవహరిస్తారు.
ఆణివార ఆస్థానోత్సవ సందర్భంగా ఆరోజు సాయంకాలం మలయప్పస్వామిని, ఉభయ దేవేరులను పుష్పపల్లకిలో అధిరోహింప జేసి, మాడవీధుల్లో అత్యంత వైభవోపేతంగా ఊరేగిస్తారు.
ఈ ఆర్జితసేవను కాంచిన భక్తులకు పూర్వజన్మ వాసనలు నశించి, సుఖశాంతులు ఏర్పడుతాయని భక్తుల విశ్వాసం.
*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం*
*రచన*
*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*
ఫోన్ నెంబర్
99490 98406
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి