18-10-గీతా మకరందము.
మోక్షసన్న్యాసయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
అవతారిక - అట్టి త్యాగశీలుడు కర్మలందు ఇచ్ఛాద్వేషములు లేకుండునని తెలుపుచున్నారు-
న ద్వేష్ట్యకుశలం కర్మ కుశలేనానుషజ్జతే |
త్యాగీ సత్త్వసమావిష్టో
మేధావీ ఛిన్నసంశయః ||
తాత్పర్యము:- సత్త్వగుణముతో గూడినవాడును, ప్రజ్ఞాశాలియు, సంశయములను బోగొట్టుకొనినవాడును నగు త్యాగశీలుడు, అశుభమును, కామ్యమును, దుఃఖకరమును నగు కర్మను ద్వేషింపడు; శుభమును, నిష్కామమును, సుఖకరమునగు కర్మయందు ఆసక్తుడుకాడు (అభిమానము గలిగియుండడు).
వ్యాఖ్య:- సత్త్వగుణముతో గూడిన కర్మఫలత్యాగి ద్వంద్వములందు సమబుద్ధి గలిగి యుండునని చెప్పబడుచున్నది. ఒకదానిని ద్వేషించుటగాని, మఱియొక దానియందు ఆసక్తిగలిగి తగుల్కొనుటగాని యతనికుండదు. అతడు ఇచ్ఛాద్వేషరహితుడై యుండును. అశుభకర్మను, కామ్యకర్మను ద్వేషింపడని చెప్పినంతమాత్రముచేత దానిని ప్రేమించునని అర్థముకాదు. జీవన్ముక్తునిపగిది దానియెడల తటస్థభావముగలిగి, తాను మాత్రము దాని నాచరింపక శుభకార్యమునే, నిష్కామకర్మమునే ఆచరించును. అట్లాచరించినను దానితో కలియక, దానియం దభిమానము (సంగము) లేకయుండును.
ప్రశ్న:- సత్త్వగుణశీలుడగు కర్మఫలత్యాగియొక్క స్వభావమెట్లుండును?
ఉత్తరము:- అతడు (1) సత్త్వగుణసంపన్నుడై (2) ప్రజ్ఞాశాలియై (3) సంశయరహితుడై (4) అశుభ (కామ్యాది) కర్మలను ద్వేషింపకయు, శుభ(నిష్కామాది) కర్మములందు తగుల్కొనకయు (అభిమానము లేకయు) నుండును.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి